దుర్గమ్మ సన్నిధిలో భక్తుల కోలాహలం…

 Vana Durga Bhawani

 

ఆషాడమాసం మొదటి ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
బోనాలు, ఓడిబియ్యం తదీతర రూపాల్లో భక్తులు మొక్కుల చెల్లింపులు

పాపన్నపేట : భక్తులు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా మారిన శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని మాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆషాడమాసం మొదటి ఆదివారం మరియు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనివారం సాయంత్రమే ఏడుపాయలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆషాడమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని శాఖాంభరి మాత అమ్మవారిగా శ్రీ ఏడుపాయల వనదుర్గాభవానిమాత భక్తులకు దర్శణమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ఉదయం నుండే మంజీరా మడుగులు, చెక్‌డ్యాం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గాభవాని మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులు భారీగా తరలిరావడంతో అమ్మవారి దర్శణానికి గంటకుపైగా సమయం క్యూలైన్లలో వేచివుండాల్సి వంచ్చింది. ఆలయంలో అమ్మవారికి అర్చకులు మురళిచారి, పార్థివశర్మ, నాగరాజు, రాములు ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సంతానం లేని దంపతులు ఆలయం ముందు ఉన్న సంతాన గుండంలో సంతనం కలుగాలని దంపతులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భారీగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. మరి కొంత మంది భక్తులు శివసత్తుల పూనకాలతో, డప్పుచప్పుళ్ల మేళాలతో ఊరేగింపుగా బోనాలు, ఓడిబియ్యం తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులను చెల్లించారు.

ఏడుపాయల ప్రాంగణంలోని చెట్లు, బండరాళ్ల మధ్య భక్తులు విందు వినోదాలు చేసుకొని ఆనందంగా ఉల్లాసంగా గడిపి వన భోజనాలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్‌రెడ్డి, ఆలయ సిబ్బంది జెన్నరవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, లక్ష్మినారాయణ, సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, ధర్మకర్తలు గౌరిశంకర్, నారాయణ తదీతరులు సేవలను అందజేశారు. ఏడుపాయలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

వర్షాలు సమృద్దిగా కురువాలి
వర్షాలు సమృద్ధిగా కురువాలని పాలక మండలి డైరెక్టర్లు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

అమ్మవారిని దర్శించుకున్న అసిస్టెంట్ కమీషనర్
ఏడుపాయల వనదుర్గాభవానిమాతను దేవాదాయ దర్మాదాయ అసిస్టెంట్ కమీషనర్ సుధాకర్‌రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేసిన అనంతరం ఆలయ ఈవో మోహన్‌రెడ్డి దేవాదాయ దర్మాదాయ అసిస్టెంట్ కమీషనర్ సుధాకర్‌రెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.

Bonala festival at Vana Durga Bhawani Mata Temple

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దుర్గమ్మ సన్నిధిలో భక్తుల కోలాహలం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.