అక్రమంగా వచ్చి అల్లుడయ్యాడు!

Arrest

 

గువాహటి: బంగ్లాదేశ్‌కు చెందిన సరిహద్దు భద్రతా జవాన్లకు లంచం ముట్టచెప్పి భారత్‌లోకి చొరబడిన ఒక బంగ్లాదేశీయుడు ఇక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకోవడంతోపాటు ఒక అస్సామీ యువతిని పెళ్లి చేసుకుని ఒక పిల్లాడికి తండ్రి కూడా అయ్యాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆ బంగ్లాదేశీయుడి గుట్టురట్లు కావడంతో ప్రస్తుతం జైలు కమ్మీలు లెక్కిస్తున్నాడు. ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే..2013 మార్చిలో బంగ్లాదేశ్‌లోని టాకూర్‌గావ్ జిల్లా సుందరీయ గ్రామానికి చెందిన 27 ఏళ్ల అయనల్ హక్ మరో 11 మంది బంగ్లా జాతీయులతో కలసి పశ్చిమ బెంగాల్ మాల్డా జిల్లాలోని సరిహద్దు పోస్టు వద్ద బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ సిబ్బందికి బంగ్లాదేశ్ కరెన్సీ 4,200 టాకాలు(రూ.౩,800 భారతీయ కరెన్సీ) లంచంగా ముట్టచెప్పి భారత్‌లోకి చొరబడ్డారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్ దీనాజ్‌పూర్ జిల్లాలో ఆజాద్ అలీ అనే వ్యక్తి సాయంతో హక్ ఆధార్ కార్డు సంపాదించాడు. అక్కడి నుంచి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కూలి పని చేశాడు.

ఆస్సాంలోని బంగాయ్‌గావ్ జిల్లాకు చెందిన ఒక యువతితో ఫోన్‌లో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడంతోపాటు ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. భారత్‌లో పాన్ కార్డు కూడా సంపాదించుకున్న హక్ ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో ఉన్న తండ్రికి రూ.7.2 లక్షలు ఆన్‌లైన్ సర్వీసు ద్వారా పంపాడని అస్సాం పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న హక్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా అతడిని జుడిషియల్ కస్టడీకీ న్యాయమూర్తి రిమాండ్ చేశారు. సరీఫా బేగం అనే అస్సామీ యువతిని పెళ్లి చేసుకున్న హక్‌కు రెండేళ్ల వయసున్న కుమారుడు ఉనాడు. హక్‌తో పాటు భారత్‌లోకి చొరబడిన ఆ మిగిలిన 11 మంది బంగ్లాదేశ్ జాతీయుల ఆచూకీని కనిపెట్టే పనిలో పోలీసులు పడ్డారు.

Bangladesh Youth Arrested in Assam, The Man bribed Border Guards Bangladesh for Illegally Entering India

The post అక్రమంగా వచ్చి అల్లుడయ్యాడు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.