మహాబలిపురం వేదికగా జి మోడీ భేటీ

modi-xi meeting

 

రేపటి నుంచి చైనా అధినేత భారత్ పర్యటన

న్యూఢిల్లీ : చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ భారతదేశంలో రెండు రోజుల అధికారిక పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 11, 12వ తేదీల్లో చైనా అధినేత భారత్ పర్యటన ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతో రెండవ ఇష్టాగోష్టి సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షులు వస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. చైనీయులకు చారిత్రకంగా అత్యంత ఆసక్తికరమైన మమ్మల్ల్లాపురం (మహాబలిపురం)లో ఇరువురు నేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఇందుకోసం తమిళనాడు రేవు పట్టణంలో అన్ని ఏర్పాట్లను చేపట్టారు.

ద్వైపాక్షిక, ప్రాం తీయ, అంతర్జాతీయ ప్రాధాన్యతా అం శాలను ఇరువురు నేతలు ఈ ఇష్టాగోష్టి సదస్సులో సమీక్షిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు వెలువడేందుకు కూడా వీలుందని అధికార వర్గాలు తెలిపాయి.ఇరువురు నేతల ముఖాముఖి ముచ్చట్లు ఉంటాయి. ప్రధాని మోడీ ఆహ్వా నం మేరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధినేత పర్యటన ఖరార యిం ది. అన్ని అంశాలపై విస్తృతంగా, నిర్మొహమాటంగా చర్చించుకునేందుకు ఈ ఇష్టాగోష్టి సదస్సు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. భారత్ చైనాల మధ్య మరింత సన్ని హిత అభివృద్ధి భాగస్వామ్యం దిశలో ప్రత్యేకించి చర్చలు జరుగుతాయని విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు.

మోడీ, జిన్‌పింగ్‌లకు తమిళనాడు స్వాగతం
శుక్రవారం మహాబలిపురంలో జరిగే శిఖరాగ్ర సదస్సుకు తరలివచ్చే మోడీ, జిన్‌పింగ్‌లకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్వాగతం చెప్పారు. తమ తీర ప్రాంత పట్టణానికి వస్తున్న అతిరథులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మహాబలిపురానికి చైనాతో ఉన్న పురాతన సంబంధాల నేపథ్యంలో ఇక్కడ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటు కావడం సముచితం అని పళనిస్వామి పేర్కొన్నారు. తొలి శిఖరాగ్ర సదస్సు చైనా నగరంల వూహాన్‌లో గత ఏడాది జరిగింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాల దిశలో జరిగే చర్చలకు తమిళనాడు వేదిక కావడం తమిళనాడుకు గర్వకారణం అని ముఖ్యమంత్రి తమ ప్రకటనలో తెలిపారు. మహాబలిపురాన్ని వేదికగా ఎంచుకున్నందుకు ప్రధాని మోడీకి పళనిస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

చీనీలకు ప్రత్యేకం పల్లవుల రేవు పట్టణం
సముద్రతీరంలో విశేష చరిత్రను సంతరించుకుని ఉన్న మహాబలిపురంతో చైనా వారికి ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. పల్లవుల రేవు పట్టణంగా ఉన్న ఈ ప్రాంతంలో చైనా పూర్వీకుల చరిత్ర ఉందని చైనా చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. అత్యంత కీలక రేవు పట్టణం కావడంతో శతాబ్దాల క్రితమే ఈ ప్రాంతానికి చైనా నుంచి వ్యాపారవేత్తలు, చరిత్రకారులు సముద్రమార్గం గుండా ఇక్కడికి వచ్చివెళ్లుతుండేవారు. ఈ క్రమంలో తరాల క్రితమే చైనా రాయబారిగా యువాన్ సూయాంగ్ ఈ పల్లవ పట్టణాన్ని సందర్శించారు. ఈ ప్రాంతపు ఆలయాలకు చైనాలోని కొన్ని మతపరమైన కట్టడాలకు అవినాభావ సంబంధం ఉందని, ఇప్పటికీ పూర్తి స్థాయిలో వెలుగులోకి రాని చైనా చరిత్ర ఇక్కడ నిక్షిప్తం అయి ఉందని చినీయులు భావిస్తూ వస్తున్నారు. తూర్పు తీర ప్రాంతంలో చోళ రాజుల కాలంలోనూ ఈ రేవు పట్టణం అన్ని విధాలుగా విలసిల్లింది.

చరిత్రకు ముఖద్వారంగా, పలు విశేషాల గోపురంగా నిలిచిన మహాబలిపురంలో ప్రాధాన్యత గల సదస్సు జరగడం కీలక ఘట్టం అని తమిళనాడు సిఎం తెలిపారు. యునెస్కో నుంచి కూడా చారిత్రక వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో ఇరువురు ప్రముఖ నేతల భేటీ తమిళనాడుకే కాకుండా యావత్ భారతదేశానికి మైలురాయి వంటిదని పేర్కొన్నారు. 1956లో అప్పటి చైనా ప్రధాని దివంగత జౌఎన్లె కూడా ఈ ప్రాంతంలో పర్యటించిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయాల్సి ఉంటుందన్నారు. మహాబలిపురంలో ఇరుదేశాల నేతల సదస్సు నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో భాగంగా మంగళవారం నుంచి ఇక్కడ పర్యాటకుల రాకపోకలను నిలిపివేశారు. ఈ సదస్సు ముగిసే వరకూ ఇక్కడికి యాత్రికులు రావద్దని మార్గదర్శకాలు వెలువరించారు.

Chinese President Xi Jinping on 2 day India visit

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహాబలిపురం వేదికగా జి మోడీ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.