దశ తిరుగుతుందా?

 

ఎంఎస్‌ఎంఇల కొత్త నిర్వచనానికి గ్రీన్‌సిగ్నల్
రూ. కోటి పెట్టుబడి, ఐదుకోట్ల టర్నోవర్ ఉంటే మైక్రో యూనిట్లు
రూ. ఐదు కోట్ల క్యాపిటల్, 50 కోట్ల టర్నోవర్ ఉంటే చిన్న తరహా పరిశ్రమలు
రూ. పది కోట్ల క్యాపిటల్, 100 కోట్ల టర్నోవర్ ఉంటే మధ్య తరహా
14 పంటలకు ఖరీఫ్ మద్దతు ధరల పెంపు
వరి క్వింటాల్‌కు రూ.1868

న్యూఢిల్లీ: దేశంలోని సూక్ష్మ, చిన్న మధ్యతరహా పారిశ్రామిక సంస్థలకు (ఎంఎస్‌ఎంఇ), రైతాంగానికి సహాయానికి సంబంధించిన పథకాలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎంఎస్‌ఎంఇలకు రూ. 20000 కోట్ల మేర ఆర్థిక సాయం, రైతులకు కనీస మద్దతు ధరల పెంపుదలపై కేంద్రం ఆమోదముద్ర దక్కింది. సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగింది. మంత్రిమండలి భేటీ వివరాలను ఆ తరువాత కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, ప్రకాశ్‌జవదేకర్ విలేకరులకు తెలిపారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కిన చిన్న పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి, ఇతర వర్గాలకు ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సహాయ ప్యాకేజీలు ప్రకటించారు. వీటికి ఇప్పుడు కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించిందని మంత్రులు తెలిపారు. దేశంలోని రెండు లక్షల ఎంఎస్‌ఎంఇ యూనిట్లకు రూ20,000 కోట్ల మేర ప్యాకేజీ ద్వారా తగురీతిలో మేలు జరుగుతుందని గడ్కరీ చెప్పారు. ఇక దేశంలోని వీధివ్యాపారులకు రూ 50,000 కోట్ల ప్యాకేజీని కూడా ఆమోదించారు. ఈ ప్యాకేజీ పరిధిలో హాకర్లు, దుకాణాదార్లు, సెలూన్ల వా రు రూ 10000 మేరకు రుణసదుపాయం పొందుతారు. దీని వల్ల దేశవ్యాప్తంగా కనీసం 50 లక్షల మంది చిల్లరవ్యాపారులకు మేలు జరుగుతుందని తెలిపారు.

రైతులకు మద్దతు ధరల ఖరారు
రైతాంగానికి కనీసమద్దతు ధరలను పెంచుతామని ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. ఎంఎస్‌పిలను 15ం శాతం మేర పెంచుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత పెంపుదల 14 ఖరీఫ్ పంటలకు వర్తిస్తుందన్నారు. రైతుల సాగువ్యయంతో పోలిస్తే ఈ పెంపుదలతో వారికి 50 నుంచి 83% మేర లాభం చేకూరుతుందని వివరించారు. ఖరీఫ్ పంటలకు వర్తింపచేస్తూ పంటలకు మద్దతు ధరలను పెంచినట్లు తెలిపారు. 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచే ప్రక్రియలో భాగంగా వరి పంటకు ధరను క్వింటాలు కు రూ 1868 చేశారు. జొన్నల మద్ధతు ధరలను క్వింటాల్‌కు రూ 2620 చేశారు. సజ్జలకు క్వింటాలుకు రూ 2150 ఖరారు చేశారు. రాగులకు మద్దతు ధరలను 50 శాతం పెంచారు. అదేఊ విధంగా పత్తి, పల్లీ, ఇతర తృణధాన్యాలకు కూడా ధరను పెంచారు. రైతులు రుణాలు చెల్లించేందుకు మరికొంత గడువు ఇస్తారు. ఆగస్టు వరకూ ఈ అవకాశాన్ని ఇస్తున్నట్లు, తరువాత దీనిని పెంచే విషయం ఆలోచించనున్నట్లు వివరించారు. సోమవారం నాటి కేంద్ర కేబినెట్ భేటీలో పది నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మంత్రి ఇటీవల చేసిన ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఎంఎస్‌ఎంఇలకు ఇచ్చిన నూతన నిర్వచనాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీనితో ఇప్పటివరకూ ఇంతకు ముందు రూ 25 లక్షల పెట్టుబడులు పెట్టి, రూ 10 లక్షలకు పైగా టర్నోవర్ ఉండే సంస్థలు మైక్రో యూనిట్లుగా ఉండేవి. అయితే ఇప్పుడు మారిన స్వరూపంతో రూ కోటి వరకూపెట్టుబడులు పెట్టి, రూ 5 కోట్ల టర్నోవర్ ఉండే సంస్థలకు మైక్రోయూనిట్ల స్వరూపం ఏర్పడుతుంది.

ఇక చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడుల పరిమితిని రూ 5 కోట్ల పరిధి వరకూ పెంచారు. టర్నోవర్ పరిమితిని రూ 2 కోట్ల నుంచి రూ 50 కోట్ల పరిధికి విస్తృతం చేశారు. మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడుల పరిమితిని రూ 10 కోట్లు చేశారు. టర్నోవర్ పరిధిని రూ 5 కోట్ల నుంచి రూ వంద కోట్ల వరకూ పెంచుతూ ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించిన తరువాత ఈ పరిమితిని సవరించింది. పెట్టుబడుల పరిధి రూ 50కోట్లుగా, టర్నోవర్‌ను రూ 250 కోట్లుగా ఖరారు చేశారు. పరిశ్రమ వర్గాల ప్రతినిధుల ప్రతిపాదనల మేరకు మరో కీలక నిర్ణయానికి కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎంఎస్‌ఎంఇలకు ఎగుమతుల ద్వారా వచ్చే లాభాలను టర్నోవర్‌లో మిళితం చేయరాదని నిర్ణయించారు. ఇక ఎంఎస్‌ఎంఇలను ఉత్పత్తి సేవల రంగ సముదాయంగా ఖరారు చేసే నిర్ణయానికి ఆమోదం లభించింది.

Central Govt hikes paddy price

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దశ తిరుగుతుందా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.