సారస్వత సార్వభౌముడు మన కె.సి.ఆర్

  గత శతాబ్దం(ఇరువదవ శతాబ్దం) సగభాగంలో, అంతకుముందు దాదాపు రెండువందల సంవత్సరాల కంటె ఎక్కువ కాలం తెలంగాణ ప్రజలు, వారి భాష తెలుగు పాలకుల అలక్ష్యానికి, అనాదరణకు, అవమానాలకు గురి అయినాయన్నది చారిత్రక సత్యం. ఈ విషయంలో గోలకొండ కుతుబ్ షాహి పాలన కొంత మెరుగని చెప్పాలి. పాలకుల అలక్ష్యధోరణిని, అనాదరణను, అవమానాలను ఎదుర్కొంటూనె తెలంగాణ ప్రజలు, విశేషించి కవులు, రచయితలు, పండితులు, పరిశోధకులు తమ భాషను, వాజ్మయాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఎంతో కృషి జరిపారు. నిజామ్ […]

 

గత శతాబ్దం(ఇరువదవ శతాబ్దం) సగభాగంలో, అంతకుముందు దాదాపు రెండువందల సంవత్సరాల కంటె ఎక్కువ కాలం తెలంగాణ ప్రజలు, వారి భాష తెలుగు పాలకుల అలక్ష్యానికి, అనాదరణకు, అవమానాలకు గురి అయినాయన్నది చారిత్రక సత్యం. ఈ విషయంలో గోలకొండ కుతుబ్ షాహి పాలన కొంత మెరుగని చెప్పాలి. పాలకుల అలక్ష్యధోరణిని, అనాదరణను, అవమానాలను ఎదుర్కొంటూనె తెలంగాణ ప్రజలు, విశేషించి కవులు, రచయితలు, పండితులు, పరిశోధకులు తమ భాషను, వాజ్మయాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఎంతో కృషి జరిపారు. నిజామ్ పాలనలోని తెలంగాణ ప్రాంతంలో తెలుగు కవులు, రచయితలు, పాఠకులు లేరని ఆంధ్రులు హేళన చేసినప్పుడు ఎనభయి సంవత్సరాల కిందట, అప్పటి గోలకొండ పత్రిక సంపాదకుడు, మహా పండితుడు, పరిశోధకుడు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఊరూర నివురుగప్పిన నిప్పువలె మరుగున పడి ఉన్న కవుల కవితలను ఆహ్వానించి, సేకరించి, వాటిని సంకలనం చేసి గోలకొండ కవుల సంచిక ను ప్రచురించారు. తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ తెలుగుభాష, సారస్వతాలు బతికె ఉన్నాయని, వెలుగుతున్నాయని ఆధునిక యుగంలో ప్రపంచానికి సోదాహరణంగా చాటి చెప్పిన ప్రథమ ప్రయత్నం సురవరం వారిదే.

తెలంగాణ తెలుగుభాష, సారస్వతాలకు వేయి సంవత్సరాల ఉజ్వల చరిత్ర ఉంది. ఈ ఉజ్వల చరిత్రను ఉద్దేశపూర్వకంగా గుర్తించకుండా అవహేళన చేసినవారు సున్నితంగా చెప్పాలంటే అజ్ఞానులు. తెలంగాణ ప్రాంతంపై రాజకీయంగా, పరిపాలనాపరంగా పెత్తనం చేసి, అన్ని రంగాలలో పిండారీలవలె దోపిడి చేసిన పరాయివాళ్లు ‘ఇదేం తెలుగు’ అంటూ తెలంగాణ తెలుగుభాషను ఘోరంగా గేలి చేసారు. తాము మాట్లాడేది నిజంగా తెలుగు కాదేమోనని తెలంగాణ ప్రజలు భయపడే, ఆ భయంతో న్యూనతాభావానికి(ఇన్ఫీర్యారిటీకి) గురిఅయ్యే, తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సైతం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తెలంగాణ ప్రజలు తమ సహజభాషలో మాట్లాడటానికి, ప్రసంగించడానికి, రాయడానికి బిడియపడిన క్లిష్ట పరిస్థితి ఉత్పన్నమయింది. ఈ దుస్థితిలో తెలంగాణ భాషా పతాకం పడిపోకుండా పట్టుకుని, నిటారుగా నిలిపి ఆదుకున్న ఆపద్బాంధవుడు, తెలంగాణ భాషోద్ధారకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. పరాయీల గాలిదుమారంలో తెలంగాణ భాషా దీపం ఆరిపోకుండా చూసి, అది సహస్ర జ్యోతులతో వెలుగడానికి తగిన చర్యలు తీసుకున్న ఘనత కె.సి.ఆర్.దే-; తెలంగాణ భాషా జ్యోతి అఖండంగా వెలిగినంత కాలం ఆయన అమోఘ పాత్ర నేల నాలుగు దిశల చిరస్మరణీయమవుతుంది. ఆయన స్వయంగా కవి, సాహిత్యపిపాసి, తపస్వి. పధ్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి ఏకైక సేనానిగ, ఎదురులేని మహానాయకుడుగా ఆయన చేబూనిన ఒకేఒక ఆయుధం, వజ్రాయుధం భాష-అది తెలంగాణ భాష.

పధ్నాలుగు సంవత్సరాల ఉద్యమకాలంలో, తరువాత అయిదు సంవత్సరాలు గౌరవనీయ ముఖ్యమంత్రిగా పరిపాలన బాధ్యత నిర్వహణలో వివిధ విషయాలపై, అనేక అంశాలపై(సాంకేతిక, శాస్త్రీయ అంశాలపై గూడ) కొన్నివేల సందర్భాలలో, కొన్ని వందల వేదికలపై కె.సి.ఆర్.ఏమాత్రం సంకోచం లేకుండా తన తెలంగాణ ప్రజల గ్రామ్య, వ్యవహారిక భాషలో, సరళ, శక్తివంతశైలిలో అనర్గళంగా, గంభీరంగా ప్రసంగించారు-ప్రసంగిస్తున్నారు. తెలంగాణ కోట్ల ప్రజల భావాలను ఆకళింపు చేసుకోవడానికి, కోట్లాది తెలంగాణ ప్రజలకు తన అమూల్య సందేశం అందించి మార్గదర్శకత్వం వహించడానికి, ఉద్యమ స్ఫూర్తి కల్గించడానికి ప్రజానాయకుడు కె.సి.ఆర్.కు అచ్చమయిన తెలంగాణ ప్రజల తెలుగు భాష ఒక దివ్యాస్త్రంగా ఉపయోగపడింది- ఉపయోగపడుతున్నది. కె.సి.ఆర్.తన వజ్రాయుధ భాషగా ఉద్యమకాలంలో, తరువాత ప్రభుత్వ నిర్వహణలో ఉపయోగించిన, ఉపయోగిస్తున్న(ఇంటర్వ్యూలు మొదలయిన వాటిలో గూడ) తెలంగాణ తెలుగుభాష ఈరోజు ప్రపంచమంతటా గుర్తింపు, ఆదరణ పొందడం విశేషం. ఇది తెలంగాణ తెలుగుభాషకు కె.సి.ఆర్.సంతరింపజేసిన అపూర్వగౌరవం, ఔన్నత్యం. నిన్న మొన్నటి వరకు తెలంగాణ తెలుగుభాషను చులకన చేసి ఈసడించిన వారు సైతం ఈరోజు అదే భాషలో మాట్లాడడానికి తంటాలుపడుతున్నారు. ఇది తెలంగాణ తెలుగుభాష విషయంలో కె.సి.ఆర్.సాధించిన ఘనవిజయం. తెలంగాణ తెలుగుభాష, సారస్వతం, సంస్కృతి గత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పి, భవిష్యత్తులో తెలంగాణ తెలుగుభాష, సారస్వతం, సంస్కృతి మరింత ఉజ్వల వికాసం పొందడానికి సకల చర్యలు తీసుకోవాలన్నది కె.సి.ఆర్.తపన, పరమాశయం. ఈ తపనతోనె, ఈ ఆశయసాధన కోసమే ఆయన తెలంగాణ రాష్ట్రం, తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేవలం మూడు సంవత్సరాలకే తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సంకల్పించి, అది విజయవంతం కావడానికి అన్నివిధాల అండగా నిలిచారు, అమితమయిన శ్రద్ధాసక్తులతో నేతృత్వం వహించారు. ఆ సందర్భాన ఆయన తెలంగాణ ప్రముఖ కవులు, రచయితలు, మేధావులు, పండితులు, సాహితీవేత్తలతో పలు పర్యాయాలు జరిపిన చర్చలు అసాధారణమయినవి. తెలుగుభాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతుల గురించి పనికిరాని ఎన్నో మాటలు మాట్లాడిన ఆంధ్ర పాలకులు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయిన తరువాత పద్దెనిమిది సంవత్సరాలకు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు జరిపారన్నది ఈ సందర్భాన గమనించవలసిన విషయం.

తెలంగాణ రాష్ట్ర ప్రథమ ప్రభుత్వం శ్రీ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఏర్పాటయిన పిదప మొదటి సంవత్సరంలోనె తెలుగు సారస్వతరంగ మహనీయులను, వైతాళికులను ప్రభుత్వ పక్షాన గౌరవించే విశిష్ట సంప్రదాయం మొదలయింది; ప్రజాకవి కాళోజీ, మహాకవి దాశరథి సేవల సంస్మరణార్ధం ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులకు లక్షరూపాయల అవార్డులిచ్చి ఘనంగా సన్మానిస్తున్నది. కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో అధికార భాషా దినోత్సవంగా జరుగుతున్నది. గౌరవనీయ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. చొరవతో 2018 విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రమంతట అన్ని పాఠశాలలలో తెలుగు మొదటి తరగతి నుంచి పదవ తరగతి వరకు తప్పనిసరి చదువవలసిన భాషగా ప్రవేశపెట్టబడింది. తెలంగాణ తెలుగు కవులు, రచయితలు, పండితులు, పాత్రికేయులు, పరిశోధకులకు కె.సి.ఆర్. ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సాహం అందిస్తున్నది. సారస్వత సార్వభౌముడు కె.సి.ఆర్.నాయకత్వంలో, ఆయన అందిస్తున్న స్ఫూర్తితో తెలంగాణ తెలుగుభాష, వాజ్మయ రంగాలలో ఒక మహోజ్వల ఘట్టం ఆరంభమయింది.

Article on Telangana CM KCR

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: