ఆశ్చర్యపరుస్తున్న చంద్రబాబు

Chandrababu mentally disturbed

 

హుందాతనం, పరిణతి, సంయమనాలకు సంబంధించిన చంద్రబాబు రికార్డు ఇది. అటువంటిది ఇపుడు ప్రస్తుత ఎన్నికల సందర్భంలో అకస్మాత్తుగా కుప్పగూలుతున్నది. ఆయన రికార్డు అటువంటిది కాకుండా ఉండినట్లయితే ఈ పతనం ఆశ్చర్యకరంగా తోచేది కాదు. అదే పతన ధోరణి మరి కొంత దిగజారిందని మాత్రమే అనుకునే వారు. కాని ఇది చూస్తూ చూస్తుండగానే, మహా వేగంగా, 180 డిగ్రీలు తిరిగిపోయినట్లనిపిస్తున్నది. కనుకనే ఈ ఆశ్చర్యం, నమ్మశక్యంకాని స్థితి. అటువంటి మానసిక స్థితికి తను ఎందుకు లోనవుతున్నారనేది ప్రశ్న. ఎన్నికలలో ఓటమి ఎదురవుతున్నదనే అనుమానాలు ఆయనకు అంతబలంగా కలిగాయా? ఒకవేళ అది నిజమనుకున్నా, తనవంటి సుదీర్ఘ అనుభవం గల నాయకునికి జయాపజయాలు సాధారణమని తెలియనిది కాదు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒకప్పుడు హుందాతనం, పరిణతి, సంయమనం గల నాయకునిగా పేరుండేది. విధానాలు, పరిపాలన, వాటి ఫలితాల గురించి తనను విమర్శించే వారు కూడా, తన వ్యవహరణాపద్ధతిని మెచ్చుకునే వారు. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలోనూ కన్పించేది. అటువంటిది ప్రస్తుత ఎన్నికల సందర్భంలో ఆయన ఈ మంచి లక్షణాలు అన్నింటినీ కోల్పోయి వ్యవహరించటం, తనను నిన్నటి వరకు ప్రశంసించిన వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నది. ఈ మార్పు రావటానికి, అది కూడా ఇంత ఆకస్మికంగా జరగటానికి కారణం ఏమై ఉంటుందని వారు ఆలోచిస్తున్నారు.

కొందరు నాయకులకు కొన్ని మాటలు ఊతపదాలుగా మారుతుంటాయి. ఆ విధంగా “హుందాతనం” అన్నది టిడిపి అధ్యక్షుని ఊతపదంగా మారటాన్ని మనం ముఖ్యంగా ఆయన 2004- 14 మధ్య పదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న కాలంలో గమనించాము. మరీ ముఖ్యంగా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయి జీవించి ఉండిన కాలంలో జరిగింది. అపుడు అసెంబ్లీలో వారిద్దరి మధ్య వాగ్యుద్ధాలు తరచు చోటు చేసుకుంటుండేవి. రాజశేఖర రెడ్డి మాటకు పదను, దూకుడు ఎక్కువ. అందుకు భిన్నంగా చంద్రబాబు గట్టిగానే జవాబిచ్చేవారుగాని భాషా ప్రయోగంలో మాట శైలిలో సంయమనం కన్పించేవి. అంతేకాదు, “హుందాతనం అవసర” మని ఆయనే స్వయంగా తరచుగా అంటుండేవారు. రాజశేఖర రెడ్డికి అది లేదని ధ్వనింప చేసేవారు. “హుందాతనం” లోని “హు” అనే అక్షరానికి దీర్ఘం ఇచ్చి “హూందాతనం” అనటం ఆయన అలవాటు. నాయకులైన వారికి ఈ విధమైన మంచి లక్షణం ఉండాలని ఆయన శాసన సభ వాగ్యుద్ధాల సందర్భంలోనే కాదు, బయట ఇతరత్రా కూడా పేర్కొంటుండే వారు.

దీనంతటి అంతర్ధారం ఏమంటే, తనకు హుందాతనం ఉందని చంద్రబాబు పరోక్షంగా చెప్పుకుంటూ వచ్చారన్న మాట. అది తన ప్రత్యర్థులకు లేదని ఎత్తి చూపారు కూడానన్న మాట. అందుకు తనకు కించిత్ గర్వంగానూ ఉండేదది. అయితే, పైన చెప్పుకున్నట్లు, బయట ప్రజలలో, పరిశీలకులలో కూడా ఈ అభిప్రాయం తగినంత ఉండేది గనుక, అందుకు టిడిపి అధినేతను తప్పుపట్టలేము. ఆయనకు ఇదే విధమైన ప్రతిష్ఠ జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ రోజుల నుంచి లభించింది. దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులతో మంచి సంబంధాలు ఏర్పడటానికి ఇది కూడా ఒక కారణం. ఆయన పరుష పదజాలాన్ని ఉపయోగించటం వత్తిడి ఏర్పడిన పరిస్థితులలోనూ దాదాపు లేదనాలి.

హుందాతనం, పరిణతి, సంయమనాలకు సంబంధించిన చంద్రబాబు రికార్డు ఇది. అటువంటిది ఇపుడు ప్రస్తుత ఎన్నికల సందర్భంలో అకస్మాత్తుగా కుప్పగూలుతున్నది. ఆయన రికార్డు అటువంటిది కాకుండా ఉండినట్లయితే ఈ పతనం ఆశ్చర్యకరంగా తోచేది కాదు. అదే పతన ధోరణి మరి కొంత దిగజారిందని మాత్రమే అనుకునే వారు. కాని ఇది చూస్తూ చూస్తుండగానే, మహా వేగంగా, 180 డిగ్రీలు తిరిగిపోయినట్లనిపిస్తున్నది. కనుకనే ఈ ఆశ్చర్యం, నమ్మశక్యంకాని స్థితి. అటువంటి మానసిక స్థితికి తను ఎందుకు లోనవుతున్నారనేది ప్రశ్న. ఎన్నికలలో ఓటమి ఎదురవుతున్నదనే అనుమానాలు ఆయనకు అంతబలంగా కలిగాయా? ఒకవేళ అది నిజమనుకున్నా, తనవంటి సుదీర్ఘ అనుభవం గల నాయకునికి జయాపజయాలు సాధారణమని తెలియనిది కాదు. అటువంటి అనుభవానికి తాను స్వయంగా లోనయ్యారు కూడా. కాని ఇప్పటివలె సంయమనాన్ని కోల్పోవటం లోగడ జరగలేదు. అటువంటిది ఈ సారి ఎందుకు జరుగుతున్నట్లు?

కేవలం ఎన్నికల ఓటమికి మించి చంద్రబాబును ప్రభావితం చేస్తున్న విషయాలు ఏవైనా ఉండి ఉంటాయా? ఖచ్చితంగా చెప్పలేముగాని కొన్ని ఊహాగానాలు చేసేందుకు ప్రయత్నిద్దాము. ఒకటి, తన, తమ చేతులలో అధికార స్థిరీకరణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సామాజిక ఆర్థిక వర్గాల మధ్య ఉండిన అధికార స్పర్ధ, రాష్ట్ర విభజన తర్వాత ముగియకుండా కొత్త ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నది. ఆ స్పర్థలో 2014 నాటి మొదటి ఎన్నికలలో చంద్రబాబు వర్గం పై చేయి సాధించింది. దానిని కొనసాగించి స్థిరపరచుకునేందుకు ఈ రెండవ ఎన్నికలలోనూ గెలవటం అవసరం. అటువంటి గెలుపు ఈ ఒక్క ఎన్నికకు పరిమితమైన విషయం కాబోదు. ఒక సుదీర్ఘ ప్రణాళికలో, లక్షంలో ఒక భాగమవుతుంది. ఇది మొదటిది కాగా, వయసు పైబడుతున్నతాను తన వారసుడిగా కుమారుడిని ముందుకు తెచ్చి స్థిరపరచటం రెండవది.

ప్రస్తుతం 68 సంవత్సరాల వయసు గల చంద్రబాబుకు 2024లో మరుసటి ఎన్నికల నాటికి 73 ఏళ్లు వస్తాయి. కనుక లోకేశ్ స్థిరీకరణకు ఈ ఎన్నికలలోనూ అధికారం కొనసాగుదల అవసరమవుతుంది. ఇది రెండవది కాగా, తమకు ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థావరంగా మారగలదని భావించే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావటం. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ టిడిపి ఓడిపోతే జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్మాణాన్ని కొనసాగిస్తారా లేదా అనేది అనిశ్చితంగా ఉంది. ఇది మూడవది కాగా, జాతీయ రాజకీయాలూ, అందులో తన సంబంధాల పరిస్థితి ప్రస్తుతం చంద్రబాబుకు డోలాయమానంగా ఉంది. నరేంద్ర మోడీతో సంబంధాలు చిలికి చిలికి గాలివానగా మారాయి. ఒకవేళ మోడీ తిరిగి అధికారానికి వచ్చినట్లయితే తనకు “గెలిచినా ఓడినా నరకమే’ అన్న సూచనలు పీడకలవలె కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ అధికారానికి రాకపోయినా గుడ్డిలో మెల్లవలె ఉండాలంటే తను గెలవటం తప్పనిసరి.

ప్రస్తుత ఎన్నికలు చంద్రబాబుకు ఒక “బహుళ పంచమి రాత్రి” వలె తోచి భయపెట్టటం వెనుక ఇవన్నీ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇది నిజమైతే, చంద్రబాబు “ఇంతగా” ఆందోళన చెందటానికి కారణం కేవలం సాధారణమైన జయాపజయాలు కాదని అనుకోవాలి. తార్కికంగా ఆలోచిస్తే అంతేననిపిస్తున్నది. లేనట్లయితే కొన్ని దశాబ్దాలుగా నిలబెట్టుకున్న తన హుందాతనం పరిణతి సంయమనాల రికార్డును ఆయన ఇపుడు ఉన్నట్లుండి ఎందుకు భంగపరచుకోవాలి? పైన మనం చెప్పుకున్న నాలుగు అంశాలూ ఒక వేళ ఈ ఎన్నికలలో ఓడితే భంగపడే ప్రమాదం పొంచి ఉన్నందునే ఆయన ఈ రికార్డును తనపై తాను నియంత్రణను కోల్పోయి భంగపరచుకుంటున్నట్లు భావించాలి.

దేశంలోని రాజకీయ నాయకులు అందరిలోకీ తానే సీనియర్ అని స్వయంగా, సగర్వంగా ప్రకటించుకునే చంద్రబాబు గత పది రోజులుగా మనను ఆశ్చర్యపరుస్తున్న క్రమం ఏమిటో ఒకసారి గమనించండి. అందులో ఇవిఎంల పనితీరు, ఎన్నికల సంఘం వ్యవహరణ, రాష్ట్ర అధికారులు, సుప్రీంకోర్టు అనే నాలుగు అంశాలున్నాయి. ఇవిఎంలు లోపభూయిష్టమైనవా కావా? తాము గెలిచినపుడు సరైనవి అయి ఓడినపుడు లోపాలతో కూడినవి అవుతాయా? వాటిని హ్యాక్ చేయవచ్చునా లేదా? తిరిగి బ్యాలట్ పద్ధతికి పోవటం మంచిదా? లోపాలు నిజంగా లేకపోయినా తగినంత మంది నిజంగానో కపటంగానో అనుమానాలు వ్యక్తపరుస్తున్నందున ఇవిఎం ఓటింగ్ తీసివేయటం శ్రేష్టమా? అనే చర్చ ఒకటి కొంత కాలంగా సాగుతున్నది. ఒక రాజకీయ నేతగా చంద్రబాబు రైటో, తప్పో తన వాదన తాను చేయవచ్చు. దానిని రొటీన్ రాజకీయంగా తీసుకుంటాము తప్ప నిజంగా ఆశ్చర్యపడదగింది లేదు. ఆయన వైఖరి తాను గెలిచిన 2014లో ఏవిధంగా ఉందో, ఇపుడు గెలుపుపై అనుమానాల వల్ల ఎట్లున్నదో అందరూ గమనిస్తున్నదే.

కాని తక్కిన మూడు అంశాలకు సంబంధించి చంద్రబాబు అతిగా, హుందాతనాన్ని కోల్పోయి వ్యవహరించటం స్పష్టంగా కన్పిస్తున్నది. ఎన్నికల సంఘంపైన, తమ రాష్ట్ర అధికారులపైన ఆయన వ్యాఖ్యలు విభ్రాంతికరంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని “కోవర్టు” అనటం, తనపై కేసులను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసి కూడా “సహనిందితు” డని అభివర్ణించటం అందుకు బాధ్యతారహితమైన, అసభ్యకరమైన పరాకాష్ట. రాష్ట్ర ఎన్నికల అధికారితోనూ ఆయన వ్యవహరణ ఇంతే అభ్యంతరకరంగా ఉంది. ఇవిఎంల వివిప్యాట్ స్లిప్‌ల లెక్కింపును సుప్రీంకోర్టు ఒకటి నుంచి అయిదుకు పెంచిన మీదట ఆయన కోర్టు గురించి ఇంతటి వ్యాఖ్యలకైతే సాహసించలేదుగాని తన నర్మగర్భపు నిరసన, అసహనం కనిపిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు తన హుందాతనపు రికార్డును కోల్పోవటానికి తన కారణాలు తనకు ఉన్నట్లున్నాయి.

Chandrababu mentally disturbed on current election

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆశ్చర్యపరుస్తున్న చంద్రబాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.