దళిత మహిళావాద కథానికతత్వము

  దళిత మహిళల రచనలు సాహిత్యానికి అంటరానిదిగా పరిగణింపబడుతున్న అప్రజాస్వామిక విధానాలపై తెలుగు సాహిత్యంలో విస్తృత చర్చ జరగాల్సి వుంది. దళిత మహిళల రచనల గురించి మాట్లాడాలంటే… కుల వ్యవస్థ యొక్క సాంఘిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కోణాల్ని జెండర్ దృక్పథంతో అధ్యయనం చేయాల్సి వుంది.  దళిత మహిళలు కుల సమాజంలో అంటబడని వారై అనేక ప్రతికూల పరిస్థితుల్లో, ప్రతికూల సామాజిక సాంస్కృతిక అణచివేతల్లో అక్షరాల్ని అభ్యసించడం ఒక యుద్ధమైతే, వారిలో అతికొద్ది మంది రచయితలై సాహిత్య […]

 

దళిత మహిళల రచనలు సాహిత్యానికి అంటరానిదిగా పరిగణింపబడుతున్న అప్రజాస్వామిక విధానాలపై తెలుగు సాహిత్యంలో విస్తృత చర్చ జరగాల్సి వుంది. దళిత మహిళల రచనల గురించి మాట్లాడాలంటే… కుల వ్యవస్థ యొక్క సాంఘిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కోణాల్ని జెండర్ దృక్పథంతో అధ్యయనం చేయాల్సి వుంది. 

దళిత మహిళలు కుల సమాజంలో అంటబడని వారై అనేక ప్రతికూల పరిస్థితుల్లో, ప్రతికూల సామాజిక సాంస్కృతిక అణచివేతల్లో అక్షరాల్ని అభ్యసించడం ఒక యుద్ధమైతే, వారిలో అతికొద్ది మంది రచయితలై సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించడం చిన్న విషయం గాదు. తమ రచనలను ప్రపంచానికి పరిచయం చేయడానికి మహా యుద్ధమే చేయాలి. ఆ భాష అర్థం కావడం లేదనీ అప్పకవి సూత్రీకరించిన కుక్క ముట్టిన కుండనే చేసింది, ఆధునిక తెలుగు సాహిత్యం కూడా. దళిత మహిళల జీవితాలు కుల, మత, శ్రమ, బాంచరిక సంబంధ జీవితాలు.

వీరిపై మత కుల పెత్తనం, మగపెత్తనం, కులహింసలు, శ్రమదోపిడీ, పేదరికం, అల్పదోపిడీ, నిరక్షరాస్యత, అంటరానితనం, అత్యాచారాలు, వెట్టిచాకిరి, అనారోగ్యాలు, బాల కార్మిక వ్యవస్థ, జోగినీ దురాచారం, దొర పెత్తనాలు, దొర్సాని పెత్తనాలు, నిరుద్యోగం వంటి అనేక పీడనల్ని ఎదుర్కొంటూ ఉత్పత్తి శక్తులుగా యీ సమాజానికి సేవలందిస్తూ వారు మానవ హక్కులు లేని మనిషి గౌరవాల్లేని వారుగా చూడబడుతున్నారు. ఈ కుల సమాజంలో అంటరాని మగవాళ్లు, బానిసలైతే… ఆ బానిసలకు బానిస దళిత మహిళ.

ప్రపంచవ్యాప్తంగా అనేక శ్రామిక మహిళా పోరాటాల ఫలితంగా ఐక్యరాజ్య సమితి 1975ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించడంతో భారత ప్రభుత్వాలు మహిళల గురించిన జెండర్ అవగాహన పద్ధతులు, పరిశోధనలు, చర్చలు విస్తృతంగా చేయడం మొదలైంది. కానీ ఇవన్నీ చదువుకున్న సవర్ణ స్త్రీల వరకే పరిమితమైంది. పరిశోధనలు, అవగాహనలు, సాహిత్యాలు వారి జీవన సమస్యల చుట్టే తిరగడం జరిగింది. అవి కింది శ్రామిక కులాల మహిళల వరకు చేరలేదు. సమస్త సామాజికాంశాలు, రాజకీయ సిద్ధాంతాలు, ఉద్యమాలు, చరిత్రలు, సాహిత్య నిర్మాణాలు, అస్తిత్వాలు, అధ్యయన పద్ధతులు, చరిత్ర వ్యాఖ్యానాల కోణాలు, అభిప్రాయాలు అన్నీ సవర్ణ మహిళల అనుభవజ్ఞాన ప్రాతిపదికన్నే అభివృద్ధి చేసి, అవే సార్వజనీన జెండర్ దృక్పథంగా చెలామణి అవుతున్నాయి. 1980 దశకంలోనే జెండర్ రాజకీయ అవగాహన తెలుగు సాహిత్య విమర్శలోకి వచ్చింది. కానీ తెలుగు సాహిత్య విమర్శలోకి కులజెండర్ రాజకీయ అవగాహన ఇంకా మొదలు కాలేదు. మగవాడు మహిళని వ్యవస్థీకృతంగా లోబర్చుకున్న పదము ‘పితృస్వామ్యం’. అయితే, స్త్రీవాదం పేరుతో సవర్ణ స్త్రీలు, దళిత మహిళల అనేక అణచివేతలను మాట్లాడనివ్వకుండా కేవల పితృస్వామ్యంను జనరలైజ్ చేసి సృష్టించిన పదమే ‘దళిత స్త్రీ వాదము.’

దళిత మహిళల రచనలు సాహిత్యానికి అంటరానిదిగా పరిగణింపబడుతున్న అప్రజాస్వామిక విధానాలపై తెలుగు సాహిత్యంలో విస్తృత చర్చ జరగాల్సి వుంది. దళిత మహిళల రచనల గురించి మాట్లాడాలంటే… కుల వ్యవస్థ యొక్క సాంఘిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కోణాల్ని జెండర్ దృక్పథంతో అధ్యయనం చేయాల్సి వుంది. సంప్రదాయ ఆధునిక సిద్ధాంతాలుగానీ, అంతర్జాతీయ సిద్ధాంతాలు గానీ దళిత (మగ) సిద్ధాంతాలు గానీ దళిత మహిళల సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి అంచనా కట్టడానికి ఉపయోగపడకపోవచ్చు. చరిత్రలో ఏ సాహిత్యమైనా, ఏ సమూహమైనా తన ప్రయోజన సిద్ధాంతాన్ని తానే నిర్మించుకున్నది. సాహిత్య చరిత్రల్లో మచ్చుకైనా దళిత మహిళల రచనలు కనిపించవు. కులం, జెండర్ వంటి అనేక రకాల వివక్షలతో, సెన్సార్‌షిప్‌ల ఉక్కు మేఘాల కింద అనేక నల్లపొద్దులు నలిచేయబడినయి. అవి ఇప్పుడిప్పుడే వెలుగుల్ని రేఖామాత్రంగా చూస్తున్నాయి.

కథలు చెప్పడంలో దళిత మహిళలు ప్రత్యేకులు. తెలుగులో మొదటితరం చదువుకున్న దళిత మహిళ తాడి నాగమ్మ ‘ముద్దుకత’. జాతీయోద్యమకాలంలో ఒక మహిళ వలసవాదానికి వ్యతిరేకంగా విదేశీ బహిష్కరణ చేయాలని ఒక నాగరికున్ని కోరగా, అతడు ప్రతిఫలంగా ముద్దియ్యమని కోర్తాడు. విదేశీ హాలాహలమునకు ఆహుతి అగుతున్న నీబోటి సోదరున్ని రక్షింపనొకముద్దీయలేనా’ అనడంతో అతనికి మూర్చ వస్తుంది. ముద్దు అనేది ఒక మానవీయమైన స్పర్శ. దానికున్న మగ విలువల్ని అవలీలగా తీసి పారేస్తుంది రచయిత్రి. నల్లపొద్దు దళిత స్త్రీల సాహిత్యం వచ్చేదాకా ఇలాంటి అద్భుతమైన కథ సాహిత్య ప్రపంచానికి అంటరానిదే అయింది. జాతీయోద్యమ కాలం నాటికే ఇలాంటి మానవీయమైన విలువల్ని జీవిత మహిళలు తెలుగు కథాసాహిత్యంలో వెలువరించారు.

అయితే, ఈ కథలో ఆ మహిళ దళిత మహిళలు తెలుగు కథాసాహిత్యంలో వెలువరించారు. అయితే ఈ కథలో ఆ మహిళ దళిత మహిళ అయివున్నందునే ఆ నాగరికుడు (ఆధిపత్యకులం) ముద్దడిగి తన పెద్ద కులాధిపత్యాన్ని ప్రదర్శించుకున్నాడు. ఆధిపత్య కులం మహిళల్ని అట్లా అడిగే సాహసాలు చేసి వుండరు. ఈ కథలో కులజెండర్ చర్చ, ఉద్యమాల్లో కూడా ఎలాంటి ఆధిపత్య మగస్వామ్యాల వికృత చేష్టలుంటాయనేది రచయిత్రి వెల్లడించి తన సమాధానంతో ఒక గొప్ప మానవీయ విలువని చాటి చెప్పింది. నంబూరి పరిపూర్ణ ‘ఉంటాయి మాకు ఉషస్సులు’ కథా సంపుటిలో కుల వివక్షల మీద, సమాజంలోని అన్ని రకాల ఆధిపత్యాల మీద కథలను వెలువరించింది. లలితా పీటర్ జరిగిన స్వప్నం’ కథలో జెండర్ సమానత్వం నోటిమాటే కానీ ఆచరణలో లేవనీ రాసింది అంటరాని అవమానాల్ని ఆవిష్కరించింది.

మామిడి సత్యవతి ‘తెర తొలిగింది’ సెంటినా సరోజిని ‘వింత పశువు’ కథలో దళిత మగవాళ్లు కూలి చేసి ఇంటికి పైసా ఇవ్వకుండా తాగుడుకి బానిసలై కుటుంబాల్ని పోషించే బాధ్యతల్ని పట్టించుకోని నిర్లక్షాన్ని నిలదీసే కథలివి.
గెద్దాడ కస్తూరి ‘ రక్తమా నీదేకులం’ కథలో కింది కులాలు నీచం అని, శీలం లేని వాళ్లు, శుభ్రం లేనివాళ్లు అనే గర్వంతో అవమానించే ఒక ఆధిపత్య స్త్రీ కూతురు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే … ‘ఒక రిక్షావాడి రక్తం ఉంది ఎక్కించమంటారా?’ అని అడుగుతుంది ఒక డాక్టర్. ఆ డాక్టర్ ఆ ఆధిపత్య కుల స్త్రీ ఇంట్ల పని చేసి అనేక చీత్కారాలకు గురై చదువుకున్న దళిత మహిళ సమీర.

గుజ్జర్లమూడి నిర్మలారాణి ‘ కాటేసిన కరువు’ కథలో రాయలసీమ పల్లెల్లో కరువు, దళిత కులాల్ని కబలించడాన్ని, ఏ కూలీనాలీ దొరక్క పేదరికంతో దళిత మహిళలు పట్టణాలకు వలస వెళ్లడాన్ని, కుటుంబాల్ని, పిల్లల కడుపు నింపడానికి తమ శరీరాల్ని అమ్ముకున్నే దురవస్థను కళ్లకు కట్టింది.

దాసరి శిరీష కులాంతర వివాహాల్లో మంచి చెడ్డలు, దానివల్ల జరిగే నష్టాలకు దళిత మహిళలు ఎట్లా బలవుతున్నారనే కథ ‘వ్యత్యాసం’. అట్లనే చంద్రశ్రీ ‘అంటరాని పాట’ లో కులాంతర వివాహం ఉద్యమంలో జరిగిన ఇంట్లకొచ్చేటప్పటికీ వంట గిన్నెలు ముట్టుకోనివ్వని కుల వివక్షలు, పాట పాడనివ్వని నిషేధాల మీద ఎక్కుపెట్టిన కథ. జాజుల గౌరి కథా సంపుటి ‘మన్నుబువ్వ’లో కూలికి పోయి వచ్చిన తల్లి కట్టెలు, నీళ్లు, బియ్యం సమకూర్చి వండే పనిలో ఉంటే బిడ్డ ఆకలికి బువ్వ అందక మన్ను బుక్కి, నీళ్లు తాగి పడుకునే బాల్యాలు, దళితుల్లో, దళిత కులాలకున్న దాష్టీకాల్ని చెప్పే కథ. అత్యాచారానికి గురైన బిడ్డ భయాన్ని, బాధని దళిత ‘తల్లి పానం ఉన్నదంటే మీద పడ్డ బురదను కడుక్కొని మంచిగ బతకొచ్చు. జిందగీని ఇడుసుకోకు’ అని ప్రాణం పోయినా పర్వాలేదు. మానం పోవద్దు అని ఆధిపత్య పితృస్వామ్య విలువల్ని తృణీకరించే నీతిని బోధించి అంటరాని కులాల మానవ విలువల తత్వాన్ని ‘ కంచె’ కథలో చెప్పింది జాజుల గౌరి.

గోగు శ్యామల ‘ ఏనుగంత తండ్రికన్నా ఏకుల బుట్టంత తల్లి నయం’ కథా సంపుటిలో దళిత తల్లిదండ్రికన్నా మిన్నగా తన పిల్లలకు ప్రధాన పోషకురాలై ఉండే కథ. ‘తాటకి’ కథలో అత్యాచారం చేసే మగవాణి రెండు కాళ్ల మధ్యలో తన్ని పారిపోయి వచే దళిత అమ్మాయి సాహస తత్వాన్ని చెప్పింది. ‘రడం’ కథలో మాదిగ ఆడపిల్లల్ని జోగిని చేసే కులం మతం ఆధిపత్యం అల్లికల ఉచ్చు ఊరిలో ఎట్లా ఏర్పాటు చేస్తారు అనీ అది మానని గాయంగా ఉంచే దుర్మార్గాన్ని వివరించింది. ఈ దళిత మహిళల మీద జరిగే బలవంతపు దాష్టీకం ఈ ‘రడం’.

పుట్ల హేమలత బాల కార్మికులుగా దళిత పిల్లలే ఎందుకు అవుతున్నారు. అనే ప్రశ్నతో బాల కార్మికుడి విషాద గాధని ‘నూతిలో కప్ప’ కథలో వివరించింది. ఎమ్‌ఎమ్.వినోదిని ‘బ్లాక్ ఇంక్’ కథా సంపుటిలో కులం, ఆచరణను ఆధిపత్య కులాలు, తమ పిల్లలకు ఇచ్చే సంస్కృతి వల్ల వారి పిల్లలు కూడా ఇతర పిల్లల భిన్న సంస్కృతి సంఘటనల్ని బ్లాక్ ఇంక్‌తో రాసుకుంటుంది. ‘ఒక విలన్ ఆత్మహత్య’ కథలో రైతులు, దళిత స్త్రీలను లైంగికంగా వేధిస్తూ కూలిని పెంచకుండా అమానవీయంగా ఉండే రైతులు చస్తే దళిత మహిళకు సంతోషమే, రైతులు దళిత మహిళలకు విలన్’లే అంటుంది.

జూపాక సుభద్ర ‘ రాయక్క మాన్యెం’ కథా సంపుటిలో ఉద్యోగం చేసే దళిత మహిళలకు ఇండ్లు కిరాయికి దొరకని కుల నీతిని ‘ఎన్నో పోరాటాలు చేసి మేము పగులగొట్టిన ముంత, మల్లా మా మూతికి కడుతున్నట్లే ఉన్నది, అంటరాని తనాల బాధను ‘శుద్ధి చేయాలి’ కథలో చెప్పింది. కులాంతర వివాహాలు చేసుకునే దళిత మహిళలు గురవుతున్న విధ్వంసాన్ని చెప్పే కథ ‘ఆదర్శ విధ్వంసం’. మాదిగల ఆశ్రిత కులమైన డక్కలి మహిళ తన హక్కుల్ని పంచాయతీ పెట్టి ఎట్లా సాధించుకుందో చెప్పే కథ ‘ రాయక్క మాన్యెం’.

వి. నాగమణి ‘మనువుగాడి పెండ్లి కథ’లో ఆసామి ఇంటిముందు నడుములిరిగే చాకిరీ చేసినా పిడికెడు మెతుకులు విదిలని అమానుషాన్ని, కళ్లు తిరిగి పడిపోయిన ఆకలి బాధను విముక్తి చేయాలంటే చదువుకోవడమే పరిష్కారం అని సూచించే కథ. చల్లపల్లి స్వరూపారాణి ‘వలస పిట్టలు’ కథా సంపుటిలో దళిత మహిళల దయనీయ పరిస్థితిని, సామాజికంగా వారిపై జరిగే దాడుల్ని, అత్యాచారాల్ని, అన్యాయాల్ని విప్పి చెప్పిన కథ. భద్రం తల్లి కథలో దళిత బాలికల మీద జరిగే హింసలు, లైంగిక వేధింపుల మీద రాయడం జరిగింది.

ఎండ్లూరి మానస ‘మిళింద’ కథా సంపుటిలో కొత్త నెత్తురుగా వచ్చిన భావజాలం కథలు. దళిత క్రిష్టియన్స్‌కి బొట్టు లేకుంటే… ఎట్లా చూస్తుంది హిందూ కుల సమాజం అనే వాస్తవాన్ని ఎండగట్టింది బొట్టు, దొంగబొట్టు అనే కథల్లో. ఇంకా ‘మెర్సీ పరిశుద్ధ పరిణయం’ కథలో ప్రియురాలు అత్యాచారానికి గురైన ప్రేమతో ఆ ప్రియురాలినే పెళ్లాడిన అద్భుత ప్రేమగా మలిచిన దళిత పరిశుద్ధ ఆత్మలో చెప్పింది.

యెండపల్లి భారతి ‘ఎదర బతుకులు’ కథా సంపుటిలో దళిత మహిళల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికంగా గ్రామాల్లో శ్రమలో ఎట్లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారనేది పూసలుగా, యీనెలు యీనెలుగా కథలు అల్లింది. కుటుంబాల్లో భర్త తాగుడు కోసం వునొక్క యిత్తడి బిందెలు, తలె ముంతలు అమ్ముకున్న ‘ఇత్తలిబింది’ గ్రామాల్లో ఆసామి కన్నుబడి అత్యాచారం చేసినా… నేను ఏమి చెప్పేది. చెపుకుంటే బగిసాట్లు కదా’ అని కన్నేసిన ఆసాముల నుంచి తప్పించుకొని తిరిగే దళిత మహిళల అగచాట్లు ‘అవ్వతలపులు’ కథ. ‘ మా యిండ్లల్లో దుడ్డుకి కొదవేగానీ, ఆడదాని ఉసురుదీసే దానికి ఏమి కొదవలేదు. మొగోల్లకి మేము చేసి వేసిందాక నోటి కాడికి చెయ్యిపోడు’ యింటి భారమంతా దళిత శ్రామిక కులాలే మొయ్యాలె. ‘సచ్చిసాధించడం’ కథ చదివితే…. దళిత ఆడోల్లకు జోగినీ, బసివి, బాల్య వివాహాల దురాచారాలే కాకుండా తొలుత మొగడికే తాళి తెంచాలనే దురాచారం బైటి ప్రపంచానికి తెలువది ‘ఎవరు తొలీత బొట్టు కడితే వాడు కట్టిన తాళి వాడికే తెంపల్ల లేదంటే మీ కుటుంబానికి మంచిది కాదు. మారుమనువులు, యిడుపు కాయితాలు సర్వసాధారణం దళిత కులాల్లో, తెలంగాణలో మొదటి మొగనికే తాళి తెంచే ఆచారంలేదు. యిది రాయలసీమ అంతటా వుందా అనేది తెలియాల్సింది.

‘దప్పి’ కత మాదిగోల్లు ఆధిపత్య కులాల చేదబాయిని కూడా అంటకూడని నిషేధాలున్నాయని చెప్తది. కొడుకు బాయికాడికి బొయి నీల్లు తాగొస్తా అంటే… తల్లి ‘వద్దు కొడుకా వాల్లు కాపోల్లు మనం వాల్ల బాయిని తాకితే మనల్ని దండిస్తార’ని వారిస్తుంది. అంటరాని దుర్మార్గాలు, దండనలు యింకా సజీవంగా వుండి సమసిపోనందుకు బాదైతది. టీవీలొచ్చి మానవ సంబంధాల్ని గూడెం ప్రేమల్ని కూడా ఎంత దెబ్బ తీసినయో ఎదారిన బతుకులుగా ‘ఎడారి బతుకులు’ కథలో విశ్లేషించింది రచయిత్రి యెండపల్లి భారతి. పల్లె మాదిగ మహిళల చుట్టూత ఆవరించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలను పల్లెమట్టి భాషలో, యాసలో ప్రధాన స్రవంతిలో కనబడని వినబడని కథలు ‘ఎదారి బతుకులు’ కథల సంపుటిలో యెలుగెత్తి చాటింది ఎండపల్లి భారతి.

కన్నారం ఝాని ‘గోటి దెబ్బ’ కతలు, మేం మాదిగ ‘మాష్టిపోషవ్వకతలు యీకుల సమాజాన్ని ఎదిరించి దెబ్బగొట్టే కతలు. అయితే దళిత మహిళల గురించి దళిత రచయితలు కూడా తమ రచనల్లో వెల్లడించారు. కొలకలూరి ఇనాక్ దళిత మహిళల గొప్పతనాల్ని, బలాల్ని, శక్తుల్ని, ఆత్మవిశ్వాసాల్ని మానవీయ విలువల్ని ‘ దట్టెం’, ‘కొలుపులు’ వంటి అనేక కథల్లో ఆవిష్కరించాడు. యింకా బోయ జంగయ్య, నాగప్పగారి సుందర్రాజు, గుండెడప్పు కనకయ్య, మద్దూరి నగేష్ బాబు మొదలగు దళిత రచయితలు దళిత మహిళల జీవన చిత్రాల్ని ఆవిష్కరించారు. దళితేతరులైన ఆధిపత్య కుల రచయితలు, రచయిత్రులు కూడా దళిత మహిళల జీవితాన్ని చూసి రాసిన చలం ‘మాదిగమ్మాయి’, కరుణకుమార్ ‘పాకామె’, యిల్లందల సరస్వతీదేవి ‘మెహర్తాని’, ‘గీతాంజలి’ ‘పహెచాన్’ కథల సంపుటి వంటి కొద్దిమంది దళిత మహిళల మీద తమ అనుభవాల్ని, అన్ని రకాల అవమానాల్ని, అంటరాని తనాల్ని, వూరి ఆసామి, యింటి మగాధిపత్యాల్ని, శ్రమ దోపిడిని, అనేక సామాజిక హింసల్ని ఎదిరిస్తూ … ప్రశ్నిస్తూ… తెలుగు కథా సాహిత్యానికి తన మహిళావాద తాత్వికతతో కొత్త వెలుగులు నింపుతుంది. రేపటి సాహిత్యాలు అట్టడుగు మహిళల సాహిత్యాలతో ప్రజాసామీకరించబడ్తాయి.

Article about Dalit womens works

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: