పరిశోధనలోనూ అణచివేత!

  ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి, విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడంపై చూపించిన శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం పేద, నిమ్న జాతి వర్గాలకు చెందిన పరిశోధకులకు ఉపకార వేతనాలు అందించడంలో చూపకపోవడం శోచనీయం. ఇక ఇటీవల విడుదలైన వెనుకబడిన తరగతులు, వికలాంగుల ఉపకార వేతనాల జాబితాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు దక్కింది నామమాత్రమే. ఉన్నత విద్యా వ్యవస్థలో పరిశోధనా రంగం చాలా కీలకమైనది. దేశం అభివృద్ధి చెందాలంటే మారుతున్న ధోరణులకు అనుగుణంగా సామాజిక, […] The post పరిశోధనలోనూ అణచివేత! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి, విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడంపై చూపించిన శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం పేద, నిమ్న జాతి వర్గాలకు చెందిన పరిశోధకులకు ఉపకార వేతనాలు అందించడంలో చూపకపోవడం శోచనీయం. ఇక ఇటీవల విడుదలైన వెనుకబడిన తరగతులు, వికలాంగుల ఉపకార వేతనాల జాబితాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు దక్కింది నామమాత్రమే.

ఉన్నత విద్యా వ్యవస్థలో పరిశోధనా రంగం చాలా కీలకమైనది. దేశం అభివృద్ధి చెందాలంటే మారుతున్న ధోరణులకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగాలలో పరిశోధనలు జరగవలసిన అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో దేశంలో ఆ దిశగా అడుగులు పడడం లేదు. భారతీయ సమాజంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న కుల జాడ్యం, పరిశోధనా రంగాన్ని సైతం వదలడం లేదు. ఎన్నో ఆశలతో, ఉన్నత విద్యను అందుకోవాలని ఉత్సుకతతో పరిశోధకులుగా విశ్వవిద్యాలయాల్లో అడుగుపెడుతున్న షెడ్యూల్డ్ కులాల పరిశోధకులపై కేంద్రం వివక్ష చూపుతుంది.

నిరుపేద గ్రామీణ కుటుంబాల నుండి వచ్చిన షెడ్యూల్డ్ కులాల పరిశోధకులు తమ పరిశోధనలు కొనసాగించాలంటే వారికి కొంత ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంటుంది. దాని కోసం విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యుజిసి) రాజీవ్ గాంధీ జాతీయ ఉపకార వేతనాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ప్రతి సంవత్సరం వేలాది మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు పరిశోధకులుగా నమోదు చేసుకుంటూ ఉండగా, వారికి తగిన సంఖ్యలో ఉపకార వేతనాలు అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతూనే ఉంది. అనేక మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తూ ఉండగా అరకొరగా మాత్రమే ఫెలోషిప్పు మంజూరు చేస్తూ ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అనేక మంది నిరుపేద షెడ్యూల్డ్ కులాలకు చెందిన పరిశోధకులు, పరిశోధనలు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందక, గత్యంతరం లేక తమ పరిశోధనలకు మధ్యలోనే స్వస్తిపలికి ఇతర మార్గాలను అన్వేషించుకుంటున్నారు.

ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులు సైతం సరైన సమయంలో నిధులు మంజూరు అవ్వక సతమతమవుతున్నారు. ఇది దేశంలో పరిశోధనా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి ఏటా 2000 షెడ్యూల్డ్ కులాల ఉపకార వేతనాలకి ప్రకటనలు వెలువరించాల్సి ఉన్నా, గత మూడు సంవత్సరాలుగా షెడ్యూల్డ్ కులాల ఫెలోషిప్‌కు సంబంధించి కేంద్రం ప్రకటన వెలువరించకపొవడం వారిపై కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరికి నిదర్శనం.

గత సంవత్సరం వెలువడిన వెనుకబడిన తరగతుల ఉపకార వేతనాల ప్రకటనలో ఉపకార వేతనాల సంఖ్యను 300 నుంచి 1000కి పెంచడం ఆహ్వానించదగిన పరిణామం, అయితే దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులతో పోలిస్తే వారికి అందుతున్న ఉపకార వేతనాల సంఖ్య చాలా తక్కువ. వికలాంగులు, మైనారిటీ వర్గాల ఉపకార వేతనాల సంఖ్య కూడా ఆశించినంతగా లేదు. దీని వల్ల ఆర్థిక స్థోమత లేక పరిశోధకులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి, విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడంపై చూపించిన శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం పేద, నిమ్న జాతి వర్గాలకు చెందిన పరిశోధకులకు ఉపకార వేతనాలు అందించడంలో చూపకపోవడం శోచనీయం. ఇక ఇటీవల విడుదలైన వెనుకబడిన తరగతులు, వికలాంగుల ఉపకార వేతనాల జాబితాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు దక్కింది నామమాత్రమే.

మారుతున్న సామాజిక పరిస్థితులలో ప్రజల జీవన వ్యయం కూడా పెరుగుతున్న దశలో ఉపకార వేతనాల పెంపు కూడా ఆవశ్యకమైనదే, అయితే కేంద్ర ప్రభుత్వం దానిని నామమాత్రంగా పెంచుతూ చేతులు దులుపుకుంటుంది. వివిధ వర్గాల వారికి ఉపకార వేతనాల మంజూరులో భిన్నమైన నియమాలు విధించడంతో విశ్వవిద్యాలయాలు కేంద్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశం అభివృద్ధి చెందడంతో పరిశోధనా రంగం కీలక భూమిక పోషిస్తుంది. అటువంటి పరిశోధనా రంగాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. సామాజిక, శాస్త్రీయ రంగాలలో సరైన పరిశోధనలు జరిగినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది. దాని కోసం యువ పరిశోధకులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులుగా నమోదు చేసుకున్న విద్యార్థులకు సరైన సంఖ్యలో, సరైన మొత్తంలో ఉపకార వేతనాలు అందినప్పుడు మాత్రమే పరిశోధనకల్లో లోతు పెరిగి, ప్రజలకు ఉపయోగకరమైన పరిశోధనలు జరుగుతాయి.

ఇక నిధుల విడుదలలో జాప్యం జరగకుండా సరైన సమయంలో ఉపకార వేతనాలు అందించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యుజిసి) పై ఉంది, దాంతో పాటు ఉపకార వేతనాలను సరైన రీతిలో ఉపయోగించుకొని ఉపయోగకరమైన పరిశోధనలు చేయవలసిన బాధ్యత పరిశోధక విద్యార్థులపై ఉంది. కేంద్రం ఇప్పటికైనా మేల్కొనకపోతే పరిశోధనా రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇది దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ పై, దేశ అభివృద్ధి పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి సమస్యలన్నింటి పై దృష్టి కేంద్రీకరిస్తూ, ఇప్పటికైనా షెడ్యూల్డ్ కులాల పరిశోధకుల పట్ల కేంద్రం ఆసక్తిని కనబరిచి షెడ్యూల్డ్ కులాల జాతీయ ఉపకార వేతనాల కొరకై ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలు, వికలాంగుల ఉపకార వేతనాలు సంఖ్య పట్ల కూడా పునస్సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యుజిసి కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం…

Center discrimination against scheduled caste researchers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పరిశోధనలోనూ అణచివేత! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: