రౌడీషీటర్ హత్యతో కలకలం

సింగరావుపేట శివారులో హత్య మృతదేహాన్ని నిజామాబాద్ ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వలో పడేసినట్లు అనుమానాలు పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు? మనతెలంగాణ/జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన మాద అనిల్ (21) అనే రౌడీషీటర్ హత్యకు గురి కావడంతో జగిత్యాల పట్టణంలో కలకలం రేగుతోంది. చల్‌గల్ గ్రామానికి చెందిన కిశోర్, యశ్వంత్‌తో పాటు నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అనిల్ రాయికల్ మండలం సింగరావుపేట గ్రామ శివారులోని ఓ షెడ్డులో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందులో […]

సింగరావుపేట శివారులో హత్య
మృతదేహాన్ని నిజామాబాద్ ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వలో పడేసినట్లు అనుమానాలు
పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు?

మనతెలంగాణ/జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన మాద అనిల్ (21) అనే రౌడీషీటర్ హత్యకు గురి కావడంతో జగిత్యాల పట్టణంలో కలకలం రేగుతోంది. చల్‌గల్ గ్రామానికి చెందిన కిశోర్, యశ్వంత్‌తో పాటు నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అనిల్ రాయికల్ మండలం సింగరావుపేట గ్రామ శివారులోని ఓ షెడ్డులో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నాడు. చిత్తుగా మద్యం సేవించిన తర్వాత ఏం జరిగిందో ఏమో కాని అనిల్‌ను ఆ నలుగురు యువకులు దారుణంగా హతమార్చారు. శవం ఆచూకీ లేకుండా చేసేందుకు దూరంగా తీసుకెళ్లి పడేయాలని భావించారు. దాంతో చల్‌గల్ గ్రామానికి చెందిన యశ్వంత్ అనే యువకుడు తన తల్లి ఆరోగ్యం బాగా లేదని, ఆస్పత్రికి తీసుకెళ్తానంటూ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారును తీసుకువెళ్లి అందులో అనిల్ శవాన్ని వేసుకున్నారు. మేం శవాన్ని దూరంగా పడేసి వస్తామంటూ నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు శవాన్ని కారులో తీసుకుని వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి కారును మేడిపల్లిలో వదిలేసి వెళ్తున్నాం… మీరు వచ్చి కారు తీసుకెళ్లాలని వారు చల్‌గల్‌కు చెందిన కిశోర్, యశ్వంత్‌లు ఫోన్ చేసి చెప్పడంతో వారు వెళ్లి కారును తెచ్చుకున్నారు. అయితే హత్య సంఘటనలో పాల్గొన్న యశ్వంత్, కిశోర్‌లు బుధవారం ఉదయం పోలీసులకు లొంగిపోయి విషయాన్ని వివరించడంతో హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు యువకులు సూచించిన సింగరావుపేట గ్రామ శివారులోని రేకుల షెడ్డు వద్దకు వెళ్లి పరిశీలించగా అక్కడ రక్తం మరకలు, హతుడి పాదరక్షలు, ఖాళీ మద్యం సీసాలు లభించాయి. అయితే శవాన్ని నిజామాబాద్ ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వలో పడేస్తామని తీసుకెళ్లారని పోలీసులకు లొంగిపోయిన యువకులు చెబుతుండగా ఆ దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య సంఘటనలో పాల్గొన్న నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు పట్టుబడితే శవం ఆచూకీ లభిచండంతో పాటు అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా అనిల్ గత కొంత కాలంగా జల్సాలకు అలవాటు పడి పట్ణణంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మే, 2015లో పట్టణానికి చెందిన తుమ్మనపెల్లి శ్రీధర్‌పై దాడి చేసి గాయపర్చగా పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అక్టోబర్, 2015లో కృష్ణానగర్‌కు చెందిన నాగుల పూర్ణచందర్‌పై దాడి చేసి అతడి వద్ద ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లిన కేసులో అనిల్ ముద్దాయి. అలాగే నవంబర్, 2015లో గోవిందుపల్లికి చెందిన గోలి మల్లారెడ్డిపై దాడి చేసి గాయపరిచాడు. తరచుగా గొడవలు సృష్టిస్తూ, బెదిరింపులు, నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తుండటంతో డిసెంబర్, 2015లో అప్పటి డిఎస్‌పి రాజేంద్రప్రసాద్ అనిల్‌పై రౌడీషీట్ తెరిచారు. పథకం ప్రకారమే అనిల్‌ను స్నేహితులు విందు చేసుకుందామని పిలిపించి దారుణంగా హతమార్చడంతో జగిత్యాలలో కలకలం చోటు చేసుకుంది.