ఇది వికాస ‘గీతాంజలి’!

cm kcr

 

మన నిత్య వ్యవహారంలో జంట పదాలు కొన్ని ఉన్నాయి. ఇల్లువాకిలి, పొలం పుట్ర, నింగి-నేల, రేయిపగలు, సూర్యచంద్రులు, రామలక్ష్మణులు, పనిపాట… ఇంకా ఎన్నో…! ఇలాంటి జంట పదాలన్నింటిలో మానవ జీవన పరిణామాన్ని నడిపించి, గెలిపించి, మురిపించి, మరిపించి, మెప్పించిన జంటపదం, ఒకవైపు మానవ శ్రమకు మరోవైపు మానవ సృజనకు నిలువెత్తు సంతకంలా నిలిచిన జంటపదం ‘పనీపాట’!
‘పని’ మనిషిలోని శక్తిసామర్థ్యాలను, ఉత్పాదక నైపుణ్యాన్ని సష్టికి ప్రతి సష్టి చేయ గలిగిన ప్రతిభను సానబెట్టి, నిగ్గుతేల్చిన విశిష్ట లక్షణం! అయితే, ‘పాట’ మనిషిలోని రాగ జీవనానికి, లయాత్మకతకు, సజనాత్మక వ్యాసంగానికి, విభిన్న ఆలోచనాధారను మేళవించి, అనుభవాన్ని అనుభూతుల్ని రంగరించి వాక్యాల దేహాల నిండా సంగీతాన్ని సమకూర్చిన వైవిధ్య లక్షణం.
అందుకే, పనితో పాటే పాట పుట్టింది…! పాటను అల్లుకుని పని మరింత మెరుగు పడింది. అలాంటి పనికి పుట్టినిల్లు తెలంగాణా!, అలాంటి పాటకు పట్టుగొమ్మ తెలంగాణా!, శతాబ్దాల కాలం నుండి పనీ పాటలు చెట్టా పట్టాలేసుకుని సంచరిస్తున్న పుణ్య భూమి తెలంగాణా!, అందుకే, మన పల్లెల్లో గ్రామీణ జీవనంలో తుమ్మెద పాటలు, దంపుడు పాటలు, ఉయ్యాల పాటలతో పాటు పండుగ పాటలు, బతుకమ్మ పాటలు జానపదాలుగా, జనజీవన నదాలుగా అనాది కాలం నుంచీ ప్రవహిస్తున్నాయి. జానపదులు మట్టిని, మనిషిని, నింగినీ, నేలను, ప్రకతిని, పిట్టను, చెట్టును, అడవిని మానవ బంధాలను, తమ పాటల్లో కీర్తించుకున్నారు.
సంబరాన్ని, దుఃఖాన్ని, ద్వేషాన్ని తిరుగుబాటును పోరు బాటను, త్యాగాన్ని వీరత్వాన్ని తమ పాటల్లో వల పోసుకున్నారు. తమ మాటలనే పాటలుగా మలిచి, వాటికి రాగాల రెక్కలు తొడిగి, ఊరూరా వాటిని ప్రదర్శించారు. వాడవాడలా వాటిని ఆలపించారు. అయితే పాట నిశ్చల కాదు…. పాట నిష్క్రియ కాదు…. పాట సోమరి కాదు…. పాట పిరికిది కాదు…! , అందుకే, పాటతో చేయి కలిపిన ప్రతి గాలీ పిడికిలి బిగించింది!, పాటతో పాటు అల్లుకుపోయిన ప్రతి చెట్టూ నిటారుగా నిలబడింది. పాటతో ప్రవహించిన నది ఉప్పెనై ఎగిసింది. పాటతో మమేకమైన మట్టి యుద్ధాన్ని మొదలెట్టింది. పాటతో పునీతమైన ఆకాశం ఉరుములుమెరుపులై గర్జించింది. పాటతో సంలీనమైన అగ్ని, జ్వాలలై రగిలింది.
ఇది నిజం! ఇదే సత్యం!! అని చెప్పడానికి చరిత్రలో ఎన్నెన్నో ఉదంతాలు ఉన్నాయి. భారత స్వాతంత్య్ర సమరం దానికి నిజమైన తార్కాణం! తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం దానికి సత్యమైన దష్టాంతం!!
ప్రపంచ దేశాలు ప్రజా గీతాలు
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలోని దేశాలన్నీ ప్రాచీన జానపద జీవన విధానాన్ని, ప్రజా పోరాట నేపథ్యాన్ని కలిగి ఉన్నవే. అణిచివేతకు, దోపిడీకి, పరాయి పాలనలో వివక్షకు గురై కునారిల్లిన సమాజాలే! అందుకే ఆఫ్రికాలో, దక్షిణ అమెరికా దేశాలలో బలమైన ప్రజా పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. ఆ సందర్భంలో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఆయా దేశాల సామాన్య ప్రజల వ్యవహార భాషలో, వాడుక పదాలతో వేలాది పాటలు ప్రాణం పోసుకున్నాయి. ఆఖరికి ఆధిపత్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసిన అమెరికా, ఇంగ్లండ్‌లలో కూడా ప్రజా గీతాలు, జానపద పాటలు ప్రచారంలోకి వచ్చాయి. అలాంటి వాటిలో జిలాన్ థామస్ రాసిన గీతాలు, పీట్ సీగర్స్, బాబ్ డిలాన్ పాటలు ప్రముఖంగా ప్రస్తావించదగినవి. అమెరికాలో ఆదిమ జాతుల హక్కుల గురించి గొంతెత్తిన పీట్ సీగర్స్ (19192014) వెస్టర్న్ కల్చర్‌లో మునిగితేలుతున్న సమాజానికి, తాను చనిపోయేంత వరకూ జానపద పాటలనే పాడి వినిపించాడు. ఆయన రాసిన ‘we shall overcome’ అనే పాట ప్రపంచ భాషలన్నింటిలోకి అనువాదమైంది. ఆఖరుకు హిందీలో కూడా ‘హవ్‌ు ెంగే కావ్‌ు యాబ్ ఏక్ దిన్’ అనే పాటగా 1970 దశకంలో ఆత్మవిశ్వాసానికి సంకేత గీతంగా ప్రజాదరణ సాధించింది.
అలాగే, జానపద భాషను, బాణీలను తన స్వరాలకు ఆధారంగా మలుచుకున్న బాబ్ డిలాన్‌కు 2016 సంవత్సరపు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఈ ఉదాహరణలు ప్రపంచ స్థాయిలో ప్రజా గీతాలకు జానపద పాటలకు నేటికీ ఆదరణ ఉందనే విషయాన్ని మరోసారి రుజువు చేసేవే!
పాటలు వర్గీకరణ
మనసులోని భావాలను అర్థవంతమైన వాక్యాలుగా మార్చి వాటికి లయను, రాగాన్ని, సంగీతాన్ని జోడించి ఆలపించేదే “పాట”! అంటే పాటలో సాహిత్యం సంగీతం రెండూ దేహం ప్రాణంలాగా కలిసి ఉంటాయి. కాగా సందర్భం, నేపధ్యం, వస్తువు పాటలోని సాహిత్య తీరు తెన్నులకు, సంగీతంలోని స్వరాలకు ప్రాతిపదికగా నిలుస్తాయి. సాహిత్య సంగీతాలను నిర్ధారించేవి, నిర్ణయించేవి కూడా అవే. కాగా ‘పాట’ను స్థూలంగా ఆయా పాటల వస్తువు, మాధ్యమాల ఆధారంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు :
1. శాస్త్రీయ బాణీ పాటలు / 2. సినిమా సంగీతం పాటలు / 3. సంప్రదాయ జానపద పాటలు
ఎ. పొలం పనుల పాటలు / బి. పెళ్ళి పాటలు, బారసాల పాటలు
సి. పండుగల పాటలు / డి. పల్లె పాటలు
ఇ. ఉయ్యాల పాటలు, తుమ్మెద పాటలు, జాజిరి పాటలు మొ॥
4. సమకాలీన జానపద పాటలు
ఎ. పుణ్యక్షేత్రాల / దేవాలయాల పాటలు / బి.పండుగల పాటలు
సి. ఉద్యమ పాటలు / డి. రాజకీయ పాటలు / ఇ. సామాజిక చైతన్య పాటలు / ఎఫ్. ప్రభుత్వ పథకాల సంక్షేమ పాటలు / జి. జానపద భక్తి పాటలు / హెచ్. ప్రత్యేక సందర్భాల పాటలు (రాష్ట్ర అవతరణ ఉత్సవం, ప్రముఖుల జన్మదినోత్సవం, జయంతి, నివాళి, స్మృతి పాటలు)
శాస్త్రీయ బాణీ పాటలు
పాటల పరిణామ క్రమంలో తొలిపాదం జానపదానిదే! ఆ తర్వాతే పాట పాండిత్యాన్ని, శాస్త్రీయతను సంతరించుకుని శాస్త్రీయ సంగీతంగా వినుతికెక్కింది. ఉత్తర భారతీయ శాస్త్రీయ బాణీలన్నీ ‘హిందుస్థానీ సంగీతం’ గానూ, దక్షణ భారతీయ శాస్త్రీయ బాణీలన్నీ ‘కర్నాటక సంగీతం’గా పేరొందాయి. ఆయా సంగీత స్వరాలు, రాగాలు, రీతులలో లిఖిత రూపంలో సమకూర్చిన పాటలే ‘శాస్త్రీయ గీతాలు’గా ఆదరణ పొందాయి. కర్నాటక సంగీతత్రయం ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, పురందరదాసు, క్షేత్రయ్య, అన్నమాచార్య, రామదాసు, స్వాతి తిరునాళ్ మొదలగు వారు రాసిన కీర్తనలు, జావళీలు, పదాలు ఈ కోవలోనివి. అలాగే రాకమచర్ల, హనుమద్దాసు, దున్న ఇద్దాసు వంటి వారు రాసిన భజన కీర్తనలు కూడా ఈ సంప్రదాయానివే!
సినిమా సంగీతం పాటలు
1913లో మన దేశంలో సినిమా నిర్మాణం దాదాసాహెబ్ ఫాల్కే కృషితో ప్రారంభమై, ఆ తర్వాత 1931లో ‘ఆలం అరా’తో టాకీ సినిమాలు మొదలైన తర్వాత సినిమా సంగీత గీతాలు వాడుకలోకి వచ్చాయి. తెలుగులో అదే సంవత్సరం విడుదలైన ‘భక్త ప్రహ్లాద’ సినిమాతో సినీ పాటల ప్రస్థానం ప్రారంభం అయింది. తెలంగాణ ప్రాంత కవి చందాల కేశవదాసు ఈ సినిమాలో పాటలు రాసి తొలి తెలుగు సినీ గీత రచయితగా కీర్తి సంపాదించినారు. అప్పట్నించీ ఇప్పటి వరకూ తెలుగు సినీ రంగం 89 ఏళ్ళ కాలంలో దాదాపు 40 వేలకు పైగా పాటలను సృష్టించింది. క్రమంగా జనసామాన్యంలో అంతకు ముందున్న జానపద గీతాలు, శాస్త్రీయ కీర్తనల కన్నా సినీ పాటలు బహుళ ప్రజాదరణను సాధించి, పాటలు అంటే సినిమా పాటలే అనేంతగా ముద్ర వేసాయి. మరో వైపున ప్రజలలో వాడుకలో ఉండి అత్యంత ఆదరణ పొందిన జానపద పాటలు కూడా, ఆ తర్వాత సినిమా గీతాలుగా కొన్ని మార్పులతో మళ్ళీ వాడుకలోకి వచ్చాయి.
సంప్రదాయ జానపద పాటలు
తెలుగులో సినిమా పాటలకు వందేళ్ళ లోపు చరిత్ర మాత్రమే ఉంది. శాస్త్రీయ పాటలకు దాదాపు 6,7 శతాబ్దాల చరిత్ర మాత్రమే ఉంది. కానీ జానపదాలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. మానవ జీవన అనుభవాల సారమంతా జానపదంగా ‘శ్రుత సంప్రదాయం’లో ఒక తరం నుంచి మరో తరానికి మౌఖికంగా అందించబడి, పరంపరానుగతంగా ప్రజల నిత్య జీవన వ్యవహారంలో అంతర్భాగంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి సంప్రదాయ జానపద పాటలు వ్యవసాయం పంటలు, పెళ్ళిల్లు, కుటుంబ వేడుకలు, ఆయా పండుగల సందర్భాను సారంగా వచ్చే పాటలుగా బహుముఖాలుగా విస్తరించాయి. పనిలో ఉన్నపుడు శ్రమ తెలియకుండా ఉండటానికి, వేడుకల సందర్భంలో సంబరాన్ని ద్విగుణీకృతం చేయడానికి ఈ పాటలు ఉపకరించాయి.
సమకాలీన జానపద పాటలు
సగటు ప్రజలలోకి, సామాన్య నిరక్షర జనంలోకి ప్రభావమానంగా, వేగంగా తీసుకు వెళ్ళగలిగే బాణీలు జానపద బాణీలే! ప్రజల భాషలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో, స్థానిక ప్రతీకలు సామెతలు పలుకుబడులతో కూడి ఉన్న ఈ పాటలు ప్రజాభిమానాన్ని సంపాదించినాయి. అందుకే ఆయా సందర్భాలలో వివిధ సంస్థలు, సమాజాలు, ప్రభుత్వాలు, వ్యక్తులు సమకాలీన అవసరాలు ఆశయాలకు అనుగుణంగా జానపద పాటలను రూపొందించి ప్రచారం చేసాయి. చేస్తున్నాయి.
సమకాలీన జానపద పాటల పరిణామం తెలంగాణ
తెలంగాణలో సమకాలీన జానపద పాటల తీరు తెన్నులను గమనిస్తే ఆశ్చర్య పోకుండా ఉండలేము. తెలంగాణ సమాజం మొదటి నుండీ ప్రజా కళలకు, ప్రజా కళా రూపాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడమే కాక, వాటిని అంతరించిపోకుండా కాపాడుకోవడంలో, పరిరక్షించుకోవడంలో కూడా అంతే పాత్రను పోషించింది. ఎన్ని ఆధునిక, నవీన రీతులు, పాశ్యాత్య సంగీతాలు, సినీ సంగీతం వంటివి ఎన్ని వచ్చినా జానపద గీతాల్ని వదులుకోలేదు.
అందుకే తెలంగాణలో సమకాలీన యుగంలో ముఖ్యంగా 1948 సాయుధ రైతాంగ పోరాటం సమయంలో పాట ఆయుధమై మెరిసింది. దోపిడీకి, అణిచివేతకు, వ్యతిరేకంగా ప్రజలలో గొప్ప తిరుగుబాటకు ప్రేరకమై నిలిచింది. అలాగే 1980 దశకంలో నక్సల్బరీ ఉద్యమ సమయంలో పాట జన జీవన నాడిగా గెలిచింది. ఇక, 2000వ సంవత్సరం నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమ సమయంలో జానపద పాట కొత్త చైతన్యపు చిగుళ్ళతో పల్లవించింది. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి పతాకమై ఎగిరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ భావనను, ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు, వివరించి, జాగృత పరిచి వారిలో ఏకత్వ స్ఫూర్తిని, పోరాట దీప్తిని వెలిగించింది. ఇక రసమయి బాలకిషన్ గారి ‘ధూంధాం’, ఇతర ప్రజా కళా సంఘాలు కూడా తోడై జానపద పాటకు శిఖరాగ్రస్థాయిని తీసుకొచ్చాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న జానపద గాయకులు, రచయితలు,సంగీతకారులు తమదైన శైలిలో ఆయా స్థానిక దేవాలయాల మహాత్మాల్ని వర్ణించే పాటలను, జానపద భక్తి పాటలను విస్తృతంగా సృజించినారు. ఉదా. యాదాద్రి, వేములవాడ, భద్రకాళి ఆలయాల మహిమలను, క్షేత్ర విశేషాలను వివరించే పాటలు.
అలాగే పండుగల సందర్భంలో ప్రత్యేక జానపద పాటలను కూడా సృష్టించారు. బోనాలు, బతుకమ్మ, వినాయకచవితి, దసరా, హోలీ వంటి పండుగల సందర్భంలో వచ్చిన జానపద పాటలు. ఈ పాటలు మొదట్లో వేదిక మీద, ఆ తర్వాత ఆడియో క్యాసెట్ల రూపంలో, ఆ తర్వాత సీడీలుగా, ప్రస్తుతం వీడియోలుగా, విజువల్ సాంగ్స్‌గా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ఇవే కాక సమాజంలో ఉండే దురాచారాలు వరకట్నం, మద్యపానం, నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు మొదలగు అంశాల పట్ల సరైన అవగాహన కోసం సామాజిక చైతన్య పాటలు జానపద శైలిలోనే విస్తృతంగా సృష్టించబడ్డాయి. అలాగే, ఎన్నికల సందర్భంలో ఆయా రాజకీయ పార్టీల ప్రచార అస్త్రాలుగా కూడా ఈ జానపద పాటలు పుట్టుకువచ్చాయి. ఇక, ప్రభుత్వం కూడా ఆయా ప్రజాప్రాధమ్యాలను అనుసరించి తమ పథకాలను ప్రచారం చేయడానికి, అవగాహన కల్పించడానికి, ఆయా సంక్షేమ పథకాల వినియోగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడానికి జానపద పాటలనే ఆశ్రయించింది. ఈ పంథా ఆయా కాలాలలో, వేర్వేరు సందర్భాలలో సత్ఫలితాలను కూడా ఇచ్చిం ది. ఇలా జానపద పాటలు ఎంత ప్రాచీనతను, చరిత్రను కలిగి ఉన్నామో, అంతకన్నా ఎక్కువ సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉండి, సామాన్య మానవుడికి ఇరుపక్కలా నిలబడి, నిరంతరం అతడ్ని జాగృతం చేసాయి.
తెలంగాణ సాంస్కృతిక సారథి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా జానపద పాట ప్రజలం దరిలో గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చింది. అదే చైతన్యాన్ని ఉద్యమానంతరం కూడా కొనసాగించాలనే లక్ష్యంతో ఒక విభిన్న, వినూత్న సంస్థను “సాంస్కృతిక సారధి” పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాటనే ఇంటిపేరుగా మార్చుకుని, పాటనే తమ కలల నిండా, తమ గళాలు పొంగగా పరవశించి, పరిమళించి పాడే ‘పాటన్న’లను, ‘పాటక్క’లను గౌరవించుకోవాలి అని తెలంగాణా ప్రభుత్వం భావించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మానస పుత్రికగా ప్రజా పాటకు పట్టాభిషేకం చేసేలా “తెలంగాణ సాంస్కతిక సారధి” జీవో ఎం.ఎస్. నెం. 6 ద్వారా 27112014 నాడు ఆవిర్భవించింది. 5 డిసెంబర్ 2014 నాడు శ్రీ రసమయి బాలకిషన్ గారిని సాంస్కృతిక సారథి అధ్యక్షులుగా ప్రభుత్వం నియమించింది. 550 మంది కళాకారులు అధికారికంగా 112015 నుండి బాధ్యతలు స్వీకరించారు. నిజానికి తెలంగాణ రాష్ర్ట అవతరణ ప్రజలందరికీ ఎలాంటి ఉద్విగ్న భరిత ఘట్టమో, ‘తెలంగాణ సాంస్కతిక సారథి’ ఏర్పాటు కూడా కళాకారులం దరికీ అంతే అత్మీయ సందర్భం. ఉద్యమకాలంలో తెలంగాణ ప్రజల కోసం, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం నిరంతరం తపించి పదాలకు పాదాలను, పాటలకు గళాలను అంకితం చేసిన కళాకారులకు నీరాజనంగా తెలంగాణ సాంస్కతిక సారథి అవతరించింది. ఉద్యమకాలంలో పాట ద్వారా ఏవిధంగానైతే ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారో, అదే పంథాలో రాష్ర్ట పునర్నిర్మాణ క్రమంలో కూడా ప్రజలలో అంతే జాగృతిని తీసుకురావాలనే సదాశయంతో తెలంగాణ సాంస్కతిక సారధి వ్యవస్థ ఏర్పాటైంది. గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ సాంస్కతిక సారధి కళాకారులు ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ, వికాస, విజ్ఞాన అవగాహన కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పం దించి వందలాది గీతాలను రాసి, రాగాలను కూర్చి, పాడారు… ఊరూరా తిరిగా రు… తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతర కాలంలో తెలుగులో సినిమా యేతర సంగీత గీత సాహిత్య సృష్టిలో అత్యధిక సంఖ్యాక పాటలను సృష్టించిన ఏకైక సంస్థ తెలంగాణ సాంస్కృతిక సారధి అని చెప్పాలి. వివిధ అంశాలపై దాదాపు 1000కి పైగా పాటలను సాంస్కృతిక సారధి లోని కవులు, గాయకులు, సంగీత కా రులు కలిసి రచించి గానం చేసి స్వరాలు సమకూర్చారు. ఆ లెక్కన అతిపెద్ద పాటల సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన సంస్థ తెలంగాణ సాంస్కృతిక సారధి. కాగా, తెలంగాణ సాంస్కృతిక సారధి ఈ గీతాల సాఫ్ట్‌వేర్‌ను ప్రధానంగా రెండు రూపాలలో అందించింది.
1. సీడీల రూపంలో : వివిధ ప్రభుత్వ పథకాలు, సందర్భాలను అనుసరించి ప్రత్యేక గీతాలను రచించి సంగీత స్వరాలను సమకూర్చి వాటిని రికార్డు చేసి సీడీల రూపంలో పూర్తిస్థాయిలో గీతాలుగా అందించింది. గీతాలకు శాశ్వత రికార్డును, డాక్యుమెంట్‌ను చేసింది. వాటిలో కొన్ని
1. బతుకమ్మ పాటలు 2015 / 2. బతుకమ్మ పాటలు 2016 / 3. గోదావరి పుష్కరాలు భక్తి గీతాలు / 4. చైతన్య గీతాలు ఆరోగ్య కుటుంబ సంక్షేమం
5. ప్రజాసంక్షేమ పథకాలు చైతన్య గీతాలు 2017 / 6. మిషన్ కాకతీయ
7. తెలంగాణకు హరితహారం / 8. స్వచ్ఛ హైదరాబాద్
2. ప్రచారంలో భాగంగా పాడే గీతాలు: ఆయా సందర్భాన్ని, ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు రాసి వివిధ వేదికల మీద గ్రామ గ్రామాన పాడిన పాటలు ఇవి. వేలాదిగా ఉన్న ఇలాంటి గీతాలలో కొన్నింటిని సమీకరించి పుస్తక రూపాన్ని ఇవ్వడం ద్వారా ఆ పాటలకు శాశ్వతత్వాన్నివ్వగలుగుతాము అని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాంస్కృతిక సారధి భావించింది.
3. డిజిటలైజ్ చేయడం : అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం జరిగింది. దీనికోసం ఎ) www.tssts.org పేరిట ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసాం. బి) తెలంగాణ సాంస్కృతిక సారధి పేరిట ప్రత్యేక యూట్యూబ్ చానెల్‌ను ఏర్పాటు చేసి, అందులో సాంస్కృతిక సారథి కార్యకలాపాలను, పాటలు, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా అందరికి అందుబాటులోకి తెచ్చాం. సి) సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ ద్వారా సాంస్కృతిక సారథి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ డిజిటల్ యువతకు కూడా దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాం.
పుస్తక రూపం
ఇలా, ప్రజా సాహితీ క్షేత్రంలో వందలాది పాటలను సాంస్కృతిక సారధి కళాకారులు సష్టించారు. ప్రజల మస్తిష్కాలలో ఆలోచనను రేకెత్తించారు. అలాంటి పాటలను ఏరి కూర్చి పుస్తకాలుగా ముద్రించడం ద్వారా ఆయా సందర్భానికి తగిన పాటలకు శాశ్వతత్వం, డాక్యుమెంటేషన్ జరుగుతుందని భావించడం జరిగింది. ఆ ఆలోచనలోంచే మొదటిసారి వందలాది పాటలలోంచి కొన్ని పాటలను ఎంపిక చేసి జూన్ 2017లో “బంగారు తెలంగాణ బాటలో…” పేరుతో ఒక పాట సంకలనాన్ని సాంస్కతిక సారథి ప్రచురించింది. ఇందులో మొత్తం 154 పాటలను (హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అవతరణ దినోత్సవం, వివిధ సంక్షేమ పథకాలు, స్వచ్ఛ హైదరాబాద్, గుడుంబా నిషేధం, అవినీతి అంతం, నగదు రహితం, మహిళాశక్తి, గ్రామజ్యోతి, అమరుల యాది లాంటి ప్రాధాన్య అంశాలపై) సంకలనం చేసాము. ఇప్పుడు మళ్లీ ఈ రెండున్నరేళ్ళ కాలంలో (జూలై 2017 నుండి డిసెంబర్ 2019 వరకు) సాంస్కృతిక సారధి సృష్టించిన వేలాది పాటలలోంచి ఎంపిక చేసిన 505 పాటలతో “సంక్షేమ స్వరాలు” పేరుతో మరో పుస్తకాన్ని మీ ముందుకు తెస్తుంది. ‘సంక్షేమ స్వరాలు’ తెలుగు గేయ / పాట సాహిత్య చరిత్రలోనేకాక, అన్ని ఇతర భారతీయ భాషలలోకెల్లా అతిపెద్ద సంకలనంగా భావిస్తున్నాను. ఆ మేరకు ఇది పాటల ప్రస్థానంలో ‘బృహత్ సంకలనం’ అనడంలో సందేహం లేదు. 505 పాటల సంకలనంగా రూపొందించిన ఈ గీతాల మహాసంకలనంలో.. రైతు బంధు, హరిత హారం, స్వచ్ఛ తెలంగాణ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, బడి బాట, మున్సిపల్ చట్టం, కంటి వెలుగు, రాష్ర్ట అవతరణ, కాళేశ్వర, సంక్షేమ తెలంగాణ వంటి ఎన్నెన్నో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల మీద, సమయోచితమైన చైతన్యాన్ని, అవగాహనను కలిగించే పాటలు రచించి గానం చేయడం విశేషం అని చెప్పాలి. ఈ పుస్తకం, ఉద్యమానంతర తెలంగాణ రాష్ర్ట ప్రగతి తీరుతెన్నులను, వివిధ అభివద్ధి సంక్షేమ పథకాల గురించిన సమాచారాన్ని విశేషాలను ప్రజలను ఆకట్టుకునే జానపదరీతిలో పాటల గుచ్ఛంగా రూపొందించింది.
తెలంగాణ సాంస్కృతిక సారధి 2015 నుండి 2019 వరకు గొప్ప పాటల సాఫ్ట్‌వేర్‌ను సృజనాత్మకంగా సృష్టించిదనే మాటకు, ఈ ‘సంక్షేమ స్వరాలు’ సంకలనం ‘పాటెత్తు’ నీరాజనంగా నిలిచిందనడంలో సందేహం లేదు. సాంస్కృతిక సారధి కళాకారులు సృష్టించిన వేలాది పాటలలో ఏరిన ముత్యాల వంటి పాటలను ఒక్క చోట చేర్చి ‘పాటల హారాన్ని’ అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము.
ఇలా తెలంగాణ సాంస్కతిక సారధిని స్థాపించడమే కాకుండా, నిరంతరం మాకందరికీ స్ఫూర్తి ప్రదాతగా ఉన్న మాన్య ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.సంస్కతి పట్ల అభిమానాన్ని, కళల పట్ల ఆదరణను కలిగి, మార్గదర్శిగా మమ్మల్ని నడిపిస్తున్న మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ఐఎఎస్(రి) గారికి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ సి. పార్ధసారధి ఐఎఎస్ గారికి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్ర వెంకటేశం ఐఎఎస్ గారికి ప్రత్యేక కతజ్ఞతలు. తెలంగాణ సాంస్కతిక సారధి కళాకారులకు, రచయితలకు, గాయకులకు ఈ పుస్తక ప్రచురణలో సహకరించిన అందరికీ వందనాలు తెలియజేస్తూ…                                                                                                                                        మామిడి హరికృష్ణ
                                                                                                 సభ్య కార్యదర్శి,
                                                                                                 తెలంగాణ సాంస్కతిక సారథి

Article about Telangana Literature

The post ఇది వికాస ‘గీతాంజలి’! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.