కళాత్మక దర్శకుడు మృణాల్‌సేన్

  భారతీయ సినిమాను సమాంతర లేక కళాత్మక సినిమా వైపు మళ్ళించిన ముగ్గురు దర్శకుల్లో మృణాల్‌సేన్ ఒకరు. మిగుతా ఇద్దరు: సత్యజిత్‌రే, రిత్విక్ ఘటక్‌లు. 1955లో సత్యజిత్‌రే దర్శకత్వంలో నిర్మించబడిన “పథేర్ పాంచాలి” చిత్రంతో భారతదేశంలో ఆర్ట్ సినిమాల యుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆర్ట్ సినిమా లేక సమాంతర సినిమా భారతదేశంలో ప్రారంభం కావడానికి దారితీసిన పరిస్థితికి నేపథ్యం: 1947లో సత్యజిత్‌రే, చిదానంద దాస్‌గుప్తాలు కలిసి కలకత్తా ఫిల్మ్‌సొసైటీని స్థాపించటమేనని సినిమా చరిత్రకారులు భావిస్తారు. ఫిల్మ్ సొసైటీల […]

 

భారతీయ సినిమాను సమాంతర లేక కళాత్మక సినిమా వైపు మళ్ళించిన ముగ్గురు దర్శకుల్లో మృణాల్‌సేన్ ఒకరు. మిగుతా ఇద్దరు: సత్యజిత్‌రే, రిత్విక్ ఘటక్‌లు. 1955లో సత్యజిత్‌రే దర్శకత్వంలో నిర్మించబడిన “పథేర్ పాంచాలి” చిత్రంతో భారతదేశంలో ఆర్ట్ సినిమాల యుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆర్ట్ సినిమా లేక సమాంతర సినిమా భారతదేశంలో ప్రారంభం కావడానికి దారితీసిన పరిస్థితికి నేపథ్యం: 1947లో సత్యజిత్‌రే, చిదానంద దాస్‌గుప్తాలు కలిసి కలకత్తా ఫిల్మ్‌సొసైటీని స్థాపించటమేనని సినిమా చరిత్రకారులు భావిస్తారు. ఫిల్మ్ సొసైటీల ద్వారా మనదేశ ప్రేక్షకులకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌లాంటి దేశాల్లో నిర్మించబడిన సమాంతర సినిమాలను వీక్షించే అవకాశం కల్గింది. అలాగే ఇక్కడి మంచి సినిమాలు నిర్మించాలన్న ఆసక్తి ఉన్న దర్శకులకు అనేక దేశాల్లో నిర్మించబడ్తున్న ఆర్ట్ సినిమాలను చూసే అవకాశం కల్గింది.
సత్యజిత్‌రే నిర్మించిన పథేర్ పాంచాలి సినిమాతో ప్రభావితులైన మృణాల్‌సేన్, రిత్విక్‌ఘటక్‌లు కూడా ఆర్ట్ సినిమాల నిర్మాణాలను చేపట్టారు. వాస్తవ జీవితాన్ని చిత్రించటమే ఆర్ట్ సినిమాల్లో ప్రధానంగా జరుగుతుంది. వాస్తవ జీవితమే ఆర్ట్ సినిమాకు ముడిపదార్థం. అతినాటకీయత, వాస్తవ జీవితంతో సంబంధం లేని పాటలు, డాన్స్‌లు, ఫైట్స్, కృతకమైన నటీనటుల నటన, సూపర్‌మ్యాన్‌లాంటి కథానాయకులు… ఇలాంటి వాతావరణం ఆర్ట్ సినిమాల్లో ఉండటానికి వీల్లేదు. “సినిమా అనేది కొత్త ఆలోచనలు, భావనలు కల్గించటానికి, వాటిని అభివృద్ధి పరచి వాటిద్వారా కళాత్మక ఆనందం పంచటానికి కృషి చేయాలి గాని కేవలం సాంకేతిక మాయాజాలంతో మేజిక్కులు సృష్టించటానికి కాదు” అని నమ్మినవాడు మృణాల్‌సేన్. యువకుడుగా ఉన్నప్పట్నించే మృణాల్‌సేన్ సత్యజిత్‌రే, చిదానందదాస్ గుప్తా కలిసి స్థాపించిన కలకత్తా ఫిల్మ్‌సొసైటీ ప్రదర్శిస్తున్న ఆర్ట్‌సినిమాలన్నీ చూస్తుండేవారు. ఆ విధంగా మృణాల్‌సేన్‌కు ఆర్ట్ సినిమాల పట్ల గొప్ప అవగాహన కల్గింది. 1923, మే 14న జన్మించిన మృణాల్‌సేన్ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. డిగ్రీ తీసుకున్న తర్వాత సినిమా నిర్మాణం పట్ల ఆసక్తి యేర్పడింది. మొదట్లో మామూలు సినిమాలే నిర్మించిన 1969లో ఆయన దర్శకత్వం వహించిన “భువన్ షోమ్‌”తో ఆయనకు ఆర్ట్ సినిమా దర్శకుడుగా గొప్ప పేరు లభించింది. భువన్‌షోమ్ సినిమా ఆయన నిర్మించిన మొట్టమొదటి ఆర్ట్ సినిమా. ఈ సినిమా ఆయన హిందీలో నిర్మించాడు. ఆర్ట్ సినిమాలు ఆర్థికపరంగా విజయవంతం కావు అనుకునేవారు. కాని భువన్‌షోమ్ ఆర్ధికంగా కూడా విజయవంతమైంది. ఈ సినిమాలో గొప్ప బెంగాలీ నటుడైన ఉత్పల్‌దత్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయనతోపాటు ఈ సినిమాలో సుహాసినీ మూలే గొప్పగా నటించారు.

రైల్వేస్‌లో పనిచేసే ఒక టికెట్ చెకింగ్ అధికారిని (సాధూమెహర్) రైల్వే అధికారులు చాలా దూర ప్రదేశానికి బదిలీ చేస్తారు. ఎందుకంటే అతడు ప్రయాణీకుల నుండి విరివిగా లంచాలు తీసుకుంటున్నాడన్న ఫిర్యాదులు అతని మీదున్నాయి. అయితే ఆ ఆఫీసర్ భార్యకు (సుహాసిని మూలే) ఒక పెద్ద రైల్వే ఆఫీసర్ (ఉత్పల్‌దత్) పరిచయమౌతాడు. ఆ రైల్వే ఆఫీసర్ పేరు ‘భువన్‌షోమ్’. అతడు గుజరాత్‌లోని కచ్ ప్రాంతం చూడటానికి ఒక టూరిస్టుగా వస్తాడు. అతనికి ఆ ప్రాంతమంతా చూపించే గైడ్‌గా ఆ బదిలీ అయిన చెకింగ్ మాస్టర్ భార్య పనిచేస్తుంది. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే భువన్‌షోమ్‌కు ఆ ప్రాంతమంతా చూపిస్తూ సుహాసినీ మూలే అతన్ని బాగా ఆకర్షిస్తుంది. బోల్డు జోక్స్ చెప్పి అతన్ని బాగా నవ్విస్తుంది. భువన్‌షోమ్ (ఉత్పల్‌దత్)కు ఆమె చాలా నచ్చుతుంది. కచ్ ప్రాంతంలోని టూరిస్టు ప్రాంతాలన్నీ చూడటం పూర్తయ్యాక మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్న భువన్‌షోమ్ ఆమెతో “నువ్వు ఈ వారం రోజులు నన్ను భలేగా ఎంటర్‌టైన్ చేశావు. నీకేదన్న సహాయం కావాలంటే కోరుకో” అంటాడు. అప్పుడామె “నా భర్త రైల్వేస్‌లోనే పనిచేస్తాడు. ఈమధ్యనే అతన్ని చాలాదూరం ట్రాన్స్‌ఫర్ చేశారు. అతన్ని మా ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ఫలానా రైలుస్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తే నేనెప్పుడూ మీకు కృతజ్ఞురాలుగా ఉంటానంటుందామె. “నీ భర్తకు తప్పకుండా సహాయం చేస్తానని భువన్‌షోమ్ ఆమె భర్తను బొంబాయి మహానగరంలోని ఒక రైల్వేస్టేషన్‌కు బదిలీ చేయిస్తాడు. అప్పుడామె భర్త “బొంబాయి లాంటి పెద్ద నగరానికి వెళ్తున్నానంటే లంచాలింకా బాగా దొరుకుతాయనుకుంటాడు. స్థూలంగా ఇదీ భువన్‌షోమ్ కథ. మొత్తం సినిమాను అవుట్‌డోర్‌లోనే… అందమైన దృశ్యాల మధ్య షూట్ చేశారు. అద్భుతమైన ఫోటోగ్రఫీ… ఉత్పల్‌దత్, సుమాసినీ మూలే గొప్ప నటన… సినిమాలో పాటలు లేవు. ఎప్పుడూ సీరియస్‌గా, స్ట్రిక్టుగా ఉండే భువన్‌షోమ్‌ను ఆమె (సుహాసినీ మూలే) కడుపు నిండా నవ్వించడం, స్ట్రిక్టుగా ఉండే భువన్‌షోమ్ తనను బాగా నవ్వించిన ఆ అమ్మాయి భర్తను ఇదివరకంటే ఎక్కువ లంచాలు దొరికే బొంబాయి లాంటి మహానగరానికి బదిలీ చేయించటం- ఈ దృశ్యాలన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. బనపూల్ అన్న బెంగాలీ రచయిత రచించిన ఓ చిన్న కథ ఆధారంగా మృణాల్‌సేన్ ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకు జాతీయ ఉత్తమచిత్రం, జాతీయ ఉత్తమ దర్శకుడు, జాతీయ ఉత్తమ నటుడు మొదలైన అవార్డులు లభించాయి. ఇలా మృణాల్‌సేన్ మొత్తం 27 సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెల్చుకున్నాడు. ప్రపంచంలో ఎన్నోచోట్ల జరిగే చలనచిత్రోత్సవాల్లో ఆయన సినిమాల్ని ప్రదర్శించారు. భువన్‌షోమ్ తర్వాత మృణాల్‌సేన్ నిర్మించిన మరో గొప్ప హిందీ చిత్రం “మృగయా” అంటే వేట. మిథున్ చక్రవర్తి తొలిసారిగా నటించిన చిత్రం ఇదే. అడవిలో వేట పేరుతో మనుష్యులను చంపుతున్న పెద్దపులుల లాంటి జంతువుల్ని చంపినవాడు హీరో అవుతాడు. కానీ జనావాసాల్లో తోటి మనుష్యుల్ని చంపుతున్న మానవ మృగాల్ని చంపుతున్న వాళ్ళకు మరణశిక్ష విధించటం ఏమిటని ప్రశ్నిస్తుందీ సినిమా. ఈ సినిమాలో ప్రధాన భూమికను పోషించిన మిథున్ చక్రవర్తికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది.

మృణాల్‌సేన్ తెలుగులో కూడా ఒక సినిమా నిర్మించాడు. అదే “ఒక ఊరి కథ”. మృణాల్‌సేన్ దీనిని 1977లో నిర్మించాడు. ప్రేమ్‌చంద్ రచించిన “కఫన్‌” ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా ఈ సినిమాకు చాలా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.“కలకత్తా ట్రయోలజీ”గా ప్రసిద్ధి చెందిన మూడు చిత్రాలు- “ఇంటర్వ్యూ” (1970), “కలకత్తా 71” (1972), “పదాతిక్‌” (1973) ఈ మూడు సినిమాల్లో కూడా “కలకత్తా” నగరం ఒక ముఖ్య పాత్రలా రూపొందింది. ఈ మూడు చిత్రాలు ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలో యేర్పడిన విభజన, ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సలైట్ ఉద్యమం, కలకత్తా నగరంలో తాండవించిన నిరుద్యోగ సమస్య మొదలైనవి అత్యంత వాస్తవికంగా చిత్రించబడినాయి.1978లో మృణాల్‌సేన్ “ఏక్‌దిన్ ప్రతిదిన్‌” చిత్రాన్ని నిర్మించాడు.
కలకత్తాలో నివసిస్తున్న ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక ఉద్యోగి అయిన యువతి ఒకరోజు అర్ధరాత్రి దాటాక కూడా ఇల్లు చేరదు. ఆమె తల్లిదండ్రులే కాకుండా ఆ వీధిలో నివసిస్తున్న అనేకమంది స్త్రీ పురుషూలు “అర్ధరాత్రి దాటాక కూడా ఆ అమ్మాయి ఇల్లు ఎందుకు చేరలేదు” అన్నదాన్ని గూర్చి బోల్డు ఊహాగానాలు చేస్తారు. “ఆ అమ్మాయి ఎవరితోనైనా లేచిపోయిందా?” లేక “యే తపె్పైనా చేసి పోలీసుల చేతికి చిక్కిందా?” ఇలాంటి ఊహాగానాలే చేస్తుంటారు. చివరికామె ఇంటికొచ్చి సిటీలో రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగి, ట్రాఫిక్‌జామ్ అయ్యిందని, ఈ కారణం వల్లనే ఇంత ఆలస్యం జరిగిందని చెబుతుంది. ఒక ఆడపిల్ల సకాలంలో ఇల్లు చేరకపోతే సమాజం ఆమెను గురించి ఎంత నీచంగా ఆలోచిస్తుందో ఈ సినిమాలో మృణాల్‌సేన్ అద్భుతంగా చూపించాడు. 1991లో మృణాల్‌సేన్ “మహా పృథ్వీ” అన్న సినిమాను నిర్మించాడు. 1991లో తూర్పుయూరోపియన్ దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూలిపోవడం, బెర్లిన్ గోడను పగులగొట్టడం లాంటి సంఘటనలతో వ్యథ చెందిన కలకత్తాలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ పెద్దామె ఉరివేసుకొని మరణించిన సంఘటన ఆధారంగా మృణాల్‌సేన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ విధంగా 27 అత్యంత వాస్తవిక సినిమాలను నిర్మించిన మృణాల్‌సేన్ సినిమాలను అనేక జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. 1981లో భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రత్యేక రెట్రాస్పెక్టివ్‌గా ప్రదర్శించబడ్డాయి. అనేక సంవత్సరాలు ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషించిన మృణాల్‌సేన్ చాలాకాలం ఓ.ఓ.ఐ.. ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు. 95 యేళ్ళ నిండు జీవితాన్ని జీవించిన మృణాల్‌సేన్ మొన్న, అంటే 30-.12.-2018 నాడు ఉదయం కలకత్తాలోని తన నివాసంలో గుండెపోటుతో చివరిశ్వాస విడిచాడు.

Article about Director Mrinal Sen

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: