ప్రతిపాదనల్లోనే…సైకిల్ ట్రాక్‌లు

bicycle-tracksహైదరాబాద్: విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్, రవాణా వ్యవస్థల సమస్యలను అధిగమించేందుకు హెచ్‌ఎండిఎ చేయిస్తున్న సమగ్రమైన రవాణా అధ్యయనం(కాంప్రహెన్సివ్ ట్రాన్స్‌పోర్టు స్టడీ–సిటిఎస్) నివేదిక ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. భవిష్యత్ కాలాన్ని దృష్టిలోపెట్టుకుని అథారిటీ పరిధిలో రవాణా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా చేపట్టాల్సిన పథకాలను సిటిఎస్ సూచిస్తున్నది. మోటార్ రహిత వాహనాల(ఎన్‌ఎంవి)కు దారులు కల్పించడం, బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టం(బిఆర్‌టిఎస్) సూచనలు ప్రభుత్వంకు చేరలేదనే చర్చ సర్వత్రా జరుగుతున్నది.

నగరం శరవేగంగా విస్తరిస్తుంది. అంతే స్థాయిలో కొత్త పోకడలకు ఆహ్వానం పలుకుతుంది. కానీ, నగర రవాణా వ్యవస్థలో భాగంగా ప్రతిపాదించిన అత్యంత ప్రయోజనకరమైన మోటార్ రహిత వాహనాల వినియోగానికి అథారిటీ ప్రాధాన్యతనివ్వడం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. సైకిళ్ళు, రిక్షాలు నగరంలో చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. వీటి వినియోగానికి ప్రోత్సాహం అందించాల్సిన అవసరమున్నది. ప్రత్యేకంగా రోడ్లవెంబడి ట్రాక్‌లను లేదా లేన్‌లను, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయాలని సిటిఎస్‌లో సూచించింది. సైకిళ్ళను అధికంగా వినియోగించే ప్రాంతాలను గుర్తించి వాటికి సరిపడా పార్కింగ్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా వాటి వినియోగాన్ని పరోక్షంగా పెంచాలనే సూచన సిటిఎస్‌లో స్పష్టంగా పేర్కొన్నది.

ప్రతి సంవత్సరం మోటారు రహిత వాహనం లేదా ప్రజా రవాణా వాహన వినియోగం దినంను పాటించేలా చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రైల్వే, బస్, మెట్రో స్టేషన్‌ల వద్ద వీటికి పార్కింగ్ సదుపాయం కల్పించాలి. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. వీటి వినియోగం ద్వారా నగర రోడ్లలో ట్రాఫిక్ సమస్య, కాలుష్యం తగ్గుముఖం, వేగంగా గమ్యస్థానాలకు చేరడం జరుగుతుందని నివేదిక స్పష్టంగా వివరించింది. కానీ, నగరంలో ప్రత్యేక ట్రాక్‌లను గచ్చిబౌలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని భావించినా ఇప్పటి వరకు ఆ ఊసే కనిపించడంలేదనే విమర్శలున్నాయి.

ప్రకటనల్లోనే బిఆర్‌టిఎస్….

నగరంలో ఉద్యోగులు, ప్రయాణికులు వేగంగా తమతమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టం(బిఆర్‌టిఎస్)ను ప్రతిపాదించింది సిటిఎస్. 2021 నాటికి నగరంలోని 67 ప్రాంతాల్లో బిఆర్‌టిఎస్‌ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించింది. ఉద్యోగులు, బహుళజాతి సంస్థలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ విధానాన్ని అమలు చేయాలని నివేదిక పేర్కొన్నది. అయితే, ఇటీవల ప్రభుత్వం కూడా ప్రయోగాత్మకంగా కూకట్‌పల్లి జెఎన్‌టియు నుండి మదాపూర్ వరకు బిఆర్‌టిఎస్ మార్గాన్ని ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ఆ క్రమంలోనే జిహెచ్‌ఎంసి అధికారులకు సూచనప్రాయంగా ఆదేశాలిచ్చింది.

ముఖ్యంగా మాదాపూర్-కోకాపేట, శరత్‌నగర్-నరసాపూర్, జూబిలీ-ములుగు, తార్నాక- -కీసర ఓఆర్‌ఆర్. కాప్రా-కోకాపేట, బైరామల్‌గూడ-అగ్పా, జెబిఎస్- మేడ్చెల్, ఓఆర్‌ఆర్, కుర్మగూడ- కొత్తూరు మొత్తం 9 మార్గాల్లో 393 కి.మీ.లుగా బిఆర్‌టిఎస్‌ను ఏర్పాటు చేయాలని సిటిఎస్ నివేదికలో స్పష్టంచేసింది. కానీ, వీటివైపు ప్రభుత్వం చూడటం లేదనేది బహిరంగ రహాస్యం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందదించి నగరంలో మోటారు రహిత వాహనాలకు, బిఆర్‌టిఎస్ అమలుకు ప్రాధాన్యతనివ్వాలని పలువురు పేర్కొంటున్నారు.

Bicycle Rickshaws Tracks in Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రతిపాదనల్లోనే… సైకిల్ ట్రాక్‌లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.