స్వాతంత్య్రోద్యమ ఫలాలు దక్కేదెప్పుడు?

  వర్తకులుగా భారతదేశానికి వలస వచ్చిన యూరోపు దేశాల వ్యాపారస్థులు భారత దేశ ఔన్నత్యాన్ని, వనరులను, సంస్కృతి సంప్రదాయాలను చూసి అబ్బురపడి ఇక్కడి భూభాగాన్ని హస్తగతం చేసుకోవడానికి పలు విధాలుగా ప్రయత్నించసాగారు. అప్పటికే భారతదేశంలో పాలన కొనసాగిస్తున్న ఐదు వందల పైచిలుకు సంస్థానాలను క్రమక్రమంగా ఆక్రమింపసాగారు. ఈ కాలక్రమంలో ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్, ఇంగ్లీష్ తదితర దేశాలు మనపై ఆక్రమణలు చేయగా ఇంగ్లీషువారు పూర్తిస్థాయిలో భారత భూభాగాన్ని వశపరచుకున్నారు. తదనంతరం జరిగిన భారత స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో […] The post స్వాతంత్య్రోద్యమ ఫలాలు దక్కేదెప్పుడు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వర్తకులుగా భారతదేశానికి వలస వచ్చిన యూరోపు దేశాల వ్యాపారస్థులు భారత దేశ ఔన్నత్యాన్ని, వనరులను, సంస్కృతి సంప్రదాయాలను చూసి అబ్బురపడి ఇక్కడి భూభాగాన్ని హస్తగతం చేసుకోవడానికి పలు విధాలుగా ప్రయత్నించసాగారు. అప్పటికే భారతదేశంలో పాలన కొనసాగిస్తున్న ఐదు వందల పైచిలుకు సంస్థానాలను క్రమక్రమంగా ఆక్రమింపసాగారు. ఈ కాలక్రమంలో ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్, ఇంగ్లీష్ తదితర దేశాలు మనపై ఆక్రమణలు చేయగా ఇంగ్లీషువారు పూర్తిస్థాయిలో భారత భూభాగాన్ని వశపరచుకున్నారు. తదనంతరం జరిగిన భారత స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో అనేకమంది ప్రముఖులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి చివరకు అఖండ భారతావని దాస్య శృంఖలాలు విదిల్చి భరత మాతకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని ప్రసాదించారు. బానిస బతుకులు గడిపిన భారతీయులు గంపెడు ఆశలతో భారత స్వాతంత్ర పోరాటంలో చాలా మంది అసువులు బాశారు.

ఎంతో మంది భారతీయులు నిరాశ్రుయులయ్యారు. సమస్త భారతీయుల చిరకాల స్వప్నం అయిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సాధికారత వంటి అంశాలు స్వాతంత్య్రంతో సాకారం అవుతాయనుకున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ నిర్మాణంతో మన హక్కులు పరిరక్షింప బడుతాయనుకున్నారు. కానీ నేటి భారతదేశ సమకాలీన ఆర్థిక రాజకీయ సామాజిక వాతావరణంలో భారత స్వాతంత్ర మూల సిద్ధాంతం విస్మరించబడి ధనికులు ఇంకా ధనికులుగా మారుతూ లెక్కలేనంత సంపాదనతో రాజకీయ అధికారంతో తులతూగుతుండగా, పేదవారు, మధ్యతరగతివారు ఎండిన పేగులతో, మాడిన డొక్కలతో రెక్కాడితేగాని డొక్కాడని దుర్భర పరిస్థితులలో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు.

నేడు ప్రపంచపటంలో అఖండంగా వెలిగిపోతున్న భారతావని, సాంకేతిక ఎదుగుదలతో అద్భుతాలను సృష్టిస్తూ అంతరిక్షంలో చంద్రయాన్ లాంటి వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. అవినీతిని అంతమొందించే దిశగా ప్రయాణం చేస్తూ, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా సాధికారత, రైతులకు నిరంతర విద్యుత్, పెట్టుబడి సహాయం, వ్యాపారానికి అనుకూలమైన రవాణా, జాతీయ మార్గాలను విస్తరింపజేస్తూ, స్వయం ఉపాధి, నిత్యావసరాల సమర్ధ పంపిణీతో విదేశీ మారకద్రవ్యాన్ని పెంపొందించుకుంటూ పలు సామాజిక పరిణామాలతో దూసుకెళ్తుంది. దేశ అంతర్గత భద్రతలో దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ శత్రు దేశాల పట్ల పటిష్ట వ్యూహ విధానాలు అవలంబిస్తూ అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుకుంటూ వినూత్న మార్పులకు స్వీకారం చుడుతున్నా ఇంకోపక్క బాలల హత్యాచారాలు, బలహీనులపై బలవంతుల దోపిడీ, పీడనం, సమాన హక్కులు సాకారమవ్వకపోవడం, ఆదివాసులపై, దళితులపై దాడులు, రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, జల వివాదాలు, దిగజారుతున్న విద్య, వైద్య ప్రమాణాలు స్వతంత్ర భారతావనిని ఇంకా తీవ్రంగా బాధిస్తూనే వున్నాయి.

భారత రాజ్యాంగంలో భారతీయుడిగా పేర్కొన్న ప్రతి మనిషికి ఓకే ఓటు, ఒకే విలువ, సమానత్వం అనేవి స్వతంత్ర భారతావనిలో చాల ఉన్నతమైన అవకాశాలు. భారతదేశం ముందెన్నడూ ఎరుగని ఒక మహోన్నత అవకాశం ఈ సామాజిక సమానత్వం ద్వారా భారత పౌరులకు సిద్ధించాయి. కానీ స్వాతంత్య్రానంతరం పాత సంస్థానాధీశులు, రాజులు, రాజ ఉద్యోగులు, అడ్వకేట్లు, విద్యావంతులు సింహభాగం పొందుతూ రావడం జరిగింది. తదనంతరం బడుగు బలహీన అణగారిన వర్గాలకు విద్య, పరిపాలన, రాజకీయ వ్యవస్థలలో సమాన నిష్పత్తిలో అవకాశాలు లేనందున వారి కోసం ఫూలే , బి.ఆర్ అంబేద్కర్, నారాయణ గురు., పెరియార్ రామస్వామి నాయకర్, రామ్ మనోహర్ లోహియా మండల్ వంటి వారు ఆయా కాలాల్లో, ప్రాంతాల్లో కృషి చేస్తూ వచ్చారు.

నాగరికత పరిణామక్రమంలో మానవ జీవితం మారినట్లు గానే ప్రజాస్వామ్యం పరిణితి చెందిన కొలది మార్పులు రావాలి. కానీ స్వాతంత్య్రానంతరం కూడా అనేక ప్రాంతాల్లో సమాజంలో కులాల్లో ఇంకా అంతరాలు కొనసాగుతున్నాయి. ఆధునిక సమాజంలో అన్నీ అందుకొని ముందుకు సాగుతున్న వారికి, అవి అందుకోలేనివారికి, అవి ఎలా అందుకోవాలని తెలియని వారికి, అవి అందుకోవాల్సిన అవసరం లేదని భావించే సంస్కృతిలో భావజాలంతో జీవిస్తుంటున్న వారికి మధ్య అంతరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దశలో దేశంలో పేదరిక నిర్మూలనకు శాస్త్రీయంగా ప్రణాళికలు రూపొందించే ప్రయత్నాలు చేయకుండా పారిశ్రామికీకరణ ద్వారా జరుగుతున్న అభివృద్ధినే దేశాభివృద్ధిగా పరిగణించి మనదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రకటించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా పరిగణింపబడుతోంది.

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని 18 రాష్ట్రాల నుండి బిసిల నుండి ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా ఎన్నిక కాకపోవడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? 12 వందలకు పైగా బిసి కులాలు ఇప్పటికీ సంచార జాతులుగా , విముక్త కులాలుగా జనాభా లెక్కలకు దూరంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దూరంగా బతుకుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ప్రజలకు విద్య, వైద్యం రాజ్యాంగబద్ధంగా ఉచితంగా ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ ఇది ఆచరణలో మాత్రం ఇప్పటికీ అంతంతమాత్రంగానే వుంది. దేశ జనాభాలో 54 శాతం ఉన్న బిసిలకు పార్లమెంటులో 14 శాతం కూడా వాటా రాలేదు. దేశంలో 2600 బిసి కులాలు ఉండగా 2550 బిసి కులాలు పార్లమెంటు గేటు దాటలేదు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుండి బిసి కులానికి చెందిన పార్లమెంటు సభ్యులు కూడా లేరు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలలో 10% ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్లో బిసిలకు లేదు.

దేశంలో ప్రస్తుత ప్రభుత్వంలో 545 పార్లమెంటు స్థానాలకు గాను కేవలం 96 సభ్యులు మాత్రమే బిసిలు వున్నారు ఈ విధంగా బిసిలు రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా తీవ్రంగా అణచివేయబడుతున్నారు. దేశంలోని 50 శాతం జాతీయ సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలు, కాంట్రాక్టులు రాజకీయ నాయకుల ఆధీనంలోనే ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యం. అందుకే బ్యాంకులలో జరిగే మోసాలు బయటకు రావడం లేదు. ఇటీవల నీరవ్ మోడీ రూ. 12967 కోటు,్ల విజయ్ మాల్యా 9 వేల కోట్లు, బిపిన్ దొహ్రా1400 కోట్లు, జైన్ ఎనిమిది వేల కోట్లు, విన్సన్ డైమండ్స్ 7,600 కోట్లు, కేరుహన్ పరేఖ్ 2,200 కోట్లు, ్ల విక్రమ్ కొఠారి 3695 కోట్లు బ్యాంకులను ముంచడంతో వీరి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు విమర్శించుకోవడం తమను తాము ఈ స్కాముల నుండి సంరక్షించుకోవడమే తప్ప ఇటువంటి అక్రమాలు జరగకుండా శాశ్వత నివారణోపాయల వైపు దృష్టి సారించడం లేదు.

ప్రజాధనాన్ని సంరక్షించే విషయంలో, దేశ రక్షణ విషయంలో రాజకీయ పార్టీలు అత్యంత బాధ్యతగా వ్యవరించాల్సిన అవసరం వుంది. ఈ దిశగా సగటు భారతీయుడు జరుగుతున్న పరిణామాలను గమనించి రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చి సమర్ధపాలనను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఆసన్నమయింది. స్వాతంత్య్ర ఫలాలు అందుకోవడం సగటు భారతీయులకు ఆటంకంగా వున్న విషయాన్ని రాజకీయ నాయకులు, మేధావులు ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని వర్గాలు అధికారం చేజిక్కించుకోవడానికి ధనబలాన్ని, అంగబలాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంలో దేశ ప్రజల మధ్య వ్యత్యాసాలు తగ్గి ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడే అన్ని వర్గాల మధ్య అంతరాలు తగ్గి భారత స్వాతంత్య్ర అభీష్టము సిద్ధిస్తుంది. భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును ప్రతి పౌరుడు వినియోగించుకోవాలి.

మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి. భారత దేశ సౌభాగ్యానికి పాటుబడే సరయిన నాయకులను, రాజకీయ పార్టీలను ఎన్నుకొని మన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించినప్పుడే భారతదేశ స్వాతంత్య్ర లక్ష్యాలు నెరవేరుతాయి. శాసనవ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థతో పాటు ఎప్పటికప్పుడు ముందు కు వచ్చే వైజ్ఞానిక ఆవిష్కరణలు ప్రజల ఆకాంక్షలు ఉద్యమాలు సమన్వయంతో ముందుకు సాగినప్పుడే ఏ దేశమై నా సంక్షేమ రాజ్యంగా ఆవిర్భవిస్తుంది. దేశం సస్యశ్యామలమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వ విధానాలలో మార్పు, భారత రాజ్యాంగంలో పలు సవరణలు సంభవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం ఒక ఉత్సవంగా జరుపుకొని హాలిడేగా ప్రకటించినంత మాత్రాన మన బాధ్యత తీరలేదు!! స్వాతం త్య్రం ద్వారా మనకు సిద్ధించిన ఫలాలను అనుభవిస్తూ బాధ్యతలు నిర్వహిస్తూ విధి విధానాలను పాటిస్తూ కులం, మతం, వర్గం లింగం, పేదలు అన్ని అంశాలు సమాన ప్రతిపత్తిలో ఆదరింపబడ్డప్పుడే స్వాతంత్య్రానికి అసలైన గౌరవం. అందరూ సమైక్యంగా, సంతోషంగా ఉన్నప్పుడే భారత స్వాతంత్య్ర సమర యోధులకు ఘనమైన నివాళి.

Article about Independence day

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్వాతంత్య్రోద్యమ ఫలాలు దక్కేదెప్పుడు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: