జిహెచ్‌ఎంసి చట్టానికి సవరణలు

GHMC Act

 

 

కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు

మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధం, పచ్చదనం,
బస్తీ దవాఖానాలకు ప్రాధాన్యం
బిల్లు ముసాయిదా తయారు చేయండి
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి కెటిఆర్ ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి చట్టాన్ని మార్చనున్నట్లు రాష్ట్ర మున్సిపాలిటీ, పరిశ్రమల మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. నూతన మున్సిపాలిటీ చట్టంలోని ప్రధాన అంశాలను జిహెచ్‌ఎంసి చట్టంలో పొందుపర్చి చట్టాలను సవరించనున్నట్లు ఆయన వివరించారు. శనివారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో జిహెచ్‌ఎంసి అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ముసాయిదా బిల్లును రూపొందించాలని పురపాలక శాఖముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్,కమిషనర్ లోకేష్‌లను కెటిఆర్ ఆదేశించారు. హైదరాబాద్ పౌరులకు మరింతగా సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు జిహెచ్‌ఎంసి చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

సిఎం కెసిఆర్ మార్గదర్శనంలో అమలులోకి తీసుకువచ్చిన నూతన పురపాలక చట్టంలోని అన్నికీలకమైన అంశాలను జిహెచ్‌ఎంసి నూతన చట్టంలో పొందుపర్చనున్నట్లు ఆయన వివరించారు. మున్సిపాలిటీ చట్టంలోని నిబంధనలను యథాతధంగా జిహెచ్‌ఎంసి చట్టంలోనూ తీసుకురావాలని పురపాలక శాఖాధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి చట్టం ద్వారా భవన నిర్మాణ అనుమతులు, పౌరసేవలు పారదర్శకంగా వేగవంతం చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు. అధికారులు తమ విధులకు మరింత బాధ్యత వహించే విధంగా చూడటం వంటి కీలకమైన అంశాలను ఈ చట్టంలో పొందుపర్చాలని కెటిఆర్ ఆదేశించారు. నూతన పురపాలక చట్టం ద్వారా ప్రజలకు అందుబాటులో అనేక సేవలు వస్తాయని,దీంతో వారికి మరింత వేగంగా,పారదర్శకంగా సేవలందుతాయని తెలిపారు.

ప్రస్తుత జిహెచ్‌ఎంసి చట్టాన్ని సమూలంగా మార్చేందుకు, నూతన పురపాలక చట్టంతో సమానంగామార్పులు చేసేందుకు అవసరమైన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆయన అధికారులకు చెప్పారు. ప్రధానంగా త్వరలో తీసుకురానున్న బిల్డింగ్ అనుమతుల ప్రక్రియ ( టిఎస్ ఐపాస్) నేపథ్యంలో అవసరమైన మార్పులను కూడా ఈ నూతన చట్టంలో ఉండాలని కెటిఆర్ సూచించారు. లాగే హెచ్‌ఎండిఎ పరిధిలోని భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసే విధంగా చట్టంలో పొందుపర్చాలని ఆయన చెప్పారు.

Changes in the GHMC Act

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జిహెచ్‌ఎంసి చట్టానికి సవరణలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.