పాత బకాయిలకు రైతుబంధు సొమ్ము

Farmer

 

జమ చేసుకుంటున్న బ్యాంకులు, వ్యవసాయ శాఖకు రైతుల నుంచి ఫిర్యాదులు

హైదరాబాద్ : ఖరీఫ్ సీజన్ పంట పెట్టుబడి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న రైతుబంధు పథకం సొమ్మును బ్యాంకులు మింగేస్తున్నాయి. రైతు ఖాతాలో రైతుబంధు సాయం డిపాజిట్ కాగానే వాటిని బకాయిలు, వడ్డీల కిందకు జమ చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా రూ. 500 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సొమ్మును బ్యాంకులు లాగేసుకున్నట్లు వ్యవసాయ శాఖ నిర్ధారించుకుంది. దీనిపై అనేకమంది రైతులు ఇప్పటికే వ్యవసాయ శాఖకు రైతుల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీంతో వ్యవసాయ శాఖ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

రైతుబంధు సొమ్మును బకాయిలకు, వడ్డీలకు జమ చేసుకోవద్దని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి ప్రభుత్వం తరపున సూచించాలని కోరింది. ఇప్పటికే వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వ బడ్జెట్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, రైతుల నుంచే ముక్కు పిండి వసూలు చేయడంపై సిఎం సీరియస్‌గా ఉన్నారు. ఇదే సమయంలో రైతుబంధు సాయాన్ని కూడా పాట పంట రుణాలకు కట్ చేసుకోవడంపై ఎస్‌ఎల్‌బిసికి గట్టిగానే చెప్పాలని నిర్ణయించారు.

ఈ ఖరీఫ్‌లో 56.76 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హులుగా గుర్తించారు. ఇందుకోసం మొత్తం రూ. 7254 కోట్లు అవసరం. అయితే వ్యవసాయ శాఖ వద్ద 52.63 లక్షల మంది రైతుల వివరాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 49.33 లక్షల మంది రైతులకు అందాల్సిన సాయం రూ.6537 కోట్ల బిల్లులను ఆర్థిక శాఖకు సమర్పించగా, దాదాపు 40 లక్షల మంది రైతులకు రూ.4400 కోట్లు బదిలీ చేశారు. ఇంకా 9.30 లక్షల మందికి రూ.2100 కోట్లు జమ చేయాల్సి ఉంది.

గత సీజన్‌లలో సాఫీగానే..
వాస్తవానికి రైతుబంధు పథకాన్ని 2018 ఖరీఫ్‌లో ప్రారంభానికి ముందు ప్రభుత్వం దృష్టికి ఇవే అంశాలు వచ్చాయి. ఒకవేళ రైతుల ఖాతాల్లో జమ చేస్తే రుణమాఫీ మాదిరి వడ్డీలకు జమ చేసుకుంటే ఎలా ? ఒకవేళ మమూ లు చెక్కులు ఇస్తే వాటిని కూడా బ్యాంకులు బకాయిలకు జమ చేసుకునే అవకాశం ఉందని గుర్తించారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఆర్డర్ పే చెక్కులను ముద్రించి పంపిణీ చేశారు. అప్పుడు బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. ఆర్డర్ పే చెక్కులకు నగదును ఖచ్చితంగా రైతు చేతికి ఇవ్వాలని, ఒకవేళ రైతులు పాత బాకీ కట్టాలనుకుంటే అది వారి ఇష్టానికి వదలేయ్యాలని ఎస్‌ఎల్‌బిసికి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మొదటి విడత ఖరీఫ్ సీజన్‌కు ఎటువంటి అడ్డంకులు లేకుండా రైతులకు పెట్టుబడి సాయం అందింది.

ఆ తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నేరుగా రైతుబ్యాంకు ఖాతా కు రైతుబంధును అందజేశారు. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ను జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు మౌఖికంగా స్పష్టం చేయడం సాఫీగానే సాగిపోయింది. రెండో ఏడాది ఖరీఫ్‌లో కూడా చెక్కుల కంటే నేరుగా రైతు ల ఖాతాల్లో జమ చేయడమే సులభమని, అదే మార్గంలో పెట్టుబడి అందజేస్తున్నారు. అయితే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించడం ఇచ్చిన హామీ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు మొదటి విడతకు కేటాయించింది.

కాకపోతే అందుకు సంబంధించి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు, నిధులు విడుదల చేయలేదు. దీంతో చాలామంది రైతులు మాఫీ కోసం ఎదురు చూస్తూ గతేడాది ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలను రెన్యువల్ చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఒకవేళ పంట రుణం చెల్లిస్తే, మాఫీ వర్తిస్తదో లేదో అనే భయం అన్నదాతల్లో ఉంది. ఇదే అదునుగా భావించిన బ్యాంకులు రైతుబంధు కోసం జమ చేసిన సాయాన్ని పంట రుణాలకు, వడ్డీ బకాయిలకు మళ్లించుకుంటున్నాయి.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా
రైతుబంధు పథకం కింద రైతులకు జమ చేసిన పెట్టుబడి సాయాన్ని బ్యాంకులు బకాయిలు కింద జమ చేసుకున్నట్లు గుర్తించాం. దాదాపు రూ.500 కోట్లు వడ్డీలకు, బకాయిలకు మళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించాం. రైతుల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. పెట్టుబడి సాయాన్ని బకాయిలకు జమ చేసుకోవద్దని ఎస్‌ఎల్‌బిసికి చెప్పాలని కోరాము.

Banks are Depositing the Money of Farmer

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాత బకాయిలకు రైతుబంధు సొమ్ము appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.