చేతులెత్తేసిన జాతీయ పార్టీలు

     కేంద్రంలో అధికారం కోసం పోటీపడుతున్న జాతీయ పార్టీలు రెండూ (భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్) 17వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ అయిదు దశలు ముగిసే సరికి తమ అసలు పరిస్థితి తెలుసుకొని మాట్లాడడం మొదలుపెట్టాయి. ఈ ఎన్నికల్లో తమకు స్పష్టమైన మెజరిటీ లభించే అవకాశాలు లేవని ఒప్పుకోడం ప్రారంభించాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా లోక్‌సభలో మెజారిటీ రాదని దాని జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మొన్న ఆదివారం నాడు అభిప్రాయపడ్డారు. అయితే […] The post చేతులెత్తేసిన జాతీయ పార్టీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

     కేంద్రంలో అధికారం కోసం పోటీపడుతున్న జాతీయ పార్టీలు రెండూ (భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్) 17వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ అయిదు దశలు ముగిసే సరికి తమ అసలు పరిస్థితి తెలుసుకొని మాట్లాడడం మొదలుపెట్టాయి. ఈ ఎన్నికల్లో తమకు స్పష్టమైన మెజరిటీ లభించే అవకాశాలు లేవని ఒప్పుకోడం ప్రారంభించాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా లోక్‌సభలో మెజారిటీ రాదని దాని జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మొన్న ఆదివారం నాడు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలాన్ని సాధించుకోగలుగుతామని అన్నారు. అంతేకాదు 2014 ఎన్నికల్లో ఏక మొత్తంగా, గంప గుత్తగా గెలుచుకున్న ఉత్తరాది రాష్ట్రాలలో ఈసారి కలుగగల నష్టాలను ఈశాన్యంలో, తూర్పు భారతం (పశ్చిమ బెంగాల్, ఒడిశా) లో సాధించుకోనున్న సీట్లతో భర్తీ చేసుకోగలమని కూడా రామ్ మాధవ్ వివరించారు.

543 స్థానాలున్న లోక్‌సభలో బిజెపి గత ఎన్నికల్లో 282 గెలుచుకొని అఖండ విజయాన్ని రికార్డు చేసుకొన్నది. స్పష్టమైన ఆధిక్యంతో తిరుగులేని జనాదేశాన్ని పొందింది. ఇతరుల మద్దతు, సహకారం అవసరం లేకుండా తనంత తానుగా ప్రభుత్వాన్ని నెలకొల్పగలిగింది. ఆ పార్టీకి ఈసారి అంత సీన్ ఉండబోదని రామ్ మాధవ్ స్వయంగా అంగీకరించారు. తాము 271 సీట్లు గెలుచుకోగలిగితే మహదానందమని ఆయన ఒక ఇంటర్వూలో చెప్పారు. ఆయన మాటల్లో రెండు విషయాలు స్పష్టపడుతున్నాయి. మొదటిది : 2014లో మాదిరిగా సొంత బలంతో తాము కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవన్నది. రెండవది : ఉత్తరాది రాష్ట్రాలలో అప్పుడు గెలుచుకున్నన్ని స్థానాలను ఈసారి సాధించుకోలేమన్నది. 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 78 చోట్ల పోటీ చేసిన బిజెపి 71 సీట్లను గెలుచుకొని అమోఘమైన విజయాన్ని మూటగట్టుకున్నది. అంతకు ముందరి కంటే ఒకేసారి 61 స్థానాలు అధికంగా సాధించుకున్నది. అలాగే 2014లో మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాల్లో బిజెపి 26 గెలుచుకున్నది.

రాజస్థాన్‌లో మొత్తం 25 సీట్లుండగా బిజెపి 24 సాధించుకున్నది. ఇవన్నీ అపూర్వ, అఖండ, అసాధారణ విజయాలే. గోభూమి ఆ పార్టీకి చరిత్రాత్మకమైన విజయహారం వేసి వైభవోపేతమైన గెలుపును అందించింది. ఇప్పుడు అక్కడ కమలం పార్టీ అప్పుడంత బలాన్ని పొందజాలదని రామ్ మాధవ్ మాటల్లో స్పష్టపడుతున్నది. అయితే ఆ లోటును ఈశాన్యం నుంచి, ఉత్తర భారతం నుంచి పూడ్చుకుంటామని ఆయన చెబుతున్న మాటను పూర్తిగా విశ్వసించలేము. అదే నిజమైతే 271 స్థానాలు వస్తే సంతోషమే అనే మాట ఆయన నోట వచ్చేది కాదు. కాంగ్రెస్ విషయానికి వస్తే లోక్‌సభలో ఆ పార్టీ ఇప్పట్లో మెజారిటీ తెచ్చుకోగలదనే అంచనా అసలే లేదు. గత ఎన్నికల్లో 40 స్థానాలు మాత్రమే గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షం హోదాను కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇంత తొందరగా దేశానికి ఏకచ్ఛత్రాధిపత్యం వహించగలదని ఎవరూ అనుకోలేరు. చింత చచ్చినా పులుపు చావని రీతిలో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని కాపాడుకుంటున్న నేపథ్యం కాంగ్రెస్‌కు అప్రతిహతమైన బలాన్ని లోక్‌సభలో కలగనీయబోదు.

కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో ఒకరైన జ్యోతిరాధిత్య సింధియా ఇటీవల మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ లోక్‌సభలో మెజారిటీ లభించబోదని స్పష్టం చేశారు. తమ పార్టీ భావ సార్యూపత గల ఇతర పక్షాలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. రామ్ మాధవ్, సింధియా చెప్పిన దాన్ని బట్టి 2019 ఎన్నికలు సొంతంగా ఎవరికీ మెజారిటీ లేని అస్థిర లోక్‌సభనే ప్రసాదిస్తాయని అనుకోకతప్పడం లేదు. అటువంటప్పుడు 17వ లోక్‌సభలో ఏకైక అతిపెద్దదిగా ఏ పార్టీ అవతరిస్తుంది, అతి పెద్ద కూటమి ఎవరిది అవుతుంది అనే వాటికి అసాధారణమైన ప్రాధాన్యం కలుగుతుంది. భారతీయ జనతా పార్టీ తన పరిస్థితి బాగాలేదని తెలుసుకొని ముందుగానే మేల్కొన్నది. వీలైనంతగా చిన్నాచితకా పార్టీలతో కూడా పొత్తులు కుదుర్చుకున్నది. శివసేనకు అధిక స్థానాలు ఇచ్చి దారిలోకి తెచ్చుకున్నది.

అయినా ఎన్‌డిఎ కూటమి దేశాధికారాన్ని చేపట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు భావించవలసి వస్తున్నది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే జాతీయ పార్టీలకు మించిన ప్రాబల్యాన్ని లోక్‌సభలో పొందే సూచనలున్నాయి. అవి గతంలో మాదిరిగా తోక పార్టీలుగా కాక, కీలక పాత్ర పోషించే పక్షాలుగా వ్యవహరించే పరిస్థితి ఈసారి తల ఎత్తుతుంది. ఇంతకాలం కేంద్రానిదే పై చేయి, పెత్తనంగా సాగిన ఢిల్లీ పాలన మొదటి సారిగా రాష్ట్రాల అవసరాలకు అగ్ర ప్రాధాన్యం కలిగే ఫెడరల్ విధానాన్ని దికూచి చేసుకొని నడిచే రోజులు రాక తప్పదు.

BJP has won 24 out of 25 seats in Rajasthan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చేతులెత్తేసిన జాతీయ పార్టీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: