“మా నందిని నిజం చెప్పదు. అడిగితే తప్పయిపోతోంది. రెండు రోజులకోసారి ఇంట్లో కోర్టు సీనూ….” “చెప్పావూ… డోలొచ్చి మద్దెలతో అన్నట్లు మా తరుణ్.. చదివేది థర్డ్‌క్లాస్… ఒక్క విషయం చెప్పడు తెలుసా? టీచర్ డైరీలో రాసి పెట్టింది చూసి అడిగినా సరే ఏడుపులు… అస్సలు వీడెందుకు ప్రతీది దాస్తాడో అర్థం కావటం లేదు…” “నందినిని వద్దు అడగద్దు అనుకుంటాను. మళ్లీ ఏదో భయం. ఏం స్నేహాలు చేస్తోందో.. తెలిసీతెలియక ఏ ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడోనని భయం. సరే వయసు వచ్చింది ఏదో దాస్తోంది అంటే ఆలోచిద్దాం.. మరి ఇంత చిన్నపిల్లాడు విషయాలు దాస్తుంటే…”
సాధారణంగా పిల్లలున్న ఇళ్లల్లో జరిగే వ్యవహారం ఇది. ఎంత చనువు ఇచ్చినా ఎందుకు మనసు విప్పి మాట్లాడరు. ఎందుకు గుంభనంగా ఉంటారు? కన్న తల్లిదండ్రులకీ చెప్పుకోలేని వ్యవహారాలు వీళ్లకు ఏముంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు అంతుబట్టవు. అసలు మనుషులు ఎందుకు నిజాలను దాస్తారు అనేందుకు చాలా కారణాలు ఉంటాయి. నిజం తెలియటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అనుకున్నప్పుడు నిజం దాచేస్తారు. కానీ నిజం దాస్తే, అదెప్పుడో బయటపడితే పెద్దవాళ్లకు భయం పట్టుకుంటుంది.
ఈ దాచటాన్ని సహజంగా తీసుకోండి అంటారు నిపుణులు. ఏ విషయం, ఎప్పుడు, ఎలా ఎవరికి చెప్పాలన్న సంగతి మానసిక పరిపక్వత చెందుతున్న సమయంలో టీనేజ్ పిల్లలు తెలుసుకుంటారంటారు. అలా చేస్తూ తమ ప్రత్యేకత ప్రపంచానికీ, తమలో తమకీ నిరూపించుకుంటారు. అది అవసరం. దీన్ని గుర్తించకుండా తల్లిదండ్రులు తమకి చెప్పని విషయాల గురించి అస్తమానం నిలదీస్తారు. తప్పు పడతారు. ఇది పిల్లల మానసిక ఎదుగుదలకు ఆటంకం అంటారు నిపుణులు.
భయంతో దాస్తారు : చిన్నపిల్లలు సాధారణంగా క్లాస్‌లో టీచర్ కొట్టినా, తిట్టినా ఇంట్లో చెప్పరు. చెపితే కారణం చెప్పాలి. ఏ హోమ్‌వర్క్ చేయకనో, క్లాసులో అల్లరి చేసో టీచర్ చేత తిట్లు తింటారు. ఆ విషయం ఇంట్లో చెప్పినా చివాట్లు తప్పవు. లేదా నన్నిలా కొట్టారని చెపితే తల్లిదండ్రులు పోయి స్కూల్లో అడుగుతారని, టీచర్‌కు అనవసరంగా తమ పైన కోపం వస్తుందని భయపడతారు. సందర్భం ఇలా రావటానికి కారణం తల్లిదండ్రులే… పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలనుకుంటారు. ప్రతి విషయం తరచి అడుగుతారు. పిల్లలు ముందుగా నిజమే చెబుతారు. పిల్లలవైపు నుంచి ఆలోచించి చిన్నపిల్లవాడి విషయంలో తాము ఎలా ప్రవర్తించాలి అనుకుంటే గొడవే లేదు.
ముందు తామే జడ్జిమెంట్ ఇవ్వటం, లేదా వెంటనే దండించటం, స్కూలుకి వెళ్లి టీచర్‌ను అడగడం, ఇవన్నీ కక్ష సాధింపు వ్యవహారాలుగా పిల్లలకు అర్థమవుతాయి. ఏం జరిగినా భరించేది వాళ్లే కదా! ఆటల్లో పొరుగు పిల్లవాడితో కొట్టుకుంటే మాటలు పోతాయి. టీచర్ కోపాగ్నికి గురవుతారు, లేదా తల్లిదండ్రుల క్రమశిక్షణకు బలవుతారు. ఇలా ఒకటి రెండుసార్లు అయ్యాక వాళ్లు నిజం చెప్పటం మానేస్తారు. అతి జాగ్రత్త, అతి పర్యవేక్షణ వల్ల పిల్లలకు ఇబ్బంది కలిగిస్తున్నామని తెలుసుకుంటే సమస్యలేదు.
ఇబ్బందితో దాస్తారు : ఇక టీనేజర్ల విషయంలో బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టే దశలో వాళ్ల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి విషయాన్ని పెద్దవాళ్లతో చెప్పుకోలేరు. వాటి గురించి మాట్లాడటం పెద్దవాళ్లకు ఇబ్బందే. ఫ్యామిలీ డాక్టర్ సాయంతో పిల్లలకు వ్యక్తిగత విషయాలు తెలుసుకునేలా చేయాలి. దాన్ని మళ్లీ పబ్లిక్‌లో చర్చించకుండా ఉండాలి.
అలాగే పిల్లల స్నేహితుల ముందు వాళ్లను చులకన చేయకూడదు. పిల్లలు ఏ విషయాలు స్నేహితులతో చెప్పాలనుకుంటారో, దాచేయాలనుకున్నారో, తెలుసుకోకుండా, పెద్దరికం ప్రతి విషయం స్నేహితుల ముందు మాట్లాడి వాళ్లు ఇబ్బంది పడేలా చేయకూడదు. ఏదైనా వాళ్లతో చెప్పాలంటే పర్సనల్‌గా మాట్లాడి తెలుసుకోవాలి కానీ వాళ్ల గురించి, స్నేహితుల నుంచి తెలుసుకోవాలని చూడొద్దు. పిల్లల మనసుని అర్థం చేసుకుని ఏ విషయాన్ని షేర్ చేయకుండా దాచుకున్నారో ఆ విషయం తమకు చెప్పేంత ముఖ్యమైనదా? కాదా దానికి పిల్లలు తగినంత ప్రాముఖ్యత ఇచ్చారా? ఇవ్వలేదా తెలుసుకోగలగాలి. మనం ఆ వయసు నుంచే కదా పెద్దవాళ్లయింది. ఆ వయసులో మనం ఎలా ఉండేవాళ్లం, దేనికి బిడియపడేవాళ్లం, తల్లిదండ్రులతో ఏ సున్నితమైన విషయాలు పంచుకోలేక పోయేవాళ్లమని ఒక్కసారి ఆలోచించి చూస్తే అప్పుడు మనం టీనేజర్లతో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది.
తల్లిదండ్రుల కర్తవ్యం : తమ పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలని ఆశించే తల్లిదండ్రులు తమ వంతుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛ ఇచ్చి తీరాలి. ఆ స్వేచ్ఛను సక్రమంగా వినియోగించుకుంటున్నారా లేదా అని గమనించాలి. తప్పులు చేసే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. పిల్లల స్నేహితులను ఇంటికి ఆహ్వానించాలి. వాళ్లతో మాట్లాడాలి. కేవలం వాళ్ల ఆలోచన స్థాయి ఎక్కడుందో తెలుసుకునేందుకే ఈ సంభాషణ ఉపయోగపడాలి. ఏదైనా సందేహం వస్తే పిల్లలతో ప్రైవేట్‌గా మాట్లాడేందుకు ప్రతిసారి ప్రయత్నించాలి.
అప్పుడే యువతకు పెద్దవాళ్ల పట్ల నమ్మకం వస్తుంది. తమ రహస్యాలు పెద్దవాళ్లు తెలుసుకున్నా దాన్ని మనసులో దాచుకుంటారని తమ స్నేహితులకు పంచరని తేల్చుకుంటారు. అప్పుడే మనసు విప్పి మాట్లాడతారు. పిల్లలు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాలనుకుంటారు. దాన్ని అర్థం చేసుకునే మనసు ఉంటేనే పిల్లలతో స్నేహం సాధ్యమవుతుంది. ముందుగా వినాలి, మాటలకు అడ్డం రాకుండా వెంటనే అభిప్రాయం చెప్పకుండా జడ్జిమెంట్లు చేయకుండా ప్రేమగా వినాలి. దాన్నే అలవాటు చేసుకోవాలి. పిల్లల మనసు గెలుచుకోగలిగితే వాళ్లు రహస్యాలు ఎందుకు దాస్తారు. తల్లిదండ్రులను మించిన స్నేహితులు ఆప్తులు మేలు కోరేవాళ్లు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని వాళ్లకి అర్థమయ్యేలా పెద్దవాళ్ల ప్రవర్తన ఉంటే పిల్లలకు దాపరికం అవసరమే రాదు. ఒక సర్వే ప్రకారం తల్లిదండ్రుల నమ్మకం, ప్రేమాభిమానాలు పొందని యువత అపరిచితుల వేటలో, వలలో పడే అవకాశాలు ఉన్నాయని అధ్యయనకారులు చెప్పారు. దీనికి బాధ్యులు తల్లిదండ్రులు మాత్రమే.
నిరంతరం కెరీర్ పరుగుల్లో పిల్లలను పట్టించుకోకుండా క్షణం తీరిక లేకుండా ఉండటంలో పిల్లలు మనసు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది. అలా జరగకుండా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్లకి కొంత సమయం ఇవ్వాలి. వాళ్లతో ప్రతిరోజూ మాట్లాడాలి. వాళ్ల మనసు అర్థం చేసుకోవాలి. వాళ్లు ఎప్పుడూ పెద్దవాళ్ల సలహా కోరేంత స్నేహ పూరిత వాతావరణం ఉండాలి. ఏ విషయాన్నైనా ఎలాంటి సంకోచం లేకుండా అమ్మానాన్నతో చెప్పుకోగలిగిన చనువు ఉంటే పిల్లలకు దాచుకోవలపిన అంశాలు ఎప్పటికీ ఉండవు. పిల్లల్ని ప్రేమించడం, గౌరవించడం అవసరం అని ప్రతి తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ గుర్తించాలి. వాళ్లకీ మనసూ, ఆలోచనలూ ఉంటాయి. వాటిని సున్నితంగా అడిగి తెలుసుకోవాలి. సమస్యల్ని అడిగి కను క్కోవాలి. పరిష్కార మార్గాల్ని చూపించాలి.
Building Courage in Kids
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post పెద్దలతో ధైర్యంగా చెప్పుకోగలగాలి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.