ఇ-సిగరెట్ల నిషేధం బిల్లుకు ఆమోదం

e-Cigarettes

 

పిల్లల ఆరోగ్యంకోసమే నిషేధం
కార్పొరేట్లకు అవకాశం ఇవ్వకూడదు
రాజ్యసభకు వివరించిన ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారి, వాటి వ్యాపారం, రవాణా, నిల్వ, ప్రకటనల్ని నిషేధించాలని కోరే బిల్లును పార్లమెంట్ సోమవారం ఆమోదించింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధం బిల్లు 2019 పేరుగల ఈ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీనికి లోక్‌సభ ఇదివరకే ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్ సిగరెట్లను నిషేధించాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పుడు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు వచ్చింది. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ ‘చేయి దాటక ముందే ఈ సమస్యను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. నా జీవితమంతా పొగాకు లాబీకి వ్యతిరేకంగా పోరాడాను. మా ప్రయత్నాలపట్ల మీకు (సభ్యులు) ఎలాంటి అనుమానాలూ ఉండనక్కర్లేదు’ అని హర్షవర్ధన్ రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

ఇక … అప్పుడేం చేయలేం
‘ఇప్పుడున్న పొగాకు ప్రాడక్టులు, మద్యం మాదిరిగా ఇ సిగరెట్లకు వినియోగదారుల అలవాటు పడితే అప్పుడు పరిస్థితిని అదుపు చేయ డం అంత సులభం కాదు’ అని కూడా మంత్రి చెప్పారు. పెద్దపెద్ద కార్పొరేట్ వ్యవస్థలు దేశంలో తమ ఇ సిగరెట్ల ఉత్పత్తుల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నందున సెప్టెంబర్‌లో ఆర్డినెన్స్ తీసుకురావడం తప్పనిసరి అయిందని హర్షవర్ధన్ తెలిపారు. ‘సంప్రదాయక పొగాకు వ్యాపా రం తగ్గుతున్నందున పొగాకు కంపెనీలు ఇ సిగరెట్లను ప్రమోట్ చేసేందుకు ఆసక్తితో ఉన్నాయి’ అని ఆరోగ్య మంత్రి చెప్పారు. పిల్లలు ఇ సిగరెట్లకు చాలా సులభంగా అలవాటు పడతారని, అందుకే తక్షణ చర్యలు అవసరమయ్యాయని, అంతే తప్ప స్వప్రయోజనమేదీ లేదనీ హర్షవర్ధన్ అన్నారు.

‘పొగాకు కంపెనీలు చెప్పినట్టు మనం నడచుకోకూడదు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం మనకు చాలా ముఖ్యం. పొగాకు వాడకంపై చర్య తీసుకునేందుకు మొత్తం ప్రభుత్వం ఒక్క మాట మీద నిలిచింది. పొగాకుకు సంబంధించిన అన్ని ఉత్పత్తుల్నీ దేశంలో నిషేధించిన రోజు నేను చాలా సంతోషిస్తాను’ అని మంత్రి అన్నారు. ‘మొత్తానికే పొగాకును ఎందుకు నిషేధించకూడదు? అసలు ప్రభుత్వం ఉద్దేశమేంటి? పొగాకు లాబీల నుంచి ప్రభుత్వం ఒత్తిడి వస్తోందా?’ అని ఈ అంశంపై చర్చ సందర్భంగా బిఎస్‌పి సభ్యుడు రాజారాం, మరికొందరు అడిగిన ఇదేమాదిరి ప్రశ్నలకు మంత్రి ఈ వివరణ ఇచ్చారు.

 

Bill to ban e-Cigarettes is Approved

The post ఇ-సిగరెట్ల నిషేధం బిల్లుకు ఆమోదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.