అచ్చమైన తెలంగాణ కవి

Article about Telangana poet Dasarathi

తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన ప్రాతఃస్మరణీయుడు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ‘ అని సగర్వంగా చాటిన మహాకవి. నాటి నిజామును పిశాచిగా వర్ణిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని మేల్కొల్పిన కలం వీరుడు. రచనల్లో నవరసాలను పలికించి తెలుగు జన హృదయాలను గెలుచుకున్న ధీశాలి.ఉర్దూ తన సాహిత్య మాతృ భాష అన్న జనాబ్ దాశరథి. సినిమా ప్రపంచంలో లాజవాబ్ దాశరధి. పిల్లల కోసం పల్లవులు రాశాడు. పెద్దల కోసం వ్యాసాలు రాశాడు. అతని కాలం నవలను, నాటకాలను కల కన్నది. తెలంగాణలో ఎందరో కవులు ఉన్నప్పటికీ, పీడిత ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి గొంతెత్తి చెప్పగలిగిన మహాకవి దాశరథి. తెలంగాణను తన కలం బలంతో ఉర్రూతలూగించిన వైతాళికుడు. తన పద్యాలతో గర్జించి కవిత్వాన్ని అగ్ని దారలుగా కురిపించిన అచ్చమైన మధురకవి దాశరథి కృష్ణమాచార్య. ప్రాచీన, ఆధునిక కాల వారధిగా పేరుగాంచిన దాశరథి తెలంగాణ వారికే కాక, తెలుగు ప్రజలందరి సంపదగా పేర్కొనవచ్చును. ‘ఏను సవయముగా కవితను వరించలేదు, తానే వరియించె కవితల రాణి నన్ను‘ అని ధైర్యంగా అన్న మహా కవి. ‘ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ‘ అని గర్వంగా ప్రకటించిన అసలుసిసలైన తెలంగాణవాది.

దాశరధి కృష్ణమాచార్య ఒక మధ్యతరగతి వైష్ణవ కుటుంబంలో 1925 జూలై 22 న వరంగల్ జిల్లా మానుకోట తాలూకా లోని చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. వెంకటాచార్యులు, వెంకటమ్మ దాశరధి తల్లిదండ్రులు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన వీరు అనేక భాషలలో నిష్ణాతుడు గా పేరు గడించాడు. ఖమ్మం లో చదువుకునే రోజుల్లో ఆంధ్ర మహాసభ కార్యకర్తగా పని చేశాడు. కందుకూరి, రఘుపతి వెంకటరత్నం, గాంధీజీ, కారల్ మారక్స్ వంటి ఎందరో మహనీయుల ప్రభావం ఇతనిపై చూపింది. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చివరి ఘట్టాల అనుభవముతోపాటు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల అనుభవాలను గడించిన దాశరధి తన రక్తంలో అనువనువున తెలంగాణ వాదాన్ని జీర్ణించుకుండు. అసలు వీరి కుటుంబమే సాహిత్య సేవకు అంకితం అయ్యింది. దాశరధి రంగాచార్యులు వీరికి స్వయానా తమ్ముడు. ఆగర్భ శ్రీమంతునికి అనాధ కి మధ్య చిరకాలం నుండి జరుగుచున్న సంఘర్షణయే దాశరథీకి కవితా వస్తువు అయింది. ఆనాటి ప్రజల కష్టాలు దాశరధిని కాల రుద్రుని చేసెను. 1949లో దాశరథి మొట్ట మొదటి పుస్తకం ‘అగ్నిధార‘ నల్గొండ జిల్లా చండూరు లో సాహితీ మేఖల పక్షాన అచ్చు కాబడి అదే జిల్లాకు చెందిన గొప్ప రచయిత వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితమిచ్చి ధన్యులు అయినట్లు దాశరథి స్వయంగా చెప్పాడు. అగ్నిధార తో పాటు రుద్రవీణ, మహాంధ్రోదయం, అమృతాభిషేకం, దాశరథి శతకం, తిమిరంతో సమరం, నవ మంజరి వంటి అనేక పుస్తకాలు దాశరధి కలం నుండి జాలువారినవే. ఇతని కవితల్లో తెలుగుద నం ఉట్టిపడుతుంది.‘ ఏది కాకతి, ఎవరు రుద్ర మ, ఎవరు రాయలు, ఎవరు సింగన? అన్నీ నేనే, అంతా నేనే, వెలుగు నేనే, తెలుగు నేనే‘ అంటూ ఆవేశంతో గర్జించిన సింహం మన దాశరధి.

నిజాం నిరంకుశత్వానికి, రజాకార్ల మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితం అనుభవించిన స్వాతంత్య్ర సమర యోధుడాయన. తన కలాన్ని గళాన్ని ప్రజల విముక్తి కోసం సమస్త మానవాళి శ్రేయస్సు కోసం అంకితం చేసిన మహనీయుడు. ఆయన రచించిన ‘అగ్నిధార‘ వెయ్యి జలపాతాల వేగంతో సాగిపోయింది. ఇంకా ఆయన కలం నుండి పుట్టిన ‘రుద్రవీణ‘ లోని విప్లవ గీతాలు మరువలేనివి. దాశరధి రాసిన కవిత్వం లో మోదుగు పూలు శృంగార వీర రసాలుగా పేరుగాంచినవి. 1944లో ఓరుగల్లు కోటలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కవి సమ్మేళనం వేదిక పందిళ్లను రజాకారు మతోన్మాదులు నిప్పు పెట్టి కాల్చివేశారు. సభికులపై రజాకార్ దుండగులు రాళ్లు విసిరారు. అయినప్పటికీ ఏమాత్రం బెదరకుండా సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు వంటి వారు ధైర్యంగా నిలిచి కవి సమ్మేళనం జరగాల్సిందేనని నిర్ణయించారు. అట్లా కూలిన పందిళ్ళ పైనే దాశరధి తన మొదటి పద్యం వినిపించి కవనంతో సమర శంఖారావం పూరించాడు. 1948లో వరంగల్ జిల్లా జైలు నుండి దాశరధిని నిజాంబాద్ జైలుకు ఆనాటి నిజాం ప్రభుత్వం తరలించింది. అయినా ఏమాత్రము బెణకకుండా జైలు లోపల కలం కాగితం లేకున్నా బొగ్గు తోనే జనచైతన్యం గావించే కవితలు రాయకుండా ఉండలేదు. జైలుగోడల మీద బొగ్గు తోనే‘ ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ‘  అంటూ రాసి, ఒక రాజ్యంలో ఆ రాజు కే ఎదురు తిరిగిన కవులలో పోతన తర్వాత దాశరథి కే స్థానం దక్కింది. జైలు గోడల మధ్యనే‘ మా నిజాం రాజు జన్మజన్మల బూజు, ముసలి నక్క కు రాజరికము దక్కునే‘ అని నిర్భయంగా గర్జించిండు.

అదేవిధంగా సాహిత్యరంగంలో పద్యం, గద్యం, గేయం, సినీ గీతం ఇలా ఏది రాసినా పాఠకుల హృదయాలను రంజింప చేసిన ధీరోదాత్తుడు. అనేక ప్రక్రియల్లో తన రచనా శైలిని చూపడం జరిగింది. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు ఇలా ఎన్నో రాశాడు. 1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో ‘ ఖుషి ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ‘ అనే పాట రాసి ఆయన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇలా దాగుడుమూతలు, శ్రీకృష్ణ తులాభారం, ఆత్మగౌరవం, పూలరంగడు, నిండు మనసులు, రంగులరాట్నం వంటి సినిమాలకు వందలాది పాటలు రాశాడు. ప్రాచీన, నవీన కవిత్వాలకు వారధిగా నిలిచాడు. దాశరథి ప్రసంగాలు సునిశిత చతురోక్తులతో, అనర్గళంగా సాగిపోతూ వినసొంపుగా ఉండేవి. 1967లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు తో పాటు, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందినాడు. వీటితో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆగ్రా విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్లను కూడా పొందడం జరిగింది. 1977 నుండి1984 వరకు దాశరధి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా పనిచేశాడు. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్ గా, ఆకాశవాణి ప్రయోక్తగా వివిధ ఉద్యోగాలు చేశాడు. ఆయన మహాకవి. సాహితీవేత్త. గొప్ప ఉపన్యాసకుడు. దేశభక్తుడు. ఈ విధంగా దాశరథి కృష్ణమాచార్య ఎంతో పేరు గడించిన ప్పటికీ, చివరి జీవితంలో కొంత ఇబ్బంది పడ్డాడు. తన తమ్ముడు సాహితీవేత్త అయిన శ్రీ రంగాచార్య మాటల్లో చెప్పాలంటే….‘మా అన్నయ్య దాశరథి కృష్ణమాచార్య కపటమెరుగని కోవిదుడు. రాజకీయ ద్రోహానికి కొంత బలి అయినా, తనకు ద్రోహం చేసిన వారు కూడా బలి కావలసి వచ్చింది‘ అని తన అన్న గురించి ఆవేదన వెలిబుచ్చాడు. చివరకు 1987 నవంబర్ 5వ తారీఖున చనిపోయారు. ఇవాళ దాశరధి కృష్ణమాచార్యులు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ, వారి రచనలు నిత్యనూతనం కలిగిస్తూ భావితరాలకు మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఆయన ఎప్పటికీ తెలంగాణ వారి గుండెల్లో స్వచ్ఛమైన కవిగా నిలిచిపోయిన వ్యక్తి. దాశరథి తెలంగాణ కే కాదు, యావత్ తెలుగు సాహితీ ప్రపంచంలో ఎల్లవేళలా నిలిచి ఉండే మహనీయుడు.

‘కవితాశరథి’

కవనం కదనం
జమిలిగా పెనవేసుకొని
గేయం, గాయం
ఒక్కటిగా ముడివేసుకొని
రక్తచందనం పూసుకున్న సూర్యుడై
రజాకారు దగాకోరులకు భాస్వరమై
తమస్సులొ తడిసిన తెలంగాణకు
తూరుపుకనుమల్లో పూసిన ఉషస్త్స్ర
సమతామమతల సాదృశ్యమై వెలసిన
మహాంధ్రోదయ అగ్నిధార దాశరథి

నిజాము దౌర్జన్యాలను, దాష్టికాలను
కవనాయుధంతో దునుమాడి
గాలీబు గజళ్ళను, షాయరీలను
పసందుగా తెనుగాడి
తెలుగుప్రజల హృదయాలలో
అభ్యుదయ కవితాశరథిగా
నవకవన జలధిగా ఆసీనుడైన
కళాప్రపూర్ణ రుద్రవీణ దాశరథి

మానవకల్యాణం కోసం కలమెత్తి
ధనవంతుల దుర్మార్గాలపై గళమెత్తి
తెలగాణ నిగళాలు తెగగొట్టి
తెలుగుతోటలో కవితాసుమాల మాలగట్టి
మహాంధ్రకై మూడుకోటుల తమ్ముల కూడగట్టి
కోటి రతనాల వీణను సవరించిన కవితాశరథి దాశరథి.

డా.చింతల రాకేశ్ భవాని
                                                                                                    9246607551

(జూలై 22, దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా…)

Article about Telangana poet Dasarathi

The post అచ్చమైన తెలంగాణ కవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.