బిగ్‌బాష్ విజేత బ్రిస్బేన్ హీట్

Big Bash

 

బ్రిస్బేన్: ప్రతిష్టాత్మకమైన బిగ్‌బాష్ లీగ్ ఉమెన్స్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో బ్రిస్బేన్ హీట్ ట్రోఫీని గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్ ఆరు వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రయికర్స్ జట్టును చిత్తు చేసింది. ఈ క్రమంలో వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని సాధించి చరిత్ర సృష్టించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బ్రిస్బేన్ హీట్ 18.1 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్షఛేదనకు దిగిన బ్రిస్బేన్‌ను ఓపెనర్ బెత్ మూనీ ఆదుకుంది. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగింది.

సహచర ఓపెనర్ మాడి గ్రీన్ (11) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా మూనీ మాత్రం పోరాటం కొనసాగించింది. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన సామి జాన్సన్ మెరుపు ఇన్నింగ్స్‌తో తనవంతు పాత్ర పోషించింది. చెలరేగి ఆడిన జాన్సన్ 11 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లతో 27 పరుగులు చేసింది. అయిదే దూకుడుగా ఆడిన జాన్సన్ భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరింది. మరోవైపు తర్వాత వచ్చిన జొనాసెన్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది. మూనీతో కలిసి జట్టును లక్షం వైపు నడిపించింది. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న జొనాసెన్ ఐదు ఫోర్లతో 33 పరుగులు చేసింది. చివర్లో లౌరా హారిస్ మెరుపులు మెరిపించింది. మూడు ఫోర్లతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

మరోవైపు మూనీ చివరి వరకు నాటౌట్‌గా నిలిచి బ్రిస్బేన్‌కు వరుసగా రెండో సారి ట్రోఫీ సాధించేలా తనవంతు పాత్ర పోషించింది. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన మూనీ 45 బంతుల్లో ఐదు ఫోర్లతో 56 పరుగులు చేసింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైన్ జట్టును అమంద వెల్లింగ్టన్ ఆదుకుంది. బ్రిస్బేన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అమంద 33 బంతుల్లోనే పది ఫోర్లతో 55 పరుగులు చేసింది. కెప్టెన్ సుజి బేట్స్ 27 పరుగులు సాధించింది. మరోవైపు తహిలా మెక్‌గ్రాత్ (33), వికెట్ కీపర్ తెగాన్ (18) తమవంతు పాత్ర పోషించారు. దీంతో అడిలైడ్ స్కోరు 161 పరుగులకు చేరింది.

Big Bash Women’s League winner is Brisbane Heat

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బిగ్‌బాష్ విజేత బ్రిస్బేన్ హీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.