ఇది న్యాయ వ్యవస్థపై దాడి!

Jaising, Anand

 

సుప్రీంకోర్టు న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలైన ఆనంద్ గ్రోవర్, ఇందిరా జైసింగ్‌ల ఇళ్ళు, ఆఫీసులపై మొన్న 11వ తేదీన సిబిఐ దాడి చేయడాన్ని అప్రజాస్వామిక చర్య. గత నెలలోనే ముంబాయిలో ఉండి పని చేస్తున్న లాయర్స్ కలెక్టివ్ అనే ఎన్జీవో సంస్థపై విదేశీ నిధుల క్రమబద్ధీకరణ చట్టం(Foreign Contribution (Regulation) act) (FCRA) ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగింది. హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఆధారంగా, విదేశాల నుండి ఎన్జీవోకు వస్తున్న నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు.

మాజీ సోలిసిట్ జనరల్ ఇందిరా జైసింగ్ పేరును ముద్దాయిగా చూపెట్టకుండానే కేసు నడుస్తున్నది. సిబిఐ మాత్రం విదేశాల నుండి లాయర్స్ కలెక్టివిటీ ఎన్జీవోకు వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణతో వీరిని వెంటాడుతున్నది. హోం మంత్రిత్వ శాఖ ఆరోపణ ప్రకారం సుమారుగా 96 కోట్ల 69 లక్షల రూపాయలు విదేశాల నుండి తీసుకుని దుర్వినియోగం చేశారనే ఆరోపణతో ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఆర్‌సిఎ చట్టం క్రింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. లాయర్స్ కలెక్టివిటీ ఎన్జీవోకు సంబంధించి ఆడిట్ పుస్తకాల పరిశీలన కూడా 2016 జనవరి 19 నుంచి 26 వరకు నిర్వహించారు. ప్రభుత్వ విధానానికి ఎన్జీవో స్పందిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు అంతా అసంపూర్తిగా ఉందని ఎఫ్‌సిఆర్‌ఐ చట్ట పరిధిలో జరగలేదని ఆరోపించారు.

అయినప్పటికీ హోం మంత్రిత్వ శాఖ 2016లో లాయర్స్ కలెక్టివిటి సంస్థకున్నటువంటి ఎఫ్‌ఆర్‌సిఎ అనుమతిని కూడా రద్దు చేసింది. ఎఫ్‌ఆర్‌సిఎ రద్దు చేయడాన్ని బొంబే హైకోర్టులో సవాలు చేయటం జరిగింది. దీని వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని చాలా మంది ప్రజాస్వామిక వాదులు సీనియర్ అడ్వకేట్లు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో పని చేసిన మాజీ మహిళా ఉద్యోగినిపై కొనసాగిన లైంగిక దాడిని ఇందిరా జైసింగ్ లాంటి వారు ప్రశ్నించినందుకు ఆ ఉద్యోగికి మద్దతుగా నిలబడ్డందుకు ఇటువంటి దాడి జరుగుతుందనేది కాదనలేని సత్యం.

సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిలర్ సభ్యురాలైన ఇందిరాజైసింగ్ పై గల బాధ్యతలను, విలువలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆమెపై ఇటువంటి దాడికి పాల్పడడం అప్రజాస్వామిక చర్యే కాదు, అరెస్టుకాబడిన ప్రజాస్వామికవాదులకు మద్దతుగా నిలబడి న్యాయాన్ని డిమాండ్ చేయటం కూడా నేరంగా భావించే కేంద్ర ప్రభుత్వమే ఇటువంటి దాడులు చేయిస్తున్నదని స్పష్టపడుతున్నదని లాయర్స్ కలెక్టివిటీ ఇందిరా జైసింగ్, ఆనంద్ గ్రోవర్‌ల పట్ల రాజ్యాంగ విలువలతో చట్టబద్ధ పాలనను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇందిరా జైసింగ్ మొట్ట మొదటి భారత సొలిసిటర్ జనరల్‌గా 2005లో విధులు నిర్వర్తించారు. దేశంలోనే 3వ అత్యున్నత అడ్వకేట్‌గా పేరున్నవారు. ఈమె అనేక గృహ హింస కేసులను క్రిమినల్ కేసులుగా నమోదు చేయించి బాధితులకు న్యాయం అందించారు.

1970, 80 దశకాల్లో ఉత్తర భారతంలో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో జరిగిన పోలీసుల అమానుష హత్యాకాండలకు వ్యతిరేకంగా, మనుషుల అదృశ్యాలకు వ్యతిరేకంగా కమిషన్ల ముందుకు సాక్షులను తీసుకొచ్చి బాధితులకు న్యాయం అందించడంలో ప్రజా న్యాయవాదిగా నిలబడ్డారు. అంతేగాక 2002 గుజరాత్ దాడుల్లో బాధిత ముస్లింలకు న్యాయం చేయడమే కాక ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ కూడా వేలాది మంది ముస్లింల హత్యకు బాధ్యత పడాలని న్యాయస్థానంలో పోరాటం చేసినవారు. ఈమె గత అర్ధ శతాబ్ద కాలంలో అనేక బలమైన కేసులను న్యాయ స్థానంలో పోరాడి విజయం సాధించింది. 1984లో భోపాల్ విష వాయువు బాధితుల తరపున న్యాయ పోరాటం చేయటమే కాక ప్రపంచ పారిశ్రామిక అతిపెద్ద వైపరీత్యంగా దీన్ని పరిగణించాలని బాధితులకు అదే స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేసిన న్యాయవాది.

1970 లండన్‌లో ఉన్నప్పుడు తన చుట్టూ ప్రజా ఉద్యమాలు, కార్మిక సమ్మెలతో నిండి ఉన్న సమాజాన్ని చూశారు. ఇందిరాజైసింగ్ బ్రిటీష్ న్యాయ సామాజిక సంబంధాలను చాలా దగ్గర నుండి అధ్యయం చేశారు. దేశంలో ప్రజలందరికీ సమాన న్యాయం అందాలని కలలు కన్నారు. కానీ తోటి మిత్రులు సమాన న్యాయం అందివ్వడం కలగానే మిగిలపోతున్నదని సలహా కూడా ఇచ్చారు. అయినప్పటికీ న్యాయ స్థానంలో పేద ప్రజల పక్షాన దోపిడీకి గురవుతున్న ప్రజల కోసం న్యాయస్థానంలో ధైర్యంగా నిలబడింది.

1975లో ఆమె 35 ఏళ్ళ వయస్సులో ఒక ఎన్జీవోను స్థాపించారు. భారత ప్రభుత్వం అణచివేస్తున్న రైల్వేకార్మికుల కేసును చేపట్టారు. ఆ సమయంలో చాలా మంది రైల్వేకార్మికులను జైల్లో నిర్బంధించారు. వారి వారి ఉద్యోగాల నుండి తొలగించబడ్డారు. ఈ రైల్వే సమ్మె ప్రధాని ఇందిరాగాంధీ, ఎమర్జెన్సీ విధింపుకి కారణమయింది. ఈ స్థితిలో రైల్వే కార్మికుల కేసును ఇందిరా జైసింగ్ పూర్తిగా ఉచితంగా కోర్టులో వాదించారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తరువాత ఆమె అనుయాయులు ప్రజాస్వామ్యాన్ని ఎలా దిగజార్చారో సమాజానికి తెలియచేశారు. గత ఏడాది కాలంగా దేశంలోని ప్రజాస్వామిక వాదులందరిపై, హక్కుల కార్యకర్తలపై జరుగుతున్న బిజెపి ప్రభుత్వ అమానుష నిర్బంధానికి వ్యతిరేకంగా రొమిల్లా థాపర్‌తో కలిసి న్యాయస్థానంలో పోరాడారు.

అంతేకాక సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దావే, ఇందిరాజైసింగ్, ప్రశాంత్ భూషన్‌లు సిబిఐ జడ్జ్ బి.హెచ్. లోయ మరణంపై చట్టపరమైన న్యాయ విచారణ జరగాలని, నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయటం జరిగింది. కలకత్తా పోలీస్ కమీషనర్‌పై సిబిఐ దాడిని ఖండిస్తూ ఇది చట్ట విరుద్ధమేకాక దేశ రాజ్యాంగ ఫెడరల్ విధానానికి కూడా విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని, ప్రభుత్వాన్ని విమర్శించారు. న్యాయవ్యవస్థకున్న ఫెడరల్ సూత్రాలను పూర్తిగా ఉల్లంఘించబడుతున్న ఈ స్థితిలో ప్రజాస్వామిక వాదుల గొంతు బయటకు రావాల్సిందిగా కోరారు కూడా. మొత్తంగా ఆనంద్‌గ్రోవర్, ఇందిరాజైసింగ్‌లపై కొనసాగిస్తున్న సిబిఐ దాడులన్నీ మేధావులను హక్కుల కార్యకర్తలను భయపెట్టడానికి మాత్రమే ఉపయోగపడతాయి.

కానీ వీటిలో చట్టబద్దఅంశాలు పూర్తిగాలోపించాయి. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలను లోబర్చుకోవాలంటే ఆయా పార్టీల ఎంపిల సంస్థలపై ఇళ్ళపై సిబిఐ దాడులు చేసి లోబర్చుకున్న ఘటనలు మనందరం చూస్తున్నాం. ఇది దేశంలో ఒక ప్రజాస్వామిక చట్టబద్ద పాలనకోసం ఇందిరాజైసింగ్ లాంటి సీనియర్‌న్యాయవాదులు చేస్తున్న న్యాయ పోరాటంగా ప్రజలందరూ భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాస్వామికవాదులపై ఎటువంటి దుర్మార్గ నిర్బంధం కొనసాగుతుందో ఇలాంటి బాధ్యత కలిగిన సీనియర్ న్యాయవాదులపై కూడా అటువంటి నిర్బంధం కొనసాగుతున్నది. ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి. ఏవైతే ఘటనల్లో ఇందిరా జైసింగ్ నిలబడ్డారో వాటికి మద్దతుగా నిలబడి ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరులతో న్యాయవ్యవస్థ కుదేలవడమే కాక దానిపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతున్నది.

నేరం చేయకుండానే తమ అసమర్ధతను విమర్శిస్తున్నారనే నెపంతో వారిని నిశ్శబద్దం చేయాలని ఇటువంటి దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దం గా ఉండటమే నేటి పరిస్థితులో సమాజానికి అవసరం. ఒకవైపు లోదా లాంటి జడ్జీలకే రక్షణ లేకుండా పోతే మరొకవైపు చలమేశ్వర్ లాంటి సీనియర్ న్యాయవాదులకే న్యాయం అందకపోతే పత్రికా సమావేశం ద్వారా ప్రజల మధ్యకు వచ్చిన స్థితిని మనమందరం మరిచిపోలేం. కోర్టుల్లో బెంచీని బట్టి న్యాయం కాదు కేసుల్లో న్యాయన్యాయాలను బట్టి చట్టబద్ద న్యాయం నిలబడాలని ప్రజలు కోరుకుంటున్నారు. న్యాయవ్యవస్థలో ప్రభుత్వ ప్రమే యం లేకుండా స్వయం ప్రతిపత్తితో పారదర్శకంగా అది పని చేయటం జరగాలి. అలాగైతేనే హక్కుల న్యాయవాదులను ప్రభుత్వ నిర్బంధం నుంచి కాపాడుకోగలుగుతాం.

CBI raids home, offices of Indira Jaising, Anand Grover

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇది న్యాయ వ్యవస్థపై దాడి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.