కీలుబొమ్మ సిఎంలతో బిజెపి

Modi Govenment

 

కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదంతో దేశ రాజకీయాలలో ఒక సంచలనం సృష్టించి, ప్రధాన మంత్రి పదవి చేపట్టి జాతీయ రాజకీయాలను నియంత్రిస్తూ, రెండో సారి అఖండ ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ఆచరణలో కాంగ్రెస్ విధానాలనే అనుసరిస్తున్నదా ? విధానపరంగా ‘కాంగ్రెస్ యుక్త బిజెపి’గా మారుతున్నదా? అంటే అవుననే అనిపిస్తున్నది. కాంగ్రెస్‌లో ఒక కుటుంబమే సర్వస్వంగా మారి అంతర్గత ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. బిజెపిలో సహితం ఇద్దరు వ్యక్తులే సర్వస్వంగ మారుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక ప్రాధాన్యత గల అంశంపై కేంద్ర మంత్రివర్గం ఏడు నిమిషాలు మాత్రమే చర్చించడం, ఆ సమయాల్లో కూడా హోం మంత్రి అమిత్ షాపై ప్రశంసలు కురిపిస్తూ, చప్పట్లు కొట్టడంతోనే గడపడం కనిపిస్తే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో స్పష్టం అవుతుంది. ఇందిరా గాంధీ హయం నుండి రాష్ట్రాలలో స్థానికంగా బలం గల నేతలను పక్కన పెట్టి, ఢిల్లీ చుట్టూ తిరిగే కీలు బొమ్మలను ముఖ్యమంత్రులుగా నియమించే సంప్రదాయం కాంగ్రెస్ అనుసరిస్తుంది. ముఖ్యమంత్రిగా ఎవ్వరు ఉండాలో ఎన్నికైన శాసనసభ్యులు కాకుండా పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తూ వస్తున్నది. తొలి నుండి బిజెపికి తమ తమ రాష్ట్రాలలో బలమైన పట్టు గల నాయకులే ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు.

కళ్యాణ్ సింగ్, మదన్ లాల్ ఖురానా, భైరాంగ్ సింగ్ షెక్వాత్, ఈ మధ్య కాలంలో శివరాజ్ సింగ్ చౌహన్, వసుంధర రాజే, బి ఎస్ యడియూరప్ప… ఆ విధమైన నేతలే. బిజెపిలో జాతీయ స్థాయిలో ప్రజాబలం, సొంత నియోజకవర్గాలు గల నేతలను కాకుండా, స్థానికంగా పట్టు లేని వారినే ఎల్ కె అద్వానీ హయాంలో ప్రోత్సహిస్తూ వచ్చారు. రాష్ట్రాలలో గల బలమైన ముఖ్యమంత్రులను సహితం బలహీన పరుస్తూ వచ్చారు.

మోడీ హయాంలో ఈ సంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ రాష్ట్రాలలో కీలుబొమ్మ ముఖ్యమంత్రులను నియమిస్తూ వచ్చారు. తమ సొంత ఇమేజ్‌తో కాకుండా ప్రధాని మోడీ పట్ల గల ఆకర్షణతో తమ రాజకీయ భవిష్యత్ ఆధారపడి పరిస్థితులు సృష్టిస్తూ వచ్చారు. చౌహన్, వసుంధర రాజే వంటి బలమైన నేతలు ముఖ్యమంత్రులుగా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నది. మొత్తం దక్షిణాదిన ప్రజాబలం గల ఏకైక నేతగా పేరొందిన యడ్యూరప్పను గత్యంతరం లేని పరిస్థితులలో అనధికారికంగా ఏర్పర్చుకున్న వయస్సు పరిమితిని మించి 76 ఏళ్ళు వచ్చినా ముఖ్యమంత్రిగా చేశారు. అయితే సుమారు మూడు వారాల పాటు మంత్రివర్గం లేకుండా ఒక్కరే ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చింది. మంత్రి వర్గం ఏర్పాటుకు ఢిల్లీ చుట్టూ తిరగవలసి వచ్చింది.

చివరకు 17 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నా ఢిల్లీ నుండి జాబితా కోసం ముందురోజు అర్ధరాత్రి వరకు ఎదురు చూడవలసి వచ్చింది. ఆ జాబితాలో ఐదారుమందికి మించి ఆయన మద్దతుదారులు లేరు. పైగా ఆయనంటే ఏమాత్రం గిట్టనివారు అత్యధికంగా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నా బలమైన నాయకుడిగా ఎదగకుండా జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టం అవుతుంది. 2008 నుండి 2011 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను పార్టీ అధిష్టానం కుట్రపూరితంగా ఆ పదవి నుండి తొలగించి, తాము చెప్పిన్నట్లు నడచుకొనే వారిని ముఖ్యమంత్రిగా నియమించే ప్రయత్నం చేశారు. అయితే మంత్రులు, ఎంఎల్‌ఎలు ఆయనకే అండగా నిలబడడంతో తన వారసుడిగా సదానంద గౌడ్‌ను ఎంచుకొనే అవకాశం ఆయనకు ఇవ్వక తప్పలేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నారు.

దాదాపు అన్ని జాతీయ రాజకీయ పార్టీలలో రాష్ట్రాలలో బలమైన నాయకులు ఉంటె ఏకపక్షంగా తాము నిర్ణయాలు తీసుకోవడం సాధ్య పడదని జాతీయ నాయకులు భయపడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బిజెపిలో కూడా అదే జరుగుతున్నది. అందుకనే మంత్రివర్గ విస్తరణ జరిగిన రోజుననే కర్ణాటక బిజెపిలో అసంతృప్తి బహిరంగంగా వ్యక్తమైనది. మంత్రి పదవులు ఆశించిన కనీసం డజన్ మంది నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మరోవంక కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం బిజెపితో చేతులు కలిపి, తమ శాసన సభ్యత్వాలను కోల్పోయిన 17 మందిలో కనీసం 12 మందికి మంత్రిపదవులు ఇస్తామని హామీ ఇచ్చిన యడ్యూరప్ప ఒక్కరికి కూడా ఇవ్వలేక పోయా రు. అందుకు సుప్రీం కోర్ట్ కేసును సాకుగా చూపారు అనుకోండి.

ఈ పరిస్థితులు చూస్తుంటే యడ్యూరప్ప ప్రభుత్వం మనుగడ అనుమానాస్పదంగానే కనిపిస్తున్నది. అయితే బిజెపిలో ప్రజలను సమీకరించగల మరో నేత రాష్ట్రంలో లేకపోవడంతో కొంతకాలం ఆయనను ఆ పదవిలో కొనసాగనీయక బిజెపికి కూడా తప్పకపోవచ్చు. గత ఐదేళ్లల్లో బిజెపి అధికారం చేపట్టిన అన్ని రాష్ట్రాలలో సహి తం ముఖ్యమంత్రి ఎంపికలలో ఆయా రాష్ట్రాలలో రాజకీయ ఆధిపత్యం వహిస్తున్న బలమైన సామాజిక వర్గాలకు చెందినవారిని పక్కన బెట్టి, సొంతంగా బలం పుంజుకోలేరని నమ్మకం ఉన్న సామాజిక వర్గాలకు చెందిన వారినే ఎంపిక చేయడం గమనార్హం. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లలో ముఖ్యమంత్రుల ఎంపికలో ఇటువంటి సూత్రాన్నే అనుసరించారు. ఉత్తర ప్రదేశ్ లో తప్పని పరిస్థితులలో ‘ప్రజాబలం’ గల యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా చేసినా ఆయనకు పార్టీపై, పార్టీ శాసనసభ్యులపై పట్టు లేకపోవడం గమనార్హం.

2014లో మోడీ ప్రధాన మంత్రి పదవి చేపట్టగానే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజనాథ్ సింగ్ ను తన మంత్రివర్గంలో చేర్చుకొని, హోం శాఖను అప్పచెప్పి, తక్షణమే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. ఆ స్థానంలో ప్రధానికి నమ్మకస్థుడైన అమిత్ షాను ఎంపిక చేశారు. వాస్తవానికి అప్పట్లో పార్టీలో తదుపరి అధ్యక్షుడిగా జెపి నడ్డా పేరు తెరపైకి వచ్చింది. అయితే 2019లో రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన మోడీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాను తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. కానీ ఆయనతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించకుండా, సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగనిస్తున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డాను నియమించినా కీలక నిర్ణయాలు అన్ని షా మాత్రమే తీసుకొంటున్నారు.

ఇందిరాగాంధీ హయం నుండి కాంగ్రెస్‌లో, జనతా పార్టీ ప్రభుత్వం వైఫల్యం నుండి, కుటుంబం ఆస్తులుగా ప్రాంతీయ పార్టీలు ఎదగడం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు అన్ని ఇతర రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనబడటం లేదు. దానితో కీలక పదవులలో కీలు బొమ్మలను నియమించుకోవడం ద్వారా, తమ రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నారు. దానితో తమ పాలనను చూపు కాకుండా ఓటర్లకు తాయిలాలు చూపో, ఎన్నికల ముందు భావోద్వేగాలను రెచ్చగొట్టే గెలుపొందే ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. గత నాలుగు దశాబ్దాలలో తన పనితీరు చూపి కేంద్రంలో తిరిగి గెలుపొందిన ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మాత్రమే అని చెప్పవలసి అంటుంది.

ఒక సారి వాజపేయి, మరోసారి మోడీ ప్రధాని పదవిలో ఉండి గెలుపొందినా ప్రజల భావోద్వేగాలతో గెలుపొందారు గాని తమ పరిపాలనను బట్టి కాదని చెప్పవలసిందే. అందుకనే ఇప్పుడు ఎన్నికైన మరుసటి రోజు నుండే ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో తిరిగి గెలుపొందడం గురించి ఆలోచిస్తున్నారు గాని, మంచి పాలనా అందించడం పట్ల దృష్టి సారించడం లేదు. రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం పెంపొందకుండా, ఎన్నికల సంస్కరణలు అర్ధవంతంగా జరుగకుండా మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కాలేదు. పరిపాలనలో ప్రజలకు అర్ధవంతమైన భాగస్వామ్యం లభించదు. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలలో ఆ దిశలో మార్పులు రాగలవని ఆశింపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దిశలో సంస్కరణలు జరుగకుండా దేశంలో సుపరిపాలన కూడా సాధ్యం కాదు. 73 ఏళ్ళ క్రితం లభించిన స్వాతంత్య్రం అర్ధవంతం కాబోదు.

Article about Modi Govenment

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కీలుబొమ్మ సిఎంలతో బిజెపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.