ఆహార వృథాను అరికట్టలేమా?

 Food

 

మెతుకు విలువ తెలిస్తేనే బతుకు విలువ తెలుస్తుంది. కానీ ఈనాడు ప్రపంచంలో పండిస్తున్న ఆహార పంటల్లో మూడో వంతు వృథా అవుతోంది. దాని విలువ అక్షరాలా 47 లక్షల కోట్ల రూపాయలు. ఆహారం వృథా ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. 3.3 బిలియన్ టన్నుల హరిత వాయువులు వెలువడి రోజు రోజుకూ భూతాపాన్ని అమాంతంగా పెంచుతున్నాయి. కొన్ని కోట్ల మంది అర్ధాకలితో, పస్తులతో బతుకులు ఈడుస్తుండగా 47 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆహారం వృథా కావడం అత్యంత శోచనీయం. మన దేశంలో ఆహార పదార్థాల వృథా విలువ 92,651 కోట్ల రూపాయలు కాగా, కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు కేటాయించిన దాదాపు 40 వేల కోట్ల రూపాయల పద్దు కంటే ఇది మూడు రెట్లు ఎక్కువగా అంచనా.

ఇలా వృథా కావడానికి ఎన్నో కారణాలున్నాయి. వ్యవసాయ విధానాలు సరిగ్గా లేకపోవడం, పండిన పంటను భద్రపర్చుకోడానికి తగిన నిల్వ సదుపాయాలు లోపించడం, వీటన్నిటితో పాటు వ్యక్తిగతంగా ఆహారాన్ని వృథా చేయడం కూడా ప్రధాన కారణాలవుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో సాగు నేల విస్తీర్ణం ఎక్కువ. కాని సద్వినియోగం కావడం లేదు. సాగు విస్తీర్ణం పెంచుకోడానికి ఎవరికి వారు విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడుతున్నారు. భూగర్భ జలాలను తోడేస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. ఇవన్నీ సాగు కోసమే అని అనుకుంటున్నా వాస్తవానికి నేల సారం తగ్గి ఎడారి విస్తరిస్తోంది. ఈ విధంగా దేశంలో 45 శాతం ఎడారిగా మారింది. ఇది ఆగడం లేదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పండించే పంటను భద్రపర్చుకోడానికి నిల్వ సదుపాయాలు సరిగ్గా లేక తిండి గింజలు చాలా వరకు వృథాగా మట్టి పాలు అవుతున్నాయి.

దేశంలో 10 శాతం ఆహార పదార్థాలకు మాత్రమే శీతల గిడ్డంగులు ఉన్నాయి. 200714 మధ్య కాలంలో దాదాపు 7000 వరకు శీతల గిడ్డంగులను కేంద్ర ప్రభుత్వం రూ. 2375 కోట్లతో ఏర్పాటు చేయగలిగింది. 201416 మధ్య కాలంలో 600 కోట్లతో 609 ప్రాజెక్టులను మంజూరు చేసింది. మరి ఈ ప్రాజెక్టులు ఎంత వరకు ఆచరణలోకి వచ్చాయో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తేనే కానీ వాస్తవాలు తెలియవు. పెద్ద నగరాల్లో బడా వ్యాపార వర్గాలు ఆహార నిల్వకు స్వంతంగా ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. కానీ చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో ఇవి కొరతగానే ఉంటున్నాయి.

ఆధునిక విధానాల ద్వారా ఆహార పంటలను కానీ పదార్థాలను కానీ నిల్వ చేసుకునే వీలుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పాలిథిన్ పొరల సంచుల్లో తిండి గింజలను నిల్వ చేస్తే కొన్నాళ్ల పాటు చెడిపోకుండా ఉంటాయని చెబుతున్నారు. ఈ నిల్వ గడువు తీరే సమయానికి ముందుగానే తగ్గింపు ధరకు వీటిని విక్రయించుకోగలిగితే ‘వృథా’ అన్నది కొంత వరకు తగ్గుతుందని సూచిస్తున్నారు. వాతావరణ మార్పులు, భూతాపం, ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు. ఈ నేపథ్యంలో ఆహార కొరత పెద్ద సవాలుగా మారుతోంది.

పెరుగుతున్న జనాభా అవసరాలకు కావలసిన ఆహార ధాన్యాలను ఎంత భారీగా ఉత్పత్తి చేయగలిగినా వృథాను కూడా అదే స్థాయిలో నివారించడానికి తగిన ప్రణాళికలు రూపొందించాల్సిన అగత్యం ఏర్పడింది. మంచినీరు దొరకడమే మహాభాగ్యం అవుతుండగా 25 శాతం నీటిని మన దేశంలో వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. అలాగే వ్యవసాయానికి 30 కోట్ల బ్యారెళ్ల ఇంధనం వాడుతున్నారు. ఇంత భారీ ఎత్తున ఇంధనం ఎంత విలువలో వృథా అవుతోందో లెక్కగడితే ఏటా 58 వేల కోట్ల రూపాయలు అని తేలింది.

ఆర్థిక సంపన్నుల సంఖ్య పెరుగుతున్న మన దేశంలో ఆయా కుటుంబాలు కొన్ని వివాహాది కార్యక్రమాలు జరిగినప్పుడు కొన్ని లక్షలు వెచ్చించి విందు భోజనాలు ఏర్పాటు చేయడం వారి హోదాగా కొనసాగుతోంది. అయితే ఆ విందు భోజనాల ఆహార పదార్థాలు ఎంత వృథా అవుతున్నాయో అంచనాలకు అందని విషయం. వృథా అవుతున్న ఆ ఆహారంతో కొన్ని లక్షల మంది క్షుద్బాధను తీర్చవచ్చు. ఇదే కాదు హోటళ్లు, దుకాణాల వారు కూడా ఇందులో తీసిపోవడం లేదు.

తమ వద్ద అమ్మకం కాకుండా మిగిలిపోయిన వాటిని ఏం చేస్తున్నారో చెప్పలేం. కాని కెనడా దేశంలో హోటళ్లు, దుకాణాలు, ఇతర ఉత్పత్తిదారుల వద్ద మిగిలిపోయిన ఆహార పదార్థాల్లో బాగా ఉన్న వాటిని ధార్మిక సంస్థలకు పంపించడం పరిపాటిగా వస్తోంది. ఈ విధానం వల్ల అక్కడ రోజూ 22 వేల మందికి ఉచితంగా ఆహారం అందుతోంది. ఫ్రాన్స్‌లో ఆహార పదార్థాల వృథాను అరికట్టి సద్వినియోగపర్చడానికి ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తోంది. అక్కడ సూపర్ మార్కెట్లు, అమ్ముడు పోని ఆహార పదార్థాలను స్వచ్ఛంద సంస్థలకు తప్పనిసరిగా అందజేయవలసి ఉంటుంది. ఈ విధంగా మన దేశంలో కూడా ఆహార వృథాను అరికట్టవచ్చు.

కుళ్లిపోతున్న పంటల ఉత్పత్తులు
దేశంలో పండించిన పంటను గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే సౌకర్యంలేక పంటల ఉత్పత్తులు వృథాగా కుళ్లిపోతున్నాయి. శీతల గిడ్డంగుల కొరత తీర్చడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇటువంటి సదుపాయాలు లేకనే ఏటా 21 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలు కుళ్లిపోతున్నాయి. ఈ మొత్తం ఆస్ట్రేలియా ఉత్పత్తితో సమానం. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలో ఏటా 50 వేల కోట్ల రూపాయల విలువైన ఆహార ఉత్పత్తులు వ్యర్థమై పోతున్నాయి. పొలాల నుంచి మార్కెట్‌కు వెళ్లేలోగా మిలియన్ టన్నుల ఉల్లి కుళ్లిపోతోంది. అలాగే 2.2 మిలియన్ టన్నుల టొమాటో ఎందుకూ పనికి రాకుండా పోతోంది.

పండ్లు, కూరగాయలు, చేపలు, చమురు గింజలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు నిల్వ సదుపాయాలు లేకనే చెడిపోతున్నాయి. దేశంలో 100 మిలియన్ టన్నుల పండ్లు, 180 మిలియన్ టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ వీటిలో 40 శాతం గిడ్డంగులు లేకనే చెడిపోతున్నాయి. మొత్తం మీద రాశిపరంగా వ్యవసాయ నష్టాలు 2015 లో 6.7 శాతం నుంచి 15.88 శాతం వరకు పండ్లకు, 4.58 శాతం నుంచి 12.44 శాతం వరకు కూరగాయలకు విపరీతంగా నష్టం వచ్చింది.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కోల్‌కతా నిర్వహించిన అధ్యయనంలో చెడిపోడానికి వీలున్న ఉత్పత్తుల్లో 10 శాతం వాటికే శీతల గిడ్డంగుల సౌకర్యం అందుబాటులో ఉందని తేలింది. అయితే ఈ గిడ్డంగులు చాలా వరకు అత్యధిక డిమాండ్ ఉన్న బంగాళా దుంపల నిల్వకే వినియోగం అవుతున్నాయి. ఇంకా 370 మిలియన్ టన్నుల ఉత్పత్తుల నిల్వకు గిడ్డంగుల సౌకర్యం అదనంగా కావలసి ఉందని అధ్యయనం అంచనా వేసింది.

పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏటా పండ్లు, కూరగాయలు 5 నుంచి 7 మిలియన్ టన్నుల వరకు ఉత్పత్తి అవుతుంటాయి. కానీ నిల్వకు 3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థం గల 900 శీతల గిడ్డంగులు మాత్రమే ఉన్నాయి. ఇవి బంగాళా దుంపలు, ఉల్లి, యాపిల్, నారింజ, పువ్వులు వంటి ఏదో ఒకే ఒక సరకు నిల్వకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. బిల్ మెళిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహించిన అధ్యయనంలో తక్కువ ఖర్చుతో స్టోరేజి సౌకర్యాలను కల్పిస్తే ఆహార ఉత్పత్తుల వ్యర్థాలను 60 శాతం వరకు తగ్గించవచ్చని స్పష్టమయింది.

ఆధునిక సౌకర్యాల గిడ్డంగులు ఏర్పాటయితే 76 శాతం వరకు ఆహార పదార్థాల వృథాను, 16 శాతం వరకు కర్బన్ ఉద్గారాలను తగ్గించగలుగుతామని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నిటినీ ఆకళింపు చేసుకుని ఆహార సంక్షోభాన్ని ముందుగానే నివారించగల ప్రణాళికలు సిద్ధమైతేనే కాని దేశాన్ని పీడిస్తున్న దారిద్య్రం తీరిపోదు.

Can’t prevent Food waste?

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆహార వృథాను అరికట్టలేమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.