బోరిస్ జాన్సన్ ఎగ్జిట్ తప్పదా?

  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరిగా తయారైంది. ఆయన చేజేతులా చేసుకున్నదే ఇదంతా. లేబర్ పార్టీ నాయకులు కూడా మంచి శాస్తి జరిగిందిలెమ్మని ఊరుకుంటున్నారు. బ్రిటన్‌లో అతి స్వల్పకాలం ప్రధాన మంత్రిగా పని చేసిన ఘనత బహుశా ఆయనకే దక్కవచ్చు. అంతేకాదు, బ్రిటన్‌ను పాలించిన అత్యంత బలహీనమైన ప్రధానిగా కూడా ఆయన పేరే చరిత్రలో నిలిచిపోవచ్చు. ఇప్పుడాయన చేయగలిగింది కూడా ఏమీ లేదు. తన చేజేతులా చేసుకున్నది చూసి చింతించడం […] The post బోరిస్ జాన్సన్ ఎగ్జిట్ తప్పదా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరిగా తయారైంది. ఆయన చేజేతులా చేసుకున్నదే ఇదంతా. లేబర్ పార్టీ నాయకులు కూడా మంచి శాస్తి జరిగిందిలెమ్మని ఊరుకుంటున్నారు. బ్రిటన్‌లో అతి స్వల్పకాలం ప్రధాన మంత్రిగా పని చేసిన ఘనత బహుశా ఆయనకే దక్కవచ్చు. అంతేకాదు, బ్రిటన్‌ను పాలించిన అత్యంత బలహీనమైన ప్రధానిగా కూడా ఆయన పేరే చరిత్రలో నిలిచిపోవచ్చు. ఇప్పుడాయన చేయగలిగింది కూడా ఏమీ లేదు. తన చేజేతులా చేసుకున్నది చూసి చింతించడం తప్ప. యూరోపియన్ యూనియన్ నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండా వైదొలిగిపోవడం కుదరదని హౌస్ ఆఫ్ కామన్స్ ఓటింగులో తేలింది. ఒప్పందం లేకపోయినా యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేద్దామని చెప్పిన బోరిస్ జాన్సన్ ప్రయత్నాలకు గండి పడింది. వీలయితే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చే ఒప్పందం చేసుకుంటామని బోరిస్ చెప్పినప్పటికీ ఎలాంటి డీల్ లేకపోయినా సరే బయటకు వచ్చేయాలని ఆయన తొందరపడ్డాడు. ఇప్పుడు దానికి బ్రేకులు పడ్డాయి. ఆయన స్వంత పార్లమెంటు సభ్యుల్లో 21 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఇప్పుడు బోరిస్ జాన్సన్ అధికారంలో ఉన్నాడు కాని ఆయనకు మెజారిటీ బలం లేదని తేలిపోయింది. ఈ ఊబి నుంచి బయటపడడానికి నిర్ణీత వ్యవధి పార్లమెంటు చట్టాన్ని పక్కన పెట్టాలని అనుకున్నాడు. అందుకు పార్లమెంటు అనుమతి కోసం ప్రయత్నించాడు. అక్టోబర్ 15వ తేదీన ఎన్నికలకు ఒప్పుకున్నాడు. నిర్ణీత వ్యవధి పార్లమెంట్ చట్టాన్ని మినహాయించాలంటే మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం. బోరిస్ జాన్సన్ ప్రతిపాదనకు 133 ఓట్లు తక్కువ వచ్చాయి. హౌస్ ఆఫ్ కామన్స్ ఈ విషయంలో అభిప్రాయం మార్చుకునే అవకాశాలు కనిపించడం లేదు.

కాబట్టి వెంటనే బ్రిటన్‌లో ఎన్నికలు రాకపోవచ్చు. లేబర్ పార్టీ నాయకుడు జెరిమి కోర్బిన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, బోరిస్ జాన్సన్ ఓడిపోతే కూడా ఎన్నికలు వెంటనే వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయడానికి ప్రతిపక్షాలకు రెండు వారాల సమయం ఉంటుంది. ఇలాంటి ఒక ఏర్పాటు విషయమై కోర్బిన్ కూడా ఇంతకు ముందు చెప్పాడు. బ్రెగ్జిట్ చివరి తేదీ అక్టోబర్ 31. ఈ తేదీని మరికాస్త పొడిగించేలా ప్రయత్నాలు చేయడానికి కోర్బిన్ ఇలాంటి ప్రతిపాదనల గురించి మాట్లాడారు. చాలా మంది ప్రతిపక్ష నేతలకు కూడా ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యంగానే ఉంది. కాని కోర్బిన్ ప్రధాని పదవి స్వీకరించడం చాలా మందికి ఇష్టం లేదు. ఆయన పక్కకు తప్పుకుని మరెవరినైనా ప్రధాని చేయడానికి ఒప్పుకుంటే ప్రతిపక్ష నాయకులు చాలా మంది ఒప్పుకోవచ్చు. బహుశా ఒత్తిడి వల్ల కోర్బిన్ కూడా ఒప్పుకునే అవకాశాలున్నాయి. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితులు వస్తే బోరిస్ జాన్సన్ పదవి నుంచి తప్పుకోవలసి వస్తుంది.

కాని కోర్బిన్ ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమని అంటున్నాడు. బ్రెగ్జిట్ చివరి తేదీ పొడిగింపు విషయమై మహారాణి ఆమోదం తెలిపితే మళ్ళీ ఎన్నికలకు వెళదామంటున్నాడు. కాని ఆయన పార్టీ నేతలు చాలా మందికి ఎన్నికలు ఇష్టం లేదు. అక్టోబర్ 31 తర్వాత మాత్రమే ఎన్నికలు జరగాలని కోరుతున్నారు. ఈ లోపు ఎన్నికలు జరిగి బోరిస్ జాన్సన్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి, బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండా బయటకు వచ్చే పరిస్థితి తీసుకు వస్తాడని చాలా మంది భయపడుతున్నారు. కాబట్టి వెంటనే ఎన్నికలు జరిపించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరుతున్నప్పటికీ, కోర్బిన్ కూడా ఒప్పుకుంటున్నప్పటికీ వెంటనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడడం లేదు. బోరిస్ జాన్సన్ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నాడు. ఆయన పదవిలో ఉన్నాడు కాని అధికారాలు లేవు.

పోనీ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఓడిపోయి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తీసుకువద్దామని అనుకున్నా అది కూడా బోరిస్ జాన్సన్ కు సాధ్యమయ్యేలా లేదు. ఆరు నూరైనా సరే అక్టోబర్ 31వ తేదీన బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలని బోరిస్ జాన్సన్ పట్టుపడుతున్నాడు, కాని అలా జరిగే సూచనలు కూడా కనబడడం లేదు. ఈ ప్రయత్నాలన్నింటినీ లేబర్ పార్టీ అడ్డుకుంటోంది. బ్రిటన్‌లో ఇప్పుడు పరిస్థితేమిటన్నది ఒక అయోమయం. ఏది ఏమైనా అక్టోబర్ 31 లోపు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఆ తేదీ తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి. కాని అక్టోబర్ 31 తర్వాత ఎన్నికలు జరిగితే బోరిస్ జాన్సన్ ప్రతిష్ఠ అప్పటికే దిగజారి ఉంటుంది. బ్రెగ్జిట్ అక్టోబర్ 31 లోపు సాధిస్తానని చేసిన వాగ్దానం విషయమై ప్రజలు నిలదీస్తారు. బ్రెగ్జిట్ పూర్తయిన తర్వాత ఎన్నికలు జరగడమే జాన్సన్ కు లాభం.

జాన్సన్ వద్ద మరి కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయి. కాని అవి ఎంతవరకు ఫలితాలు సాధిస్తాయన్నది స్పష్టంగా లేదు. తాడో పేడో తేల్చుకోడానికి నిర్ణయించుకుని, పార్లమెంటు అభిప్రాయాన్ని పక్కనపెట్టి, యూరోపియన్ యూనియన్ నుంచి ఎలాంటి ఒప్పందం లేకపోయినా అక్టోబర్ 31వ తేదీ డెడ్ లైన్ ప్రకారం బయటకు వచ్చేయవచ్చు. కాని ఇలా చేయడం చట్టాన్ని పక్కన పెట్టి వ్యవహరించడమే. కాని పార్లమెంటు కూడా ఏం చేయగలదు? కోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కేబినేట్ సెక్రటరీని బ్రసెల్స్ పంపించి బ్రెగ్జిట్ చర్చలు జరుపుతుందా? అలా సాధ్యం కాదు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేలా చేయడమే ఇప్పుడు బోరిస్ జాన్సన్ ముందున్న పెద్ద సవాలు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడం కన్నా ఈ ప్రయత్నాల్లో అవసరమైతే ప్రాణాలు పోవడమే మంచిదని బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు బ్రిటన్ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎంత కీలకంగా మారాయో చాటి చెబుతున్నాయి.

ఇప్పుడు బోరిస్ జాన్సన్ ఏం చేస్తాడనే విషయంపైనే అందరి దృష్టి ఉంది. బ్రెగ్జిట్‌కు మరింత వ్యవధి ఇవ్వమని యూరోపియన్ యూనియన్ ను అడిగే బదులు ఆయన రాజీనామా చేయవచ్చు. కాని దానివల్ల ఆయన రాజకీయ జీవితం అర్థాంతరంగా ముగిసినట్లే అవుతుంది. ఆయన ఈ పని చేయడానికి కూడా వెనుకాడడని చాలా మంది అంటున్నారు. బ్రెగ్జిట్ ఆలస్యం చేయాలని ప్రతిపక్షాలతో పాటు కలిసి బోరిస్ జాన్సన్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన టోరీ సభ్యులు 21 మందిని బహిష్కరించాలని ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఆయన స్వంత పార్టీలో విమర్శలకు కారణమైంది.

వేటుపడిన వారిలో చర్చిల్ మనుమడు నికోలస్ సోమ్స్ కూడా ఉన్నాడు. ఈ బహిష్కరణలను ఖండిస్తూ 100 మంది కన్సర్వేటివ్ సభ్యులు లేఖ రాశారు. కాబట్టి బహిష్కరణ నిర్ణయం వెనక్కు తీసుకోవాలనే ఒత్తిడి ఆయనపై చాలా ఉంది. అన్నింటికి మించి ఆయన స్వంత సోదరుడే రాజీనామా చేశాడు. స్వంత సోదరుడే ఆయన్ను నమ్మకపోతే దేశం ఎలా నమ్ముతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. రానున్న రోజుల్లో బ్రిటన్ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

Boris Johnson to suspend parliament in Brexit run up

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బోరిస్ జాన్సన్ ఎగ్జిట్ తప్పదా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: