చట్టాలతో నేరాలు ఆగవు

Venkaiah Naidu

 

రాజకీయ సంకల్పం, పాలనా విధానమే పరిష్కారం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటన
మహిళలపై అకృత్యాలు మనకు సవాళ్లు
వాటిని చూసి సిగ్గుపడుతున్నాం
వాటిపరంగా రాజకీయాలు వద్దు
విద్యార్థులకు విలువలు బోధించాలి
ఉప రాష్ట్రపతి సలహా

పుణె: మహిళలపై అకృత్యాల నియంత్రణకు చట్టాలు చేయడం మాత్రమే పరిష్కారం కాదని, సామాజిక దురాగతాని రాజకీయ సంకల్పం, పాలనా యంత్రాంగం నైపుణ్యాలు అవసరమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవలి ఉన్నావ్, హైదరాబాద్ సంఘటనల్ని ప్రస్తావించారు. ‘స్త్రీని తల్లిగా, సోదరిగా చూడడం మన సంస్కృతి. కానీ కొన్ని రోజులుగా దేశంలో కొన్ని చోట్ల జరుగుతున్న సంఘటనలు చూసి సిగ్గుపడాల్సి వస్తోంది. అవి మనకు సవాళ్లు విసురుతున్నాయి. ఇలాంటి వివక్ష, అకృత్యాల్ని వెంటనే ఆపుతామని మనం ప్రతిన పూనాలి. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి గురువారంనాడు కోర్టు విచారణకు హాజరయ్యేందుకు రాయ్ బరేలి వెడుతుండగా అయిదుగురు కిరాతకులు ఆమెను సజీవ దహనం చేశారు. వారిలో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేసిన వారు. తీవ్రంగా గాయపడిన ఆమె శుక్రవారం రాత్రి మరణించింది. హైదరాబాద్‌లో దిశ హంతకుల్ని కాల్చి చంపిన రోజే ఈ దురాగతం జరిగింది’ అని ఇక్కడి సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ 16వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ వెంకయ్యనాయుడు చెప్పారు.

మన మైండ్‌సెట్ మారాలి
‘కేవలం చట్టాలు సమస్యకు పరిష్కారం కాబోవు. నిర్భయ చట్టం తెచ్చాం. ఏం జరిగింది? నేను ఏ బిల్లును, లేదా కొత్త బిల్లును వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు మన ఆలోచనల్లో మార్పు రావాలి. మైండ్‌సెట్ మారాలి. మనం మూలాల్లోకి వెళ్లాలి. సంస్కృతిని గుర్తు చేసుకోవాలి. ఈ నేరాలను, అకృత్యాల్ని అంతం చేయాలంటే రాజకీయ సంకల్పం, పాలనా యంత్రంగం నైపుణ్యాలు కావాలి. ఇలాంటి సంఘటనల్ని మతం, రాజకీయకోణం నుంచి చూస్తే ఆశయం దెబ్బతింటుంది. ఇలాంటివి దేశానికి చెడ్డపేరు తెస్తున్నాయి’ అని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయాల్లో దేశం పేరు చెప్పి రాజకీయాలు చేయకూడదు అని హెచ్చరించారు.

రాజకీయాలు తగవు
‘భారతదేశం వేటికో రాజధానిగా మారుతోంది అని కొందరు అంటున్నారు. నేను అలాంటి వాటిలోకి వెళ్లదలుచుకోలేదు. మనం దేశాన్ని తక్కువ చేయకూడదు. అకృత్యాలు వంటి విషయాల్లో రాజకీయాల్లోకి వెళ్లకూడదు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సరైన విలువలు పెంపొందించాలి. వారికి సరైన దారి చూపాలి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ‘ఈ ఏడాది టైమ్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్ ఇచ్చిన 300 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విశ్వవిద్యాలయం ఒక్కటి కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇందుకు కారణమేమిటో ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేశంలో విద్య నాణ్యతను పెంపొందించాల్సిన అవసరముంది. వంద ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో , ఆ తర్వాత 50 యూనివర్శిటీల జాబితాలో భారతీయ విశ్వవిద్యాలయాలు నిలబడేలా వ్యూహాన్ని రూపొందించుకోవాలి. విజ్ఞానంలో మళ్లీ మనం ప్రపంచానికి గురు స్థానంలో నిలబడాలి అని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల్లో స్థానం సంపాదించాలంటే బోధన బాగా ఉండాలి. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీల్ని వెంటనే భర్తీ చేయాలని సలహా ఇచ్చారు.

Change of mindset required to kill the social evil

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చట్టాలతో నేరాలు ఆగవు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.