కాగ్ ప్రశంసలు

CAG

కెసిఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లను మెచ్చుకున్న కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక
రాష్ట్ర పథకాలు భేష్
మూలధన వ్యయంలో తెలంగాణ ముందంజ
పరిమితికి లోబడే జిఎస్‌డిపి
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ప్రశంసల జల్లు కురిపించిం ది. 2018 మార్చి నాటితో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై కాగ్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు ప్రజారంజకంగా ఉన్నాయని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. ముఖ్యంగా కెసిఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రజలకు మేలు కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీఠ వేసిందని కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. మూలధన వ్యయం విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నప్పటికీ, విద్యారంగానికి మాత్రం కేటాయింపులు తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మొత్తం రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.284.74 కోట్లు కాగా ద్రవ్యలోటు రూ.27,654 కోట్లని కాగ్ రిపోర్టు బహిర్గతం చేసింది. 2014….20-19 మధ్య ప్రాజెక్టులపై రూ. 79,236 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నది.
రాష్ట్రంలో చేపట్టిన 19 ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.41,021 కోట్లు కాగా నిర్మాణ పనులు ఆశించినంత వేగంగా ముందుకెళ్లకపోవడంతో అంచనాలు రూ.1.32 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపింది. ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, జిఎస్‌డిపి నిష్పత్తిలో 19 శాతంగా ఉన్నాయని, ఇది 14 వ ఆర్థిక సంఘం నిర్ణయిచిన 22.82% పరిమితికి లోబడి ఉందని పేర్కొన్నది. అయితే రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది. ముఖ్యంగా నీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల దాని ప్రభావం ఆర్థికంగా కనిపించిందన్నారు. దీంతో రాష్ట్ర అప్పులు రూ.లక్షా 42వేల కోట్లకు చేరగా, రెవెన్యూ రాబడితో పరిశీలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19శాతమని తెలిపింది. దీంతో ఏడేళ్లలో రాష్ట్రం తీర్చాల్సిన అప్పులు రూ.65 వేల కోట్ల పైమాటే అని వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లింపుల శాతం పెరుగుతోందని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. 2017..2018 సంవత్సరానికి రెవిన్యూ రాబడి రూ. 88,824 కోట్లు కాగా 2016..2017 సంవత్సరానికితో పోల్చుకుంటే రూ. 6,006 కోట్లు (7.25శాతం) పెరిగింది.

అయితే రెవిన్యూ రాబడి బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రూ.24,259 కోట్లకు తగ్గింది. కాగా గత మూడేళ్ళుగా రాష్ట్రంలో ముఖ్యమైన పన్నుల వసూళ్ళ కొరకు అయ్యే ఖర్చు తగ్గిందని, ఇది పన్నుల వసూళ్ళలో సమర్ధత పెరిగిందనడానికి సూచిక అని కాగ్ తెలిపింది. మొత్తం ద్రవ్య బాధ్యతలను లెక్కగట్టేందుకు, వాటి తీర్చే సామర్ధాన్ని అంచనా వేసేందుకు భవిష్యత్ ప్రక్షేపణల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేపట్టాలని సూచించారు. అలాగే పన్నెండో ఆర్ధిక సంఘం సిఫారుల మేరకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్యబాధ్యత..బడ్జెట్ నిర్వహణ చట్టం..2005 అనుగుణంగా ముఖ్యమైన లక్ష్యాలను ఎప్పటికప్పుడు సవరించాలని సూచించారు. అయితే 14వ ఆర్ధిక సంఘం ఇచ్చిన సిఫారసులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని ఇంకా సవరించుకోవాలని వ్యాఖ్యానించింది. ఇక రాష్ట్ర పునర్వీస్థీకరణ జరిగి నాలుగేళ్ళు పూర్తి అయినా కాపిటల్ పద్దులలో ఉన్న రూ 1,51,349.67 కోట్లు, రుణాలు, అడ్వాన్సు పద్దుల్లో ఉన్న రూ.28,099.68 కోట్ల మొత్తాల పంపకం ఇంకా జరగాల్సి ఉందని పేర్కొన్నది.

షెడ్యూల్ 9 ప్రకారం మొత్తం 91 సంస్థల విభజన జరగాల్సి ఉందని, ఇందుకోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ 86 సంస్థల విభజన సిఫారసులు చేసిందన్నది. పునారావృతం అవుతున్న అధిక ఖర్చులకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషించుకోవాలని సూచించింది. రాష్ట్ర శాసనసభ అనుమతించిన కేటాయింపులకు మించి స్వయంగా ఆర్ధిక శాఖతో సహా శాఖాపరమైన నియంత్రణాధికారులెవరూ ఎక్కువ ఖర్చు చేయకుండా ఆర్ధికశాఖ నిర్ధారించుకోవాలని కాగ్ తన నివేదకలో పేర్కొన్నది.

CAG Appreaciate Telangana Welfare Schemes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాగ్ ప్రశంసలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.