‘క్యాబ్’ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

Vinod Kumar

 

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం సిటీజన్స్ అమైండ్‌మెంట్ బిల్ (క్యాబ్)ను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకుని వచ్చిందని, ఇది ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం హోటల్ కత్రియాలో జరిగిన అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ‘క్యాబ్’ ను ఉద్ధేశ్య పూర్వకంగానే తీసుకొచ్చిందని, ఆర్థిక మాంద్యం వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. ‘క్యాబ్’ పూర్తిగా రాజకీయ దురుద్ధేశ్యంతో, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేదిగా ఉందని వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

‘క్యాబ్’ ప్రకారం పొరుగు దేశాల నుంచి వచ్చే ముస్లిం శరణార్ధులకు భారత పౌరసత్వం అవకాశం లేదని, ఇది లౌకిక వాదానికి వ్యతిరేకమన్నారు. ‘క్యాబ్’ అమలులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. క్యాబ్ ను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్రంలోనూ ‘క్యాబ్ ’ను అమలు చేయబోమని ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరగా ‘క్యాబ్’ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాష్ట్రాల చేతిలో ఏమీ లేదన్నారు. కేవలం రాజకీయ ప్రకటన తప్ప ఆ ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాత్ర ఉండ దన్నారు. పోలీస్ వేరిఫికేషన్‌లో జాప్యం చేయడం తప్ప ‘క్యాబ్’ విషయంలో రాష్ట్రాలు చేసేదేమీ ఉండదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న ‘క్యాబ్’ విషయంలో సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకొని స్పష్టత ఇవ్వాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

CAB is against Constitution spirit says Vinod Kumar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘క్యాబ్’ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.