ఎట్టకేలకు…

     ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి పరిణామం. పదేపదే నిరాశకు గురి చేసి ఎట్టకేలకు సాధ్యమైన ఒక గణనీయమైన విజయం. గత ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ వాహన శ్రేణిపై దాడి చేసి 40 మందికి పైగా జవాన్లను బలిగొన్న ఘాతుకం తమ ప్రతాపమేనని చాటుకున్న జైషె మొహమ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్‌ను ఇంతకాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇది ఇండియాకు ఆలస్యంగానైనా సంక్రమించిన అసాధారణ […] The post ఎట్టకేలకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

     ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి పరిణామం. పదేపదే నిరాశకు గురి చేసి ఎట్టకేలకు సాధ్యమైన ఒక గణనీయమైన విజయం. గత ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ వాహన శ్రేణిపై దాడి చేసి 40 మందికి పైగా జవాన్లను బలిగొన్న ఘాతుకం తమ ప్రతాపమేనని చాటుకున్న జైషె మొహమ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్‌ను ఇంతకాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇది ఇండియాకు ఆలస్యంగానైనా సంక్రమించిన అసాధారణ దౌత్య విజయమని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ ఇప్పటికే ఇటువంటి 262 మందిని, 83 సంస్థలను ఈ జాబితాలో చేర్చింది. ఇందువల్ల మసూద్‌పై ప్రయాణ నిషేధం అమల్లోకి వస్తుంది. దేశదేశాల్లో సునాయాసంగా పర్యటించే అవకాశాన్ని కోల్పోతాడు.

ఆయుధ నిషేధమూ అమలవుతుంది. అతడి ఆస్తులనూ స్తంభింపచేస్తారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల సహకారంతోనూ, స్వయంగానూ చైనా అడ్డును అతి కష్టంగా తొలగించుకోడం ద్వారా భారత ప్రభుత్వం దీనిని సాధించుకోగలిగింది. సునాయాసంగా అందివచ్చేదేదీ ఘనమైనదనిపించుకోదు. ఎంతో కృషితో, సవాళ్లకు ఎదురీతతో తెచ్చుకున్నదే గొప్పదిగా పరిగణన పొందుతుంది. మన ప్రయోజనాలకు విరుద్ధంగా పాకిస్థాన్‌తో అత్యంత సఖ్యత నెరపుతున్న చైనా అడ్డంకిని తొలగించుకొని మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్ర జాబితాకు ఎక్కించడానికి పదేళ్లు పట్టింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా జైషె మొహమ్మద్‌ను ఉగ్రవాద సంస్థగా 2001 లోనే పరిగణించాయి. అయితే మసూద్‌పై అంతర్జాతీయ ముద్ర వేయించడానికి భారతదేశం 2009 నుంచి ప్రయత్నిస్తున్నా సాఫల్యం పొందడానికి ఇంతకాలం పట్టింది. ఇందుకు ఒక్క చైనాయే కారణం. ఇప్పటికి నాలుగుసార్లు అడ్డుకున్నది.

తాజాగా పుల్వామా దాడి అనంతరం మొన్న మార్చిలో కూడా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల ప్రతిపాదనకు బీజింగ్ అడ్డుతగిలింది. ప్రతిపాదనలో కీలకమైన మార్పు తీసుకువచ్చిన తర్వాతనే పాకిస్థాన్ సమ్మతితో చైనా ఇందుకు అడ్డు తొలగిందని భావించకతప్పడం లేదు. పుల్వామా ముష్కర దాడి అనంతరం గత మార్చి లో భద్రతా మండలి ముందు వీగిపోయిన ప్రతిపాదన సవరణ ప్రతిలో పుల్వామా ప్రస్తావన లేకపోవడం ఇక్కడ గమనార్హం. 1990వ దశకంలో సంభవించిన పెక్కు భీషణమైన ఉగ్రదాడులలో మసూద్ పాత్రను ప్రస్తావించిన ఐక్యరాజ్య సమితి నిర్ణయం పుల్వామా ఘాతుకాన్ని మాత్రం పేర్కొనలేదు. అంటే కశీర్ వ్యవహారాన్ని ఉగ్రవాదులతో ముడిపెట్టకుండా ఉండేలా చూడాలన్న పాకిస్థాన్ అభిమతానికి అనుగుణంగానే ఈ వ్యవహారం జరిగిందని బోధపడుతున్నది.

పుల్వామా దాడి ప్రస్తావన ఉండి తీరాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు పట్టుబట్టి ఉంటే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్ర జాబితాలో చేర్పించడానికి చైనా ససేమిరా అంగీకరించి ఉండేది కాదని అనుకోవాలి. అందుకే ఆ మూడు దేశాలు కూడా పుల్వామా జోలికి పోకుండా లాంఛనంగా తీర్మానాన్ని ప్రతిపాదించి ఈ నిర్ణయాన్ని సాధించాయని భావించవలసి ఉంది. ఈ కారణం వల్లనే ఇది ఇండియా విజయం కాదంటూ పాకిస్థాన్ విర్రవీగుతున్నది. పాకిస్థాన్ తో తన గాఢమైన మైత్రి అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని చైనా ప్రకటించగలిగింది. పదేళ్లుగా సాధ్యం కాని అంశంపై భద్రతా మండలి సమ్మతిని సాధించడం వెనుక భారత ప్రభుత్వం చైనాతో ఎంతో ఓపికగా సాగించిన సంప్రతింపుల పాత్రా ఉన్నది. మొత్తంగా ఉగ్రవాద ముష్కర కాండపై ప్రపంచ వ్యాప్తంగా పెరిగి పరాకాష్ఠకు చేరిన వ్యతిరేకత నేపథ్యంలోనే చైనా మనసు మార్చుకొని మసూద్ విషయంలో కలిసిరాక తప్పలేదని స్పష్టపడుతున్నది.

పుల్వామా అనంతరం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై మన వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడుల పట్ల ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోడంలోనే ఉగ్రవాద ముఠాల మీద అంతర్జాతీయ స్థాయి వ్యతిరేకత గూడుకట్టుకున్నదని బోధపడింది. మసూద్ తమ దేశంలోనే ఉన్నట్టు పాకిస్థాన్ ఇటీవల అధికారికంగానే అంగీకరించింది. అతడు అంతర్జాతీయ ఉగ్రవాది అని ఐక్య రాజ్య సమితి తిరుగులేని ముద్ర వేసిన తర్వాత కూడా ఈ నిప్పును అది కొంగున కట్టుకొని ఊరేగుతుందా, తగిన కేసులుపెట్టి జైలుకు పంపిస్తుందా? హఫీజ్ సయీద్ మాదిరిగా మసూద్ సైతం పాక్‌లో బేఫర్వాగా ఇకముందు కూడా తిరగగలుగుతాడా? పాకిస్థాన్ సైన్యం భారత వ్యతిరేక ఉగ్రవాద సర్పాలను పెంచి పోషించే స్థితి ఇలాగే కొనసాగినంతకాలం సయీద్‌లు, మసూద్‌లను ఎవరూ ఏమీ చేయలేరనిపిస్తే తప్పుపట్టవలసిన పని లేదు.

Attack on CRPF vehicle range in Pulwama

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎట్టకేలకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: