కాపుల ఆశలు పవన్ నెరవేర్చునా?

  ప్రస్తుత ఎన్నికలు తెలంగాణలో ఇంచుమించు ఏకపక్షంగా మారటంతో ఆ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలపైనే అమితమైన ఆసక్తిని చూపటం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గత డిసెంబర్ లోనే ముగిసిపోయి టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించటంతో ఈ ఏప్రిల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చుననే సస్పెన్స్ ఎవరికీ లేకుండాపోయింది. అందుకే పోలింగ్ శాతం కూడా తగ్గింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు సమ ఉజ్జీలుగా మారి హోరాహోరీ పోరాటం సాగటంతో […] The post కాపుల ఆశలు పవన్ నెరవేర్చునా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రస్తుత ఎన్నికలు తెలంగాణలో ఇంచుమించు ఏకపక్షంగా మారటంతో ఆ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలపైనే అమితమైన ఆసక్తిని చూపటం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గత డిసెంబర్ లోనే ముగిసిపోయి టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించటంతో ఈ ఏప్రిల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చుననే సస్పెన్స్ ఎవరికీ లేకుండాపోయింది. అందుకే పోలింగ్ శాతం కూడా తగ్గింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు సమ ఉజ్జీలుగా మారి హోరాహోరీ పోరాటం సాగటంతో తెలంగాణ ప్రజలు ఆసక్తి మొదటి నుంచి కూడా తమ రాష్ట్రం కన్న ఎక్కువగా పొరుగు రాష్ట్రంపైనే కేంద్రీకృతమైంది.

ఆ క్రమంలో వారు ప్రత్యేకంగా తెలుసుకోగోరిన అంశాలలో పవన్ కళ్యాణ్ పార్టీ అవకాశాలు ఏ విధంగా ఉండగలవన్నది ఒకటి. జనసేన పార్టీని స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను రెండు రాష్ట్రాలలో వేర్వేరు వర్గాల ప్రజలు వేర్వేరు విధాలుగా చూశారు. కొందరు కేవలం నటునిగా, కొందరు ఒక మార్పును తెచ్చే అవకాశమున్న తిరుగుబాటు యువకునిగా, కొందరు కాపు సామాజిక వర్గానికి రాజకీయ అధికారాన్ని తెచ్చిపెట్టగల ఆశాజ్యోతిగా, కొందరు కేవలం కొంత కాలం మరో విధమైన వినోదాన్ని ఇవ్వగల వానిగా. ఒక టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తదితర పార్టీల వారు ఆయన ఒక స్వతంత్రమైన, బలమైన రాజకీయ శక్తిగా ఎదగగలరని ఎపుడూ భావించినట్లు లేరు.

తమ అనుయాయిగా మారి తమకు కాపుల ఓట్లను, యువకుల ఓట్లను తెచ్చిపెట్టగలరని, లేదా కాపుల ఓట్లు, యువకుల ఓట్లు తమ ప్రత్యర్థులకు లభించకుండా చీల్చగలరని ఆశించినట్లు తోస్తుంది. చంద్రబాబు, జగన్‌ల ఆశాభావాలు మొదటి నుంచి పోలింగ్ వరకు ఒకే విధంగా కాకుండా వేర్వేరు దశలలో వేర్వేరు విధాలుగా మారటం ఒక విశేషం. పవన్ కళ్యాణ్‌కు వామపక్షాలతో ఎన్నికల అవగాహన ఏర్పడిన తర్వాత కూడా ఈ స్థితి మారకపోవటం గమనించదగ్గది. రాజకీయంగా చూసినా, భవిష్యత్తును బట్టి ఆలోచించినా ఇది పవన్ కళ్యాణ్‌కుగాని, అటువంటి మరెవరికైనాగాని శ్రేయస్కరం కాదు. అటువంటి అభిప్రాయం ఏర్పడటంలో స్వయంగా పవన్ బాధ్యత ఎంతన్నది విడిగా చేయవలసిన వివరమైన విశ్లేషణ.

ఇదంతా పోలింగ్‌కు ముందటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ జనసేన గురించి పోలింగ్‌కు ముందే ఆరంభమై ఇపుడు మే 23 ఫలితాలలోగా సాగుతున్న ఊహాగానాలు మరొక విధంగా ఉన్నాయి. జనసేనకు స్వంత ఆధిక్యత రాగలదని భావిస్తున్నవారు ఎవరూ ఉన్నట్లు లేరు. రెండు రాష్ట్రాలలో కూడా. ఎన్ని స్థానాలు రావచ్చునన్నది ఒక చర్చ కాగా, అంతకన్న ముఖ్యంగా ఒకవేళ టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లలో దేనికీ పూర్తి ఆధిక్యత రానట్లయితే జనసేన ఎవరిని బలపరచవచ్చునన్నది ప్రధాన చర్చగా మారింది. పోలింగ్‌కు ముందు వారాలలో వ్యాపించిన అనుమానాలను బట్టి అయితే జనసేన మద్దతు టిడిపికి లభించాలి. అందులోని నిజం ఎట్లున్నా ఇందులో రెండు మెలికలు ఉన్నాయి. రెండు ప్రధాన పార్టీలలో దేనికీ స్వంత ఆధిక్యత లభించనపుడు మాత్రమే ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది ఒక మెలిక కాగా రెండవది, జనసేన సభ్యులు ఎవరో ఒకరి ప్రలోభాలకు గురై చీలకపోటం. ఇదంతా ఈ నెల 23 వరకు కొనసాగగల స్థితి.

ఇంతవరకు చెప్పుకున్నదంతా ఈ చర్చకు ఒక పార్శం మాత్రమే. అదికాకుండా, అంతకన్న ముఖ్యంగా, మరొక పార్శం ఉంది. అది పైన సూచన ప్రాయంగా ప్రస్తావించినటువంటిదే. పవన్ కళ్యాణ్‌ను “కొందరు కాపు సామాజిక వర్గానికి రాజకీయ అధికారాన్ని తెచ్చిపెట్టగల ఆశాజ్యోతి” గా చూస్తున్నారని పైన అనుకున్నాము. ఆ విషయాన్ని ఇపుడు కొంత చర్చించుకోవలసి ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెడ్లు, కమ్మల తర్వాత మూడవ స్థానం కాపులది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా. వీరిలో మొదటి ఇద్దరికి రాజకీయాధికారం ఏదో ఒక మేరకు స్వాతంత్య్రానికి ముందు కూడా ఉండేది. ఆ తర్వాత ప్రధానంగా రెడ్లది అయింది. భౌగోళిక విస్తరణ రీత్యా కాకపోయినా ఆర్థిక బలాన్ని బట్టి, ఆర్థిక బలంలో పెరుగుదల వేగాన్ని బట్టి ఒక దశ వచ్చే సరికి కమ్మలు రెడ్లతో సమానం కావటమేగాక కొంత మించిపోయారు కూడా. ఆర్థిక బలం పెరుగుదల వేగంలో మొత్తం దేశంలోనే అగ్రశ్రేణిలో గల కమ్యూనిటీలలో కమ్మలు ఒకరని నిపుణులు అంచనా వేశారు. అటువంటి వర్గానికి మొదటి సారిగా రాజకీయాధికారం, స్వాతంత్య్రానంతర కాలంలో ఎన్‌టి రామారావు రాకతో లభించటం తెలిసిందే. ఆ విధంగా రెడ్ల, కమ్మల తర్వాత వంతు కాపులది అయింది. కనీసం వారు ఆ విధంగా నమ్మారు.

ఎంతో కొంత ఆర్థిక సామాజిక రాజకీయ పునాది ఉన్న ఒక కమ్యూనిటీ ఆ విధంగా ఆశించి నిచ్చెన మెట్లు ఎక్కచూడటం సహజం. అదే సమయంలో ఒక వాస్తవం ఏమంటే, కాపులు మూడవ స్థానంలోనైతే ఉన్నారుగాని వారి బలం రెడ్లు, కమ్మలతో సాటిరాగలది కాదు. వారితో పోల్చినపుడు చాలా వ్యత్యాసం ఉంది. భౌగోళిక విస్తృతి ఇతర సంబంధిత కమ్యూనిటీలతో కలిపి చూసినపుడు తగినంత ఉంటుందిగాని, ఆ ప్రాతిపదికపై ఈ కమ్యూనిటీలు అన్నింటిని అన్ని ప్రాంతాలలో కలిపి సంఘటితం చేసేందుకు ఒక పద్ధతి ప్రకారం, తగినంత కాలం, ప్రయత్నం జరగలేదు. గతంలో జరిగిన ప్రయత్నాలు స్వల్ప కాలం పాటు సాగి ముగిసిపోయాయి. అందుకు కారణాల చర్చకు ఇది సందర్భం కాదు. మొత్తానికి కాపుల రాజ్యాధికార కాంక్షలు ముందుకు సాగలేదు. వారు ఒక చుక్కాని లేని నావవలె సాగుతూ ఒక సారి ఒక పార్టీకి, మరొకసారి ఇంకొక పార్టీకి మద్దతు నివ్వటం, లేదా స్థానిక పరిస్థితులను బట్టి వేర్వేరు పార్టీల మధ్య చీలటం జరుగుతూ వచ్చింది. ఇది మొత్తంగా ఆ కమ్యూనిటీని నిరాశలో మిగిల్చింది. వేర్వేరు పార్టీలలో వ్యక్తిగత అవకాశాలను వెతుక్కోవటానికి వారు పరిమితమయారు.

ఇటువంటి చరిత్ర అంతా కొత్త మలుపు తీసుకోగల సూచనలు మొదటి సారిగా సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుతో కన్పించాయి. అపుడు ప్రధానంగా మూడు జరిగాయి. ఒకటి, కాపులతో పాటు సంబంధిత ఇతర కులాలు కూడా కదలి రావటం. రెండు, ఆ కదలిక అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కన్పించటం. మూడు, ఒక ప్రగతి శీలమైన సామాజిక అజెండాను చిరంజీవి ముందుకు తేవటంతో ఆ విధంగా కూడా తత్సంబంధిత సామాజిక రాజకీయ వర్గాలు తనను ఆహ్వానించటం. ఈ తరహా కదలికలను గమనించిన కాపులకు ఇక రెడ్లు, కమ్మల తర్వాత తమ కమ్యూనిటీ నాయకుని చేతికి రాజకీయాధికారం రావటం తథ్యమన్న ఆశాభావం గట్టిగా కలిగింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆ లక్షం సిద్ధించేదేమో కూడా. కాని అది అకస్మాత్తుగా ఒక ఎండమావివలె తేలిపోయింది. అందుకు కారణాన్ని సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే, చిరంజీవి వ్యక్తిత్వంలో ‘పొలిటికల్ యానిమల్’ అనదగ్గ అంశ లేదు. తక్షణ ఫలితాలపై నమ్మకం పెట్టుకునన ఆయన, అది జరగకపోయినా నిలబడి పట్టుదలతో పార్టీని శక్తివంతం చేసే బదులు, అస్త్ర సన్యాసం చేశారు. కాపు కమ్యూనిటీతోపాటు తత్సంబంధిత ఇతర కమ్యూనిటీలు, వర్గాలకు ఆశాభంగం కలిగించారు.

ఆ విధంగా కాపులకు మొదటి చారిత్రక అవకాశం చేజారిపోగా, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ రెండవ అవకాశాన్ని సృష్టించనున్నారా అనే అనే భ్రమను కనీసం ఒక మేరకు, కనీసం తొలి దశలో కల్పించారు. కాపుల కాని వర్గాలను, కాపుల స్థావరమైన ఉభయ గోదావరులు, కృష్ణా గుంటూరులకు బయటి ప్రాంతాల వారిని, రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలను కదిలిస్తున్నట్లు కన్పించారు. ప్రగతిశీలమనిపించే భాష మాట్లాడారు. తన అన్నయ్య కంటె పదునైన పదజాలం ఉపయోగించారు. తనకు నిజంగా రాజకీయాధికారం లభించకపోయినా ఒక రాజీకయ శక్తిగా ఆవిర్భవించి దీర్ఘకాలికమైన నిలకడను సాధించి, తమకు భవిష్యత్ ఆశాజ్యోతికాగలరని కాపులలో పలువురు తొలుత ఆశించారు. కాని అది కనీసం చిరంజీవి విషయంలోవలె పోలింగ్ నాటి వరకైనా నిలిచినట్లులేవు. ఇందుకు పూర్తి స్పష్టత ఓట్ల లెక్కింపుతో రాగలదనుకోవాలి.

Article about Jana Sena Party

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాపుల ఆశలు పవన్ నెరవేర్చునా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: