తెలంగాణ కథలో స్త్రీ

  సమకాలీన సమాజంలో స్త్రీ అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికీ పురుషాధిక్యత ఇంకా కొనసాగటం వల్ల స్త్రీ స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజంలో, కుటుంబంలో స్త్రీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమ వుతున్నాయి.సమకాలీన కథారచయితలు స్త్రీ జీవితంలోని వివిధ పార్శాలను కథల్లో ప్రతిఫలించ జేయడంలో ముందున్నారు. ఉద్యోగం చేసే స్త్రీల పట్ల కూడా సమాజంలో వివక్ష కొనసాగుతూ ఉన్నట్లు చంద్రలత ‘ఆవర్జా’ (2002) కథలో తెలిపారు. మహిళా ఆడిటర్‌గా విధీశ తన అనుభవంలో ఉద్యోగాలు […]

 

సమకాలీన సమాజంలో స్త్రీ అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికీ పురుషాధిక్యత ఇంకా కొనసాగటం వల్ల స్త్రీ స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజంలో, కుటుంబంలో స్త్రీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమ వుతున్నాయి.సమకాలీన కథారచయితలు స్త్రీ జీవితంలోని వివిధ పార్శాలను కథల్లో ప్రతిఫలించ జేయడంలో ముందున్నారు.
ఉద్యోగం చేసే స్త్రీల పట్ల కూడా సమాజంలో వివక్ష కొనసాగుతూ ఉన్నట్లు చంద్రలత ‘ఆవర్జా’ (2002) కథలో తెలిపారు.
మహిళా ఆడిటర్‌గా విధీశ తన అనుభవంలో ఉద్యోగాలు చేసే స్త్రీలను చులకనగా చూడటం, ఆడిట్ రంగంలో మహిళలకు ప్రోత్సాహం కొరవడడం, క్లయింట్లకు మహిళా ఆడిటర్ల మధ్య సయోధ్య కుదరకపోవడం, స్త్రీలు నలుగురిలోకి వెళ్లి మాట్లాడకపోవడం, బయటి పనులు చేసుకొని రావడంలో ఇబ్బందులను ఎదుర్కోవడం, శారీరక ధర్మాల్లో ఉన్న తేడాతో రుతుచక్ర సమయంలో ఇబ్బందిగా ఉండడం ఇవన్నీ స్త్రీ ఎదుగుదల విషయంలో అవరోధంగా నిలుస్తున్నట్లు గమనిస్తుంది. తన ఆఫీసులో జరిగిన సంఘటనకు చలించి పురుషులకు, స్త్రీలకు మధ్య ఒకే క్రోమోజోమ్ తేడా ఉండడం వల్లనే స్త్రీ వివక్షకు గురవుతున్నట్లు గమనిస్తుంది.
ఉద్యోగంలో సమాన స్థాయిలో ఉన్నప్పటికీ కుటుంబ విషయానికి వస్తే మగవానిదే పెత్తనం కొనసాగినట్లు, అంతటా అదే పరిస్థితి ఉండటాన్ని చంద్రలత “కొలీగ్స్’ కథ (2001)లో స్పష్టం చేశారు. ఈ కథలో ప్రీతి, కృషి భార్యాభర్తలు. వీరిద్దరు కలిసి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆరంభించి దాని అభివృద్ధికై పాటుపడతారు. వారిద్దరిదీ ఒకే స్థాయి గల ఉద్యోగం అయినప్పటికీ ప్రీతికి మాట మాత్రమైనా చెప్పకుండానే తమ కంపెనీని మరో కంపెనీలో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని రావడాన్ని ఆమె జీర్ణించుకులేకపోతుంది. ఆ అగ్రిమెంట్ కాగితాన్ని చింపి చెత్తబుట్టలో వేసి తన ఉనికి కాపాడుకోవడం ఈ కథలో చూడవచ్చు. ఉద్యోగం విషయంలో భర్త పెత్తనమే కొనసాగాలన్నది దారుణమని ఈ కథ స్పష్టం చేస్తుంది.
జీవితాన్ని, సమాజాన్ని వాటిలో ఉండే అంతర్గత వైరుధ్యాల్ని చిత్రించడం ద్వారా ఆలోచింపజేయడం రచయితల పని. ఆ కర్తవ్యంలో స్త్రీవాదులు సఫలమయ్యారు. ఒంటరి స్త్రీల జీవితాల చిత్రణ ఇది. స్త్రీవాద కథల్లో ప్రబలంగా కనిపించే అంశం.
తెలంగాణ భూస్వామ్య వ్యవస్థను ఎదుర్కొని ఒంటరి పోరాటం చేసిన వృద్ధురాలు తెగువను బెజ్జారపు రవీందర్ రాసిన ‘పోరుతల్లి’ (2003) కథ తెలుపుతుంది.
భూస్వామి వద్ద కుదువబెట్టిన భూమిని విడిపించుకోవడానికి లచ్చవ్వ రెక్కలు ముక్కలు చేసుకుని కూలీపని చేస్తుంది. ఒక్కగానొక్క మనమణ్ని చదివిస్తూ కూడబెట్టిన డబ్బు భూస్వామి చేతిలో పెడితే అది వడ్డీ కిందే చూపి కొత్త లెక్క చెప్తాడు. ఎట్లాగైనా తన పొలాన్ని తానే దక్కించుకోవాలని లచ్చవ్వ ఉపాయం పన్నుతుంది. అర్థరాత్రి ఎవ్వరూ చూడకుండా తన ఇంట్లోంచి గుండ్రాయి ఎత్తుకెళ్లి పొలంలో సగం వరకు పాతి, తెల్లవారగానే వెళ్లి తన పొలంలో దేవుడు వెలిశాడని ప్రచారం చేస్తుంది. ఊరి వాళ్లతోపాటు దొర కూడా నమ్మడం వల్ల లచ్చవ్వ పొలాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. లచ్చవ్వను తలచుకున్నప్పుడల్లా మనవనికి ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకు వస్తుంది.
స్త్రీవాద కోణంలో వారసత్వ గుర్తింపును అస్తిత్వాన్ని అక్కిరాజు భట్టిప్రోలు ‘అంటుకొమ్మ’ (2004) కథలో చిత్రించారు. అనసూయమ్మ కూతురు సంధ్య, మనవడు శని అమెరికా నుండి రావడంతో ఆమె పుట్టినూరు చూసి రావడానికి వెళ్లిన నేపథ్యంలో కుటుంబంలో ఆడపిల్లలే పుట్టడం చేత వంశ వృక్షం నిలిచిపోయిందని స్త్రీ కోణంలో ఎందుకు చూడకూడదన్న ప్రశ్నకు ఈ కథ సమాధానంగా నిలుస్తుంది. “వంశంలో మగపిల్లలు పుట్టకుంటే ఆ వంశం ఆగిపోవల్సిందేనా? లేదు. ఆడపిల్లలు… వారి సంతానంతో వంశాన్ని శాఖోపశాఖలుగా విస్తరించగలం” అని ఈ కథ తెలుపుతుంది.
ఆధునిక జీవన నేపథ్యంలో దాంపత్య జీవనంలో భార్యాభర్తల మధ్య దూరంపెరగటాన్ని ముదిగంటి సుజాతారెడ్డి ‘నిశ్శబ్దం!… నిశ్శబ్దం!’ (2002) కథలో చిత్రించా రు. సుకన్యను పెళ్లిచేసుకున్న అతను అపార్టుమెంటులో ఒంటరిగా వదిలేసి ఉద్యోగానికి వెళ్తాడు. ఒంటరితనం భరించలేక సుకన్య ఆవేదన చెందుతుంది. అతను ఇంట్లో ఉన్నప్పుడు ఏవో కబుర్లు చెప్పాలని ఉబలాటపడితే పల్లెటూరు మొద్దంటూ ఆమెను కసురుకునేవాడు. తాను ఒంటిస్తంభం మేడలో బతుకుతున్నానని, ఏరాజకుమారు డో వచ్చి రక్షిస్తే బాగుండేదని ఆలోచిస్తుంది. ఇట్లా స్త్రీ జీవితంలో ఒంటరితనం వేధించడాన్ని ఈ కథలో చూడగలం.
నేటి స్త్రీలు సమాజంలో పాతుకు పోయిన సంప్రదాయాలకు విరుద్ధంగా నడిస్తే ఎట్లుంటుందో కాలువ మల్లయ్య ‘ద్రౌపది’ (2002) కథలో సూచించారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన దమయంతి భర్తచనిపోగా పునర్వివాహం చేసుకుంది. ఆ భర్తతో విడిపోయి కరుణాకర్ అనే యువకుడిని పెళ్లాడడానికి సిద్ధపడుతుంది. తండ్రి రాజారావు “అమ్మా! దమయంతి! మనది సంప్రదాయ కుటుంబం.. నీకిది వరకే పెళ్లయింది. అయినా పునర్వివాహం చేసుకున్నావు… పునర్వివాహమే తప్పంటే మళ్లీ ఇదో సమస్య తెచ్చిపెట్టావు.. ఇదంతా ఏంటమ్మ! మమ్మల్ని తలెత్తుక బతుకమంటావా.. గంగల పడి చావమంటావా..” అని అంటాడు. అయితే మగవాళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తప్పులేదు కానీ ఆడవాళ్లు చేసుకుంటే తప్పా. నేనతనితో సరిగా ఉండలేకే మరోపెళ్లి చేసుకుంటున్నానే కానీ మరో ఉద్దేశ్యం కాదని మన సంప్రదాయ కుటుంబాల్లో దీన్నో నేరంగా భావించడం తగదంటుంది. నీవు ద్రౌపదిగా ఉండదలుచుకుంటే నీ ముఖం చూపకని తండ్రి వెళ్లిపోతాడు. దమయంతికరుణాకర్ స్నేహితుల సమక్షంలో దండలు మార్చుకుంటారు. ఆచారంపేరిట భర్త చనిపోయిన స్త్రీల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్న సమాజపోకడలను ‘నేరెళ్ల శ్రీనివాసగౌడ్ ‘ముండరాలు’(2009) కథలో చిత్రించారు.
ఈ కథలో ఎల్లవ్వ భర్త తాడిచెట్టు పై నుండి పడి మరణిస్తే కుంగిపోతుంది. ఒక్కగానొక్క కొడుకు పోషణభారం తనపై ఉండటంతో కొద్దిరోజులు వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితిలో కులవృత్తిలోకి ప్రవేశించాల్సి వచ్చి కొద్ది రోజుల్లోనే తాళ్లు ఎక్కడం, ఈదులు గీయడం నేర్చుకుంటుంది. ఒక స్త్రీ అయి ఉండి విధవయైన ఎల్లవ్వ మగవాళ్లకు ధీటుగా కల్లుగీసి అమ్ముతుంటే ఆమెకు నిందలు అవమానాలు తప్పవు. తనకే కాదు సమాజంలో భర్త చనిపోయిన ఏ స్త్రీకి కూడా విలువ లేకపోవడాన్ని గురించి ఆవేదన చెందుతుంది. కొడుకును చదివించి ప్రయోజకున్ని చేయడంతో అనతి కాలంలోనే ఉద్యోగం సంపాదించుకుంటాడు. పెళ్లిచేసాక వచ్చిన కోడలుకు కూడా ఉద్యోగం రావడంతో ఇంటిపెత్తనం కోడలు చేతిలోకి వెళ్తుంది. కొద్ది రోజుల్లోనే కోడలు కొడుకు పట్టణంలో కాపురం పెడ్తారు. ఆచారంపేరిట భర్త చనిపోయి న స్త్రీ ఆత్మగౌరవాన్ని మంటగలిపిన సమాజంపై ఎల్లవ్వ దుమ్మెత్తి పోస్తూ పల్లెలోనే ఒంటరిగా మిగిలిపోతుంది.
వేధింపులకు గురిచేసిన భర్తను దారిలో పెట్టిన ఇల్లాలు వేణు సంకోజురాసిన ‘కేసు’(2007) కథలో కనిపిస్తుంది. సుధకు నిరంజన్‌తో వివాహమవుతుంది. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది. ప్రైవేటు కాలేజీలలో పనిచేసే నిరంజన్ యేడాదికి రెండు మూడు కాలేజీలు మారతాడు. ఇద్దరు కూతుర్లు పుట్టాక భార్య పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తాడు. అత్తమామలను డబ్బుకోసం పీడిస్తాడు.
విడాకులు ఇవ్వమంటే సుధను పదే పదే ఇబ్బందులకు గురిచేస్తాడు. అతడు పెట్టే హింస భరించలేక సుధ పుట్టింటికి వచ్చి ప్రశాంతంగా ఉంటుంది. అయితే తాను విడాకులు వద్దన్నందుకే తనపై హత్యాయత్నం చేసి పుట్టింటికి వెళ్లిందని పోలీసుస్టేషన్‌లో కేసుపెట్టానని మామను బెదిరిస్తూ ఫోన్ చేస్తాడు నిరంజన్. పోలీసులు వచ్చి విచారణచేస్తే తమ పరువు పోతుందని భయపడిన తండ్రికి నచ్చజెప్పి భర్త దగ్గరకు వెళ్తుంది సుధ. ఆరాత్రి నిరంజన్ బట్టలు వలచి కత్తిపట్టుకొని హత్యచేయబోతున్నానని, పోలీసులకు ఫోన్ చేయమంటుంది. ఆమె తెగింపుచూసి నిరంజన్ ఆమె చెప్పినట్లే నడుచుకుంటాడు.
స్త్రీ జీవితంలో ఆర్థిక స్వావలంబన ఎంత అవసరమో కె. కవిత ‘సంగీత’(2013) కథలో చిత్రించారు. పి.జి. వరకు చదువుకున్న సంగీత పుట్టింట్లో గారాబంగా పెరుగుతుంది. ఇంజినీరింగ్ చదివిన దగ్గరి బంధువుల అబ్బాయితో వివాహం. అత్తగారింట్లో అడుగు పెట్టిన సంగీతకు నిర్బంధం ఎదురౌతుంది. భర్త డ్రగ్స్‌కు ఎడిక్ట్‌అయి నరకాన్ని చూపిస్తాడు. బిడ్డ పుట్టాక ‘నా భర్తను నేను మార్చుకోలేనా’ అన్న ధీమాతో వచ్చిన సంగీతకు నిరాశే ఎదురవుతుంది. మళ్లీ నెలతప్పడంతో భర్త మరింత అమానుషంగా ప్రవర్తిస్తాడు. తనపై హత్యాయత్నం జరిగితే తప్పించుకుని పుట్టినిల్లు చేరుతుంది. ఇలాంటి ఇంకా ఎన్నో కథలున్నా యి. కానీ, మచ్చుకు మాత్రమే వీటిని ఉటంకించడమైన ది. ఇటీవల మారిన పరిస్థితుల కనుకూలంగా తెలంగాణలోని కథారచయితలు మహిళా సమస్యలపై భిన్నభిన్న కో ణాల్లో విశ్లేషించి కథలు రాయడం జరుగుతున్నది. వీటితో కొన్నైనా మహిళా సమస్యలు తీరితే కొంతమేలే కదా.

డా. బన్న అయిలయ్య
9949106968

Article on Womens Freedom in Present Swituation

Related Images:

[See image gallery at manatelangana.news]