మూలాలను మరువని పసునూరి కవిత్వం

  సాహిత్యాన్ని ఎవరు ఎందుకోసం రచించినా, సాహిత్య రచనకు ఎవరు ఏ నిర్వచనం చెప్పినా అస్తిత్వవాదులకు మాత్రం సాహిత్యం ఒక వాస్తవ జీవన ఆవిష్కరణ, చరిత్రను తవ్వితీయటం వర్తమానాన్ని తరచి చూడటం తలమీద భారమై పోయిన వేలయేళ్లుగా మోస్తున్న తమది కాని చెత్త మూటలను దింపి తగులబెట్టడం ఇలాంటి వాళ్లే ఇవాళ సాహిత్యంలో తమదైన సొంతబతుకు చిత్రాన్ని పటంకట్టి ఆవిష్కరిస్తున్నారు. దళిత వాదం, తెలంగాణ వాదం, ముస్లిం వాదం ఇట్లా ప్రతి అస్తిత్వ రచయితా తమ సొంత […]

 

సాహిత్యాన్ని ఎవరు ఎందుకోసం రచించినా, సాహిత్య రచనకు ఎవరు ఏ నిర్వచనం చెప్పినా అస్తిత్వవాదులకు మాత్రం సాహిత్యం ఒక వాస్తవ జీవన ఆవిష్కరణ, చరిత్రను తవ్వితీయటం వర్తమానాన్ని తరచి చూడటం తలమీద భారమై పోయిన వేలయేళ్లుగా మోస్తున్న తమది కాని చెత్త మూటలను దింపి తగులబెట్టడం ఇలాంటి వాళ్లే ఇవాళ సాహిత్యంలో తమదైన సొంతబతుకు చిత్రాన్ని పటంకట్టి ఆవిష్కరిస్తున్నారు.
దళిత వాదం, తెలంగాణ వాదం, ముస్లిం వాదం ఇట్లా ప్రతి అస్తిత్వ రచయితా తమ సొంత కళ్లతో గతంలోకి తొంగి చూస్తున్నారు. తాటాకుల శిథిలాల కింద నలిగిపోయిన మరుగున పడిన వెతల్ని తమ దృష్టితో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. వేలయేళ్ల క్రితమే బ్రాహ్మణీయ వ్యవస్థ తమ తలలోంచి పుట్టించిన పదునైన ఆయుధాలతో తవ్వి మట్టి పొరల కింద దాచిపెట్టిన చరిత్రను వెలికితీసి, ఇప్పుడీ దళితవాదులు తమ కన్నీటి సిరాతో ఆ మృతసాహిత్యానికి జీవవాయువు అందిస్తున్నారు.
పసునూరి రవీందర్ ఈ తరం సాహిత్యపు బలమైన గొంతుక. ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ కథల సంపుటితో కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారాన్ని అందుకున్న రవీందర్ యువతరం అస్తిత్వ సాహిత్యానికి ఒక ఉత్తేజం. దళితవాదానికి, తెలంగాణ వాదానికి, తెలుగు కవిత్వానికి ఒక భరోసా! ‘పడిపోయే ప్రతీసారి లేచి నిలబడాలన్న’ తపన ఉన్న రవీందర్ సాహిత్య దోవ చాలా స్పష్టంగా వుంది. దళిత సమాజం తలెత్తుకోవాలని ప్రతి అణిచివేతను అధిగమించి ఆత్మగౌరవంతో ధైర్యంగా నిలబడాలన్నది రవీందర్ ఆకాంక్ష.
గతం మీద పేరుకుపోయిన కుట్రల దుమ్ముదులిపి, మట్టి పొరల కింద సమాధి అయిన మనిషి చరిత్రను బయటికి తీయడంలో ‘సూపుడేలు’ పట్టుకొని ముందుకు సాగుతున్నాడు. అచ్చరాల్లో ఇగురం కల్తీ జేసే బతకనేర్చిన బట్టెబాజ్‌లను గుర్తించడమే కాదు జాతిని మోసం జేసే దొంగ ప్రతినిధులు వడ్డీతో సహా లెక్క అప్పజెప్పాల్సి వుంటుందని హెచ్చరికతో వస్తున్నాడు.
ఇవాళ బ్రాహ్మణీయ వస్తు నియమాలు, అభివ్యక్తి సూత్రీకరణలు చిలుంపట్టిన పాత సామాన్ల జాబితాలోకి చేరిపోయాయి. సాహిత్యపు గాంభీర్య వేషధారణలో వున్న చొప్పదంట్ల రహస్యం బట్టబయలు అయిపోయింది. కొందరి సామాజిక అవకాశాల కోణం నుంచి, కొందరి దుర్బుద్ధితో కూడిన ఆపాదిత ఔన్నత్యం నించి సాహిత్యాన్ని వేరు చేసి సమాజ నిర్మాణంలో భాగమై, గుర్తింపులో…అవకాశాల్లో అల్పుడైపోయిన ‘మనిషి’ని వెలికితీయడం ఇవాళ్టి సాహిత్యం. ఇలాంటి సాహిత్యానికి అలంకరణల అవసరం తక్కువ. సహజ సౌందర్యంతో పరిమళించే జీవ సాహిత్యం ఇది.
ఈ సాహిత్యపు తత్వం, ప్రథమ కర్తవ్యం ఏంటంటే
మనిషిని మనిషిగా అర్థం చేసుకోవడం! సామాజిక నిర్మాణంలో అతనున్న స్థానాన్ని, ఆ స్థానం చుట్టూ నిర్మితమైన విలువల తత్వాన్ని, ఆ విలువలకు ఆధారమైన ధర్మాలను, వాటి మూలాలను ప్రశ్నించడం! తర్కించడం! పనికిరాని స్మృతి ధర్మాల అప్రయోజకత్వాన్ని సమాజానికి అర్థం చేయించడం! కాలం పొడవునా విస్మరణకు గురయిన ఈ నేల మూలవాసుల చరిత్రను సగౌరవంగా రచించడం!
“తనువును ఆయుధం చేసి /రేపటికి వూపిరిపోసిన చేతులునావి / ఈ మట్టి పొరల మీద / మహా చరిత్రను లిఖించిన / ఆదిజాంబవుణ్ణి నేనే / తంగేడు సెక్క నా పరికరం” అని పసునూరి రవీందర్ తన మూలాలను ప్రకటించాడు. ఈ సమాజంలో అవేం గొప్పమూలాలు కావు. ఇటువంటి చరిత్రకు పెద్దవిలువేం లేదు. కానీ రవీందర్ తనది ‘మహాచరిత్ర’గా చెబుతున్నాడు. మట్టి పొరలకింద మరుగునపడ్డ ఆదిజాంబవుని వారసుడిగా తనని ప్రకటించుకున్నాడు. తనను హీనుడిని చేసిన తనదికాని తప్పుడు చరిత్రను కాలితో తన్ని, మట్టి పొరల కింద ఎప్పుడో లభించిన తన శ్రమ చరిత్రను తన ఆదిమ పనిముట్ల ఆనవాళ్ల సాక్ష్యాలను వెలికి తీస్తున్నాడు. ఇన్నాళ్లూ ఈ సమాజం శ్రమ చెయ్యని, మట్టితో సంబంధం లేని వాళ్ల చరిత్రనే చదివింది. శ్రమలో చాకిరీలో వున్న దళిత సమాజం అసలు చరిత్రను ఇప్పుడు రవీందర్ సమాజం ముందుకు తెస్తున్నాడు. ఇప్పుడు ఈ సమాజం నిర్ధారించాలి! / ఎవరి మూలాలు గొప్పవో! / ఎవరి చరిత్ర గొప్పదో!!
రవీందర్ ఒక దళితుడు. తెలంగాణలో పుట్టి పెరిగాడు. రవీందర్ కవిత్వ మైదానం ఈ సరిహద్దులతోనే నిర్మాణం అయ్యింది. ఈ బౌండరీ చుట్టూ భారతీయ బ్రాహ్మణీయ సమాజం నిర్దేశించిన కఠోర నియమ నిబంధనలు వున్నాయి. అవన్నీ వేల ఏళ్లుగా విచ్చల విడిగా పెరిగిన చెట్లలాగా చిక్కగా అల్లుకొనిపోయాయి.
ఈ బౌండరీ లోపలి మనుషులు బయటి సమాజానికి మనుషులు కాదు సంస్కృతికి అంటుకోదగిన వారు కాదు! అయినా బౌండరీ లోపల తమదైన దృక్పథంతో తమదైన విలువలతో ఆ మనుషులు ఒక జీవన సంస్కృతిని నిర్మించుకున్నారు. మనిషిని మనిషిగా గౌరవించే, సాటి మనిషిని ప్రేమించే గౌరవనీయ ఈ సాంస్కృతిక విలువలే రవీందర్ సాహిత్యానికి పునాది.
నిజానికి కవిత్వ నిర్మాణంలో సాంస్కృతిక అభివ్యక్తి కీలకమైంది. ఒక్క కవిత్వానికే కాదు మొత్తం సాహిత్యంలోనే సాంస్కృతిక అభివ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తంగా ఇన్నేళ్ల తెలుగు సాహిత్య అభివ్యక్తిని బ్రాహ్మణీయ మనువాద దృక్పథం నియంత్రిస్తూ వచ్చింది. రచయిత అంతర్లీన విలువలు విశ్వాసాలే సాహిత్య అభివ్యక్తిని నిర్దేశిస్తాయి. గొప్ప రచనలనీ, గొప్ప రచయితలనీ తెలుగు సాహిత్యంలో మనం చెప్పుకునే ఏ రచయిత సాహిత్యాన్ని తిరగేసినా ఈ సాంస్కృతిక అభివ్యక్తిని మనం స్పష్టంగా చూడొచ్చు.
1980ల తర్వాత సాహిత్యంలోకి వచ్చి చేరిన తొలి అస్తిత్వ ఉద్యమాలలో స్త్రీవాదం ఒకటి. ఇది హైందవ బ్రాహ్మణీయ మతం ఏర్పరచిన ఉపరితలాంశమై పితృస్వామ్యం మీదనే దాని పోరాటాన్ని కేంద్రీకరించింది. అందుకే అది అప్పటికీ ఇప్పటికీ బ్రాహ్మణీయ అభివ్యక్తి మూస ఊబిలో కూరుకుపోయింది. ‘కేవల స్త్రీవాదం’ ‘శుద్ధ స్త్రీవాదం’గా మిగిలిపోయింది. మరొక ప్రధాన అస్తిత్వ ఉద్యమమైన దళిత సాహిత్యానికి ఈ విషాద చరిత్ర లేదు. అంబేద్కరిజం సాహిత్య సిద్ధాంతంగా మలుపు తిరిగాక తెలుగు సాహిత్య అభివ్యక్తి భారీ కుదుపుకు గురైంది. అప్పటిదాకా నిర్మితమైన బ్రాహ్మణీయ విమర్శక, వ్యాకరణ సిద్ధాంతాల గోడలు బీటలు వారాయి. భారతీయ సంస్కృతికి మనువాద సిద్ధాంతానికి అభిముఖంగా దళిత సంస్కృతి, అంబేద్కరిస్టు సిద్ధాంతం బలమైన ప్రత్యామ్నాయాలుగా నిలబడ్డాయి. ఈ విషయంలో స్త్రీవా దం కానీ, మార్క్సిస్టు సాహిత్యంగానీ స్వతంత్ర సిద్ధాంతాలున్నప్పటికీ, సంస్కృతిలో బ్రాహ్మణీయ పరిధుల్ని దాటలేక పోవడం వలన అవి బలమైన ప్రత్యామ్నాయాలు కాలేకపోయాయి. దళితవాదం చూపిన ఈ దారిలో రవీందర్ ప్రయాణం స్పష్టంగా వుంది. పైగా ఆ దారిని మరింత కాంక్రీటీకరించాడు. అందుకే- “ఓ నా అంజన్నా, ఊరు మనది కాదు / ఎప్పటికీ వాడ మాత్రమే మనది” అన్నాడు.ఊరు బ్రాహ్మణ సంస్కృతిని మనువాదాన్ని పరమ పవిత్రంగా కాపాడే క్షేత్రం ఊరు హైందవీకరణ తుది రూపం ఊరు వేదాల చిహ్నం. చదువులు, ఉద్యోగాలతో ‘ఊర్లోకి’ వెళ్లిన దళితులు “హైందవీకరణ వైపు, బ్రాహ్మణీకరణ’ వైపు మొగ్గు చూపడం మనకు తెలుసు. ఇక్కడే సాంస్కృతిక అనుకరణ’ జరుగుతుందిపరాయీకరణ జరుగుతుంది. ఒక కవి జీవనం, సైద్ధాంతిక విశ్వాసం కలగలసి అతని సాంస్కృతిక అభివ్యక్తి ఏర్పడుతుంది. రవీందర్ దళితుడు. తెలంగాణ ప్రాంతం వాడు, అంబేద్కరిస్టుఇదే రవీందర్ సాహిత్య అభివ్యక్తిని నిర్దేశించే సిద్ధాంతం. ఈ నేపథ్యం నుంచి రవీందర్ కవిత్వాన్ని చూస్తే ఒక కొత్త సున్నితమైన ప్రపంచం కనిపిస్తుంది.
“లందెగోళాల్లో / నేను నానేసింది తోలును మాత్రమే కాదు / మీ రేపటి పొద్దును కూడా! / నా గూటం, రంపెం /ఇప్పుడు మీ ఎగ్జిబిషన్‌లలో / పురాతన వస్తువులు” అంటాడు. ఇది దళిత జీవనంఎక్కడా బ్రాహ్మణత్వం లేని అంటరానితనం శ్రమతత్వం కలగలిసిన జీవన చిత్రానికి ఈ అభివ్యక్తి ఉదాహరణ. ఇది దళిత మాదిగ అభివ్యక్తి. “డప్పు శిలుక్కొయ్యకంటే / యుద్ధం ముగిసినట్టు కాదు / చిర్రలు సానపెట్టబడి / దరువులు నిప్పుకణికల కలగంటాయి” డప్పు మాదిగ సంస్కృతి చిహ్నం. ఈ సాంస్కృతిక జీవ చిహ్నాలు భాషలో, అభివ్యక్తిలో కలగలిపి వుండటం వలన వాటంతట అవియాదృచ్ఛికంగా కవిత్వంలో వాక్యాలై ఒదిగి పోతాయి. పై రెండు ఉదాహరణలు కొనసాగింపు మరింత యాదృచ్ఛికమై… “అన్యాలం పాడుగానూ / తెగిన సెప్పుల తీరే! /పగిలిన డప్పుల కతే /అంటరాని బతుకుల పొడుగూత!” అంటాడు. చెప్పులు, డప్పులు దళిత మాదిగ జీవన చిహ్నాలు. ఇవే సాంస్కృతిక ప్రతీకలు. ఒకనాడు అవమానానికి తప్ప పనికిరాని ఈ చిహ్నాలు ప్రత్యామ్నాయ సాంస్కృతిక అభివ్యక్తిలో అలవోకగా వచ్చి చేరగా మెటఫర్లు ‘సిమిలీలు’ అయ్యాయి. రవీందర్ తెలంగాణవాద దళితవాది. ఈ పుస్తకం నిండా ఎక్కువ కవితలు తెలంగాణ ఉద్యమ కవితలే. కానీ, అన్ని కవితల్లోను రవీందర్ సాంస్కృతిక అభివ్యక్తి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రతి కవితకు ఆత్మ ‘దళితతనం’ అయి వుంటుంది. అందుకే
“తాలుగింజల కోసం నేను తండ్లాడుతుంటే / ఒక్కడైనా పొక్కిలైన మా వాకిల్లలోకి తొంగి చూశాడా /బుద్ధుని బోధనలు నడయాడినా / చిందు ఎల్లమ్మ ఎత ఏగిల్‌వారినా /సదా లక్ష్మమ్మ సవాలు విసిరినా /మా భాగ్యయ్య ఉద్యమసేద్యం అచ్చరాలు పంచినా /మా కొసింటి గుడిశల్ల వెలుగెందుకు పూయలేదో?”
ఇది తెలంగాణ దళితుల ప్రశ్న. తెలంగాణ నాగరికత నిర్మాణంలో దళితుల శ్రమ తాలుగింజై పోవడం విషాదం. ఎంత పోరాడినా ఫలితం వాడ గుడిసె దాకా రాలేదు. భాగ్యరెడ్డి వర్మ, సదాలక్ష్మి లాంటి వాళ్ల పోరాటం, చిందు ఎల్లమ్మలాంటి వాళ్ల సాంస్కృతిక సేవ అన్నీ గుర్తింపుకి నోచుకోనివే అని రవీందర్ అనడం వెనుక తెలంగాణతనంలో వున్న ఆధిపత్య కులాల కుట్ర స్పష్టమవుతుంది. తెలంగాణ పోరాటంలో ముందుండి నడిచినవాళ్లు, పోలీసు లాఠీలకు ఒళ్లు ఇచ్చినవాళ్లు, తుపాకీ గొట్టాలకు గుండెల్ని అడ్డుపెట్టి నిలిచిన వాళ్లు దళిత బహుజనులు. ఒక ఎమోషనల్ సోషల్ మూమెంట్‌లో ఏ విధమైన ప్రయోజనాలు దక్కని ‘అల్పజీవులే’ నేలకొరగటం విషాదం. ఈ విషాదం రవీందర్‌ని పదే పదే వెంటాడిందనడానికి ఈ కవితల్లో ఆ దు:ఖఛాయలు అంతర్లీనంగా చారికలు చారికలుగా మనకు కనిపిస్తాయి. ఈ కవి తనకున్న ఈ రెండు అస్తిత్వాలలో దళితతనంతో అటు వస్తువుని ఇటు భాషని డామినేట్ చేసి తన “దళిత మాదిగ సాంస్కృతిక అభివ్యక్తి”ని బలంగా ప్రస్ఫుటంగా వ్యక్తీకరించాడు.

ఖాజా

Article about Poet Pasunuri Ravinder

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: