శృంగారం ఒక విజ్ఞాన శాస్త్రం

డా. భారతి (సెక్సలాజిస్ట్& సైకోథెరపీస్ట్) గారు ‘గీతాంజలి’ అనే కలం పేరుతో స్త్రీల సమస్యలపై, స్త్రీలపై జరిగే లైంగిక హింసను తాను రాసిన హస్బెండ్ స్టిచ్ అనే పుస్తకం చదువుతుంటే కన్నీటి పర్యంతంకాని పాఠకులుండరంటే అతిశయోక్తి కాదు. స్టోమా, బచ్చేదిన్, పహఛాన్, పాలమూరు వలస బతుకుల చిత్రాలు, ఆమె అడవిని జయించింది వంటి పుస్తకాలు రాశారు. నిత్యం సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యలపై సుదీర్ఘ కాలం గా పోరాడుతున్నారు. ఆడవాళ్లు లైంగిక విషయాలను జీవిత భాగస్వామి తో కూడా స్వేచ్ఛగా చర్చించలేని పితృస్వామిక ఆధిపత్య భావజాలం పేరుకుపోయిన సమాజంలో, స్త్రీ పురుషుల సెక్స్ సమస్యలకు సామాజిక మూలాల్లోంచి విశ్లేషణను ‘SEXOLOGY- శృంగారం ఒక విజ్ఞాన శాస్త్రం‘ అనే పుస్తకం లో శాస్త్రియ కోణంలో వివరించారు. సెక్స్ అంటేనే బూతు అని చెంపలేసుకొనే సమాజానికి రచయిత్రి వారిలోని ఆత్మనూన్యత భావాన్ని పోగొట్టడానికి అద్భుతంగా, సవివరంగా, వివిధ పత్రికల్లో అచ్చయిన వ్యాసాలు, తనకు ఉత్తరాల ద్వారా, మెయిల్ ద్వారా పౌర సమాజం అడిగిన సమస్యలకు సమాధానాలను కూర్పు చేసిన పుస్తకం. యుక్త వయస్సులోని పిల్లలు సెక్స్ గురించిన అపోహలు, అనుమానాలను అరకొర జ్ఞానం ఉన్న తమతోటి వారితో చర్చించి, పోర్న్ సైట్లో చూసిన వాటినే సెక్స్ ఎడ్యుకేషన్ అనుకోని నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, తమ కెరీర్ పై దృష్టి పెట్టలేక మానసికంగా క్రుంగబాటుకు గురవుతున్నారు.

‘నేనెందుకు రాసానంటే’ అంటూ తన ఉద్దేశాన్ని చెప్పేక్రమంలో ’లైంగిక పునరుత్పత్తి హక్కులపై అవగాహన స్త్రీ-పురుషులిద్దరిలో కలిగించడం కూడా నా లక్ష్యం’ అని తన స్పష్టమైన దృక్పథాన్ని తెలియపరుస్తుంది. ఈ పుస్తకాన్ని లైంగిక, గృహ హింసలను ఎదుర్కొంటున్న బాధిత స్త్రీలకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చారు. మాతృస్వామిక వ్యవస్థ కాలక్రమేణ పితృస్వామిక వ్యవస్థగా రూపాంతరం చెందిన తర్వాత సెక్స్ అనేది స్త్రీపై ఆధిపత్యాన్ని,అజమాయిషీని చలాయించడానికి వాడే సాధనంగా నేటి ఆధునికమని పిలువబడే అనాగరిక, ఆటవిక పురుష సమాజాన్ని ’ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన, ప్రశాంతమైన శృంగార జీవితం పొందే హక్కు పురుషులకే కాదు స్త్రీలది కూడా!’ అంటూ హెచ్చరిస్తారు. ’శృంగారం అంటే జీవితానికి విడిగా ప్రత్యేక ఉనికిలో ఉండే విషయం కాదు. జీవితాన్ని శాసించే, నడిపించే ఒక ముఖ్యమైన జీవన సూత్రం’ అంటూ ఫోన్ సెక్స్, ఫెటిష్, డిస్పెరునియా, హేమటో స్పర్మియా, ఫిడోఫీలియా, పారా ఫీలియా, ఎగ్జిబిషనిషమ్, శీఘ్ర స్ఖలనం, వంధ్యత్వం,మెనోపాజ్, వంటి సమస్యలకు పరిష్కారం చెప్తూ, టీనేజీ విలువలు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల ప్రాముఖ్యత, శృంగారం పట్ల ఉన్న అశాస్త్రీయమైన అపోహలకు శాస్త్రీయమైన సమాధానాలు చెప్తుంది. ‘శృంగారం ఒక భావప్రకటన! తన భాగస్వామికి స్పర్శ ద్వారా’ నీకు నేనున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కావాలని’ తెలియజేసే ఒక సున్నితమైన దేహభాష‘ అని స్పష్టంగా వివరిస్తారు. తమ శరీరాల పట్ల ముఖ్యంగా జననేంద్రియాల పట్ల అసలే మాత్రమూ స్పష్టత, అవగాహనలేని స్థితిలో స్త్రీలకు వివాహాలు జరగడం, పూర్తి అయోమయంలో, అజ్ఞానంతో, భయాందోళనలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి, 50 శాతం మంది స్త్రీలు అసలు భావప్రాప్తి అంటే ఏమిటో తెలియని అమాయకత్వంలొనే సంసారాలు వెళ్లబోస్తున్నారని వాపోతారు.

మానవ శరీరంలో కలిగే భౌతిక, ‘రసాయనిక మార్పుల ఫలితంగా కలిగే జీవ రసాయన చర్య-ప్రతిచర్యల ఫలితమైన దాహం, ఆకలిలాంటిదే శృంగార వాంఛ కూడా!‘ అని శాస్త్రీయంగా వివరిస్తారు. ఇంతటి సహజ వాంఛను పాపకార్యమనో, కేవలం పిల్లల పుట్టుకకై చేసే కార్యమనో దానిచుట్టు అనేకానేక అపోహలు అల్లి లైంగికంగా తృపిపడని స్త్రీలు హిస్టీరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. దేశంలో విడాకులు తీసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం శృంగార సంబంధమైన సఖ్యత లోపించడం మూలాన జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో వెయ్యి జంటల్లో పదమూడు జంటలు విడాకుల భారిన పడుతున్నారనేది గణాంకాలు చెప్తున్నాయి, కానీ ఇంత సాహసానికి కూడా నోచుకోక గుట్టుగా సమాజానికి భయపడి సర్దుకుపోయి, లైంగిక హింసకు గురవుతూ భారంగా సంసారాలు చేస్తున్నవారు ఎందరో..!?
లైంగిక విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలనే అంశంపై దేశంలో పెద్ద చర్చ జరిగిన విషయం విదితమే. ఇప్పటికీ హైస్కూల్ స్థాయిలో జీవశాస్త్రం లోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే పాఠ్యాంశం భోధించాలంటే అమ్మాయిలు, అబ్బాయిలను వేరే గదుల్లో కూర్చోబెట్టి చెప్పడం వల్ల దీనిపై పిల్లలకు వ్యతిరేక భావనను, నూన్యతా భావాన్ని ఏర్పరుస్తుంది. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు లైంగిక విద్యను ఇతర పాఠ్యాంశాలను బోధించిన విదంగానే సాధారణ అంశాలుగా చెప్పాలి. తమ చెల్లి, అక్క, అమ్మ ల వలే తోటి ఆడపిల్లలకు వచ్చే ఋతుక్రమం సహజమైనది అని, నీ పుట్టుక రహస్యం కూడా అదే అనే పరిపక్వతను విద్యార్థులకు భోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.

ఋతుక్రమం సమయంలో ఏ విధమైన పరిశుభ్రత పాటించాలనేది సరైన అవగాహన విద్యార్థినుల్లో కొరవడడం అత్యంత బాధాకరం. పాఠశాల హాజరు శాతం అమ్మాయిల్లో తక్కువగా నమోదు కావడానికి ఋతుక్రమ సమయంలో ఇంట్లోనే ఉండాలనే అపోహ, అపచారం, అపవిత్రం అనే మూఢనమ్మకాల వల్లనే అని సర్వే సంస్థలు చెప్తున్నాయి.,పీరియడ్ సమయంలో స్త్రీలను దూరంగా ఉంచడం రహస్యంగా వేరే గదిలో పెట్టి వ్యక్తిగత దూరంలో పెట్టడం సమాజంలో ఒక బలమైన మూఢనమ్మకం పారద్రోలె విధానాలు ప్రస్తావించాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో శానిటరీ న్యాప్కిన్స్ ఫ్రీగా అందిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి. ఇంకా గ్రామీణ భారతంలో స్త్రీలు ఋతుక్రమం సమయంలో మురికి బట్టలను వాడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. జననాంగాలకు ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే జీవిత భాగస్వామితో కానీ తల్లిదండ్రులకు స్వేచ్ఛగా చెప్పుకోగల అన్యోన్యత, అంతే భాద్యతతో పరిష్కరించాల్సిన సహృదయం కలిగివుండాలి. ‘తమ శృంగరానుభూతుల్ని స్త్రీలు స్వేచ్ఛగా తమ భర్తల దగ్గర వ్యక్తం చేసేంత సంస్కారాన్ని పురుషులు కలిగివుండాలి‘ అంటారు రచయిత్రి. పిల్లలు పుట్టకపోతే ఆడవాళ్ళనే నిందించడం ఆనవాయితీగా మారింది.

కానీ, పిల్లల పుట్టుకలో లోపాలు ఆడవారిలొనే కాదు మగవారిలో కూడా ఉంటాయని తెలుసుకోవాల్సిన విషయాలు, చికిత్స పరమైన అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. వివాహిత మహిళల్లో ముఖ్యంగా చదువుకున్న వారిలో కూడా కానుపు కానుపుకు మధ్య ఉండాల్సిన గ్యాప్ ఎంత అనేది కానీ అవాంఛిత గర్భం దాల్చకుండా ఉండడానికి పాటించాల్సిన నియమాలపై సరైన అవగాహన కొరవడి తమ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెక్స్ అనేది కేవలం వంశాభివృద్ధి కొరకే అనే అపోహ వల్ల శృంగార జీవితాన్ని సాఫీగా కొనసాగించలేకపోతున్నారు. కేవలం మగవారు మాత్రమే జీవిత చరమాంకం దాకా సెక్స్ ను పొందగలరనే అపోహ ఇంకా మహిళల్లో ఉంది.మోనోఫోజ్ దశలో కూడా స్త్రీలు సెక్స్ సుఖాన్ని అనుభవించవచ్చు. సెక్స్ పరమైన అవగాహనలేమి టీనేజీ నుండి మొదలుకొని అన్ని వయసుల వారిలో కొరవడింది. కేంద్ర ప్రభుత్వం ఆడవారి వివాహ వయస్సు పెంచాలనే యోచనతో కమిటీ వేసి పరిశీలిస్తున్న విషయాన్ని సంప్రదాయవాదులు సైతం స్వాగతించాలి. అక్షరం తెలివి నేర్పించి ఎవడికో కట్టబెడితే తమ భారం తీరిపోతుందనే ఆలోచనల వల్ల చదువుల్లో రాణించే గొప్ప భవిష్యత్తు ఉన్న ఆడపిల్లలను కసాయి వాడికి కట్టబెట్టినట్టు సైకో ల చేతిలో పెట్టి బంగారం లాంటి జీవితాన్ని తల్లిదండ్రులే నాశనం చేసిన వారవుతున్నారు. స్త్రీ వివాహ వయస్సు ఆధారంగా పెండ్లి చేసి మెచ్యూరిటీ భావన లేకుండానే స్త్రీజీవితంపై ఎనలేని ప్రభావం చూపిస్తుంది. ఈ ఆలోచన విధానాలను మార్చుకునే విధంగా అవగాహనను పెంచాలి. ఏవైనా లైంగిక సమస్యలొస్తే లోలోపలే కృంగిపోకుండా జీవితభాగస్వామితో కలిసి సెక్సలాజిస్ట్ ను సంప్రదించాలి. ఈ పుస్తకం టీనేజీ వారు మొదలుకొని ఇంటిల్లిపాది చదవవలిసిన మహాద్గ్రంధం.

                                                                                        ముఖేష్ సామల
                                                                                         9703973946

Article on Romance is a science

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post శృంగారం ఒక విజ్ఞాన శాస్త్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.