భాషానిలయంతో అనుబంధం

  హైదరాబాద్, కోఠిసుల్తాన్ బజార్‌లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయాన్ని మొదటిసారి 1968లో చూశాను. అక్కడికి దగ్గర్లో ఉన్న నారాయణగూడ కాలేజిలో చదువుతూ, కాచిగూడ హాస్టల్‌లో ఉంటూ ఉండడం వల్ల, సాయంత్రాలు కృష్ణదేవరాయ గ్రంథాలయానికి వెళ్ళడం అలవాటయ్యింది. అప్పుడప్పుడే నేను రచనా రంగంలోకి ప్రవేశిస్తున్న రోజులు. అప్పటికి ఇంకా ఆశోక్‌నగర్ నగర కేంద్ర గ్రంథాలయం లేదు. త్యాగరాయ గాన సభ నిర్మాణమూ పూర్తి కాలేదు. సాహిత్య సభలు జరగాలంటే కృష్ణదేవరాయ భాషానిలయంలోనో, బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్‌లోనో […]

 

హైదరాబాద్, కోఠిసుల్తాన్ బజార్‌లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయాన్ని మొదటిసారి 1968లో చూశాను. అక్కడికి దగ్గర్లో ఉన్న నారాయణగూడ కాలేజిలో చదువుతూ, కాచిగూడ హాస్టల్‌లో ఉంటూ ఉండడం వల్ల, సాయంత్రాలు కృష్ణదేవరాయ గ్రంథాలయానికి వెళ్ళడం అలవాటయ్యింది. అప్పుడప్పుడే నేను రచనా రంగంలోకి ప్రవేశిస్తున్న రోజులు. అప్పటికి ఇంకా ఆశోక్‌నగర్ నగర కేంద్ర గ్రంథాలయం లేదు. త్యాగరాయ గాన సభ నిర్మాణమూ పూర్తి కాలేదు. సాహిత్య సభలు జరగాలంటే కృష్ణదేవరాయ భాషానిలయంలోనో, బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్‌లోనో జరిగేవి. యువరచయితల సమావేశాలు జరగాలంటే సెలవు రోజుల్లో కళాశాలల భవనాల్లో జరిగేవి. ఆ రోజుల్లోనే నాటి సాహితీ ప్రముఖులు దాశరథి, కాళోజి, సి. నారాయణరెడ్డి, శశాంక, గుంటూరు శేషేంద్ర శర్మ, కుందుర్తి ఆంజనేయులు, బోయి భీమన్న, అరిపిరాల విశ్వం, అక్కిరాజు రమాపతిరావు, పోరంకి దక్షిణామూర్తి, నాయని కృష్ణ కుమారి, బి. రామరాజు, పాకాల యశోదారెడ్డి వంటి ఎంతో మందిని మొదటిసారి చూసింది అక్కడే! నా వంటి యువకులకు సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుతూ, ప్రముఖుల్ని పరిచయం చేసిన ఘనత భాషానిలయానిదే.
ఆ ప్రభావం నాపై ఎంతగానో ఉండేది. నా తొలి రచనా ప్రయత్నాలన్నీ అక్కడే ఆ కాలంలోనే ఆ పరిసరాల్లోనే జరిగాయి. 1969లో నా పద్దెనిమిదోయేట రేడియోలో తొలి కవితాపఠనం 1970లో ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో తొలికథ; 1971లో ‘భారతి’లో తొలిపరిశోధక వ్యాసం ప్రచురితమయ్యాయి. అవన్నీ కృష్ణదేవరాయ భాషా నిలయం గ్రంథాలయంలో చూసిచదివి బయటికి వెళ్ళి మార్కెట్లో పత్రికలు కొనుక్కోవడం జరిగేది. ‘కృష్ణా పత్రిక’కు కవితలు, కథలు ఎక్కువగా రాసేవాణ్ణి. మరి ఆపత్రిక చూడాలంటే భాషానిలయం వెళ్ళి చూసుకోవాల్సిందే. ఆ పత్రికకు మా యువరచయితల బృందం రచనలు చేస్తుండే వాళ్ళం. సాహిత్యకారుడిగా ఎదగడానికి, నా ఆలోచనా పరిధిని విస్తరింపజేసుకోవడానికి ఆ రోజుల్లో నాకు భాషానిలయం అవకాశం ఇచ్చింది.
ఒకసారి భాషా నిలయం గ్రంథాలయంలో జరిగిన సభలో నాటి ప్రముఖ కవి కుందుర్తి ఆంజనేయు గారు కలిశారు. ఆయన దగ్గరికి పిలిచి నా భుజం మీద చెయ్యేసి బయటికి తీసుకెళ్ళారు. భాషానిలయం ప్రవేశ ద్వారం పక్కన అరుగుపై కూర్చోబెట్టుకుని ఓ మాట చెప్పారు. “ నీ కలం లో బలం ఉంది. దాన్ని కాపాడుకో! ఈ సంస్థల కార్యనిర్వహణ బాధ్యతలు నెత్తికెత్తుకుని కార్యకర్తగా మారిపోకు. అది నీ రచనా వ్యాసంగాన్ని దెబ్బతీస్తుంది. కవిగా భవిష్యత్తు ఉన్నవాడివి” అని! నిజానికి స్వతహాగా నాకు కార్యనిర్వహణ మీదగాని, సంస్థాగత పదవుల మీదగాని ఆసక్తే లేదు. పైగా అంతటి పెద్ద మనిషి చెపితే ఆ విషయం గూర్చి ఆలోచించకుండా ఎలా ఉండగలనూ? కవిగా, రచయితగా ఎదుగుతున్న క్రమంతలో అక్కడ జరిగిన ఎన్నో సభల్లో పాల్గొని మాట్లాడడం జరిగింది. యువ భారతి సమావేశాలు కూడా అక్కడ జరుగుతూ ఉండేవి. 1990- నాటి తొలి దశలో సారస్వత వేదిక వారు ప్రత్యేకంగా నా ఉపన్యాసం ఏర్పాటు చేశారు. దానికి ఎన్నుకున్న విషయం వినూత్నమైంది. ‘తెలుగు సాహిత్యం పై సైన్సు ప్రభావం’ ఆ కార్యక్రమంలో పిల్లలమర్రి రాములు, ఇతర మిత్రులూ ఉన్నట్టు గుర్తు.
మరుగునపడ్డ మాణిక్యాలనదగ్గ తెలుగు సాహిత్యకారుల గూర్చి నేను విరివిగా వ్యాసాలు రాశాను. పొట్లపల్లి రామారావు గురించి రాసిన వ్యాసాలవల్ల, చివరిదశలో ఆయనకు కొన్ని గుర్తింపులు కూడా వచ్చాయి. ఆయన మరణానంతరం సంసరణ సభ కృష్ణదేవరాయ భాషా నిలయంలో జరిగింది. చాలా మంది పెద్దలతో పాటు, నేనూ నా పకాలు పంచుకున్నాను. పొట్లపల్లి రామారావు గారితో నాకు గల పరిచయం, ఆయన నాపై కురిపించిన వాత్సల్యం గురించి మాట్లాడాను. ఆయన సాహిత్య ఔన్నత్యంతో పాటు కొత్వాలు రాజబహదూర్ వెంకట్రామారావుకి ఆయనకూ జరిగిన సంభాషణ వివరాలు కూడా వివరించాను. శ్రోతల నుండి గొప్పస్పందన లభించింది. సభలో కాళోజి, బిరుదు రాజు రామరాజు, బి.ఎన్. శాస్త్రి ఇంకా అనేక మంది ప్రముఖులు ఉన్నారు. కొత్వాలుతో పొట్లపల్లి గారి సంభాషణ నమోదు చేయడం చాలా మంచి పనని’ భుజం తట్టి అభినందించారు వి. రామరాజు. అంత దాకా మాట్లాడిన అంశాలే వ్యాసం రాసి తమ ‘మూసీ’ పత్రికకు ఇవ్వాల్సిందిగా బి.ఎన్. శాస్త్రి కోరారు. అంతకు ముందే నేను వినిపించిన పొట్లపల్లి ఉరుదూ గజళ్ళ జిరాక్స్ కాపీ కావాలని చిన్న పిల్లాడిలా అడిగారు కాళోజి.
ఇదే కాక, 1980 ప్రాంతంలో భాషా నిలయంలో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశం గురించి చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున ఏర్పాటైన సమావేశంలో వేదిక పైనుండి మహాకవి దాశరథి మా ట్లాడుతున్నారు. వెనక కుర్చీల్లో కూర్చున్న కుర్రకారు ఆయనను విమర్శిస్తున్నారు. సినిమాల్లో చెత్త పాటలు రాయడం. కాంగ్రెస్ నాయకులపై కవితలు రాయడం, ఆస్థాన కవిగా ఉండడం వగైరా గిట్టని వాళ్ళు కాళోజి విన్నారు. కాబోలు, వారిని వెనక నుండి బయటికి పిలిచి గద్గద స్వరంతో మందలించారు.
“ఒరేయ్ దాశరథిని ఏమీ అనకండ్రా. ఆ రోజుల్లో దాశరథి ఎంతటి వాడంటే తలచుకుంటే ప్రజలు ఈ సుల్తాన్ బజార్, కోఠీలలో సగం ఆయనకు రాసిచ్చేవారు. ఇప్పుడు చూడండి. మందుల మీద బతుకుతున్నాడు. మందులకే నెలకు వెయ్యి రూపాయలు కావాలె. ఎవరిస్తరు? ” అంటూ చాలా సేపు చెప్పారు.‘శరథిలో ఎన్నిరకాల రత్న రాసులుంటాయో దాశరథి కవిత్వంలో అన్ని రకాల పద్యాలుంటాయన్న విషయం ఉత్పత్తి గుణం ఎంత ఉందో ఉత్తమ గుణమూ అంత ఉందన్న’ విషయం మా తరం యువకవులం క్రమక్రమంగా గ్రహిస్తూ వచ్చాం. ఈ విధంగా ఎందరో సాహితీ దిగ్గజాల ఘనతను కృష్ణదేవరాయ భాషా నిలయం తరతరాలుగా చాటి చెప్పుతూనే ఉంది.
ఇటీవలి కాలంలో కొన్ని మార్పులు జరిగాయి. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఫలితంగా శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం కొత్త రూపు సంతరించుకుంది. పాత భవనం స్థానంలో అత్యాధునికంగా కొత్త భవనం ఏర్పాటయింది. అయితే గత వైభవం నిలుపుకుంటూ కొత్తదనానికి స్వాగతం పలుకుతున్న భాషానిలయం నిత్యనూతనంగా విరాజిల్లుతోంది. కొత్త భవనంలోనూ అనేక సభల్లో పాల్గొని మాట్లాడే అవకాశం నాకు లభించింది. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. స్వయంగా తెలుగుభాషా నిలయమే 23జులై 2016న మహాకవి దాశరథి అవార్డు నాకు అందించింది. అదొక గొప్ప అనుభూతి.
గొప్ప సంతృప్తి. నా ఎదుగుదలకు తోడ్పడుతూ వచ్చిన ఒక సంస్థ, నన్ను గుర్తించి గౌరవించిన అపూర్వ సందర్భం అది! ఇది ఇలాగే కొనసాగుతూ భాషా సాహిత్యాల స్ఫూర్తిని వచ్చేతరాలకు అందిస్తుందని ఆశిస్తున్నాను.

9573706806

Article about Libraries

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: