‘పౌరసత్వం’పై మేధావుల మౌనం!

Cartoon

 

ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌ఆర్‌పిల అమలుకు వ్యతిరేకంగా పోరాడుతున్న లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రొఫెసర్‌లపై అధికార పార్టీకి చెందిన ఎబివిపి విద్యార్థులు, ఆర్.ఎస్.ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు ముసుగు ధరించి దాడులు చేయడం దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్య విలువలను, ప్రశ్నించే తత్వాన్ని సమాధి చేయబూనడం నీతిమాలిన చర్యే అవుతుంది. అధికారంలో ఉన్న వాళ్ళలో జవాబుదారీతనం లోపించి అసహనంగా ప్రవర్తించడం పిరికితనం తప్ప మరొకటి కాదు. రేపటి కోసం, భవిష్యత్ తరాల కోసం ఉన్నతంగా ఆలోచించే విద్యావంతులు, మేధావుల నిలయం ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జె.ఎన్.యు). అది భారత పురోగామి శక్తుల గడ్డగా నిలుస్తోంది.

భారతదేశ పురోభివృద్ధి లక్ష్యంగా అసమానతలు లేని నవ భారతాన్ని నిర్మించాలన్న సంకల్పం గల చైతన్యవంతులను అభివృద్ధి చేస్తోంది. విద్యనభ్యసించడం కోసం దేశ విదేశాల నుంచి జె.ఎన్.యుకు తరలొస్తారు. ఇందులో సుమారు 40 దేశాలకు సంబంధించిన పౌరులు బంగారు భవితకు, తమ మేధస్సు అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తూ ఉంటారు. ఇక్కడ అలా శ్రమించిన వారిలో వివిధ రంగాల్లో కీర్తి గడించిన ప్రముఖులున్నారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన జె.ఎన్.యును తమ కబంధ హస్తాల్లోకి లాక్కోవాలని మతతత్వ శక్తులు ఆరాటపడుతున్నాయి. అందుకోసం అందివచ్చిన అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని అరాచకత్వానికి పాల్పడుతున్నాయి. అందులో భాగమే విద్యార్థులపై దాడి ఘటన.

దాడి, కేసులు కుట్రపూరితం
ఈ నెల 5న జె.ఎన్.యు కేంద్రంగా మారణాయుధాలతో ఎబివిపికి చెందినవారు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు గాయపడ్డారు. దీంతో పాటు గ్రంథాయాల్లో బీభత్సం సృష్టించటం కలకలం రేపింది. పక్కా పథకం ప్రకారం ప్రభుత్వ అండదండలతో అల్లర్లు సృష్టించారు. ప్రభుత్వంలోని పెద్దలకు తెలియకుండా దేశ రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగడానికి ఆవకాశం లేదు. ప్రోద్బలంతో జరిగింది కాబట్టే దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా గాయపడ్డ వారిపైనే కేసులు నమోదు చేయడం, కేసుల్లో వారిని ఇరికించేందుకు ప్రయత్నాలు చేయడం మతతత్వ శక్తుల పాత్రను రుజువు చేస్తున్నది.

దాడుల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై, తదుపరి కేసు విచారణ, పరిణామాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. దాడి సందర్భంగా విసి బాధ్యతారాహిత్యం బట్టబయలైంది. యూనివర్శిటీలోకి దుండగులకు ప్రవేశం లభించింది. మూక దాడిలో గాయపడిన విద్యార్థులు, నాయకులు వెనక్కి తగ్గలేదు. మరింత పోరాట స్ఫూర్తితో ముందుకు కదులుతున్నారు. వీరికి ఊహించని విధంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ప్రముఖులు సైతం విద్యార్థి ఉద్యమానికి అండగా నిలబడి దాడులను తీవ్రంగా ఖండించారు. సిఎఎపై నిరసన తెలిపిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ జైలు కెళ్లారు.

ఆది నుండీ జె.ఎన్.యులో విద్యారంగ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై విద్యార్థులు మడమ తిప్పని పోరాటాలు సాగిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నారు. నిత్యం ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ విద్యారి లోకం ప్రజాపక్షం నిలుస్తోంది. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (ఐసా), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ), ఆ లిండియా స్టూడెంట్ ఫెడరేషన్(ఎఐఎస్‌ఎఫ్), తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యార్థి ఉద్యమాల్లో వీరోచిత పాత్రను నిర్వహిస్తున్నాయి. విద్యార్థి సంఘ ఎన్నికల్లోనూ ఈ సంఘాలే విజయ పరంపర కొనసాగిస్తున్నాయి. విద్యార్థి సంఘాల ఐక్యతను చాటుతున్నాయి. వీటిని సైద్ధాంతికంగా వ్యతిరేకించే మతతత్వ శక్తులు, ఎబివిపి ముసుగులో బలపడే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నాయి.

సైద్ధాంతిక భావజాలాల మధ్య పోరాటాలు నిత్యకృత్యంగా ఉంటాయి. ఇక్కడ ఒక్క చోటనే కాదు లెఫ్ట్ భావజాలం బలంగా ఉన్న యూనివర్శిటీల్లో ఈ రకమైన పోరాటం కొనసాగుతుంది. జామియా మిలియా, అలహాబాద్, అలీగఢ్, బనారస్ తదితర వర్శిటీల్లో నిరసనలు వ్యక్తమతున్నాయి. అయితే జె.ఎన్.యు నుంచి చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం గట్టి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. భారతదేశాన్ని మొత్తం కాషాయమయం చేసి ‘హిందూ స్టేట్’గా ప్రకటించాలన్న ‘హిందూత్వ ఎజెండా’ ను కేంద్ర ప్రభుత్వం మోసుకొస్తున్నది. ఆ దిశగా అన్ని రకాల ప్రయత్నాలు తీవ్రతరం చేస్తూనే ఉంది. అందులో భాగమే రామ మందిరం, త్రిపుల్ తలాక్ బిల్లు, కశ్మీర్ ప్రతిపత్తి రద్దు (370 ఆర్టికల్ రద్దు), జమ్ము, కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం, జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్) లాంటివి తీసుకుని రావటం జరిగింది.

మరోవైపు ఇప్పటికే బిజెపి పాలిత రాష్ట్రాల్లో మూక దాడులు పెరగడంతో పాటు దేశంలో నోట్ల రద్దు ప్రభావం, నిరుద్యోగ సమస్య, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, రైతుల ఆత్మహత్యలు ఇలాంటి అనేక సమస్యలు జటిలమయ్యాయి. దేశ స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్ర లేని ఈ కుహనా దేశభక్తులు ఇప్పుడూ దేశభక్తికి కొత్త నిర్వచనం చెబుతున్నారు. విద్యార్థి ఉద్యమాల్ని అణచడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తున్నారు. విద్యార్థులను దాడుల పేరుతో, కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేశారు. ప్రజా గొంతుకను అణచివేయడం, వారిలో ఐక్యతను దెబ్బ తీయడం, విద్వేషాల్ని వ్యాప్తి చేస్తూ మతాధారంగా ‘విభజించి పాలించాలని’ ఎత్తుగడను రాజ్యం అమలు చేస్తోంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి. అందుకోసం పౌరసత్వ బిల్లు తీసుకొచ్చారు. ఇక్కడే పుట్టి పెరిగిన ప్రతి బిడ్డ తన పౌరసత్వాన్ని నిరూపించుకోవడం అంటే పుట్టుకను ప్రశ్నించడమే అవుతుంది.

తాత, తండ్రి, కొడుకు – అమ్మ, తల్లి, బిడ్డ ఇలా ఎందరు పౌరసత్వాన్ని నిరూపించుకోగలరు. ఎంతమంది సరైన పత్రాలందించగలరు. అక్షరాస్యత లేని వాళ్ళు, ఇంకా ప్రభుత్వాలచే గుర్తించబడని వారు, సంచార జాతులు, తెగలు పౌరసత్వ పరీక్షను ఎలా నెగ్గుతారు. అదిగాక మత విభజన ప్రకారం జరిగితే మైనార్టీలుగా ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఇప్పటికే అసోం రాష్ట్రంలో 19 లక్షల మంది పౌరసత్వాన్ని నిరూపించలేక పోయారు. రాజ్యం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతున్న జె.ఎన్.యు విద్యార్థులపై, తమకు మద్దతుగా లేని ప్రొఫెసర్లపై దాడికి తెగబడ్డారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతుగా వివిధ రంగాల ప్రముఖులు జె.ఎన్.యుకు తరలొచ్చారు. అందులో ఒకరు ప్రముఖ సినీ నటి దీపికా పదుకొనే. ఆమె రాకపై మతతత్వ శక్తులు భగ్గుమన్నాయి.

ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోయాయి. మహిళా అనే గౌరవం లేకుండ సామాజిక మాధ్యమాల్లో విషాన్ని చిమ్మాయి. అయినా ఆమె సహనాన్ని చాటారు. విద్యార్థులకు అండగా నిలవడం ద్వారా దీపికా పదుకొణె తన చైతన్యాన్ని ప్రదర్శించారు. మతతత్వ ఉన్మాద శక్తుల వైఖరి కారణంగానే అనేక మంది ప్రముఖులు ప్రశ్నించే విషయాల్లో వెనుకంజ వేస్తున్నారు. వారు రాజ్యంకు వ్యతిరేకంగా ముందుకు వచ్చి నిలబడలేక పోతున్నారనేది ఓపెన్ సీక్రెట్. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మేధావుల మౌనం పాటించడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది. మౌనంగా ఉండి పోవడం బాధ్యతను విస్మరించడమే అవుతుంది. ఇప్పటికైన అందరూ ప్రజల పక్షాన గొంతెత్తాలి.ఎన్‌ఆర్‌సి, సిఎఎ, పై వ్యతిరేకతను తట్టుకునేందుకు మోడీ, షాలు చెబుతున్న మాటలు మరింత గందరగోళ పరుస్తున్నాయి.ఎన్‌ఆర్‌సికి ప్రతి రూపమే ఎన్‌పిఆర్ అని గుర్తించాలి. ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్ లకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువల కోసం జరుగుతున్న చారిత్రక పోరులో ప్రతి ఒక్కరూ ముందు బాగాన నిలవాలి.

Chandrashekhar Azad in jail for protesting against CAA

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘పౌరసత్వం’పై మేధావుల మౌనం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.