హాంకాంగ్ అశాంతి

I Can't Breathe Mass Protests at White House

ఎవరిది ప్రజాస్వామ్యం, మరెవది కాదు అనే మీమాంసను తేల్చడం కష్టసాధ్యమే. హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అణచివేసి హరిస్తున్నదని చైనాను విమర్శించిన అమెరికాను సొంత గడ్డ మీద ఆగకుండా రగులుతున్న నల్ల జాతీయుల నిరసనాగ్నులు బోనులో నిలబెట్టాయి. ఎవరు ప్రజాస్వామ్య పాలకులు, మరెవరు దానికి వ్యతిరేకులు అనే ప్రశ్న సమాధానం లేనిదిగా తయారయింది. తమ హాంకాంగ్ విధానాన్ని ఎండగడుతూ గతంలో ట్వీట్ చేసిన అమెరికా విదేశాంగ శాఖ మహిళా ప్రతినిధికి జవాబుగా చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మహిళా ప్రతినిధి ‘ఐ కాంట్ బ్రీత్ (నాకు ఊపిరాడ్డం లేదు)’ అని పంపిన ప్రతి ట్వీట్ ఈ విచిత్ర పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది. అమెరికాలోని మినియా పొలిస్ నగరంలో దొంగ నోటు ఆరోపణతో 46 ఏళ్ల ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌ను తెల్ల పోలీసు అధికారి కిందపడేసి మెడ మీద కొన్ని నిమిషాల పాటు బూటు కాలితో గట్టిగా తొక్కి పెట్టడం వల్ల అతడు ‘ఊపిరాడ్డం లేదు’ అని మొరపెట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. దాని పర్యవసానంగా అగ్ర రాజ్యం ఇప్పుడు నల్ల జాతీయుల నిరసనాగ్నులతో భగ్గుమంటున్నది. హాంకాంగ్‌లో అరెస్టయిన వారిని చైనాకు తరలించడానికి అవకాశమిచ్చే చట్టాన్ని తీసుకు రావడం కోసం రూపొందించిన బిల్లుకు వ్యతిరేకంగా గత ఏడాది జూన్‌లో అక్కడ నిరసనలు ఎగసి పడ్డాయి. తాజాగా హాంకాంగ్‌కు గల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా రద్దు చేసి అక్కడి పాలనను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోడానికి చైనా చేసిన జాతీయ భద్రతా చట్టం మళ్లీ వివాదాస్పదంగా మారింది. మరొక్కసారి హాంకాంగ్‌లో పౌరుల భారీ ప్రదర్శనలు ఊపందుకున్నాయి. 19వ శతాబ్దంలో వరుసగా రెండు గంజాయి యుద్ధాల్లో చైనా రాచరిక పాలకులు ఓడిపోడంతో అది హాంకాంగ్‌ను బ్రిటన్‌కు సమర్పించుకోవలసి వచ్చింది. ఆ విధంగా చిరకాలం పాటు తన అధీనంలో గల హాంకాంగ్‌ను 1997లో బ్రిటన్ తిరిగి చైనాకు అప్పగించింది. ఆ సందర్భంలో కుదిరిన ఒప్పందం కింద 2047 వరకు హాంకాంగ్ చైనాలో అంతర్భాగంగా ఉంటూనే అక్కడి చట్టాలతో నిమిత్తం లేని స్వయం పాలిత ప్రాంతంగా కొనసాగాలి.

స్వతంత్ర శాసన సభ, న్యాయ, పోలీసు తదితర వ్యవస్థలు కలిగి ఉండాలి. దీనినే ‘ఒక దేశం రెండు వ్యవస్థలు’గా పరిగణిస్తున్నారు. హాంకాంగ్‌కున్న ఈ స్వతంత్ర స్థితిని ఉపయోగించుకొని అక్కడ ప్రపంచ పెట్టుబడిదార్లు తమ ఉనికిని పెంచుకొని విస్తరించుకొన్నారు. అక్కడి ప్రజలు కూడా చైనీయులకు భిన్నమైన నేపథ్యంలో పెరిగి స్థిరపడ్డారు. 2047 వరకు చైనాలో ఉంటూనే స్వయం పాలిత ప్రాంతంగా మనడానికి అవకాశమివ్వడానికి ఇదే కారణం. అయితే ప్రాబల్య పోటీలో చైనాతో తలపడుతున్న అమెరికా, దాని వెంట ఉండే పాశ్చాత్య దేశాలు బీజింగ్‌ను ఇరకాటంలో పెట్టడానికి, దాని నిరంకుశ విధానాలను ప్రపంచం ముందు పలచన చేయడానికి హాంకాంగ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ఇది సహజంగానే చైనాకు కంటక ప్రాయమవుతున్నది. దాని గుండెలో ముల్లులా గుచ్చుకుంటున్నది. అందుకే హాంకాంగ్‌లోని నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని తీసుకురాడానికి అది గత ఏడాది ప్రయత్నించింది. అక్కడి ప్రజల నిరసనల వెల్లువతో వెనుకడుగు వేసి అప్పట్లో ఆ బిల్లును ఉపసంహరించుకున్నది. చైనా తమపై ఎప్పటికైనా పట్టు బిగించక మానదనే భయంతో ఉన్న హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య ప్రియులనే శక్తులకు అమెరికా దన్ను కొనసాగుతున్నది. దీనితో తాజా భద్రతా చట్టాన్ని చైనా తీసుకు వచ్చింది. జన నిరసనలకు భయపడి చైనా తన దూకుడును తాత్కాలికంగా తగ్గించినా 2047 తర్వాత హాంకాంగ్ పరిస్థితి ఏమిటి, అప్పటితో తెరపడిపోయే దాని స్వయం ప్రతిపత్తి స్థానంలో చైనా పాలకులు కోరుకునే పాలనావిధానం రాక తప్పదు కదా! చైనా దారుణంగా బలహీనపడిపోయి ప్రపంచ ఆధిపత్య పోటీ నుంచి తప్పుకుంటే తప్ప హాంకాంగ్ దాని పూర్తి అదుపాజ్ఞల్లోకి వెళ్లక మానదు. ఒక దేశం రెండు వ్యవస్థల పద్ధతి రద్దు కాక వేరే మార్గం లేదు. ఈలోగా అమెరికా, పాశ్చాత్య దేశాల పరోక్ష, ప్రత్యక్ష దన్నుతో ప్రజాస్వామ్యం పరిరక్షణ పేరిట హాంకాంగ్‌లోని నిరసనకారులు వీధుల్లోకి తరచూ రావడం కొనసాగితే చైనా ఊరుకోదు. వాస్తవంలో హాంకాంగ్ చైనాకు చెందిన భౌగోళిక ప్రాంతంగా మారిపోయిన తర్వాత అక్కడ బీజింగ్ పాలకులను అడ్డుకునే హక్కు, అధికారం ఇతరులకు ఉండవు. అక్కడి ప్రజలే తాడోపేడో తేల్చుకుందామనుకుంటే సైనికంగా బలవంతమైన చైనాను తోక ముడిచేలా చేయడం వారికి సాధ్యమయ్యే పని కాదు. అందుకే ప్రజాస్వామ్య దేశాలు అనిపించుకుంటున్న చోట, చైనా వంటి కమ్యూనిస్టు నిరంకుశ పాలన సాగుతున్న చోట కూడా ఒకే విధంగా మెజారిటీ స్వామ్యమే నిరూపణ అవుతున్నది. హాంకాంగ్ నిరసనల సారథులు అమెరికాలో జాత్యహంకారాన్ని ఖండించకుండా మౌనం పాటించడం కొసమెరుపు!

Article on I Can’t Breathe protest in US

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హాంకాంగ్ అశాంతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.