ప్రచురణల్లో మేటి తె.సా. అకాడమీ

  తెలుగునాట అకాడమీలను రద్దు చేసిన దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ సాహిత్య అకాడమీ తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసే ప్రయత్నంలో రెండేళ్ల నుండి తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగానే 50 గ్రంథాలను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన వివిధ గ్రంథాలను ప్రధానంగా 5 రకాలుగా విభజించవచ్చు. 1. చరిత్ర, భాష, సంస్కృతి, సాహిత్య చరిత్ర 2. వివిధ ప్రక్రియలు, వాటి వికాసం 3. సాహితీవేత్తలు సృజించిన సాహిత్యం […] The post ప్రచురణల్లో మేటి తె.సా. అకాడమీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలుగునాట అకాడమీలను రద్దు చేసిన దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ సాహిత్య అకాడమీ తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసే ప్రయత్నంలో రెండేళ్ల నుండి తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగానే 50 గ్రంథాలను వెలుగులోకి తెచ్చింది.

తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన వివిధ గ్రంథాలను ప్రధానంగా 5 రకాలుగా విభజించవచ్చు. 1. చరిత్ర, భాష, సంస్కృతి, సాహిత్య చరిత్ర 2. వివిధ ప్రక్రియలు, వాటి వికాసం 3. సాహితీవేత్తలు సృజించిన సాహిత్యం 4. స్వీయచరిత్రలు, జీవిత చరిత్రలు. 5. ఇతరాలు. ఈ పై ఐదు విభాగాల్లో మొదటిదైన భాష, సంస్కృతి, సాహిత్య చరిత్ర రచన అత్యంత కీలకమైంది. తెలంగాణ ప్రాంత ప్రాచీన సాహిత్య చరిత్రను వెలికితీయడం సులువైనదేమీ కాదు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు తర్వాత సాహిత్య పరిశోధనకు, అధ్యయనానికి ఆస్కారం కల్పిస్తూ తొట్టతొలిసారిగా ‘శాతవాహనుల నుండి కాకతీయుల దాకా (భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి)’ అనే అంశంపై 2017 అక్టోబరు 27, 28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించింది. వారధి అసోసియేషన్, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సహకారంతో నిర్వహించిన ఆ సదస్సులో వక్తలు సమర్పించిన పరిశోధనాపత్రాలతో ‘శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ (చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం)’ అనే గ్రంథాన్ని అకాడమీ వెలువరించింది.

‘తెలంగాణలో శాతవాహనుల వారసత్వం’ అనే మరో గ్రంథం కూడా ఈ విభాగం కింద ప్రముఖంగా చెప్పుకోదగింది. వివిధ ప్రాంతాల్లో తెలుగు మూలాలను పరిశోధనాత్మకంగా వెల్లడించిన గ్రంథం ‘గోండ్వానా లాండ్ ఎంత ప్రాచీనమైనదో తెలుగు కూడా అంతే ప్రాచీనమైనది’. తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ జిల్లాలవారీగా సాహిత్య చరిత్రను వెలువరించే బృహత్కార్యాన్ని కూడా సాహిత్య అకాడమీ చేపట్టింది. ‘మూడు తరాల తెలంగాణ కథ’ను వెలువరించింది. 1874లో జన్మించిన భండారు అచ్చమాంబ మొదలుకొని 1986లో పుట్టిన వంశీధర్ రెడ్డి వరకు 70 మంది కథకులు రాసిన కథలు ఈ కథాసంపుటిలో ఉన్నాయి. ఈ సంపుటికి డా.నందిని సిధారెడ్డి గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు. ప్రసిద్ధ రచయిత కాసుల ప్రతాపరెడ్డి రాసిన ‘తెలంగాణ నవలా వికాసం’ గ్రంథాన్ని కూడా సాహిత్య అకాడమీ ప్రచురించింది. బూర్గుల రామకిషన్ రావు, సురవరం ప్రతాపరెడ్డిలతో సహా పలువురు రాసిన భావకవితలను ‘తెలంగాణలో భావ కవితా వికాసం’ పేరిట ప్రచురించింది అకాడమీ.

ఈ గ్రంథానికి సామిడి జగన్ రెడ్డి సంపాదకత్వం వహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో వెలువడ్డ కవిత్వాన్ని విశ్లేషిస్తూ డా.వెల్దండి శ్రీధర్ రాసిన ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం’ గ్రంథాన్ని అకాడమీ వెలువరించింది. తెలంగాణలో వెలువడ్డ పద్యకవిత్వంపై డా.గండ్ర లక్ష్మణరావు రాసిన విశ్లేషణాత్మక గ్రంథం ‘తెలంగాణ పద్య కవితావైభవం’. తెలంగాణ సినీగేయ రచయితలు రాసిన సినీగేయాలతో పాటు వారి జీవిత విశేషాలను పేర్కొంటూ డా. కందికొండ రాసిన గ్రంథం ‘తెలంగాణ సినీ గేయ వైభవం’. ఈ రెండు గ్రంథాలను సాహిత్య అకాడమీ ప్రచురించింది. మూడవ విభాగమైన సాహితీవేత్తలు సృజించిన సాహిత్యంలో ప్రధానంగా చెప్పుకోదగింది డా.సి.నారాయణరెడ్డి రాసిన ‘మందార మకరందాలు’. 2002 నుండి త్రైమాసిక పత్రికగా వెలువడ్డ ‘సోయి’ ఆ పత్రికలో వెలువడ్డ కొన్ని వ్యాసాలను ఎంపిక చేసి, ‘తొలినాళ్ళ సోయి’ పేరుతో అకాడమీ ప్రచురించింది. నందగిరి ఇందిరాదేవి రాసిన కథలను ‘నందగిరి ఇందిరాదేవి కథలు’గా అకాడమీ ప్రచురించింది.

లోకమలహరి రాసిన ‘జెగ్గని యిద్దె’, ‘సంఘము’ నవలలను డా.సరోజ వింజామర సంపాదకత్వంలో ప్రచురించింది. అడ్లూరి అయోధ్య రామకవి రాసిన ‘తెలంగాణ మంటల్లో’ కథలను, ‘హైదరాబాదుపై పోలీసు చర్యలు’ అనే బుర్రకథను వెలువరించింది. నాటి ఉపముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి పేర్కొన్నట్టు ‘మాదిరాజు రామకోటీశ్వరరావు స్వీయ చరిత్ర కేవలం ఒక వ్యక్తి చరిత్రయే కాక, అభ్యుదయ తెలంగాణ సమగ్ర చరిత్ర’. ప్రజలకు అందుబాటులో లేని ఆ స్వీయచరిత్రను ప్రచురించే బాధ్యతలను సాహిత్య అకాడమీ తీసుకుని, విజయవంతంగా పూర్తి చేసింది. పూర్వ సాహిత్యాన్ని నేటి సమాజానికి అందజేసే కార్యాన్ని నిరాఘాటంగా నిర్వహిస్తోంది తెలంగాణ సాహిత్య అకాడమీ. తద్వారా తెలంగాణ సాహిత్యాన్ని పదిలంగా పరిరక్షిస్తూ, వ్యాప్తి చేస్తోంది.

                                                                                            – డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
Article about Telangana Sahitya Akademi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రచురణల్లో మేటి తె.సా. అకాడమీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: