నిజామాబాద్‌లో చెడ్డిగ్యాంగ్ హల్ చల్…….

నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణ శివారులో ఆదివారం అర్ధరాత్రి అంతరాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయింది. చెడ్డి గ్యాంగ్ గా అనుమానిస్తున్న ముఠా ముబారక్ నగర్‌లోని పెద్ద హనుమాన్ ఆలయ సమీపంలో ఓ ఇంటిపై దాడి చేసింది. రాత్రి ఒంటి గంట సమయంలో ఓ ఇంటిపై దాడిచేసి రాళ్లతో ఇంటి తలుపులను బద్దలు కొట్టారు. ఇంట్లోని వారిని తలుపులు తీసి లోపలికి రానివ్వాలంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇంట్లో ఉన్న వ్యక్తులు ప్రతిఘటించడంతో దొంగలకు ఇంట్లోని వారికి మధ్య […] The post నిజామాబాద్‌లో చెడ్డిగ్యాంగ్ హల్ చల్……. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణ శివారులో ఆదివారం అర్ధరాత్రి అంతరాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయింది. చెడ్డి గ్యాంగ్ గా అనుమానిస్తున్న ముఠా ముబారక్ నగర్‌లోని పెద్ద హనుమాన్ ఆలయ సమీపంలో ఓ ఇంటిపై దాడి చేసింది. రాత్రి ఒంటి గంట సమయంలో ఓ ఇంటిపై దాడిచేసి రాళ్లతో ఇంటి తలుపులను బద్దలు కొట్టారు. ఇంట్లోని వారిని తలుపులు తీసి లోపలికి రానివ్వాలంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇంట్లో ఉన్న వ్యక్తులు ప్రతిఘటించడంతో దొంగలకు ఇంట్లోని వారికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ధీటుగా ఎదుర్కొన్న మాలోత్ టోల్యా అనే ఉపాధ్యాయుడు అతని తండ్రి గోపి దొంగలకు లోనికి రాకుండా అడ్డుకోగలిగారు. గోపి భార్య గాయపడగా, గోపికి తలకు తీవ్రంగా గాయమైంది. టోల్యా భార్య అరుపులు కేకలతో తమను రక్షించాలని వేడుకోగా, దొంగలు ఇంట్లోని వారిపై అద్దం ముక్కలతో దాడి చేశారు. తీవ్రమైన ఆందోళనలో సైతం దొంగలను ధీటుగా ఎదుర్కొన్న టోల్యా తమను తాము రక్షించుకోగా, ప్రాణాలతో బయట పడ్డట్లయింది. దొంగల తీరు, సంఘటన స్థలాన్ని బట్టి చూస్తే ప్రాణహాని సైతం జరిగి ఉండేదని తెలుస్తుంది. పూర్తిగా తలుపు ధ్వంసం కాగా, అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో పోలీస్ వాహనం శబ్దం విని దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు.

సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిద్రిస్తున్న వాచ్‌మెన్ రమేష్, ఆయన భార్య సుమలతను కట్టివేసి వారి వద్ద ఉన్న మూడు మాసాల పుస్తెలను లాక్కుని వెళ్లారు. దుండగులు చెడ్డిలు ధరించి ఉన్నారని, నలుగురు వ్యక్తులు కనిపించారని బాధిత కుటుంబీకులు వెల్లడించగా, ఈ ఘటన స్థానిక కాలనీవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గతంలో తాళం వేసిన ఇండ్లలోనే చోరీకి పాల్పడ్డ ఘటనలు ఉండగా, అంతరాష్ట్ర ముఠాలు మాత్రమే ఇండ్లపై దాడిచేస్తాయని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు దొంగల దాడి సంఘటన నిజామాబాద్ నగర వాసుల్లో తీవ్ర కలవరానికి గురిచేయగా, శివారు కాలనీల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ వాహనాల గస్తీ లేకపోవడం వల్లే దొంగలు రెండు గంటల పాటు దర్జాగా ఘాతుకానికి పాల్పడ్డారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గత రెండు నెలల క్రితం సైతం నిజామాబాద్ నగర నడిబొడ్డున ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డ చెడ్డి గ్యాంగ్ అదే తరహాలోనే తప్పించుకున్న సంఘటనలను గుర్తు చేశారు. నిజామాబాద్ నగరంలో రక్షణను గాలికి వదిలేసిన పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేపట్టడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కమీషనరేట్‌గా మారిన నిజామాబాద్ నగరంలో సిసి కెమెరాల నిర్వహణ తీరే అందుకు నిదర్శనంగా నిలుస్తుండగా, చిన్న చిన్న నేరాలు చేసిన దొంగలను సైతం పోలీసులు పట్టుకోలేని పరిస్థితి నెలకొంది. చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనాల ఘటనల్లో సైతం పోలీసులు నిస్సాహాయ స్థితిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజామాబాద్ నగరానికి బ్రాడ్ గేజ్ రైల్వే లైన్‌తో సంబంధం ఉండగా, మరో రెండు రాష్ట్రాలతో సరిహద్దు ఉండటం గమనార్హం. అనేక సార్లు రైల్వే మార్గం ద్వారా నగరంలోకి ప్రవేశిస్తున్న దొంగలు పోలీసులకు సవాలు విసురుతూనే ఉన్నారు. నిజామాబాద్ నగరంలో దొంగలు షెల్టర్ తీసుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతుండగా, సిసి కెమెరాల ఏర్పాటు సవ్యంగా ఉంటే దొంగల కదలికలను పసిగట్టే అవకాశం ఉంటుందని నగర వాసులు అభిప్రాయ పడుతున్నారు. నిజామాబాద్ నగరంలో ప్రధానమైన కొన్ని కూడళ్లలో తప్ప శివారు ప్రాంతాల్లో, బైపాస్ రోడ్డు ప్రాంతంలో సిసి కెమెరాలు లేకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

ఈ మేరకు సీపీ కార్తీకేయతో పాటు ఎస్సై ప్రభాకర్, ఇతర పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. వాచ్‌మెన్‌తో మాట్లాడి దొంగల ఆనవాళ్లపై ప్రశ్నించారు. దొంగల కదలికలపై నిఘా ఉంచి ప్రత్యేక టీంల ద్వారా వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడిస్తుండగా, చెడ్డిగ్యాంగ్ మరెన్ని ఘాతుకాలకు పాల్పడుతుందో, మరే ప్రాంతంపై దాడిచేస్తుందోనన్న ఆందోళన నగర వాసులకు కనిపిస్తుంది. గత యేడు దర్పల్లి మండలంలో సైతం ద్విచక్ర వాహనాలపై ఆధునాతనమైన మారణాయుధాలతో దొంగల ముఠా సందర్శించినట్లు సిసి కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. అయితే, సదరు ముఠా సైతం జిల్లాలో ప్రవేశించి అదే తరహాలో తప్పించుకుని పారిపోగా, తాజాగా చెడ్డి గ్యాంగ్ పోలీసులకు సవాల్ విసిరింది.

ఇంటిని ఖాళీ చేసిన బాధితులు….
చెడ్డి గ్యాంగ్ దాడిలో గాయపడి తీవ్ర ఆందోళనకు గురైన ముబారక్ నగర్‌లోని మాలోత్ టోల్యా కుటుంబం సోమవారం ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోతున్నట్లు వెల్లడించింది. దొంగల దాడి తీరుతో తమ ప్రాణాలు గాలిలో కలిసి పోయాయని, తమ పని అయిపోయిందనుకున్నామని, తీవ్రంగా ప్రతిఘటించామని తెలిపారు. తమకు రక్షణ లేదని భావిస్తున్నామని, అందుకే మాక్లూర్ మండలంలోని తమ స్వగ్రామం లింగంపల్లికి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు.

Cheddi Gang Hulchul In Nizamabad Town

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిజామాబాద్‌లో చెడ్డిగ్యాంగ్ హల్ చల్……. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.