మళ్లీ భయపెట్టిన హిందీ…!

  ప్రధాని మోడీ ప్రభుత్వం రెండోసారి పగ్గాలు చేపట్టిన వెంటనే ఉన్నట్టుండి ఊడిపడ్డ జాతీయ విద్యా విధాన ముసాయిదా పత్రం నిశ్చలమైన నీటిలో బండరాయి దొర్లిపడిన మాదిరిగా అలజడిని రేపింది. ఆలస్యం చేస్తే తల ఎత్తగల కల్లోలాన్ని ఊహించి కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్య తీసుకోడంతో సమస్య సద్దుమణిగింది. నూతన విధాన ముసాయిదా ఇప్పుడున్న 10+2+3 తరగతుల పద్ధతికి బదులు 5+3+3+4 వ్యవస్థను నెలకొల్పాలని సూచించింది. ఈ ప్రధానాంశం పట్ల ఎటువంటి అభ్యంతరాలు వెంటనే వ్యక్తం కాలేదు […] The post మళ్లీ భయపెట్టిన హిందీ…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రధాని మోడీ ప్రభుత్వం రెండోసారి పగ్గాలు చేపట్టిన వెంటనే ఉన్నట్టుండి ఊడిపడ్డ జాతీయ విద్యా విధాన ముసాయిదా పత్రం నిశ్చలమైన నీటిలో బండరాయి దొర్లిపడిన మాదిరిగా అలజడిని రేపింది. ఆలస్యం చేస్తే తల ఎత్తగల కల్లోలాన్ని ఊహించి కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్య తీసుకోడంతో సమస్య సద్దుమణిగింది. నూతన విధాన ముసాయిదా ఇప్పుడున్న 10+2+3 తరగతుల పద్ధతికి బదులు 5+3+3+4 వ్యవస్థను నెలకొల్పాలని సూచించింది. ఈ ప్రధానాంశం పట్ల ఎటువంటి అభ్యంతరాలు వెంటనే వ్యక్తం కాలేదు కాని, దేశమంతటా హిందీ బోధనను నిర్బంధం చేసే త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనే అత్యంత వివాదాస్పదం అయింది.

దశాబ్దాల క్రితం హిందీ వ్యతిరేక ఆందోళనతో అట్టుడికి పోయిన తమిళనాడు నుంచి ఇందుకు తీవ్ర ప్రతిఘటన మళ్లీ ఎదురయింది. డిఎంకెతో పాటు తమిళనాడులోని అన్ని ప్రతిపక్షాలు ముసాయిదాలోని ఈ సిఫార్సు పట్ల భగ్గున మండిపడ్డాయి. దీనితో జాగ్రత్తపడిన కేంద్ర ప్రభుత్వం ముసాయిదాలోని సంబంధిత ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు అది కేవలం ప్రతిపాదనేనని ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఊరడించడానికి ప్రయత్నించింది. తమిళ నేపథ్యం గల కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్‌ల చేత ఆ మేరకు ట్విట్టర్‌లో అభిప్రాయాలు పెట్టించింది.

చిరకాలంగా సాగిన ఆంగ్లేయుల పాలనలో దేశంలోని భిన్న భాషా ప్రాంతాలవారి మధ్య అనుసంధాన భాషగా ఆంగ్లం బాగా అభివృద్ధి చెంది స్థిరపడింది. ఇప్పటికీ ఆ ప్రత్యేకతను ఆ భాష చాటుకుంటున్నది. విదేశాల్లో ఉద్యోగావకాశాలు బాగా మెరుగుపడిన నేపథ్యంలో ఆంగ్లం అవసరం కూడా పెరిగింది. బ్రిటిష్ హయాంలోనే 1937లో అప్పటి మద్రాస్ రెసిడెన్సీ ప్రాంతంలో హిందీని నిర్బంధ బోధనా భాషగా రుద్దడానికి జరిగిన ప్రయత్నానికి గట్టి వ్యతిరేకత ఎదురు కావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. ఆ తర్వాత 1960వ దశకం ప్రథమార్థంలో హిందీని ఏకైక అధికార భాషగా చేయడానికి జరిగిన ప్రయత్నమూ ఫలించ లేదు. అప్పుడు తమిళనాడులో సాగిన తీవ్ర హిందీ వ్యతిరేక ఆందోళన తెలిసిందే. దానితో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తిరిగి కోలుకోలేని దెబ్బ తగిలింది.

అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని తాజాగా తమిళనాడులో వ్యక్తమయిన వ్యతిరేకత రుజువు చేస్తున్నది. మిగతా దక్షిణాది రాష్ట్రాల నుంచి తమిళనాడు స్థాయి ప్రతికూలత వ్యక్తం కాకపోయినా హిందీని బలవంతంగా రుద్దే నిర్ణయం తీసుకునే నాటికి అక్కడ కూడా పరిస్థితి విషమించే అవకాశాలున్నాయి. ఇష్టపూర్వకంగా హిందీని ఒక భాషగా నేర్చుకోడానికి, విధిగా నేర్చుకొని తీరవలసిన నిర్బంధ పరిస్థితికి చాలా తేడా ఉన్నది. హిందీయేతర రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాదిలో అధికారిక అవసరాల కోసం ఇంగ్లీషును వినియోగిస్తున్నంతగా వారి వారి మాతృభాషలను సైతం ఉపయోగించడం లేదనడం అతిశయోక్తి కాబోదు. ఈ రాష్ట్రాలలో ప్రభుత్వ కార్యాలయాలలో ఉత్తర ప్రత్యుత్తరాలకు హిందీని ఉపయోగించడం అనే స్థితిని కలలోనైనా ఊహించలేము. 1960 దశకం మొదట్లో హిందీని అధికార భాషగా చేయాలనుకున్నప్పుడు తమిళనాడులో వ్యక్తమైన వ్యతిరేకతను గమనించి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇంగ్లీషును కూడా కొనసాగిస్తామని ఇచ్చిన మాటను సైతం ఆందోళనకారులు నమ్మలేదు.

ఎప్పటికైనా హిందీని రుద్దుతారనే భయంతో మొత్తంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నంత వరకు ఆందోళన కొనసాగించారు. భాష, సంస్కృతులు ప్రజల హృదయగతమైనవి. మానసికమైన ఇష్టాయిష్టాలకు సంబంధించినవి. చిరకాలంగా అలవాటైపోయిన వీటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టాలనుకోడం దుస్సాహసమే అవుతుంది. దేశమంతటా హిందీని తప్పనిసరి చేయాలన్న కోరికలో ఉత్తరాదివారి ఆధిపత్య కాంక్ష ఇమిడి ఉన్నదనే భావన కూడా అన్యప్రాంతాల్లో నెలకొన్నదనడం అసత్యం కాబోదు. అటువంటి పెత్తందారీ వైఖరిని హిందీయేతర రాష్ట్రాల ప్రజలు సహించకపోడం అర్థం చేసుకోదగినదే. పైపెచ్చు ఆంగ్లం అంతర్జాతీయ భాష కావడం వల్ల దాని ఉపయోగాన్ని ప్రజలు అనుభవంలో తెలుసుకోగలుగుతున్నారు. ఆంగ్లం స్థానంలో హిందీని అలవాటు చేయడం వల్ల అటువంటి మంచి జరిగే అవకాశాలు లేవు. ఈ సున్నితమైన సమస్యను మళ్లీమళ్లీ రేకెత్తించకుండా ఆయా భాషా ప్రాంతాల ప్రజల ప్రాధాన్యాలను గౌరవించడం ఇప్పటి ద్విభాషా విధానాన్నే కొనసాగించడం కేంద్ర పాలకులపై గల గురుతరమైన బాధ్యత.

Changes in the Education System

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మళ్లీ భయపెట్టిన హిందీ…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: