అంతా ఓకె

Basic arrangements for the elections in the state

రాష్ట్రంలో ఎన్నికలకు మౌలిక ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయి
వీలైనంత త్వరగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేస్తాం
రెండు రోజుల పర్యటన అనంతరం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా సంతృప్తి 

మన తెలంగాణ/ హైదరాబాద్: “మా రెండు రోజుల ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలకు మౌలిక ఏర్పాట్లన్నీ సజావుగా సాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ దిశగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి” అని కేంద్ర ఎన్నికల సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత ప్రక్రియను రాష్ట్రస్థాయి నుంచి బూత్ స్థాయి అధికారి వరకు అన్ని శాఖలూ వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితి, ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సన్నద్ధత, వివిధ అంశాలపై అధికారులతో చర్చించిన తర్వాత మీడియా సమావేశంలో ఉమేశ్ సిన్హా పై విధంగా వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరలోనే సమగ్రమైన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘాని కి సమర్పిస్తామని, నిర్దిష్టంగా తమకు ఎలాంటి గడువూ విధించలేదని, ఢిల్లీకి వెళ్ళిన వెంటనే అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పనులు పకడ్బందీగా జరుగుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఓటర్ల జాబితా, ఇవిఎంలు, వివిపిఎటి యంత్రాలు, ఎన్నికల, అభ్యర్థుల ఖర్చులు, ప్రచారం, అసెంబ్లీ రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలు, ఎన్నికలు నిర్వహించడానికి తక్షణం సిద్ధంగా ఉన్న ఏర్పాట్లు, చేపట్టాల్సిన పనులు వంటి పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు.

అర్హులైనవారంతా ఓటర్ల జాబితాలో చేరాలి
తమరెండు రోజుల పర్యటనలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ చర్చించామని పేర్కొన్న ఉమేశ్ సిన్హా మెజారిటీ పార్టీలు ఓటర్ల జాబితా నుంచి భారీ సంఖ్యలో పేర్లను తొలగించిన విషయాన్ని ప్రస్తావించాయని, బూత్ స్థాయి సిబ్బంది మొదలు రాష్ట్రస్థాయి వరకు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులైనవారందరి పేర్లనూ జాబితాలో చేర్చాలే కృషి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు కూడా వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. కొన్ని రాజకీయ పార్టీలు పండుగలు ఉన్నందున ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 23 తరువాత విడుదల చేసి, గడువు పెంచాలని కోరాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయిన ఏడు మండలాల సమస్యను రాజకీయ పార్టీలు తమ దృష్టికి తెచ్చాయని, వీటన్నింటిని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, తుది నిర్ణయం అక్కడే జరుగుతుందని తెలిపారు. శాంతి, భద్రతలపై కూడా సమీక్షించామన్నారు.

ఓటర్లకు అవగాహనా, ప్రచార కార్యక్రమాలు :
ముసాయిదా ఓటర్ల జాబితా, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, గ్రామాల్లో చాటింపు కార్యక్రమాలు ఉండాలని రాష్ట్ర అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఓటర్ జాబితాపై ఇంటింటి సర్వే నిర్వహించాలని చెప్పామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేనివారు నిబంధనలకు అనుగుణంగా 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండితే నమోదు చేసుకోవాలన్నారు. తొలగించిన ఓటర్లలో అర్హులు ఉంటే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవసరమైతే పునరుద్ధరించే విధంగా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఎస్‌ఎంఎస్ ద్వారా ఓటరు నమోదు, ఇతర వివరాలు తెలుసుకునేలా సాప్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. మంగళవారం అన్ని రాజకీయ పార్టీలను కలిశామని, వారివారి అభ్యంతరాలు చెప్పారని, వాటిని పరిగణనలోకి తీసుకున్నామన్నారు. జిల్లాలో ఉండే ఎన్నికల సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రతీది ఆన్‌లైన్‌లోనే ఉంటుందని, ఇఆర్‌ఒ సిస్టవ్‌ సరిగా పని చేసే విధంగా ఐటి శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. ఓటర్ల జాబితా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ,ఈవిఎంలు, వివిప్యాట్‌ల వాడకం పై సిబ్బందికి అవగాహన కల్పించే విషయమై చర్చించామన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో ఎన్నికల ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించామని, వారి దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రాథమిక అంచనాకు వచ్చామని ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదికను తొందరగానే సమర్పిస్తామన్నారు. ఎన్నికల సాధ్యాసాధ్యాలపై సమీక్షలు జరిపేందుకే బృందాన్ని రాష్ట్రానికి పంపారని, ఇది మొదటిసారి కాదని సాధారణంగానే జరిగే ప్రక్రియగానే వివరించారు. ఎక్కడైన అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.