నేడు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత…

Babli

 

నాలుగు నెలల పాటు తొలగనున్న అడ్డంకి
మహారాష్ట్రలో వర్షాలు కురిస్తేనే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు జలకళ

బాసర : గోదావరి నదికి ఎట్టకేలకు అడ్డంకి తొలగిపోనుంది. ప్రస్తుతం ఎగువ భాగంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు సోమవారం తెరుచుకోనున్నాయి. ప్రాజెక్ట్‌కు గడువు ముగియడంతో సుప్రీమ్ కోర్టు తీర్పు మేరకు జూలై 1వ తేదీ నుండి ప్రాజెక్ట్ గేట్లు తెరువాల్సి ఉంది. బాబ్లీ ప్రాజెక్ట్‌లో ఇప్పటికీ నీరు లేకపోవడంతో 332.4 మీటర్ల స్థాయిలో రెండు టిఎంసి నీరు ఉంది. గత సంవత్సరం జూన్‌లో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ఈ ప్రాజెక్ట్ నిండిపోయింది. నాలుగు గేట్లు తెరిచి నీటిని కిందికి వదిలారు. ఇన్‌ఫ్లో తగ్గినవెంటనే గేట్లను మూసి వేశారు. కానీ ఈ సంవత్సరం సరిగా వర్షాలు లేకపోవడంతో దిగువ భాగం అయిన గోదావరి నదికి నీరు వచ్చే పరిస్థితి లేదు.

కేంద్ర జలవనరుల సంఘం నియమించిన పర్యవేక్షక కమిటి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారుల బృందం నేడు గేట్లను తెరువనుంది. ప్రాజెక్ట్ 12 గేట్లను పైకి ఎత్తి కిందికి నీటిని వదులుతారు. బాబ్లీ గేట్లు ఎత్తితే అందులో నిల్వ ఉన్న 2 టిఎంసిల నీరు దిగువ భాగంలోకి రానుంది. సాయంత్రం వరకు బాసర దగ్గరకు చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా తిరిగి అక్టోబర్ 28వ తేదీన తిరిగి గేట్లు ముసివేస్తారు. 128 రోజుల పాటు అనగా నాలుగు నెలలు పాటుగా ప్రవాహానికి అంటంకాలు ఉండని నేపథ్యంలో మహారాష్ట్రలో వర్షాలు సంవృద్దిగా కురిస్తేనే బాసర గోదావరితో పాటు ఎస్సారెస్సీ ప్రాజెక్ట్ నిండే అవకాశం కలుగనుంది.

కురవని వానలు జాడలేని వరద
వర్షకాలం ఆరంభం అయి నెల రోజులు కావస్తున్నా సమృద్ధ్దిగా కురువడంలేదు.పంటలకు సరిపడే వర్షపాతం మాత్రమే కురుస్తుంది. వాగులు, వంకలు పొంగేలా వర్షాలు కురువడం లేదు. ప్రధానంగా నది పరివాహాక ప్రాంతం అయిన మహారాష్ట్రలో ఉపనది మంజీరా పరివాహాక ప్రాంతంలో వర్షాలు కురువకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో బాసర వద్ద గోదావరి నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. ఇప్పటికీ బాసర వద్ద నీరులేక ఎడారిగా కనిపిస్తోంది. బాబ్లీ గేట్లు తెరిస్తే గోదావరికి వరద నీరు వచ్చేలా ఉంది.

గోదావరికి ఈ నెలలోనే వరద
గోదావరికి కొత్త నీరు జూలై మాసంలోనే ఆనవాయితీగా వస్తుంది. నేడు తెరుచుకోనున్న బాబ్లీగేట్లతో శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్‌కు (ఎస్సారెస్పీ)కి వరద నీరు చేరనుంది. విష్ణుపూరి ప్రాజెక్ట్‌కు దిగువన వచ్చే వరద నేరుగా ఎస్సారెస్సీలో చేరుతుంది.

Babli water to Godavari

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.