కవిత్వానికి రంగులద్దిన గాలిరంగు

    ఒకనాడు కవిత్వానికి కొన్ని గీతలు గీసి ఒక పరిధిని ఏర్పాటు చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్వం కవిత్వానికి ఛందస్సు నియమాలు ఉండేవి దానివల్ల కవిత్వం సాధారణమైన రీడర్ ని చేరుకోలేకపోయింది. ఆనాటి కవులు సాహిత్యంతో ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం చేసి కొద్దిశాతం సఫలం అయ్యారు. నేటి తెలంగాణ ఉద్యమానికి కూడా సాహిత్యం వెన్నుదన్నుగా నిలిచింది. కవిత్వం ఎక్కువమందికి చేరాలంటే ఛందోబంధనాలను తెంచుకోవాల్సిందేనని గ్రహించిన కవులు సంప్రదాయ కవిత్వం నుండి వచన కవితకు […]

 

 

ఒకనాడు కవిత్వానికి కొన్ని గీతలు గీసి ఒక పరిధిని ఏర్పాటు చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్వం కవిత్వానికి ఛందస్సు నియమాలు ఉండేవి దానివల్ల కవిత్వం సాధారణమైన రీడర్ ని చేరుకోలేకపోయింది. ఆనాటి కవులు సాహిత్యంతో ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం చేసి కొద్దిశాతం సఫలం అయ్యారు. నేటి తెలంగాణ ఉద్యమానికి కూడా సాహిత్యం వెన్నుదన్నుగా నిలిచింది. కవిత్వం ఎక్కువమందికి చేరాలంటే ఛందోబంధనాలను తెంచుకోవాల్సిందేనని గ్రహించిన కవులు సంప్రదాయ కవిత్వం నుండి వచన కవితకు మారిపోయారు. వచన కవితకు పితామహుడుగా కుందుర్తి గారు చరిత్రకెక్కారు. వారు రాసిన నగరంలో వాన వచన కవిత్వానికి లక్షణ దీపికగా నిలిచింది. శ్రీశ్రీ, శిష్ట్లా, నారాయణబాబు లాంటి కవులు వచన కవిత్వంలో ప్రసిద్దులు. సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రక్రియల్లో గేయం, వచన కవిత దీనికి కారణం సాధారణమైన రీడర్ సైతం అర్థం చేసుకునే విధంగా ఉండటమే. అలా వచన కవితకి పునాదులు పడ్డాయి. నాటి నుండి నేటి వరకు ఎందరో కవులు వచన కవిత్వాన్ని రాస్తున్నప్పటికి అతికొద్ది మంది కవులు వచన కవిత్వాన్ని నడిపిస్తున్నారు.
చందోబంధ నియమాలు తెంచుకున్న తరువాత కవిత్వ వస్తువు విషయంలో విస్తృతి పెరిగింది. కవిత్వంలో భావాలు నిర్మొహమాటంగా రాయడం మొదలైంది. పూర్వం కూడా రాసేవారే కాని సాధారణమైన వారికి ఆ భావం అర్థమయ్యేది కాదు. వచన కవితలోని భావం నేరుగా రీడర్ బుర్రలోకి దిగిపోతుంది. అందువల్లే వచనానికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. కవిత్వం రాస్తున్న నేటితరంపై విమర్శ కూడా ఉన్నది అదే వచనం ఎక్కువగా ఉండటం చేత కవిత్వం పలచపడుతోందని. నిజానికి ఇది నేటి సమస్య కాదు వచన కవిత్వం ఆరంభంలోనే నాటి కవులు చాలామంది ఈ పద్ధతిని వ్యతిరేకించారు. భావుకత తగ్గిపోతుందని, సాధారణ వాడుక భాషలో రాస్తే అది కవిత్వం ఎలా అవుతుందనేది కొందరి కవుల భావన. అది కొద్దివరకు నిజమే అందుకే వచన కవిత్వం ఎక్కువగా వస్తున్నాకూడా అందులో మంచి కవిత్వాన్ని వెతుక్కోవాల్సి వస్తోంది. విమర్శలు పక్కన పెడితే ఎందరో వర్తమాన కవులు వచన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. రీడర్‌కి చేరువ అవ్వడానికి ఆ ప్రాంత యాసలో సైతం కవిత్వ పరిమళాలను వెదజల్లుతున్నారు.
నేటి ప్రముఖ కవుల్లో ఒకరైన దేవిప్రియ గారు గాలిరంగు పేరుతో విడుదల చేసిన కవిత్వ సంపుటికి 2017 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. తొలుత వీరు కొన్ని కథలు రాసినప్పటికీ తరువాతి కాలంలో వచన కవితను సుసంపన్నం చేయడంలో ఎంతో కృషి చేశారు. గాలిరంగు కవితా సంపుటిలో కొన్ని కవితల్లోని వాక్యాలపై నా విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను. దేవిప్రియ గారు పేరు చెప్పగానే తెలుగు కవిత్వ లోకానికి గుర్తు వచ్చే కవిత గారడి. ఈ కవితలో నాలుగే వాక్యాలు ఉంటాయి అందులో భావాలు కోకొల్లలు ఏటిని నిట్టనిలువునా నిలబెడతా/నిప్పును నీతితో మండిస్తా/ ఇది సాధ్యం కాదు కాని కవి ఇలా చెప్పడంలో ఉన్న అంతర్యం మన చుట్టూ జరిగే పరిణామాల గురించి చెప్పడానికి వాడినదే. నేను అది చేస్తా ఇది చేస్తా అని గొప్పలు చెప్పడమే కాని ఆ పనిని ఆచరణలో పెట్టరు. అలాంటి వారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదని చెప్పడమే కవి ఉద్దేశం అయ్యుండచ్చు.
మనిషి గురించి చెప్తూ ‘మానవ’ అనే కవితలో ‘తీగల మీద పువ్వుల్లా/ఒంటిమీద గాయాలని, గాధలని మోసుకొని తిరుగుతుంటాము’. అవును మనిషి నిరంతరం గాయాన్ని మోస్తూ ఉంటాడు. అసలు గాయాన్ని మోయని మనిషి ఉండడు. గాయాన్ని మోయలేని వాడు జీవితాన్ని ఎలా నడపగలడు. గాయం అనుభ వం, గాయం జ్ఞాపకం, గాయం బతుకు నిర్మాణానికి అవసరమైన వస్తువు. అందుకే గాయాలను మోస్తూ ఉండాలి.
ఇదే కవితలో మనుషులు తమ చరిత్రను మారుస్తారని, పరలోకాన్ని సైతం చిత్రించగలరని చెప్పడం జరిగింది. అవును మనిషి తన అవసరం కోసం, అవకాశం కోసం చరిత్రను మారుస్తాడు. అలాగే చరిత్రలో ఎప్పుడు ఏదీ అవసరమో దానిని ఉపయోగించుకుంటాడు. చెప్పిన విషయం యొక్క అర్థాలు మార్చేసి వాడుకుంటాడు. మనిషి పచ్చి అవకాశవాది చరిత్రనైన, పురాణమైన అందులో నుండి పుట్టిందే అని నా అభిప్రాయం.
‘కాలగణన’ అనే కవితలోని వాక్యాన్ని పరిశీలిస్తే ఎన్ని జన్మలయిందో అద్దంలో రోజూ కనిపించే నా ముఖం లోపలికి తొంగి చూసి అంటారు. గంటల తరబడి అద్దంలో చూసుకుంటున్నాము కదా అని అనుకుంటున్నారేమో! కవి వాక్యాన్ని అర్థం చేసుకోండి ఎప్పుడైనా మీలో మీరు ఉన్నారా? మీ కోసం మీరు జీవిస్తున్నారా? దేనికోసం ఈ పరుగులు, మీకు మీరే భారమైన చోట, మీలో మీరు లేని చోట, శారీరకంగా తప్ప మానసికంగా లేని నువ్వు ఉండి ప్రయోజనం ఏముంది. అదే విషయాన్నే దేవిప్రియ గారు చెప్పదల్చుకున్నది. అన్ని ఉండటమంటే అందులో జీవితం ఉండాలి. జీతంలో మీరు సంపూర్తిగా ఉండాలి. అలా కాకుండా కృత్రిమంగా జీవిస్తే ఎలా? బతకాలి కాబట్టి ఎదో బాధ్యతల, అత్యవసరంలా బతకడం కాదు. తృప్తిగా మీలో మీరు బతుకుతూ అందరిలో బతకాలి అప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది.
దేవిప్రియ గారి కవిత్వాన్ని, కవితా వస్తువులను గమనించినప్పుడు ఇతర కవులతో పోలిస్తే వీరి శైలిలో చాలా వైవిధ్యం కనపడుతుంది. ఎలాంటి బెరుకు లేకుండా కవిత్వాన్ని రాసినప్పుడే రీడర్ కి అసలు విషయాన్ని చెప్పగలము. అలా చెప్పడంలో దేవిప్రియ గారు మొదటి స్థానంలో ఉంటారు. వీరి కవిత్వంలో వ్యంగ్యం, విప్లవం, చైతన్యం, నాస్తికత, వస్తు వైవిధ్యం, సాధారణమైన అల్లిక విశేషమైన భావం, ఎత్తిపొడుపు కనిపించాయి. మాలాంటి యువకవులు వీరి కవిత్వం నుండి ధైర్యం, శిల్పం తప్పకుండ నేర్చుకోవాల్సిన అవసరమున్నది. వచన కవులు ఎందరో ఉంటారు కాని తమదైన ప్రత్యేకమైన శైలిని నిర్మించుకున్నవారిని రీడర్స్ హత్తుకుంటారు. అందుకే మన దేవిప్రియ గారు కూడా ప్రజాకవుల సరసన నిలబడ్డారు. గొప్ప కవిత్వాన్ని అందించిన దేవిప్రియ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ…

జాని తక్కెడశిల 9491977190

Article about the Text poem

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: