వేగంగా పోలీసు సంస్కరణలు

Police Reforms

పద్నాలుగా సంవత్సరాల సుదీర్ఘ వ్యూహాత్మక పోరాటాన్ని శాంతియుతంగా చేసి, ఎవరూ ఊహించని విధంగా కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాక రాష్ట్ర రథసారథి బాధ్యలను కూడా తానే చేపట్టడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లభించిన మరొక అదృష్టం. సహజ వనరులు ఎన్ని వున్నా, దశాబ్దాలుగా నిర్లక్షానికి గురై దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో ఒకటిగా మిగిలిపోయిన తెలంగాణను సర్వతో ముఖంగా అభివృద్ధి చేసే పనికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే కెసిఆర్ నడుం బిగించారు. గత అరవై ఏళ్లలో కనీసం ఊహకు కూడా అందని ప్రగతిని రాష్ట్రంలో ఆయన ఈ నాలుగేళ్లలో సాధించి చూపారు. బంగారు తెలంగాణను నిర్మిస్తానని ఆయన అంటే, అవి పగటి కలలని ఎగతాళి చేసినవారు నోళ్లు మూయిస్తూ, ఆ కలలను సాకారం చేసి చూపారు కెసిఆర్. ఆయనకు అన్ని తెలుసు. రాష్ట్రంలో అందరి బాధలు తెలుసు. అందరి కన్నీళ్లు తుడవడానికి కంకణం కట్టుకున్న తెలంగాణ బిడ్డ కెసిఆర్. ఆయన సహృదయుడు. సున్నిత మనస్కుడు. ఎక్కడ ప్రజలు కష్టాలలో ఉన్నా ఆయన తట్టుకోలేరు. ఇప్పటికే కెసిఆర్ సమాజంలోని అన్ని వర్గాల వారికి మంచి జరిగే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అవన్నీ ఎంతో జయప్రదంగా అమలవుతూ సత్ఫలితాలను ఇస్తున్నవి.

తెలంగాణకు శాతవాహనుల నాటి ప్రాభవాన్ని, కాకతీయుల నాటి వైభవాన్ని సంతరించి పెట్టగల మహానాయకుడు కెసిఆర్ అని అందరూ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్ర ప్రజలే కాదు ఈనాడు దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తున్నది. ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను గమనిస్తున్నది. కేవలం ఉద్యమాలు నడపడమే కాదు, సుస్థిరమైన పాలనను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు కెసిఆర్. ముఖ్యమంత్రిగా కెసిఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ వంటి సాగు నీరు, మంచి నీరు పథకాలతో పాటు, ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద నేరుగా చెక్కుల ద్వారా ఆర్థిక సాయం మొదలైన సంక్షేమ పథకాలు మంచి ఫలితాలనిస్తున్నాయి.

కెసిఆర్ పాలన పట్ల సంతృప్తి చెందిన రాష్ట్ర ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికలలో రెండోసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఆయన పట్ల తమకున్న విశ్వాసాన్ని తెలియ చెప్పారు. కెసిఆర్ ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు మాత్రమే కాక పాలనాపరంగా ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేశారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని సమూలంగా మార్చారు. మునిసిపల్ చట్టానికి కూడా మార్పులు చేసి, స్థానిక సంస్థలను అవినీతి రహితంగా తీర్చిదిద్దడానికి నడుం బిగించారు. ఈ క్రమంలో, అంతకు పూర్వం ప్రజలలో ఏహ్యభావం వున్న పోలీస్ శాఖను ప్రక్షాళన చేసి, పోలీస్ శాఖ అంటే ప్రజలకు భయం పోయే విధంగా “ఫ్రెండ్లీ పోలీసింగ్‌” వ్యవస్థను రూపొందించారు.

రాష్ట్రాభివృద్ధి సక్రమంగా జరగాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని ఎంతో దూరదృష్టితో కెసిఆర్ భావించారు. అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తమ మొదటి అధికారిక సమావేశాన్ని డిజిపి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు కూకటి వేళ్ల నుంచి జవజీవాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నదని భావించి, తుప్పుపట్టిపోయిన తుపాకులు, పాతబడిపోయిన జీపుల స్థానంలో ఆధునిక ఆయుధాలను, వాహనాలను సమకూర్చాలని నిర్ణయించారు. డొక్కు జీపుల స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో “ఇన్నోవా” కార్లను సమకూర్చుకోడానికి పోలీస్ శాఖకు వెంటనే రూ. 575.00 కోట్లు మంజూరు చేశారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ఒక్కొక్క పోలీస్ స్టేషన్‌కు నెలకు 75 వేల రూపాయల ఖర్చుల కింద ఇస్తున్నారు. ఈ విధానం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. మహిళల రక్షణను దృష్టి లో ఉంచుకుని షీ టీమ్స్‌ను ఏర్పాటు చేయడమైనది. తెలంగాణ రాష్ట్రంలో మాదిరి మరే ఇతర రాష్ట్రం లోనూ శాంతిభద్రతలు అదుపులో లేని విషయం మనం గ్రహించాలి.

పోలీసు కానిస్టేబుళ్ల సంక్షేమం
పోలీస్ శాఖలో పని వత్తిడి తగ్గించే ఉద్దేశంతో, 25 వేల మందిని కొత్తగా నియమించారు. ట్రాఫిక్ పోలీసులకు పొల్యూషన్ అలవెన్స్ కింద వేతనంపై 30 శాతం అధికంగా మంజూరు చేస్తున్నారు. పోలీస్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు జీతం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వం. సెలవులు లేకుండా కుటుంబాలకు దూరంగా నిర్విరామంగా పని చేస్తున్న పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు మంజూరు చేశారు.

హోం గార్డుల సంక్షేమం
రాష్ట్రంలో 19,638 మంది హోం గార్డులు పని చేస్తున్నారు. వీరు చాలా కాలంగా చాలీచాలని జీతాలతో, నిరాశ నిస్పృహల మధ్య బ్రతుకులీడుస్తున్నారు. 9 వేల రూపాయలుగా ఉన్న హోం గార్డుల వేతనాలను రూ. 23 వేలకు పెంచారు. ఇదిగాక రోజుకు రూ. 675/ ల డ్యూటీ అలవెన్స్, సంవత్సరానికి రూ. 1,000/ ఇంక్రిమెంట్ మంజూరు చేశారు. మరణించిన హోం గార్డు కుటుంబానికి సోషల్ సెక్యూరిటీ పథకం కింద రూ. 5 లక్షలు అందజేస్తున్నారు. వీటితో పాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు హోం గార్డులకు కల్పించడం జరిగింది.

పంజగుట్ట, గచ్చిబౌలి, ఆదిభట్ల పోలీస్ స్టేషన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సందర్శించి ఎంతగానో కొనియాడారు. ఇదే స్థాయిలో రామగుండంలో పోలీస్ గెస్ట్ హౌస్ నిర్మాణం, గోదావరి ఖనిలో పోలీస్ స్టేషన్ నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతున్నది.
రాష్ట్రమంతటా ఉన్న పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ భవనాలు ఎన్నో తరాల కిందట, ముఖ్యంగా నిజాం కాలంలో నిర్మించినవే ఎక్కువగా ఉన్నాయి. అవి ఇప్పటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోడానికి ఏ మాత్రం అనుకూలంగా లేవు సరికదా, చాలా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నారు. పోలీస్ వ్యవస్థ పటిష్ఠతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోడం ఎంతైనా అవసరమని భావించిన కెసిఆర్ ఆధునిక హంగులతో పోలీస్ భవనాల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అవసరమైన నిధులను మంజూరు చేయడం జరిగింది.

పోలీస్ భవనాల నిర్మాణానికిగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ పని చేస్తున్నది. దీనిని వెంటనే విడదీసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థను 11.08.2015లో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నేను 8 ఏప్రిల్ 2017న బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పని తీరును సమీక్షించారు. కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఉద్యోగుల సహకారంతో పోలీస్ శాఖలో భవన నిర్మాణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాము. 201516, 201617 రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి సంస్థ టర్నోవర్ రూ. 113 కోట్లు ఉండగా 201718 ఆర్థిక సంవత్సరంలో ఒక్క సంవత్సరంలోనే సంస్థ టర్నోవర్ రూ. 220 కోట్లుగా నమోదై 95 శాతం వృద్ధి రేటును సాధించింది. 201819 ఆర్థిక సంవత్సరానికి సంస్థ బడ్జెట్, ప్లాన్ పద్దు కింద రూ. 482.92 కోట్లు, నాన్ ప్లాన్ కింద రూ. 41.27 కోట్లు వెరసి మొత్తం రూ. 524.19 కోట్లకు నిర్మాణ పథకాలను తయారు చేశారు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేపట్టిన కార్యక్రమ వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ నగరంలో జుబ్లీహిల్స్ రోడ్ నెం. 12లో అత్యాధునిక హంగులతో 400 కోట్ల రూపాయల వ్యయంతో “ట్విన్ టవర్‌” పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగుతున్నది. 20 అంతస్తుల ఈ భవన నిర్మాణం 2019 అక్టోబర్ నెలలో పూర్తవుతుంది. దీనితో రాష్ట్రంలో అన్ని ప్రదేశాల శాంతి భద్రతలను, బందోబస్తులు వంటి అన్ని కార్యకలాపాలను అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఈ భవనం నుంచే పర్యవేక్షించే సదుపాయం ఏర్పడుతుంది.

పోలీస్ స్టేషన్లకు భవనాలు
11 వేరు వేరు పథకాల కింద తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో 115 పోలీస్ స్టేషన్ల భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 237.12 కోట్లు మంజూరు చేసింది.

ప్రజల నేస్తాలుగా పోలీస్ స్టేషన్
ఈ పథకం కింద ఇప్పటికి రూ. 60 కోట్లు ప్రభుత్వం కేటాయించగా, 200 పోలీస్ స్టేషన్ భవనాలను ఆధునికరించడం జరుగుతున్నది.

పోలీస్ క్వార్టర్స్
ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 80.31 కోట్ల ఖర్చుతో 297 పోలీస్ క్వార్టర్ల నిర్మాణం వివిధ జిల్లాలలో 5 వేరు వేరు పథకాల కింద చేపట్టడం జరిగింది.

రిసెప్షస్ సెంటర్స్, ఫ్రంట్ ఆఫీసులు
రిసెప్షన్ సెంటర్స్, ఫ్రంట్ ఆఫీసుల నిర్మాణానికిగాను ప్రభుత్వం రూ. 26 కోట్లు మంజూరు చేసింది.

డిజిపి పోలీస్ భవనాల పథకం
ఈ పథకం కింద క్వార్టర్లు, ఇతర పోలీసు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 108.65 కోట్లు మంజూరు చేసింది.

జిల్లా పోలీస్ కార్యాలయాలు/ కమిషనరేట్లు (డిపిఒలు)
వివిధ జిల్లాలలో 13 డిపిఒలు, 2 కమిషనరేట్లకు సంబంధించిన 90 పనులకుగాను ప్రభుత్వం రూ. 375 కోట్లు మంజూరు చేసింది.

వరంగల్ కమిషనరేట్
వరంగల్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసింది.

పెద్దపల్లి జిల్లాలో పి.ఎస్.బిలు
అంతర్గాం, కన్నెపల్లి, భీమారం, రామగిరిలలో ఒక్కక్కటి రూ. 1.50 కోట్ల ఖర్చుతో నాలుగు పిఎస్‌బిల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నది.

ఐ.ఆర్. బెటాలియన్
ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలలో 9 ఐఆర్ బెటాలిన్స్ నిర్మాణానికిగాను ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది.

గ్రే హౌండ్స్
గ్రేహౌండ్స్ దళాలకు సంబంధించిన పనులకు గాను ప్రభుత్వం రూ. 7.18 కోట్లు మంజూరు చేసింది. పై నిర్మాణ కార్యక్రమాలన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిమ్మట పోలీస్ వ్యవస్థ స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. ఏదైనా అవసరానికి సామాన్య జనం పోలీస్ స్టేషన్లకు భయం భయంగా వెళ్లే రోజులు పోయాయి. పోలీస్ స్టేషన్లు ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. పోలీసులు ప్రజల నేస్తాలుగా మారుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లోను రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజల అవసరాలను సాదరంగా, సుహృద్భావ వాతావరణంలో తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌ను రూపొందించడం జరుగుతున్నది.

సుస్థిరమైన శాంతి భద్రతలు
తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా శాంతి భద్రతలు సుస్థిరంగా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ అత్యాధునిక శాస్త్ర సాంకేతికతను ఉపయోగించడం మూలంగా శాంతి భద్రతల విషయంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగటం లేదు. హిందు, ముస్లిం, క్రైస్తవుల పండగలు మత ఘర్షణలు లేకుండా, శాంతి యుతంగా జరుగుతున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో ఎంతో ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

నేర నిరోధన, నేర పరిశోధన
నేరాలను నిరోధించడంలోనూ, జరిగిన నేరాలను పరిశోధించడంలోనూ రాష్ట్ర పోలీసులు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 2018వ సంవత్సరంలో గొలుసు దొంగతనాలలో 43 శాతం తగ్గుదల, ఆస్తి నేరాలలో 8 శాతం తగ్గుదల, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలలో 7 శాతం తగ్గుదల నమోదైంది.

సాధించిన అవార్డులు
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశంలోనే రెండవ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. పాస్ పోర్టుల వెరిఫికేషన్ సమయం జాతీయ సగటు 21 రోజులుగా వుండగా, తెలంగాణ రాష్ట్రం కేవలం 4 రోజులలో వెరిఫికేషన్ పూర్తి చేస్తూ రికార్డు సృష్టించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ వారు తెలంగాణ పోలీసులకు “బెస్ట్ పాస్ పోర్ట్ వెరిఫికేషన్‌” అవార్డునిచ్చి సత్కరించారు. సిసిటిఎన్‌ఎస్ ప్రాజెక్టును అత్యధికంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రవేశపెట్టిన పై సంస్కరణల మూలంగా, తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థగా రూపు దిద్దుకుంది. ప్రపంచ ప్రఖ్యాత చెందిన బ్రిటిష్ పోలీస్ వ్యవస్థ “స్కాట్లాండ్ యార్డ్ పోలీస్‌” స్థాయికి తెలంగాణ పోలీస్ వ్యవస్థను తీసుకుపోవాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం అతి త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను.

Article on Police Reforms in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వేగంగా పోలీసు సంస్కరణలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.