సిఎం కెసిఆర్ పెద్ద మనసు.. దక్కిన ప్రాణం

సహాయ నిధినుంచి రూ.4 లక్షలు మంజూరు
కూసుమంచికి చెందిన ప్రసాద్‌కు విజయవంతంగా గుండె ఆపరేషన్

KCR

మన తెలంగాణ/ఖమ్మం జిల్లా/కూసుమంచి : సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయడంతో మూడోసారి ఓపెన్ హార్ట్ సర్జరీని హైదరాబాద్‌లోని సిటిజన్ హాస్పిటల్ వైద్యులు పేద కుంటుంబానికి చెందిన బొమ్మ ప్రసాద్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో బొమ్మ ప్రసాద్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వంశపారంపర్యంగా ప్రసాద్‌కు, వారి కుటుంబ సభ్యులకు జన్యులోపం కారణంగా వస్తున్నటువంటి గుండె సంబంధిత జబ్బుతో ఇప్పటికే రెండుసార్లు ఆపరేషన్ జరిగింది. మూడోసారి ఆపరేషన్‌కు ఆస్పత్రులు హామీ ఇవ్వకపోవడంతో సిటిజన్ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేస్తామని ముందుకు వచ్చారు.

ఆ విషయాన్ని గమనించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్‌రెడ్డి, హాస్పిటల్ నుంచి ఖర్చు వివరాలు తెలసుకుని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. రూ. 4 లక్షలు మంజూరు చేయించారు. దీంతో పాటు మరికొంత మంది సాయంతో ప్రసాద్‌కు ఆపరేషన్ నిర్వహించారు. సోమవారం ఆపరేషన్ విజయవంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ తండ్రి బొమ్మ భిక్షం మాట్లాడుతూ తన కుమారునికి మరోసారి జన్మను ప్రసాదించిన కెసిఆర్‌కు, సహకరించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

The post సిఎం కెసిఆర్ పెద్ద మనసు.. దక్కిన ప్రాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.