370 రద్దు కశ్మీర్ స్వేచ్ఛా హరణమే

J&K Article 370

 

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనేది పూర్తిగా అప్రజాస్వామిక నిర్ణయం. దీన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాల్సిందిగా కోరుతున్నాం. కశ్మీర్ విలీన సమయంలో భారత ప్రభుత్వం ఇచ్చిన స్వయం ప్రతిపత్తి హక్కే ఆర్టికల్ 370. దాని రద్దు చేయడం వారికి దేశం నుంచి విడిపోయే హక్కు కలిపించినట్లే. విలీనానికైనా, విడిపోడానికైనా, రెండు గా విడిగొట్టడానికైనా ప్రజాస్వామిక కారణలు ఉండాలి. కాని కశ్మీర్ విషయంలో విలీన సమయంలో ఒక వైపు పాకిస్థాన్ దాడి మరొక వైపు భారత్ సహాయం కోరితే షరతులు విధించి కశ్మీర్‌ను విలీనం చేసుకున్నాం. కశ్మీర్‌పై భారత్‌కు పూర్తి ఆధిపత్యం లేనట్టుగా వారికి స్వయం ప్రతిపత్తి ఉండే విధంగా షరతులతో కూడిన ఒప్పందం జరిగింది.
కశ్మీర్ ప్రజల ప్రమేయం లేకుండా రాజు, స్థానిక రాజకీయ నాయకులతో కలిసి ఒప్పందాలు కుదిరాయి. కాని ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పరిపాలన జరగడం ప్రజాందోళనకు దారి తీసి వేలాది కశ్మీర్ ప్రజల రక్తం ఏరులై పారింది. కాని కశ్మీర్ ప్రజలు ప్రజాస్వామిక పరిష్కారాన్ని పొందలేకపోయారు. ఈ స్థితిలో ప్రభుత్వం కశ్మీర్‌లో నిశ్శబ్ద చీకటి వాతావరణాన్ని కల్పించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. 1947లో ఏ హక్కు నైతే కశ్మీర్ ప్రజలు కోల్పోయారో 2019లో కూడా అ హక్కునే కోల్పోయారు. విడగొట్టడం పరిష్కారం కాదు. ఖచ్చితంగా ఆర్టికల్ 370 ని తిరిగి అమలులోకి తేవాల్సిందే. అదే కశ్మీర్ ప్రజల ఆకాంక్ష. అంతేకాక నేషనల్ సెక్యూరిట్టి యాక్ట్, ప్రత్యేక సైనికాధికారాల చట్టాన్ని రద్దు చేయడమే వారికి కావాల్సింది.
ఆర్టికల్ 370ఎ జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రత్తిని కల్పించే అధికరణం. ఆర్టికల్ 35ఎ అక్కడి ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పిస్తూ ముఖ్యంగా కశ్మీర్‌లో శాశ్వత నివాసులు ఎవరో నిర్ణయించే అధికారాన్ని ఈ ఆర్టికల్‌కు ఉంది. దీన్ని ప్రకారం శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు. జమ్మూ కశ్మీర్‌లో ఎవరైనా స్థిర నివాసం ఏర్పర్చుకోవచ్చు. ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి వారిని ఏ ఏ హక్కులు లభిస్తాయన్న అంశాలను ఈ ఆర్టికల్ నిర్వచిస్తుంది. మారణాయుధాలు లభ్యమయ్యాయని యాత్రను ముగించాలని యాత్రికులని భయపెడుతూ హెచ్చరికలు జారీ చేసింది. తొలుత 10 వేల అదనపు సాయుధ బలగాలను తరలించిన కేంద్రం ఈ తరలింపు బలగాల సంఖ్యను 35 వేలకు పెంచింది. విద్యాసంస్థలను మూసివేసి ఎన్.ఐ.టి లాంటి జాతీయ విద్యాసంస్థల విద్యార్ధులను కూడా వారి ఇళ్ళకు పంపించివేసింది. అంతేకాకుండా కశ్మీర్ అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులను సైతం వెనక్కి పోవాలని సూచించడంతో వారు కూడా హడావుడిగా భయంతో తిరుగు మొఖం పట్టారు. అంతేకాక ప్రధానమైన విషయం ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొవడానికి ఆసుపత్రులను సన్నద్ధం చేశారు. వైద్యులకు సెలవులే లేని విధంగా ఉద్యోగాలకు హాజరు కావల్సిందిగా హుకుం జారీ చేశారు. ఇవన్నీ కూడా మీడియా మాధ్యమాల్లో ప్రచారం కావడంతో నిజంగా అక్కడ భయంకర దాడులు జరిగే అవకాశాన్ని ప్రజలందరు ఊహించే విధంగా తెర తీశారు.
1947 లో కశ్మీర్ విలీన సమయంలో ఒకవైపు పాకిస్థాన్ దాడి చేస్తున్న స్థితి ఉంటే మరొకవైపు సహాయం కోసం అర్థించిన మహారాజ్‌కు సర్దార్ వల్లభాయ్ పటేల్ షరతులు విధించాడు. ఆ షరతుల్లో ప్రధానమైనది కశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేయాలనే అంశం. విలీన సమయంలో వాళ్ళ స్వేచ్ఛా హక్కును కాపాడతామని ఆర్టికల్ 370 ని రాజ్యాంగంలో చేర్చింది. ఈ ఆర్టికల్ 370 మూడు ప్రధాన అంశాలను చేర్చింది. కశ్మీర్‌కు రక్షణ విషయంలో, కమ్యూనికేషన్స్, విదేశీ వ్యవహారాలు మినహా స్వయంప్రత్తిని కలిగించింది. ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్లన 1947 లో విలీన సమయంలో కశ్మీర్‌కు ఇచ్చిన స్వయంప్రతిపత్తి హక్కు రద్దు అవుతుంది.
ఇప్పుడు 370 ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370(3) తో జమ్మూ కశ్మీర్ లెజిస్టేటివ్ అసెంబ్లీగా మారుతుంది. దీనితో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపించే అవకాశం ఏర్పడింది. ఇలా చేయడం కశ్మీర్ ప్రజలపట్ల కేంద్రప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని భావించాలి. స్వయంప్రత్తి కోసం, స్వేచ్ఛగా జీవించడం కోసం వెబ్‌సైట్‌ను కూడా నిర్వహించాలని అనేక బలి దానాలతో కశ్మీర్ ఉద్యమం కొనసాగుతుంది. విలీన సమయంలో భారత ప్రభుత్వం రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కే ఆర్టికల్ 370 స్వయం ప్రతి పత్తి హక్కు. రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలి.
భారతదేశంలో అధికార మార్పిడి జరగక ముందు బ్రిటీష్ ఇండియాతోపాటు అనేక స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి. అందులో కశ్మీర్ కూడా ఒకటి. లార్డ్ మౌంట్ బాటెన్ ప్రణాళిక ప్రకారం ఈ సంస్థానాలు తమకు తాము స్వతంత్రంగా ఉండొచ్చు లేదా ఏర్పడబోయే ఇండియా, పాకిస్థాన్లలో ఎందులోనైనా చేరవచ్చు. అంటే నాటికి కశ్మీర్ ఒక స్వతంత్ర సంస్థానంగా ఉన్నది అనే విషయాన్ని పాలకులు ఉద్దేశ పూర్వకంగా దాచిపెడుతున్నారు. దేశ విభజన సమయంలో కశ్మీర్ పౌర సమాజం ప్రధానంగా పాకిస్థాన్ దౌర్జన్యంగా తమ భూభాగాలను ఆక్రమించడాన్ని ప్రతిఘటిస్తూ భారతదేశంతో రాజా హరిసింగ్ ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. అందులో భాగమే ఆర్టికల్ 370 అనే వాస్తవాన్ని భారత పాలక వర్గాలు కప్పిపుచ్చుతూ వచ్చాయి. ఆ ఒప్పందం ప్రకారం రక్షణ, విదేశీ, సమాచార వ్యవస్థలకు సంబంధించిన విషయాలు మాత్రమే భారత ప్రభుత్వంకి అధికారం ఇచ్చింది. మిగిలిన అన్ని విషయాల్లో అధికారాలు కశ్మీర్ ప్రభుత్వానికే ఉంటాయి. అదే విధంగా ఆర్టికల్ 35ఎ కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అమలులో ఉన్న 1/70 చట్టం లాంటిదే. ఈ విషయాలను భారత పాలక వర్గాలు భారత ప్రజలకు తెలియకుండా కశ్మీర్ భారత్‌లో ఒక రాష్ర్టంగానే ప్రచారం చేస్తూ వచ్చి ఆచరణలో దాని సర్వహక్కులు హరించివేశారు. ఒప్పందం ప్రకారం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ “(ప్లెబిసైట్) నిర్వహించకుండా కశ్మీర్ ప్రజల ప్రియతమ నాయకుడైన షేక్ అబ్దుల్లా జైలులో 20 సం॥లకి పైగా నిర్బంధించారు.
కశ్మీర్ కి ఇవ్వబడిన ఆర్టికల్ 370, 35 లాగానే ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్స్ లో ఎస్‌సి, ఎస్‌టిలకు కల్పించబడిన ప్రత్యేక హక్కులు కూడా ఈ కోవకే వస్తాయి. కానీ నాటి కాంగ్రెస్ నుండి నేటి మోడీ ప్రభుత్వం వరకు ఈ వాస్తవాలను కప్పిపెట్టి ఒక్క కశ్మీర్ మీదే దుష్ర్పచారం చేస్తూ వచ్చారు. జాతీయోద్యమ కాలంలో దేశంలో, వివిధ సంస్థానాలలో కూడా దళిత, బహుజన, మైనారిటీ జాతుల ప్రజలు స్వాతంత్య్రోద్యమంలో భాగంగా తమ హక్కుల రక్షణ కోసం అనేక వీరోచిత పోరాటాలు చేశారు. కశ్మీర్‌లో కూడా అక్కడి ప్రజలు (ముస్లింలు, హిందువులు కలిసి) షేక్ అబ్దుల్లా నాయకత్వంలో రాచరికానికి, భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రజాస్వామిక పాలన కోసం ఉద్యమం సాగించారు. దున్నే వానికే భూమి నినాదంతో ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలు సాగించి పేదలు భూములు సాధించుకున్నారు. ఈ చరిత్రకాంశాలను మన పాలకులు కుట్ర పూరితంగా దాచిపెడుతున్నారు.
రాజ్యాంగబద్ధంగా కశ్మీరీ ప్రజలకు ఇచ్చిన హక్కులన్నింటినీ రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా ప్రచారం చేస్తూ దేశ ప్రజలలో కశ్మీరీ ప్రజల పట్ల ఉగ్రవాద భావాన్ని కలిగిస్తున్నారు. ధనిక వర్గాల నుండి, అగ్రకుల భూస్వాముల నుండి, కార్పొరేట్ శక్తుల నుండి తమ హక్కుల రక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా సాధించుకున్న అధికరణాలన్నింటిపై కేంద్రంలోని బిజెపి- ప్రభు త్వం, ఆర్‌ఎస్‌ఎస్ దాడి చేస్తున్నాయి. కశ్మీర్ లోని భూములను (ఆపిల్, కుంకుమ తోటలు వగైరా) కబ్జా చేసుకోడానికి, పర్యాటక రంగాన్ని హస్తగతం చేసుకోడానికి దేశంలోని బడా కార్పొరేట్ శక్తుల కోసం కశ్మీర్‌ని నేడు యుద్ధక్షేత్రంగా మార్చివేసింది. కశ్మీర్ ముస్లింలకు వ్యతిరేకంగా దేశ ప్రజలలో హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. భారత దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చాలని కుట్రలు చేస్తున్నది. మరోప్రక్క దేశంలో దళిత, బహుజన, మైనారిటీలపై, మహిళలపై, ఆదివాసీలపై దాడుల సాగిస్తూ రాజ్యాంగం ప్రకారం వారికి రక్షణకు ఇవ్వబడిన హక్కులన్నిటిపైనా దాడి చేస్తున్నది. సారాంశంలో రాజ్యాంగం స్థానంలో మనువాద ధర్మాన్ని అమలు జరిపేందుకు పూనుకున్నది. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు నిరసన తెలపకుండా భారత రాష్ర్టపతి ఈ చర్యలను తక్షణమే ఆమోదించి గెజిట్‌లో ప్రచురించడానికి సిద్ధంగా వుంటున్నాడు.
బాలాకోట్ దాడిని చూపించి దేశభక్తిని, జాతీయతను రెచ్చగొట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దేశంలో క్షీణిస్తున్న ఆర్థిక స్థితిని, పెరుగుతున్న నిరుద్యోగితను, పేదరికాన్ని, ఆకలిని కప్పిపుచ్చడానికి ఈ విధానాలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో పెరగబోయే ప్రజా ఉద్యమాలను రక్తపుటేరుల్లో ముంచడానికి, అణచివేయడానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే లి ఉపా, ఎన్‌ఐఎ, ఆర్‌టిఐ చట్టాలను మరింత కఠినంగా రాజ్యాంగ విరుద్ధంగా సవరించింది. తద్వారా దేశంలో హిందూ ఫాసిస్టు నియంతృత్వాన్ని నెలకొల్పడానికి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం చేసిన 370, 35ఎ అధికరణాల రద్దును రాజ్యాంగ విరుద్ధమైన చర్యలుగా ప్రకటిస్తున్నాం. కశ్మీర్ రెండు ముక్కలుగా చేయ డం కశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు కోసం సాగిస్తున్న పోరాటాన్ని దెబ్బ తీయడానికే అని భావిస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకి విశేషమైన అధికారాలు లేవని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుకి ఇది వ్యతిరేకమైన చర్య. ఆర్టికల్ 370ని రద్దు చేయాలంటే జమ్మూ -కశ్మీర్ అసెంబ్లీ ఆమోదం ఉండాలనే రాజ్యాంగ నిబంధనకు విరుద్ధమైనది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరూ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలనన్నింటినీ నిరసించాలని కోరుతున్నాం. కశ్మీరీ ప్రజలు స్వయం నిర్ణయాధికార హక్కు కోసం సాగిస్తున్న న్యాయమైన పోరాటాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

* ఎన్. నారాయణ రావు
(రాష్ర్ట ప్రధాన కార్యదర్శి
పౌరహక్కుల సంఘం)
Article on J&K Article 370 Scrapped

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 370 రద్దు కశ్మీర్ స్వేచ్ఛా హరణమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.