కాలరేఖపై కవిత్వపు నది

  నాలుకలపై అక్షరాలు నానడమంటే సామాన్యమైన విషయమా! గుండెలో తడి లేకపోతే అదెలా కుదురుతుంది? హృది లోతుల్లో ఉబికి ఉబికి వచ్చిన అక్షరాలే కవిత్వమౌతుంది. అలాంటి కవిత్వమే నాలుకలపై సింహాసనం వేసుకొని కూర్చుంటుంది. “వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం” అని గుర్రం జాషువా తన కవిత్వాన్ని గురించి చెప్పుకున్నారు. అలాగే ప్రజాకవి కాళోజి గారు “ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం […]

 

నాలుకలపై అక్షరాలు నానడమంటే సామాన్యమైన విషయమా! గుండెలో తడి లేకపోతే అదెలా కుదురుతుంది? హృది లోతుల్లో ఉబికి ఉబికి వచ్చిన అక్షరాలే కవిత్వమౌతుంది. అలాంటి కవిత్వమే నాలుకలపై సింహాసనం వేసుకొని కూర్చుంటుంది. “వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం” అని గుర్రం జాషువా తన కవిత్వాన్ని గురించి చెప్పుకున్నారు. అలాగే ప్రజాకవి కాళోజి గారు “ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు – ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె.” అని అన్నారు. వారు చెప్పిన దానిని పరిశీలించినప్పుడు కవిత్వం ఎక్కడినుండో పుట్టదు మనలో నుండే మన పరిసరాల నుండే మనము అనుభవించిన సంఘటనలనే కవిత్వంగా చేసి బుర్రలో నుండి తోడుకుంటున్నాము.
కవిత్వం ఇలానే ఉండాలని ఎవరూ చెప్పలేదు చెప్పకూడదని నా అభిప్రాయం. నా కవిత్వం ఇలా ఉంటుందని కొందరు చెప్పుకుంటే మరికొందరు ఇలా ఉంటే బాగుంటుందని చెప్పారు. కావున కవిత్వం ఇలానే ఉండాలని ఎవరైనా చెపితే వినకండి. మీ భాషలో, మీ యాసలో మీ వేదనను, ఆనందాన్ని, దుఃఖాన్ని, అవగాహనని, విశ్లేషణని, అనంతాన్ని కవిత్వంలో ఇమడింపచేయండి. నా పరిశీలనలో కవిత్వం రెండు రకాలుగా వస్తోంది. ఒకటి అభూతకల్పనలతో రీడర్ కి అందని మెటాఫర్ తో కవిత్వాన్ని రాస్తున్న వారు కొందరైతే. పేరాను వాక్యాలుగా తెంచి కవిత్వంగా మలుస్తున్నామని భ్రమపడేవారు మరికొందరు. కవిత్వం కవికి, రీడర్ కి వంతెనగా ఉండాలి. కవిత్వానికి శైలి ముఖ్యం ఎన్నో సంవత్సరాల నుండి రాస్తున్నవారు కూడా ఒక శైలిని నిర్మించుకోలేకపోతున్నారంటే వారు కవిగా విఫలం అవుతున్నారనే అర్థం.
సీనియర్ కవులను ఒకరితో ఒకరిని పోల్చలేము. ఎందుకంటే ఎవరి శైలి వారిది? వారి శైలిలో వారు నిష్ణాతులు. అలాంటి కవుల్లో ఒకరైన వారు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఈ కవి పేరు చెప్పగానే తెలుగు సాహిత్యాభిమానులకు గుర్తు వచ్చేది “నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అనే వాక్యం. ఇదే వాక్యం ఇప్పటికి తెలుగు కవిత్వాన్ని శాసిస్తూనే ఉంది. ఒక్క వాక్యంలో తన కవిత్వం ఎలా ఉంటుందనే చెప్పిన విధానం, అందులో తిలక్ గారు వాడిన ప్రతీకల వల్లె తెలుగువారి గుండెల్లో ఆ వాక్యం నిలిచిపోయింది. అక్షరాలను ఆడపిల్లలతో పోల్చడం అవి వెన్నెలలో ఆడుకుంటున్నాయని చెప్పడంతో తన కవిత్వం అందంగాను, విస్తృతంగాను, భావయుక్తంగా ఉంటుందని తేల్చి చెప్పారు. పోలిక రీడర్ కి అర్థమవ్వాలి అది రీడర్ ఊహించగలగాలి. కవి ప్రకటించిన ఊహను రీడర్ అందుకున్నప్పుడే కవిత్వం పచ్చ పచ్చగా వెలుగుతుంది.
అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిలోని మొదటి వాక్యం ఇలా ఉంటుంది. ‘నా కవిత్వం కాదొక తత్వం/ మరి కాదు మీరనే మనస్తత్వం’. కవిత్వం ఎప్పటికీ ఒక తత్వం కాదు ఎవరికీ, ఏ వాదానికి చెందినది కాదు. కొన్ని కోట్ల తత్వాలతో భావం కలిస్తే కవిత్వం అవుతుందేమో. కవిత్వం రీడర్ కి ఎలా అవసరమైతే అలా ఒదిగిపోవాలి. తను దుఃఖంలో ఉన్నప్పుడు కవిత్వం చదివితే స్వాంతన దొరకాలి. ఆనందంగా ఉన్నప్పుడు ఉత్తేజాన్ని ఇవ్వాలి. ఇలా కవిత్వం తనను తాను మార్చుకుంటూ రీడర్ కి అన్ని సమయాల్లో హత్తుకుపోవాలి. అప్పుడే కవిగా మనం నిలబడగలము. కవిత్వం ఎందుకు రాస్తున్నావని ఎవరో అడిగారు?ఒక కవి అన్నాడట అతిపెద్ద పురస్కారం కోసమని. నేనంటాను కవిత్వం రాసేది ఒక వర్గం, జాతి, ప్రాంతం వివక్షకు గురైనప్పుడు బాసటగా నిలిచే అక్షరాన్ని వారికి అందివ్వడానికి. అలాంటి కవిత్వమే కదా చిరకాలం నిలిచేది. ఆ కోవలోకి చెందిన పుస్తకమే అమృతం కురిసిన రాత్రి.
మనిషి జీవితంలో వృద్ధాప్యం ఒక వరం కావాలి కాని అదొక శాపమై, పక్కలో బల్లమై క్షణం క్షణం మరణభీతిని కలిగిస్తోంది. ఎవరికీ అవసరం లేని స్థితిలోకి వెళ్ళడమే ఈ ముసలితనం. పండిన పండులో సూర్యుడు ఎలా ఉదయిస్తాడు. సూర్యాస్తమయం జరిగే చోట వెలుగును ఎలా నిలువరించలేము. అక్కడ చీకటి ప్రవేశిస్తుంది అది ముసలి చీకటి, రాకాసి చీకటి, ముడతల చీకటి, కల్లకింద మరణాన్ని పాతిపెట్టే చీకటి, రెప్పలపై ఎండిపోయిన రక్తపు ఛాయల చీకటి. నాలుగు గోడల మధ్యలో కరుగుతున్న కండల చీకటి. పురివిప్పిన చీకటి, ఉదయించిన చీకటి, అగాధంలోకి నెట్టే చీకటి. పెదవులపై మరణాన్ని ఉలకపోస్తున్న చీకటి అవును అదే అదే ఆ చీకటే ఊపిరిలో మసులుతోంది. ముసలివాడు కవితలో తిలక్ గారు ముసలితనం ఎలా ఉంటుందని వివరించిన తీరు రీడర్స్ ని కంటతడి పెట్టిస్తుంది. కవిత గొప్పదనం ఏంటంటే ఒక ముసలివ్యక్తి తన దుస్థితిని చెప్పు్తన్నట్టు రాయడమే. శివారెడ్డి గారి ఆసుపత్రి గీతంలో కూడా కొన్ని ఖండికలు సంబంధించిన పాత్రలే రీడర్స్ కి చెప్తున్నట్టు కవిత్వం ఉంటుంది. ఒక వ్యక్తి లేదా సమూహం చేత కవిత్వాన్ని చెప్పించడంతో అందులో శిల్పం, సహజత్వం బలంగా ఉంటుంది. రీడర్ కూడా త్వరగా రిసీవ్ చేసుకుంటాడు. నేను కూడా నా ‘వై’ కావ్యాన్ని హిజ్రాలే తమ బాధను చెప్పుకుంటున్నట్టు రాశాను. బహుశ అందుకేనేమో ఆ పుస్తకం ఎక్కువమందిని ఆలోచింపచేసింది. కాని ఇది ప్రతి చోట వాడకూడదని నా అభిప్రాయం అవసరాన్ని బట్టి కవి నేరుగా రీడర్ తో విషయాన్నీ కవిత్వ రూపంలో చెప్పవచ్చు, లేదా రెండవ వ్యక్తిగా మారి చెప్పించవచ్చు. కవితకు ఎత్తుగడ, శిల్పం, ముగింపు మాత్రమే కాదు ఏ టెన్స్ లో ఎలా చెప్పాలనేది కూడా ముఖ్యమే.
ఇప్పటికి మనకి అర్థం కాదు ఈ నాగరికత మనిషిని ముందుకు నడిపిందో వెనక్కి నడిపిందో. ఒక కాలం నుండి మరొక కాలానికి ప్రయాణిస్తూ వచ్చిన మనిషి అవసరాన్ని బట్టి అన్ని విషయాల్లోను మారుతూ వచ్చాడు. మార్పు మంచి చేస్తే పర్వాలేదు అదే మార్పు మనిషి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నాగరికత గురించి చెప్తూ నాగరికత మైలపడిన దుప్పటిలా నన్ను కప్పుకుంది అన్నారు. నాగరికత మైలపడింది అనే చెప్పడంతో నాగరికత అవసరమే కాని అది మైలపడినందున ముందుకు వెళ్ళలేకపోతున్నామని చెప్పడమే.
జీవితాన్ని దేనితో కొలుస్తారు. కొలవాలనుకోవడం మూర్ఖత్వమే అనుకుంటాను. ఒకవేళ కొలవాలనుకుంటే ఎన్నివేల నవ్వులతో కొలవాలో. మరి అలాంటి నవ్వులు మన జీవితాల్లో ఉన్నాయా? కాలంపై కన్నీరు పరిగెడుతుంటే నవ్వుల తీగలు ఒకరితో ఒకరిని ఎలా కలుపుతాయి. వికృతం కొలువైన చోట నవ్వులు పూయాలనుకోవడం సబబు కాదు. జీవితాన్ని కొలిచే సందర్భమే వస్తే ఇతరుల జీవితాల్లో మీరు ఎంత శాతం ఉన్నారో? ఎంతవరకు ఉపయోగపడ్డారో లెక్కకడితే సరిపోతుందేమో. జీవితం అనేది వ్యక్తిగతం కాదు అదొక సమూహం. ఎంత పెద్ద సమూహమైతే మన జీవితం కూడా అంత పెద్దది అవుతుంది.
1971 లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన ఈ కవితా సంకలనంలోని కవితలు ఆనాటి పరిస్థితులను తెలుపుతూనే భవిష్యత్ ఎలా ఉండబోతోంది అని చెప్పిన విధానం వల్ల కవి సహేతుకంగా ఆలోచించి సరైన నిర్ణయాన్ని ప్రకటించారనిపించింది. ఉదాహరణకు ‘ఓ దేవుడా రక్షించు నా దేశాన్ని దేవుళ్ళ నుండి, పూజారుల నుండి, వ్యవస్థ నుండి’ ఇది 1963 లో రాసిన కవిత కానీ నేటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు రాశారనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా అంటే వచ్చిందనే చెప్పాలి అప్పట్లో కొద్ది శాతమే దోపిడీ ఉండేది ఇప్పుడు వందకు వెయ్యి శాతం దోపిడీ జరుగుతోంది. గతం, ప్రస్తుతం, భవిష్యత్ నిర్మాణ క్రమాన్ని తెలిపేదే ఈ అమృతం కురిసిన రాత్రి. తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసిన ఎందరో కవుల్లో తిలక్ గారు ఒకరు. వారి కవిత్వ గొప్పదనం ఏంటంటే ఎన్నిసార్లు వారి కవిత్వాన్ని చదివినా మళ్ళీ మళ్ళీ కొత్తగా మనకు పరిచయం అవుతూనే ఉంటుంది.

జాని.తక్కెడశిల, 9491977190

Article about poet Gurram Jashuva

Related Images:

[See image gallery at manatelangana.news]