జీవన శైలిలో మార్పులు తప్పనిసరి…!

  రాత్రి మొగ్గగా కనిపించి, తెల్లవారుతూనే పువ్వయి గాలి స్పర్శకు ఆనందిస్తూ కనిపిస్తుంది. రాత్రి ఒడిలో నిద్రించిన ప్రకృతి భానుడి కిరణ స్పర్శతో వళ్లు విరుచుకొని లేస్తుంది. ప్రతి ఉదయం ఒక అద్భుతం. ప్రతీరోజూ ఒక సంతోషకరమైన జీవన ప్రయాణం. ఇంత తాజాగా నిద్ర లేవడానికి ప్రతీరోజూ చైతన్యవంతంగా గడిపేందుకు ఏం చేయాలి? ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం అందుకోవాలి అంటే కొన్ని అనవసరమైనవి వదిలించుకోవాలి. ఒక చక్కని జీవితం గడిపేందుకు ఆలోచనలు, ఆచరణలో మార్పుతెచ్చుకోవాలి. ఇవేం మనం […] The post జీవన శైలిలో మార్పులు తప్పనిసరి…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాత్రి మొగ్గగా కనిపించి, తెల్లవారుతూనే పువ్వయి గాలి స్పర్శకు ఆనందిస్తూ కనిపిస్తుంది. రాత్రి ఒడిలో నిద్రించిన ప్రకృతి భానుడి కిరణ స్పర్శతో వళ్లు విరుచుకొని లేస్తుంది. ప్రతి ఉదయం ఒక అద్భుతం. ప్రతీరోజూ ఒక సంతోషకరమైన జీవన ప్రయాణం. ఇంత తాజాగా నిద్ర లేవడానికి ప్రతీరోజూ చైతన్యవంతంగా గడిపేందుకు ఏం చేయాలి? ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం అందుకోవాలి అంటే కొన్ని అనవసరమైనవి వదిలించుకోవాలి. ఒక చక్కని జీవితం గడిపేందుకు ఆలోచనలు, ఆచరణలో మార్పుతెచ్చుకోవాలి. ఇవేం మనం చేయలేని, దాటలేని కష్టమైన పనులు ఏమీ కాదు. మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉండాలి అంటే జీవనశైలిలో చక్కని మార్పులు తెచ్చుకోవాలి అంతే!

ప్రతీ ఉదయం ప్రకృతి సందర్శనతోనే మొదలు పెట్టాలి. పచ్చని ప్రకృతిలో మెత్తని పచ్చికపైన ఆ స్పర్శని అనుభవిస్తూ ఒక అరగంట పాటు నడిస్తే చాలు. ఈ నడక శరీర ఆరోగ్యానికి గొప్ప ఔషధం. రోజులో కనీసం 30 నుంచి 60 నిమిషాల నడక ఉంటే బరువు అదుపులో ఉంటుంది. శరీర రూపం చెడకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి.
మంచి ఆరోగ్యం కోసం గంటన్నర నుంచి రెండు గంటల పాటు జిమ్‌లో గడపాలి. ప్రత్యేక తరహా వ్యాయామం అంటూ ఉండదు. శరీర స్థితిని బట్టి ఎక్స్‌పర్ట్ నిర్ణయించిన పద్ధతిలో జిమ్‌లో వ్యాయామం చేస్తే మంచిది. నడక, జాగింగ్, స్కిప్పింగ్, తోటపని, మెట్లు ఎక్కడం ఇవన్నీ శరీరాన్ని చైతన్యంతో ఉంచేవే.

నిద్ర ముఖ్యం: ఇవాల్టి రోజుల్లో అన్నింటికంటే ప్రధానమైన సమస్య తగినంత నిద్రలేకపోవటం. ఐదురోజుల పని, నైట్‌షిఫ్ట్‌లు, ముఖ్యంగా నిద్రను దూరం చేస్తున్నాయి. జీవగడియారం తిరగబడే పరిస్థితి వస్తోంది. నిద్రించవలసిన సమయంలో పనిచేయటం కొన్ని రంగాల్లో అనివార్యం అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం అనేది ఇవ్వాల్టి యువత నిత్య విధుల్లో ఒకటి. కంప్యూటర్, ఫోన్, వంటి వాటితో నిరంతరం ప్రవహించే సమాచారం ఎలక్ట్రానిక్ వస్తువుల్లోంచి వెలువడే నీలి వెలుగు, శబ్దాలు నిద్రపోనివ్వవు. గంటల కొద్దీ మెలకువగా ఉండటంతో నిద్రలోకి జారుకొనేందుకు మనిషి శరీరంలో హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి అవటం తగ్గిపోతోంది.

కనీసం ఏడెనిమిది గంటలు నిద్రకు నోచుకోని శరీరంలో అనారోగ్యం చోటు చేసుకొంటుంది. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి ఈ గాడ్జెట్స్‌ని పక్కన పెట్టటం ఎంతైన అవసరం. అలాగే పెరిగిన పనిగంటలతో శరీరంలో పెరిగే ఒత్తిడి కూడా నిద్రను దూరం చేసేదే. కెరీర్ వైపుగా మనిషి పరుగు నిద్రను మాయం చేస్త్తుంది. ఇలాంటి సమస్యలు దృష్టిలో ఉంచుకొని నిద్ర కోసం మిగతా అంశాలన్నీ పక్కన పెట్టవలసిందే.

ఆరోగ్యకరమైన ఆహారం: ఆరోగ్యం బావుండాలంటే ముందు ఆరోగ్యకరమైన ఆహారం ఉండాలి సరైన పోషకాలున్న తాజాగా ఉండే ఆహారం తినాలి. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్స్‌ల ప్రకారం సమతుల్యమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన బరువుతో శరీరం ఫిట్‌గా ఉండాలి. సాధారణ చక్కెరలు, ఉప్పు మితంగా తీసుకోవాలి. ఫలాలు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, నట్స్ మొదలైనవి ప్రతిదినం ఆహారంలో చేర్చుకోవాలి. సంప్రదాయ పదార్థాలు చక్కని పోషకాలు అందిస్తాయి. సూక్ష్మ పోషకాలు ఖనిజ లవణాలు, పీచు తప్పనిసరిగా శరీరానికి అందేలా ఆహారం ఉండాలి. జంక్ ఫుడ్, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌ల వల్లనే ఊబకాయం వస్తుంది. పొట్టు తీసేసిన ధాన్యాలు, ప్రాసెసింగ్ చేసిన ఆహారపదార్థాలతో వండిన వంటలు తినడం వల్లనే ఆరోగ్యానికి ముప్పు వస్త్తుంది.

చక్కని ఆహార నియమాలతో, పరిమితమైన భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే కుటుంబంతో అందరూ కలసి భోజనం చేయటం చాలా ముఖ్యం. పగలు ఉద్యోగాలతో బిజీగా ఉన్నా రాత్రి భోజనం కుటుంబంతో కలసి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకొంటూ అందరూ ఆత్మీయంగా మాట్లాడుకొనే సమయం ఇదే. కనీసం ఆ సమయంలో టెలిఫోన్‌లు బంద్ చేయాలి. అలాగే తియ్యని పదార్థాలకు చెక్ పెట్టటం కూడా ముఖ్యమైందే. పరిమితంగా తియ్యని పదార్థాలతో, ఆహారంలో అదనపు క్యాలరీలు, కొవ్వులు అందించే భాగాలను పక్కన పెట్టి మిగిలినవి తినటం మంచిది.

శరీరపు బరువు ప్రమాదం: నాజూగ్గా ఉండటం ఎవరికైనా ఇష్టమే. అలాగే ఫిట్‌నెస్‌తో కూడిన శరీరం కావాలనుకోవటం కూడా అవసరమే. అయితే బరువు ఉన్నామా లేదా నిర్ణయించుకోవటం కోసం కొన్ని ప్రమాణాలున్నాయి దీన్ని బాడీమాస్ ఇండెక్స్ అంటారు. దీని ప్రకారం ఎక్కువ బరువు ఉంటే స్థూలకాయులుగా, అధిక బరువు ఉన్న వాళ్లుగా విభజిస్తారు. ఆరోగ్యవంతమైన శరీర బరువు కోసం క్యాలరీల సమతుల్యత కావాలి. సరైన ఆహారపు అలవాట్లతో పౌష్టికాహారం తీసుకొంటే శరీరం బరువు నియంత్రించుకోవచ్చు. క్యాలరీలు ఖర్చు చేసేందుకు వ్యాయామం అవసరం. బరువు తగ్గించుకోవటం కోసం డైట్ మెయిన్‌టెయిన్ చేయటం సరైన మార్గం కాదు. అది జీవన విధానం ఆహారం, వ్యాయామాలపై ఆధారపడి ఉంటుంది. సీజనల్ పండ్లు శరీరానికి సమతుల్యమైన క్యాలరీలు అందిస్తాయి. దాదాపు అన్ని రకాల కూరగాయలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

కూర్చోవటం తగ్గించాలి: సాధారణంగా గంటల కొద్దీ కూర్చునే పని చేయవలసి వస్తూ ఉంటుంది. దానివల్లనే పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ కూర్చోవటం కన్నా నిలబడటం వల్ల శరీరంలో జీవక్రియల రేటు మెరుగవుతుంది. శరీరంలో కొవ్వు కరగటం ప్రారంభం అవుతుంది. నిలబడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్ధాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రెండుగంటలు అదనంగా నిలబడే వారిలో చక్కెర స్థాయిలు రెండు శాతం,
కొవ్వు పదకొండు శాతం మేరకు తగ్గాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాళ్లు, ఉదర భాగాలకు వ్యాయామం లభిస్తుంది.
ప్రతీ గంటకు లేదా గంటన్నరకు సీట్లో నుంచి లేచి అటు ఇటూ పది అడుగులు వేయాలి. పాదాలు నేలకు ఆనించి అటూ ఇటూ కదిలించాలి అప్పుడు నిలబడి పని చేయాలి. గంటకోసారి లేవటం గుర్తు చేసేందుకు అలారమ్ ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. వీలైనంత వరకూ మెట్లు ఎక్కాలి, కాస్త దూరం నడవటం ఎంతైనా మంచిది.

పాజిటివ్‌గా ఉండాలి…
జీవితంలో కష్టపడి అలవర్చుకోవలసింది పాజిటివ్ దృక్పథం అలవరుచుకోవటం. జీవితంలో ఎన్నో విషయాల్లో ఎప్పుడూ చిరాకు పడటం, ఎవరో ఒకరిపైన కంప్లయినింగ్ గా ఉండటం మామూలే ఇటువంటి నైజం వల్ల వ్యతిరేక భావాలతో మనసు నిండిపోతుంది. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటంలో పొరపాట్లు చేస్తాం. ప్రతీ నిమిషం ఎదుటి మనిషి మనసుని, పరిస్థితులని మనతో పోల్చుకొని అంచనా వేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి మనల్ని దూషించి ఉండవచ్చు. ఆ వ్యక్తి వైపు నుంచి ఆలోచన మొదలు పెట్టాలి. ఆ వ్యక్తి మససులో మన పట్ల వ్యతిరేకమైన భావన ఎందుకు కలిగింది? మనం చేసిన తప్పు ఏమైనా ఉందా? ఇందువల్ల ఆ మనిషికి కలిగిన బాధ నష్టం ఏ స్థాయిలో ఉన్నాయి. మనల్ని దూషించేందుకు అతని మనసులో మనపట్ల నెగిటివ్ ఫీలింగ్ కలిగేందుకు మనమే కారణం అయ్యామా? అని గనుక ఆలోచించుకోగలిగితే అప్పుడు న్యాయం కళ్లముందు నిలబడుతుంది. ఒక వేళ మనదే తప్పయితే వెంటనే పొరపాటు ఒప్పుకొనేందుకు, అవతల వాళ్లదే తప్పయితే వివరించి ఆ గ్యాప్‌ని పెంచకుండా ఉండేందుకు వెంటనే పూనుకోవాలి. వ్యతిరేకమైన ఆలోచనలకు ముందు ఫుల్‌స్టాప్ పెట్టాలి. అవి ముందుగా మన మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి.

ఇవన్నీ మనకు మనం విధించుకోవలసిన విధి విధానాలు. అనుసరించాల్సిన జీవన మార్గాలు. దీన్నే జీవన శైలిని పాజిటివ్‌గా నిర్మించుకోవటం అంటారు. మనం ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగానే మాత్రమే కాదు మానసికంగా దృఢంగా ఉండాలి. సాటివాళ్ల పట్ల పాజిటివ్‌గా స్పందించాలి. స్నేహభావంతో మెలగాలి. మానవ జీవితం ప్రవహించే సెలయేరు లాంటిది. ఎన్నో జల సమూహాలను కలుపుకొంటూ స్వేచ్ఛగా ప్రయాణం చేస్తుంది. ప్రవాహ మార్గం నలుగురికీ ఉపయోగపడేలా, నీళ్లు స్వచ్ఛంగా ఉంటే అది జీవనది అవుతుంది. ప్రేయతో, భక్తితో మునిగితే సర్వపాపాలు హరించి పునీతులను చేసే పవిత్ర గంగానది మనకు ఆదర్శం కావాలి. మనతో స్నేహం చుట్టు పక్కల సువాసనల ఉద్యానవనాలు కావాలి. అప్పుడే మనిషి బతుకు సార్ధకం  అవుతుంది.

                                                                                                      చేబ్రోలు శ్యామ్‌సుందర్

Changes in life style are mandatory

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జీవన శైలిలో మార్పులు తప్పనిసరి…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.