ఒక ప్రతిభామూర్తి అస్తమయం

  డాక్టర్ నోముల సత్యనారాయణగారు (1081940 26122018) పూర్ణ పురుషులు. జీవిత పాఠాలను నేర్చుకుంటూ, నేర్పుతూ ఎక్కడా ఆగకుండా మునుముందుకే సాగినవారు. వారి ప్రస్థానం ‘సాగిపోవుటె బతుకు’ అన్న కాళోజీ పంక్తిని గుర్తు చేస్తుంది. వారు ఎందరికో గురువులు. కాని ఎవరికీ శిష్యులు గానీ, ఏకలవ్య శిష్యులుగాని కారు. స్వయం కృషికి వారి సాహిత్య జీవితం ఒక నిలువుటద్దం. వారు రచయిత కన్నా గొప్ప పాఠకులు. వేల విలువైన పుస్తకాల సొంత గ్రంథాలయం తప్ప వారికి వేరే […]

 

డాక్టర్ నోముల సత్యనారాయణగారు (1081940 26122018) పూర్ణ పురుషులు. జీవిత పాఠాలను నేర్చుకుంటూ, నేర్పుతూ ఎక్కడా ఆగకుండా మునుముందుకే సాగినవారు. వారి ప్రస్థానం ‘సాగిపోవుటె బతుకు’ అన్న కాళోజీ పంక్తిని గుర్తు చేస్తుంది. వారు ఎందరికో గురువులు. కాని ఎవరికీ శిష్యులు గానీ, ఏకలవ్య శిష్యులుగాని కారు. స్వయం కృషికి వారి సాహిత్య జీవితం ఒక నిలువుటద్దం. వారు రచయిత కన్నా గొప్ప పాఠకులు. వేల విలువైన పుస్తకాల సొంత గ్రంథాలయం తప్ప వారికి వేరే స్థిరచరాస్తులు లేవంటే అతిశయోక్తి కాదు.

నలుగురు అక్కల తర్వాత ఒకే ఒక్క మగ సంతానం. పెద్దక్క వరంగల్‌లో ఉన్న కారణంగా అక్కడే పియుసి చదువుకున్నారు. అప్పుడే వరవరరావుగారికి సహాధ్యాయులయ్యారు. గంటా రామన్న, అంపశయ్య నవీన్, బాసిరి సాంబశివరావు మొదలైన వారికి సమకాలికులుగా మెలిగే అవకాశం దొరికింది. డిగ్రీ, పి.జి, వరకు ఉన్నత విద్యాభ్యాసమంతా ప్రైవేటుగానే సాగింది. New morality in Indian English literature, with Special reference to Mulk Raj Anand and R.K. Narayan అన్న అంశం మీద కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా స్వీకరించారు.
1960లో పాఠశాల ఉపాధ్యాయుడిగా డా. నోముల ఉద్యోగ జీవితం ప్రారంభమయింది. 1971లో ఇంగ్లీషు జూనియర్ లెక్చరర్‌గా పదోన్నతి పొందారు. దశాబ్దం తర్వాత డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేసి, 1998లో నల్లగొండ ఎన్ జి కళాశాల ఆంగ్లశాఖాధిపతిగా ఉద్యోగ విరమణ చేశారు.

ఒక సంవత్సరం పాటు నాగార్జునసాగర్ కళాశాలలో, ఒక సంవత్సరం పాలెం కళాశాలలో మాత్రం పని చేశారు. ఈ అవాంతరాలను మినహాయిస్తే తక్కిన ఉద్యోగ జీవితమంతా స్థానికంగా నల్లగొండలోనే సాగింది. ఈ కారణంగా నల్లగొండ ప్రాంతంలో నోముల వారికి శిష్య ప్రశిష్యులు వందలాదిగా ఉన్నారు. ఉన్నతోద్యోగాల్లో ఉన్న శిష్యులకూ కొదువలేదు. డా. నోములవారు స్నేహానికి ప్రాణమిచ్చే మనస్వి. కథానవలా రచయిత దేవులపల్లి కృషమూర్తి, కవి, ఉద్యమకారుడు, వేణు సంకోజు, కవి, రచయిత పెన్నా శివరామకృష్ణ, కళాకారులు ‘దాసి’ సుదర్శన్, కనకాచారి. గోనారెడ్డి, ప్రొ. పి. లక్ష్మీనారాయణ మొదలైన వారంతా వారి స్నేహ సౌశీల్యాలకు ముగ్ధులై చేరువైన వారే.

నోముల వారిది ప్రేమ వివాహం. సతీమణి రుక్మిణి గారు నల్లగొండలోనే ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి హెడ్‌మిస్ట్రెస్‌గా ఉద్యోగ విరమణ చేశారు. వీరిది ఉన్నత విద్యావంతుల కుటుంబం. కుమారులు రాహుల్, రజనీశ్, అక్షయ్‌లు ఉన్నతోద్యోగాల్లో ఉన్నారు. వీరంతా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆంగ్ల సాహిత్యంలో పి.జీ,, పి.హెచ్.డిలు సాధించినవారే. కుమార్తెలు రేణుక, అరుణలు ఆంగ్ల సాహిత సాధకులు, బోధకులు, రెండో కోడలు అధ్యాపక వృత్తిలో ఉన్నారు.

నోముల వారికి ముందుగా సృజనాత్మక సాహిత్యాధ్యయనం పట్ల ప్రగాఢమైన అనురక్తి ఏర్పడింది. ఉపాధ్యాయులుగా వివిధ విషయాలను (Subjects) విద్యార్థులకు బోధించే క్రమంలో వారికి ముందుగా హిందీ సాహిత్యంతో ఏర్పడిన అనుబంధం కారణంగా ప్రేమ్‌చంద్ వంటి మహారచయితల సాహిత్యాన్ని హిందీలోనే చదువుకున్నారు. వివిధ పాశ్చాత్య సాహిత్యాల పట్ల గౌరవాదరాలతో క్రమపద్ధతిలో అధ్యయనం చేశారు. అరిస్టాటిల్ ‘Poetics’తో ఒక పునాదిని ఏర్పరచుకొని ముందుకు సాగారు. తన గురువైన ప్లేటోతో విభేదించి అరిస్టాటిల్ అనుకరణ సిద్ధాంతంలో సాహిత్యకళకు ఇచ్చిన ఉత్కృష్టమైన స్థానమే ఆధునిక సాహిత్య వికాసానికి కేంద్ర బిందువైందని డా. నోముల వారు అనేకసార్లు చెప్పగా విన్నాను. మేధావిగా నోముల ప్రస్థానం ఎట్లా ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకుంటే, క్రమపరిణామం కూడా అవగతమవుతుంది.
1960 దశకం చివరలో మరో కీలకమైన అంశం, వారికి మార్కిజం పట్ల ఏర్పడిన విశ్వాసం. ఇది దినదిన వికాసం చెందిన దాని ఫలితమే టావ్‌చెంగ్ నవలను ‘నా కుటుంబం’ పేరుతో అనువదించటం. సరళాతి సరళమైన భాషలో సాగిన ఈ అనువాద రచన ‘సృజన’ పత్రికలో ధారావాహికంగా రావటమే కాదు, పుస్తకంగా ఎన్నో ముద్రణలు పొందింది.

ఆ తర్వాత వారు శ్రీశ్రీ, రావి శాస్త్రి, కాళీపట్నం, మఖ్దూం వంటి సాహితీవేత్తల సృజనను వామపక్ష భావజాల కోణం నుంచి పరిశీలించి అనేక విమర్శ వ్యాసాలను రాశారు. ఇవన్నీ ‘సామ్యవాద వాస్తవికత’ అన్న పుస్తకంగా రావటం సాహితీపరులకు తెలిసిందే.

వెంకట్‌గౌడ్‌గారు డా. నోముల వారితో మాట్లాడి వారి జీవిత సాహిత్యాలతో కూడిన ప్రసంగాలను రికార్డు చేశారు. దాన్ని ‘అన్‌టోల్డ్ లెసన్స్’ పేరుతో తెలుగులో ప్రచురించారు. దీన్ని వ్యక్తిత్వ నిరూపక గ్రంథంగా చెప్పుకోవచ్చు. డా. నోముల వారు పాప్యులర్ చేసిన మాటల్లో ‘జయహో’ ఒకటి. ‘జయం కలుగుగాక’ అన్న అభినందన పూర్వక సంబోధనగా బాగా ప్రాచుర్యం పొందింది. అందుకే నోముల వారి షష్టిపూర్తి సందర్భంగా సుదర్శన్, దేవులపల్లి కృష్ణమూర్తి, వేణు సంకోజు వంటి మిత్రులు వేసిన అభినందన సంచికకు ‘జయహో’ అన్న పేరు పెట్టారు.

నోముల వారి కుటుంబసభ్యులు ‘నోముల సాహితీ సమితి’ అన్న పేరుతో ఒక సంస్థను పెట్టి ప్రతి యేటా ఐదారు ఉత్తమ కళలకు అవార్డులు ఇస్తూ వస్తున్నారు. ఈ కథలను ప్రతి రెండు సంవత్సరాల కొకసారి సంకలనంగా వేస్తున్నారు. వీరి కృషి మూలంగా విలువైన కథలు, కథారచయితలు వెలుగులోకి రావటం జరిగింది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషా సాహిత్యాలతో పాటుగా ఉర్దూ, అరబ్బీ, పారశీ భాషల్లో డా. నోముల సాధించిన పాండిత్యం స్వయం కృషికి హద్దులువుండబోవని నిరూపించింది. ఈ సందర్భంలో ‘ఒక భాషలో ప్రావీణ్యం సంపాదిస్తే, అది మరెన్నో భాషలలో పాండిత్యానికి దారులు వేస్తుంది’ అన్న విశ్వనాథ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గుర్తుకు తెస్తుంది. మీర్, గాలిబ్, హాలీ, దాగ్, మఖ్దూంల పేర్లు నోముల వారి నాలుకమీద నాట్యమాడేవి. అద్భుతమైన జ్ఞాపకశక్తి కారణంగా ఏ పుస్తకాన్ని సంప్రదించకుండానే నాబోటి వాళ్ల సందేహాలను క్షణాలలో నివృత్తి చేసేవారు. జ్ఞానప్రదర్శన ఏమాత్రం వుండేదికాదు. సాహిత్యం సంస్కారాన్ని పెంచుతుందన్న సత్యానికి సజీవ సాక్షం సత్యనారాయణగారు. సామల సదాశివగారితో సమ ప్రతిభ వున్న బహుభాషా కోవిదులు డా. నోముల సత్యనారాయణగారు మాత్రమే. వారికి నా నివాళి.

Article about Dr. Nomula Satyanarayana Life Story

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: