విదేశీ భాషలలో చైనీస్‌కు నో ఎంట్రీ !

Chinese in NEP 2020 languages list, dropped

 

జాతీయ విద్యా విధానంలో లేని ప్రస్తావన

న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఇతర దేశాల సంస్కృతిని తెలుసుకుని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో మాధ్యమిక పాఠశాలల బోధనాంశాలలో కొన్ని విదేశీ భాషలను చేర్చాలని ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించిన జాతీయ విద్యా విధానం-2020(ఎన్‌ఇపి)లో చైనీస్ భాషను చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. గత ఏడాది విడుదల చేసిన జాతీయ విద్యా విధానం ముసాయిదా నివేదికలో ఆసక్తిగల విద్యార్థులకు అందుబాటులో ఉండే విదేశీ భాషలలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్‌తోపాటు చైనీస్ భాషను చేర్చడం జరిగింది.

అయితే, ఇటీవల కేంద్ర మంత్రులు ప్రకాష్ జావదేకర్, రమేష్ పోఖ్రియాన్ విడుదల చేసిన ఎన్‌ఇపి తుది నివేదికలో కొత్తగా కొరియన్, రష్యన్, పోర్చుగీస్, థాయ్ భాషలను ఇందులో చేర్చినప్పటకీ చైనీస్ ప్రస్తావన మాత్రం అందులో లేదు. మాధ్యమిక పాఠశాల స్థాయిలో చైనీస్ భాష అందుబాటులో ఉండదా లేక ఉన్నత స్థాయి విద్యలో దీన్ని అందుబాటులో ఉంచుతారా అన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. చైనీస్ భాషను విదేశీ భాషల జాబితా నుంచి తొలగించడం వల్ల ఉభయ దేశాల మధ్య ఏర్పడిన సైనిక, ఆర్థికపరమైన ఉద్రిక్తతలను ఈ చర్య మరింత పెంచే అవకాశం ఉంది.

ఈ ఏడాది జూన్ రెండవ వారంలో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన దరిమిలా చైనాకు చెందిన 59 మొబైల్ ఫోన్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కూడా ఉంది. భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలు సాగిస్తున్నాయన్న సమాచారంతో వీటిని నిషేధించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ వారం మరో 47 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.

Chinese in NEP 2020 languages list, dropped

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విదేశీ భాషలలో చైనీస్‌కు నో ఎంట్రీ ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.