కుండలో బోనం అమ్మకు నైవేద్యం…

Bonalu

 

మన దేశంలోని అన్ని సంస్కృతులలో సామాన్యంగా కనిపించే లక్షణం మాతృ ఆరాధనం, ప్రకృతిని మనం తల్లితో పోల్చుకొని ఆరాధిస్తాం, అందరినీ చల్లగా కాపాడమని, ప్రశాంతంగా ఉండాలని ఆ ప్రకృతిని వేడుకుంటాం. కానీ ఆ అమ్మ ఆగ్రహిస్తే ఈ భూతలమే దద్ద్దరిల్లుతుంది. ఇలాంటిదే 1869వ సంవత్సరంలో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో జరిగింది. ప్రకృతి వికటించి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి కోపాన్ని గమనించిన పెద్ద మనుషులు అమ్మవారిని శాంతింపజేయడానికి ఉత్సవాలను, జాతరలను నిర్వహించాలని సంవత్సరమంత మనకు భోజనం పెట్టె ఆ తల్లికి మన మందరం భోజనం పెట్టి ఆ అమ్మ కడుపు నింపి తమని కాపాడమని వేడుకోవాలని వేడుకునేందుకు భోజనాల ఉత్సవాలని ప్రారంభించారు, కాలక్రమేనా భోజనం బోనంగా మారి తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగగా అవతరించింది.

ఈ పండుగ వస్తుందంటేనే తెలంగాణ ప్రజల మనస్సులు పరవశంతో పులకరించిపోతాయి. ప్రజలు బంధుమిత్రులతో కలిసి ఈ పండుగ జరుపుకుంటారు. కుటుంబాల మధ్య బంధాలు, అనుబంధాలు పెంచడంలో ఈ బోనాల జాతర ఒక వారధిలా పని చేస్తుంది. హైదరాబాద్ ప్రజలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికా ఆలయంలో జరిగే బోనాలకు అయిదు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆషాడ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం ఏది ముందుగా వస్తే ఆ రోజున గోల్కొండ కోటలో ఉన్న జగదంబిక అమ్మవారికి తరతరాలుగా కుమ్మరి వంశస్థులైన మహిళలు తాము తయారు చేసిన మట్టి కుండలో భక్తి శ్రద్ధలతో బోనాన్ని వండగా, మగవారు వెదురుతో తయారు చేసిన తొట్టేలకు రంగు రంగుల కాగితాలు అతికించి లంగరుహౌస్ ప్రాంతం నుండి ఊరేగింపుగా వచ్చి బోనాన్ని తీసుకొని గోల్కొండ కోటపైన ఉన్న అమ్మవారికి మొట్టమొదలుగా సమర్పించి తెలంగాణ అంతట బోనాల ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆ తరువాత ఆ కుమ్మరి ఆ వంశస్థులు భక్తులకు బొట్టు పెడుతూ అర్చనలు చేస్తూ అక్కడే పూజారులుగా ఉంటారు. బోనం సమర్పించాక వారికి కట్నకానుకలు అందించి ఆశీర్వాదం తీసుకుంటే తమ కుటుంబానికి బర్కత్ అని ఇక్కడి ప్రజల నమ్మకం. అదే రోజు లోయర్ ట్యాంక్ బండ్‌లో గల కట్ట మైసమ్మ తల్లికి రాష్ట్ర కుమ్మర సంఘం తరపున 501 బోనాలను మట్టి కుండలలో మహిళలు ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించడం జరుగుతుంది.

ఆషాడమాసంలో ప్రారంభమయ్యే ఈ బోనాలు శ్రావణ మాసం వరకు కొనసాగుతాయి. గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను నిర్వహిస్తారు. పండుగ మొదటి చివరి రోజులలో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి ఆచారం. బోనం అంటే నైవేద్యం. వండిన అన్నంతో పాటు పసుపు, పాలు, బెల్లం, ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి కుండలలో ఉంచి మహిళలు తమ తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపంను ఉంచుతారు. పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, బంగారు మైసమ్మ, మైసమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మొదలైన అమ్మవారి దేవాలయాలను దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు.

పూర్వం ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును కూడా బలి ఇచ్చేవారు. కానీ నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను, మేక పోతులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. అలాగే కొంత మంది మహిళలు దేవీ అమ్మవారు తమను ఆవహిస్తుందని నమ్ముతారు, అలా పూనకం పట్టిన స్త్రీలు తలపై బోనం మోస్తూ లయబద్ధమైన డప్పు చప్పుళ్లకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. కాళీ అమ్మవారు రౌద్రానికి ప్రతిరూపం కావున ఆమెను శాంతపరచడానికై అమ్మవారు ఆవహించిన మహిళలు గుడి వద్దకు రాగానే వారి పాదాలపై భక్తులు నీళ్ళని కుమ్మరిస్తూ శాంతించమని వేడుకుంటారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందమూ ఒక తొట్టెలను (రంగుల కాగితమూ, కర్రలతో అలంకరించబడిన పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. అమ్మవారికి సమర్పించిన బోనాల ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది. పండుగ జరిగే ప్రాంతాలను వేపాకులతో అలంకరింస్తారు. అమ్మవారి జానపద పాటలు, పోతురాజుల ఆటలు, పిల్లల కేరింతల మధ్య ఈ పండుగ ఎంతో శోభాయమానంగా జరుగుతుంది.

పోతురాజును అమ్మవారి సోదరునిగా ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ పోతురాజు వేషధారణలో ఉన్న వ్యక్తి, అక్కడికి వచ్చే భక్తులను కాపాడే ఒక రక్షకుడి గా ఇప్పటికీ ప్రజలు భావిస్తారు. బోనాన్ని ఎత్తుకు వచ్చే ఆడపడుచుల సమూహాన్ని పోతురాజు నడిపించడం ఆనవాయితీ. పోతురాజు పాత్రను వేషధారణలో ఉన్న వ్యక్తి బలశాలిగా కనబడుతాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు పెట్టుకొని, చిన్న ఎర్రని ధోతీని ధరించి ఆ డప్పుచప్పుళ్లకు అనుగుణంగా ఆడతాడు. అతను అమ్మవారికి సమర్పించే పలారం బండి ముందు నాట్యం చేస్తాడు. కొరడాతో కొట్టుకుంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, పూనకంలో ఉన్న భక్తురాళ్ళను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

తదుపరి రంగం పండుగ ఉదయం పూట జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ రౌద్రత్వాన్ని తగ్గించేందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు, ఆ పోతరాజు మేకపోతును బలి ఇస్తాడు. ఈ కార్యక్రమం బోనాల ఊరేగింపు తరువాత జరుగుతుంది. ఈ బోనాల ఊరేగింపులో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు నీళ్లు, వేపాకులను ఊరంతా చల్లడం వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.

అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన కుండను ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన కుమ్మరి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. కులీ కుతుబ్ షాల కాలంలో ప్రారంభమైన ఈ బోనాలు ప్రతి సంవత్సరం రాజధానిలో సుమారు నెల రోజుల పాటు వైభవోపేతంగా జరుగుతాయి. నైజం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలను, బోనాన్ని కుమ్మరుల చేతుల మీదుగా మొదటగా సమర్పించిన తరువాతే హైద్రాబాద్ అంతటా జరిపించేవారని చరిత్ర చెబుతుంది.

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు కూడా ఘనమైన చరిత్ర వుంది. వీటినే లష్కర్ బోనాలు అని కూడా అంటారు. సుమారు శతాబ్దం క్రితం మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుండి వచ్చిన అప్పయ్య అనే సైనికుడు సికింద్రాబాద్ లో అమ్మవారిని ప్రతిష్టించడంతో ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయని చరిత్ర చెబుతుంది. ఆషాఢ మాసం తొలి ఆదివారం నాడు మారేడ్పల్లి వాస్థవ్యులు కుమ్మరి వెంకయ్య వశస్థులైన కుమ్మరి వినోద్ కుటుంబీకులు అమ్మవారి బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించిన ఘటంను తయారు చేసి ఆలయానికి అందించడంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మొదవుతాయి. ఈ ఘటాన్ని 15 రోజుల పాటు పురవీధులలో ఊరేగిస్తారు. మిగిలిన ఆలయాల్లో జరిగే బోనాలు ఒక ఎత్తు అయితే ఈ లష్కర్ బోనాలు ఒక ఎత్తు.

అక్కడ జరిగే బోనాలు సమైక్యతకు ప్రతీక, అక్కడ హిందువులు, ముస్లింలు కలిసి ఈ బోనాలు జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా ఈ బోనాలు జరుగుతాయి. ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధమైనవి. మూడు రోజుల పాటు జరిగే ఈ బోనాలకు తెలంగాణ ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివస్తారు. ఇక్కడ ఎక్కువగా భక్తులు అమ్మవారికి మొక్కు సమర్పిస్తారు. ఆట పాటలతో ఈ బోనాలు ఓ ఉత్సవంలా జరుగుతాయి. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఈ బోనాల వేడుకలో ఆనందంగా పాల్గొంటారు. ఈ జాతరలో అమ్మవారి తొట్టెల ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రాత్రి వేళల్లో అమ్మవారి ఆలయం దీపాలంకరణతో చూడముచ్చటగా ఉంటుంది. గొర్రెపోతులే రథ సారథులుగా అమ్మవారి రథం బండిని సుందరంగా అలంకరిస్తారు.

అలాగే నిజాం నవాబుల ప్రార్ధనలతో ప్రాశస్త్యం పొందిన లాల్ దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ప్రాంతానికి చేరుకుంటుంది.

హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది. అక్కన్న- మాదన్న మాతా మహంకాళి ఆలయంగా సుప్రసిద్ధమైన హరిబౌలి ఆలయంలో బోనాల రోజున రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుచీరను కానుకగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతున్నది. లాల్ దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నిలుచుని రంగరంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపద గీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

ఓల్డ్ సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న, మాదన్న, లాలా దర్వాజా, ఉప్పుగూడ, మిరాలంమండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా, సుల్తాన్షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం, చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి. ఈ ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి కుమ్మరులు బర్కత్ బోనాలు సమర్పిస్తారు. ఈ లష్కర్ బోనాలు చివరి రోజు రంగం జరుగుతుంది.

భవిష్యవాణి ని చెప్పే అపురూప ఘట్టమే ఈ రంగం పండుగ. ఈ రంగం పండుగకు కావలసిన పచ్చి కుండను కూడా కుమ్మరి వినోద్ వంశస్థులు చివరి రోజున తెల్లవారు జామున ఆలయ ప్రాంగణానికి తీసుకొని రావడం ఆచారంగా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రజల ఆరోగ్య సంక్షేమాల గురించి తెలపడమే ఈ రంగం. తన జీవితాన్ని అమ్మవారికి సమర్పించిన అవివాహిత మహిళ పచ్చి కుండపై నిలబడి ఈ రంగం ను చెబుతుంది. జరిగేది, జరగబోయేది ప్రజలకు తెలిజేస్తుంది.

Bonalu big Festival for Telangana people

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కుండలో బోనం అమ్మకు నైవేద్యం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.