సాహితీ, సామాజికవేత్త టి.వి.నారాయణ

  ’చెడుపు చేసినపుడు చేదునొందుమనసు శాంతిగోలుపోయి భ్రాంతి పొందు సంతసమున వీడు సంకటముల జేరు భరత వంశ తిలక భవ్య చరిత‘ అంటూ తెలుగు సాహిత్యంలో తనదైన శైలిలో రచనలు చేస్తూ మానవతా విలువలకు మారుపేరు, ఉద్యోగ క్రమశిక్షణకు నిలువుటద్దం, ఆధునిక వేమన, పద్మశ్రీ డాక్టర్ టి.వి. నారాయణ. నారాయణ సికింద్రాబాద్ లోని బొల్లారం హైస్కూల్లో ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడి వరకు ఎదిగిన నిరాడాంబరుడు […]

 

’చెడుపు చేసినపుడు చేదునొందుమనసు
శాంతిగోలుపోయి భ్రాంతి పొందు
సంతసమున వీడు సంకటముల జేరు
భరత వంశ తిలక భవ్య చరిత‘

అంటూ తెలుగు సాహిత్యంలో తనదైన శైలిలో రచనలు చేస్తూ మానవతా విలువలకు మారుపేరు, ఉద్యోగ క్రమశిక్షణకు నిలువుటద్దం, ఆధునిక వేమన, పద్మశ్రీ డాక్టర్ టి.వి. నారాయణ. నారాయణ సికింద్రాబాద్ లోని బొల్లారం హైస్కూల్లో ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడి వరకు ఎదిగిన నిరాడాంబరుడు డా॥ టి.వి. నారాయణ. తన జీవితంలో గొప్ప గొప్ప పదవులను అధిరోహించినా అతిసామాన్యంగా కనిపించే అపురూప సౌజన్యశీలి టి.వి. నారాయణ. పనిలో మన ప్రతిభ చూపితే పదవులు అవే వస్తాయనడానికి నిలువెత్తు సంతకం నారాయణ. ఈయన పూర్తి పేరు తక్కెళ్ళ వెంకట నారాయణ. 26.07.1925 సికింద్రాబాద్ లోని బొల్లారం దగ్గర నర్సమాంబ, వెంకటయ్య దంపతులకు జన్మించిన ఈయన జీవితం వడ్డించిన విస్తరికాదు. వడ్డన ఆయనే విస్తరి తయారీ ఆయనే. అతి సామాన్య దళిత నిరుపేద కుటుంబంలో జన్మించిన తాను తన బాల్య దశలోనే తండ్రిని కోల్పోయి కన్నీటి సముద్రాలను ఈదుకుంటూ ముందుకు నడిచారు. తానే కాదు తన తమ్ముళ్ళు, తన తోటి వారికి ఎప్పటికప్పుడు జీవిత పాఠాలు నేర్పిస్తూ విద్య ద్వారానే విజ్ఞానాన్ని సాధించవచ్చని నిరంతరం శ్రమనే నమ్ముకున్న విద్యావేత్త టి.వి. నారాయణ గారు.

ఆర్య సమాజం ద్వారా అనేక మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని ఒక క్రమపద్దతిలో ఏర్పరచుకుని సమాజ సేవకై నడుంబిగించారు. సమాజము, సాహిత్యము వేరువేరు కాదని చాటి చెప్పుతూ నిత్యం సమాజంలో జరుగుతున్న స్థితిగతులను అను నిత్యం పరిశీలించి సమాజంలో జరుగుతున్న సంఘటనలనే సాహితీ వస్తువులుగా ఎంచుకుని సమాజాన్ని ప్రతిబింబింప జేసిన ప్రతిభాశాలి టి.వి. నారాయణ ఆయన విద్య ద్వారా సమాజాన్ని మార్పుకు గురిచేస్తే, వారి సతీమణి టి.యన్. సదాలక్ష్మీ సమాజ సేవలో తన జీవితాన్నే దారపోసి ఎన్నో సామాజిక ఉద్యమాలకు పురుడుపోసి, అణగారిన వర్గాల గొంతుకై ప్రజల నాల్కలలో నిలిచి పోయారు. ఇలా భార్యభర్తలిద్దరు ముక్తకంఠంతో దళితుల పాలిట కామధేనువులుగా ఉండి ఎంతో మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిపోయారు. ఎన్నో ఒడిదొడుకుల నడుమ తన జీవితాన్ని ప్రారంభించి ఉన్నత పదవులను అధిరోహించారు టి.వి. నారాయణ.

ఎలాంటి పదవిలో తాను ఉన్నా ఎంతో క్రమశిక్షణతో సమర్థవంతంగా ఆ పనిని నిర్వహించేవారు. తన పనితనం క్రమశిక్షణా కార్యక్రమాలు నేటికి వర్క్, వర్క్, వర్క్ అని సిటికాలేజ్ గోడలమీద నేటికి నిలిచి ఉన్నాయి. క్రమశిక్షణ, ధృడసంకల్పమే తనను వివిధ కళాశాలలకు ప్రిన్సిపాల్ గా, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కార్యదర్శిగా, కాకతీయ విశ్వవిద్యాలయ సిండికేట్ మెంబర్ గా, నేషనల్ హాండ్‌లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గా, ఏ.ఐ.సి.సి., మెంబర్, నంది అవార్డు కమిటి మెంబర్, ఇలా అనేక రంగాలలో కమిటి సభ్యులుగా, వ్యవస్థాపక అధ్యక్ష, సభ్యులుగా పనిచేశారు. ఇంతటి బిజీ ప్రణాళికలు, ఇన్ని పదవులను చేపట్టినా సాహిత్యంలో సమర్థుడిగా నిలిచాడు. వేదాలు, ఉపనిషత్తులు, ప్రాచీన కావ్యాలు అంటేనే అమ్మో అని నేడు భయపడే తరుణంలో వాటిని అక్కున చేర్చుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిలోని సారాంశాన్ని వివిధ గ్రంథాల ద్వారా మనముందుంచారు. తనకు ఉన్న సాహితీ పిపాసతో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ వారి ద్వారా దాదాపు 140 వరకు తన ప్రసంగాలను కొనసాగించారు.

సాహిత్య, సామాజిక రచనలు
మొట్టమొదటి సారిగా ఆంగ్లంలో The sands of time. అనే పేరుతో కవిత్వం ప్రారంభించిన టి. వి. అనేక గ్రంథాలను వెలుగులోనికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆత్మదర్శనం(1983) అనే పేరుతో గేయ కావ్యాన్ని రాసి తన తండ్రికి అంకితమిచ్చారు. అవమవాక్సుధా స్రవంతి (1987)ఈశావాస్యోపనిషత్తు, స్థిత ప్రజ్ఞ లక్షణములు కఠోపనిషత్తు పై ఆకాశవాణి ప్రసంగాల న్నింటిని కలిపి రచనా గ్రంథంగా తీసుకువచ్చి శ్రీపండిత సోమదేవ శాస్త్రీ గారికి అంకిత మిచ్చారు. ఆర్షపుత్ర శతకం(1991) అనే శతకాన్ని తన సోదరుడు టి.వి. శంకరావుకు అంకితమిచ్చారు. కృషి ఉంటే మనుష్యులు ఋషులవుతారు అనే మాట వాస్తవం అని నిరూపించారు ఈ రచన ద్వార. నిత్యం అనేక సమస్యలతో, సాంఘిక కార్యక్రమాలతో, పాలనా విధానంలో నిజాయితీగా పనుల్లో నిమగ్నమయ్యే టి.వి. సాహిత్య ప్రక్రియలపై మక్కువ చూపుతూ వేమన్న పద్యాలను తలపించే విధంగా పద్యాలు రాశారు. ఆటవెలది పద్యాలతో సమాజ స్థితిగతులను తలపిస్తూ ఎన్నో అంశాలను మనముందుంచారు.

నేలమీద మనిషి నివసించవలెగాని / ఊహజాలమందు ఊగరాదు / గాలి ఊహలన్ని గగన పుష్పమ్ములే / అవధరింపుమయ్య ఆర్ష పుత్ర
మన దేశంలో ఉన్న అనేక మంది మహనీయుల చరిత్రను వారి బోధనలను తెలుపుతూ మహనీయులు మహితోక్తులు (2001) అనే తత్వశాస్త్ర గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చారు. అలాగే వేదాల్లో ఉన్న అనేక సామాజికాంశాలను పద్యాల్లో తెలుపుతూ శ్రుతిసౌరభం(2002) అనే కావ్యం తెలుగులో అనువాదం చేశారు. భవ్యచరిత శతకము(2008) ఈ శతకంలో 118 ఆటవెలది పద్యాలతో రచించిన శతకం ఇది. ఇందులో తన కుమారుడైన వంశ తిలక్ పేరుతో తన మనుమడైన భరత్ వంశ తిలక్ పేరుతో భరత వంశ తిలక భవ్యచరిత్ర అనే మకుఠంతో ఈ శతకాన్ని సమాజంలో ఉన్న సాంఘికాంశా లను, ఆధ్యాత్మికాంశాలను, కుల, మత తత్త్వ నిరసనకు సం బంధించిన అనేకాంశాలు ఈ శతకంలో కనబడుతున్నాయి. తప్పుచేసి కూడు తమదగు తప్పును / కప్పిపుచ్చువారు కలుషమతులు / ఒప్పుకొనెడివారు గొప్ప మనీషులు / భరతవంశతిలక ! భవ్యచరిత!’ అంటూ కలుషిత, గొప్పమనుష్యుల గురించి చక్కగా తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ శతక పద్యాలన్ని వేమన పద్యాలను తలపిస్తున్నాయి. దీని ద్వారా ఆధునిక వేమన్నగా కీర్తించవచ్చును టి.వి. నారాయణ. కందంలో రాసిన వాడు కవి, పందిని కొట్టిన వాడు బలశాలి అనే సామెత మన తెలుగు ప్రాంతంలో కనబడుతుంది.

అలాంటిది టి.వి. నారాయణ తనకు సాహిత్యం మీద ఉన్న మమకారంతో ఆటవేలది, సీస పద్యాలనే కాక కంద పద్యాల ద్వార కూడా తన సాహిత్య జీవితాన్ని కొనసాగించారు. జీవనవేదం(2009) అనే కావ్యంలో దాదాపు 122 కంద పద్యాలతో అనేక అంశాలను ప్రస్తావించారు. అలాగే మహార్షి సంత్ రవిదాస్ జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు, అలాగే ఉపనిషత్తులను తెలుగు సాహిత్యంలో వచన రూపంలోకి సులభంగా అనువాదం చేస్తూ కంఠోపనిషత్తు, ముండకోప నిషత్తు, కేనోపనిషత్తు(2014) తైత్తిరియోప నిషత్తు(2015) ఉపనిషత్ వాక్ సుధా స్రవంతి వంటి ఉపనిషత్తులను తెలుగు సాహిత్యంలో మనకందించి తనదైన ముద్రను ఏర్పరచుకున్నారు.

ఇలా సాహిత్యాన్ని సృజనీకరిస్తూ సమాజము, సాహిత్యము మనిషికి రెండు కళ్ళలాంటివని రెండింటికి సమప్రాధాన్యతనిస్తూ నిశితంగా ఇంకా అధ్యయనం చేయాలని చెప్పే మహానుభావుడు డాక్టర్ టి.వి నారాయణ. సమాజలోతుల్లో నుండే సాహిత్యము వెలుగులోకి వస్తుందని చెప్పే గొప్ప సామాజిక విద్యావేత్త.

సామాజిక, తాత్విక అంశాలు తన రచనల్లో కొక్లొల్లలుగా తెలియజేస్తూ వృత్తిపరంగా గొప్ప అడ్మినిస్టేటర్ అయినా ప్రవృత్తి పరంగా గొప్ప సాహితీ సృజనకారుడిగా వెలుగొందాడు. ఇంతటి సాహితీ సృజన చేసిన టి.వి. నారాయణ రచనలపై విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. నేటికి దాదాపు 93 సంవత్సరాల పైన ఉన్న నారాయణ చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉన్నాడంటే కారణం తన క్రమశిక్షణ పద్దతులే అని చెప్పవచ్చు.

Article about Literary and sociologist TV Narayana

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]